Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యూరియాకు ప్రత్యేక కార్డుల విధానం

యూరియాకు ప్రత్యేక కార్డుల విధానం

  • ఖరీఫ్‌ సన్నద్ధతపై మంత్రి అచ్చెన్న సమీక్ష

అమరావతి, మే 18(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ ఏడాది రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు.

ఎల్‌నినో పరిస్థితులను తగ్గట్టు ఖరీఫ్‌ సీజన్‌-2026 ముందస్తు ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఖరీఫ్‌ సాగు సన్నద్ధతపై సోమవారం రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, జేడీఏలు, జిల్లా వ్యవసాయ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. జిల్లాల నుంచి డీఏవోలు వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాగునీరు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, యంత్ర పరికరాలు, మార్కెటింగ్‌ వంటి అంశాల్లో ప్రభుత్వ వ్యూహాన్ని మంత్రి వివరించారు.

'రాష్ట్రవ్యాప్తంగా విత్తనాలు, ఎరువులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయి. యూరియా సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. ఎరువుల దుర్వినియోగం, అక్రమ రవాణాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే డీలర్లపై తక్షణ చర్యలు తప్పవు.

రైతులకు యూరియాను పారదర్శకంగా అందించేందుకు ప్రత్యేక కార్డుల విధానాన్ని అమలు చేయనున్నాం. ఈ కార్డు ద్వారా అవసరానికి అనుగుణంగా యూరియా పొందే అవకాశం కల్పిస్తాం. ఎరువులు, విత్తనాల సరఫరా, నిల్వలు, పంపిణీపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది' అని మంత్రి చెప్పారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను సూచించారు. సచివాలయ సిబ్బంది ద్వారా ప్రచారం చేయాలని, గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించాలని చెప్పారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy