Thursday, 26 Nov, 4.32 pm BBC తెలుగు

హోమ్
26/11 ముంబయి దాడులకు పన్నెండేళ్లు... హఫీజ్ సయీద్‌ను పాకిస్తాన్ ఇప్పుడే ఎందుకు శిక్షిస్తోంది?

AFP 26/11 దాడి జరిగిన ప్రదేశాలలో తాజ్ హోటల్ ఒకటి

26/11 ముంబయి దాడులు జరిగి 12 ఏళ్లు గడిచాయి. ఆ దాడుల్లో 160కి పైగా మంది ప్రాణాలు కోల్పోయారు.

ఆ దాడులకు సూత్రధారిగా భావించే హఫీజ్ సయీద్‌పై పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలోని మూడు వేర్వేరు పట్టణాల్లో ఏడు కేసులు నమోదయ్యాయి. వీటిలో మూడు కేసుల్లో అతడిని కోర్టులు దోషులుగా తేల్చాయి.

అతడి నేతృత్వంలోని జమాత్-ఉద్-దవా (జేడీయూ) సంస్థపై పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధం విధించింది.

హఫీజ్ సయీద్‌ను అరెస్టు చేసి, కేసుల విచారణ జరపాలని భారత్, అమెరికా చాలా కాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నాయి.

2001 డిసెంబర్‌లో భారత పార్లమెంటుపై దాడి, 2006లో ముంబయిలోని రైళ్లలో బాంబు పేలుళ్లు వంటివాటి వెనుక ఉన్నది హఫీజ్ సయీదేనని భారత్ ఆరోపించింది. ఆయా సందర్భాల్లో పాకిస్తాన్ అతడిని గృహ నిర్బంధంలో పెట్టింది.

ముంబయి దాడులు జరిగిన తర్వాత కూడా 2008, 2009ల్లో కొన్నిసార్లు పాకిస్తాన్ సయీద్‌ను గృహ నిర్బంధంలో పెట్టింది.

అయితే, ఈ ఆరోపణలకు సంబంధించి పాకిస్తాన్ ప్రభుత్వం ఎప్పుడూ హఫీజ్‌పై విచారణలు చేపట్టలేదు. అతడి గృహ నిర్బంధాన్ని పొడిగించేందుకు మాత్రమే కోర్టులను ఆశ్రయిస్తూ వచ్చింది. కోర్టులు ఆ అభ్యర్థనలను తిరస్కరిస్తూ అతడిని విడుదల చేస్తూ వచ్చాయి.

హఫీజ్ సయీద్

2019లో తొలిసారి లాహోర్‌కు 50 కి.మీ.ల దూరంలోని గుజ్రాన్వాలా పట్టణంలో 'ఉగ్రవాద నిరోధక' పోలీసు విభాగం సయీద్‌ను అరెస్టు చేసింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) కీలక సమావేశం జరగడానికి కొన్ని రోజుల ముందు హఫీజ్ సయీద్‌కు రెండు కేసుల్లో ఐదున్నరేళ్ల జైలు శిక్ష విధిస్తూ లాహోర్‌లోని 'ఉగ్రవాద నిరోధక' కోర్టు తీర్పు చెప్పింది.

హఫీజ్ సయీద్‌ను 'అంతర్జాతీయ ఉగ్రవాది'గా ఐక్యరాజ్య సమితి, అమెరికా ప్రకటించాయి. అతడిని పట్టి ఇచ్చినవారికి 73 లక్షల రూపాయల రివార్డు కూడా అమెరికా ప్రకటించింది.

హఫీజ్ సయీద్ అరెస్టు తర్వాత... ''పదేళ్ల గాలింపు తర్వాత ముంబయి దాడుల 'సూత్రధారి' హఫీజ్ సయీద్‌ను పాకిస్తాన్ అరెస్టు చేసింది. రెండేళ్లుగా దీని కోసం తీవ్ర ఒత్తిడి తేవాల్సి వచ్చింది'' అని ట్రంప్ ట్వీట్ చేశారు.

పుల్వామా దాడి తర్వాత ఆంక్షలు

2019 ఫిబ్రవరిలో కశ్మీర్‌లోని పుల్వామాలో సైనిక వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకుని దాడి జరిగిన తర్వాత... తమ దేశంలోని కొన్ని మిలిటెంట్ సంస్థలపై పాకిస్తాన్ నిషేధం విధించింది. వీటిలో హఫీజ్ సయీద్‌కు చెందిన జేయూడీతోపాటుగా అతడు నడిపిస్తున్న ఫలాహ్-ఎ-ఇన్సానియత్ ఫౌండేషన్ కూడా ఉన్నాయి.

జేయూడీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పాకిస్తాన్ చర్యలు తీసుకోవడం కూడా మొదలుపెట్టింది. జేయూడీ అగ్ర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ నిషేధిత సంస్థలో సభ్యుడిగా ఉన్నందుకు, దాని కోసం నిధులు సమీకరించినందుకు హఫీజ్ సయీద్‌పై పంజాబ్‌లోని వివిధ నగరాల్లో కేసులు పెట్టారు.

2019 జులైలో అతడిని అరెస్టు చేసి, కేసు విచారణ మొదలుపెట్టారు. అదే ఏడాది డిసెంబర్‌లో అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. రెండు నెలల తర్వాత అతడిని దోషిగా తేల్చుతూ కోర్టు తీర్పు చెప్పింది.

హఫీజ్ సయీద్‌ ఆస్తులకు జేయూడీ లాంటి నిషేధిత సంస్థలతో సంబంధముందని, నిషేధిత సంస్థ కార్యకలాపాలకు అతడు నిధులు సమకూర్చాడని అభియోగాలు మోపారు.

అతడి అరెస్టును అమెరికా స్వాగతించింది.

''ఉగ్రవాదుల ఆర్థిక మూలాలపై పోరాడాలన్న అంతర్జాతీయ కృత నిశ్చయానికి తగినట్లుగా నడుచుకోవడం, చేసిన నేరాలకు లష్కరే తోయిబాను బాధ్యత వహించేలా చేయడం పాకిస్తాన్ వేసిన గొప్ప అడుగు'' అని హఫీజ్ అన్నారు.

ఇప్పటివరకూ మూడు కేసుల్లో కలిపి హఫీజ్ సయీద్‌కు మొత్తంగా 21 ఏళ్ల జైలు శిక్ష పడింది. మరో నాలుగు కేసుల్లో తీర్పులు ఇంకా రావాల్సి ఉంది.

అయితే, ముంబయి దాడుల కేసుల్లో మాత్రం అతడిని పాకిస్తాన్ కోర్టులు ఇంకా విచారించడం లేదు.

భారత ప్రభుత్వం నుంచి సహకారం కొరవడటంతో ఈ కేసులు ముందుకు సాగడం లేదని పాకిస్తాన్ అంటోంది.

తమ దేశానికి చెందిన సాక్షుల విచారణను పూర్తి చేశామని, భారత్‌లోని సాక్షుల విచారణ కోసం తాము చేసిన అభ్యర్థనలను భారత ప్రభుత్వం ఇంకా అంగీకరించడం లేదని వ్యాఖ్యానించింది.

ఇప్పుడే ఎందుకు శిక్షిస్తోంది?

ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) ఒత్తిడి కారణంగానే హఫీజ్ సయీద్‌పై పాకిస్తాన్ చర్యలు తీసుకోకతప్పని పరిస్థితి ఏర్పడింది.

2018 జూన్‌లో పాకిస్తాన్‌ను ఎఫ్ఏటీఎఫ్ 'గ్రే' లిస్ట్‌లో పెట్టింది. అక్రమ నగదు లావాదేవీలు, ఉగ్రవాద ఆర్థిక కార్యకలాపాలను అరికట్టేందుకు నిర్ణయించిన ప్రమాణాలను పాటించని దేశాలను ఈ ఎఫ్ఏటీఎఫ్ జాబితాలో పెడుతుంది.

దీంతో అంతర్జాతీయ ఆంక్షల నుంచి తప్పించునేందుకు ఆ తర్వాత పాకిస్తాన్ మిలిటెంట్ సంస్థలకు చెందిన చాలా మందిపై చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. నిషేధిత సంస్థలకు చెందిన ఆస్తులపైనా చర్యలు తీసుకుంది.

ఇందులో భాగంగానే హఫీజ్ సయీద్‌ను కూడా పాకిస్తాన్ అరెస్టు చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. 'గ్రే' లిస్ట్ నుంచి బయటపడాలంటే, వచ్చే ఫిబ్రవరి కల్లా తాము తగినన్ని చర్యలు తీసుకున్నామని ఎఫ్ఏటీఎఫ్‌కు ఆ దేశం చూపించుకోవాల్సి ఉంది.

source: bbc.com/telugu

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: BBC Telugu
Top