Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆ తిమింగలం చనిపోయింది.. ఎన్ని ప్రయత్నాలు చేసినా దక్కని ఫలితం

ఆ తిమింగలం చనిపోయింది.. ఎన్ని ప్రయత్నాలు చేసినా దక్కని ఫలితం

Reuters

హంప్‌బ్యాక్ తిమింగలం కళేబరాన్ని డెన్మార్క్ పర్యావరణ అధికారులు అన్‌హోల్ట్ దీవి నుంచి తొలగించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు.

తిమింగలం కళేబరం అక్కడే ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

గతవారం ఈ తిమింగలం కళేబరాన్ని గుర్తించారు.

జర్మనీ బ్లాటిక్ సముద్రతీరంలో ఈ హంప్‌బ్యాక్ తిమింగలం చిక్కుకుపోయి కొన్నివారాల పాటు అక్కడే ఉండిపోయింది. దీన్ని రక్షించేందుకు ఓ ప్రైవేట్ సంస్థ ప్రయత్నించింది.

రెండు వారాల కిందట దీన్ని జర్మనీ తీర ప్రాంతం నుంచి ఉత్తర సముద్రంలోకి బార్జ్‌లో తరలించారు.

కానీ రెండు వారాల తర్వాత ఆ తిమింగలం చనిపోయి కనిపించింది.

'అది బీచ్ నుంచి దాదాపు 65 నుంచి100 అడుగుల దూరంలో ఉంది. కానీ అలలతో పాటు తీరం వెంబడి కదులుతోంది' అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని స్థానిక మహిళ ఒకరు చెప్పారు.

 Danny Gohlke/AFP

'తిమింగలం పొట్ట పగిలిపోతుందేమో'

తిమింగలం కళేబరానికి డెన్మార్క్ పర్యావరణ పరిరక్షణ సంస్థ పోస్ట్‌మార్టమ్ నిర్వహించనుంది. అన్‌హోల్ట్‌కు కాస్త దూరంలో ఉత్తరంవైపు సముద్రంలో దాన్ని విడిచిపెట్టారు.

ఇన్‌పెక్షన్ సోకే ప్రమాదముందని తిమింగలం కళేబరానికి దూరంగా ఉండాలని ఆ దీవి ప్రజలను డెన్మార్క్ పర్యావరణ పరిరక్షణ సంస్థ కోరింది. అయితే దాన్ని ఎప్పుడు, ఎలా తరలిస్తారనేదానిపై ఎలాంటి సమాచారమూ వెల్లడించలేదు.

అయితే పోస్ట్‌మార్టమ్ నిర్వహించడంతో పాటు పరిశోధనల కోసం విలువైన శాస్త్రీయ శాంపిళ్లను సేకరించే వీలుకలిగేలా తిమింగలాన్ని తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అంతకుముందు సంస్థ తెలిపింది.

తిమింగలం కళేబరం కుళ్లిపోతుండడంతో దాని లోపల గ్యాస్ పెరిగిపోయి అది ఉబ్బిపోతోంది. దాని పొట్ట పగిలిపోతుందేమోనని స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

'కొందరు ఆందోళన చెందుతున్నారని నాకు తెలుసు. అది సహజం. కానీ నాకేం భయం లేదు' అని బీబీసీతో మాట్లాడిన స్థానికుడు ఒకరు చెప్పారు.

 తిమింగలాన్ని, టిమ్మి, హోప్ పేర్లతో పిలిచారు.

మార్చి మొదటివారం నుంచి తిమింగలాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు

డెన్మార్క్ తూర్పు జట్లాండ్ తీరానికి దగ్గరలోని కట్టేగాట్ జలసంధి వద్దకు ఈ తిమింగలం ఎలా చేరిందన్నది ఇప్పటికీ తెలియలేదు. జర్మనీ నుంచి ఈ తిమింగలాన్ని తీసుకెళ్లిన నౌక డెన్మార్ ఉత్తర తీరానికి 45 మైళ్ల దూరంలో సముద్రంలో విడిచిపెట్టింది.

ఈ తిమింగలం మార్చి మొదటి నుంచి జర్మన్లను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ తిమింగలం గురించి ఇంత మాట్లాడుకోవడం అన్‌హోల్ట్ దీవికి చెందిన ప్రజలకు మాత్రం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఇటీవల కొందరు జర్మన్ పర్యటకులు తిమింగలం సమాచారం తెలుసుకోవడానికి అన్‌హోల్ట్ దీవికి వచ్చారు. కొన్ని మీడియా సంస్థలు ఈ తిమింగలానికి ''టిమ్మి'' అనే పేరు పెట్టాయి. తిమింగలం మొదట టిమ్మెన్‌డార్ఫర్ బీచ్‌ దగ్గర ఇసుక దిబ్బలో చిక్కుకుపోయినప్పుడు ఆ పేరు పెట్టారు. కొందరు దాన్ని ''హోప్'' అని పేరుతో పిలిచారు.

 BBCఅన్‌హోల్ట్ తీరంలో తిమింగలం కళేబరం ఉంది.

ఇంతకీ ఆ తిమింగలమేనా?

తిమింగలాన్ని రక్షిస్తామని ఇద్దరు వ్యాపారవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు గానీ జర్మన్ నిపుణులు మాత్రం అది చాలా బలహీనంగా ఉందని, చనిపోయే ప్రమాదముందని హెచ్చరిస్తూనే ఉన్నారు. తిమింగలం బతికిబయటపడుతుందన్న ఆశను వదిలేసుకున్నామని అధికారులు కూడా ఏప్రిల్ మొదట్లో చెప్పారు.

అది మొదట వలల్లో చిక్కుకుని ల్యూబెక్ బే దగ్గర ఇరుక్కుపోయింది. అక్కడ దాన్ని రక్షించడానికి ప్రయత్నాలు జరిగాయి. తర్వాత అది తూర్పు వైపు బాలిస్టిక్ సముద్రతీరం వెంబడి ఈదుకుంటూ వెళ్లి పోయెల్ దీవికి చేరుకుంది. తర్వాత దాన్ని ఏప్రిల్ చివరి వారంలో ఒక నౌకలో ఉత్తర సముద్రంలో విడిచిపెట్టారు.

సముద్రంలో విడిచిపెట్టిన తిమింగలం, అన్‌హోల్ట్ దగ్గర చనిపోయి కనిపించిన తిమింగలం ఒకటేనా అని తొలుత సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే దాన్ని రక్షించేటప్పుడు అమర్చిన జీపీఎస్ ట్రాకర్‌ను హంప్‌బ్యాక్ దగ్గర గుర్తించడంతో చనిపోయిన తిమింగలం అదేనని నిర్ధరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

హంప్‌బ్యాక్ తిమింగలం, హోప్, టిమ్మి, జర్మనీ Reuters

source: bbc.com/telugu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: BBC Telugu