Monday, 20 Sep, 1.03 pm BBC News తెలుగు

హోమ్
ఆంధ్రప్రదేశ్: కరెంటు బిల్లు ఎక్కువ వస్తే ఏం చేయాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి, ఎలా పరిష్కరించుకోవాలి

BBC

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ హోటల్‌కు రూ. 21 కోట్ల 48 లక్షలు, విశాఖలోని మరో టైలర్‌కు రూ. 90,400 కరెంట్ బిల్లు వచ్చింది.

ఇంత ఎక్కువ మొత్తంలో బిల్లులు వచ్చాయంటే అవి భారీ పరిశ్రమలో, పెద్ద పెద్ద వ్యాపారాలో అనుకోవద్దు.

పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలోని చిన్న హోటల్ నిర్వహకురాలు, విశాఖ మన్యం సీలేరులో ఇంట్లోనే ఒక మిషనుతో బట్టలు కుట్టే దర్జీకి విద్యుత్ పంపిణీ సంస్థలు పంపించిన బిల్లులువి.

ఇంత పెద్ద మొత్తంలో కరెంట్ బిల్లు చూసి అందోళన పడ్డామని, కట్టకపోతే అరెస్ట్ చేస్తారేమోనని భయంతో రాత్రంతా నిద్రపోలేదని సీలేరుకు చెందిన టైలర్ సోమనాథం చెప్పారు.

BBC

ఎక్కువ బిల్లు వచ్చిందని కంప్లయింట్ చేస్తే కొత్త మీటర్ ఇచ్చారు.. ఈసారి రూ. 21 కోట్ల బిల్లు

పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో రోడ్డు పక్క చిన్న హోటల్ నిర్వహిస్తున్నారు మంగమ్మ.

ఈ హోటల్ కు సగటున నెలకు రూ. 700 విద్యుత్ బిల్లు వచ్చేది. అయితే ఆగస్టులో కరెంటు బిల్లు రూ. 48 వేలు వచ్చింది. ఈ విషయంపై కంగారు పడిన మంగమ్మ స్థానిక విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేశారు.

దాంతో మీటరులో సాంకేతిక లోపం తలెత్తిందంటూ పాత మీటరు తీసి కొత్త మీటరు బిగించారు.

ఈ కొత్త మీటరు అమర్చిన తరువాత సెప్టెంబరులో రూ. 21 కోట్లు విద్యుత్ బిల్లు వచ్చింది. దీంతో మంగమ్మ మళ్లీ అధికారుల వద్దకు పరుగుపెట్టారు.

BBC

సీలేరులోని టైలర్ సోమనాథం కుటుంబానిదీ ఇదే పరిస్థితి. నెలకు రూ. 200 మించి విద్యుత్ బిల్లు రాదు. కానీ సెప్టెంబరులో రూ. 90 వేలు వచ్చింది.

ఇంట్లో నాలుగు ట్యూబ్ లైట్లు, ఒక సీలింగ్ ఫ్యాన్, ఒక టేబుల్ ఫ్యాన్, అప్పుడప్పుడు ఉపయోగించే ఒక ఇస్త్రీ పెట్టె ఉన్నాయి.

"నా భార్యకు ఈ విషయాన్ని చెప్పాను. అధికారులకు ఫిర్యాదు చేద్దామని నిర్ణయించుకున్నాం. అయితే ఈలోగా బిల్లు కట్టకపోతే అరెస్ట్ చేస్తారేమోనని భయపడ్డాం. ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు." అని సోమనాథం చెప్పారు.

BBC

హోటల్ మంగమ్మ, టైలర్ సోమనాథంలాగే అనంతపురం జిల్లా పాల్తూరు గ్రామానికి చెందిన పర్వతప్ప అనే రైతు కూలీకి ఆగస్టులో రూ.లక్ష 48 వేలు బిల్లు వచ్చింది. తన ఇంట్లో ఒక టీవీ, ఒక ఫ్యాన్, మూడు బల్బులు తప్ప మరేమి లేవని, పింఛనుపై బతికే తనకు ఇంత బిల్లు రావడం ఏంటనే అందోళనతో పర్వతప్ప విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేశారు.

భారీ మొత్తం చెల్లించాలంటూ విద్యుత్ బిల్లులు రావడం ప్రతి నెలా ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటుంది. ఇలా జరిగిన ప్రతిసారి మీడియాలో కరెంటే కాదు...బిల్లు కూడా షాకిస్తుందంటూ ఎన్నో వార్తలు వస్తూ ఉంటాయి. అయితే అసలు ఇంత మొత్తంలో బిల్లులు రావడానికి కారణమేంటి...? తప్పు ఎవరిది?

BBC వాసుదేవరావు

టైలర్ సోమనాథానికి ఇంత భారీ మొత్తంలో బిల్లు రావడంతో మీటరు రీడింగ్ తీసిన వ్యక్తిని ప్రశ్నించారు.

"మీ మీటరు రీడింగ్ ఎంటర్ చేసిన తర్వాత వచ్చిన బిల్లు ఇది. మీకు దీనిపై ఏదైనా అనుమానముంటే చింతపల్లిలోని విద్యుత్ అధికారులను కలవండి'' అని చెప్పారు అన్నారు సోమనాథం

''సీలేరుకు చింతపల్లి దాదాపు 80 కిలోమీటర్లు. అంత దూరం ఛార్జీలు పెట్టుకుని ప్రయాణం చేయాలి. అధికారులు, సిబ్బంది చేసిన తప్పులకు మేం కష్టపడాల్సి వస్తుంది" అని సోమనాథం చెప్పారు.

"పర్వతప్ప, మంగమ్మ, సోమనాథాలకు నిజంగానే షాక్ కొట్టేంత స్థాయిలో బిల్స్ వచ్చాయి కాబట్టి అధికారుల దగ్గరకు పరుగులు పెట్టారు. అదే సగటున నెలకు రూ. 500 విద్యుత్ బిల్లు చెల్లించే వ్యక్తికి ఏదైనా నెలలో ఇంట్లో తొమ్మిదొందలో, వెయ్యో బిల్లు వచ్చిందనుకుందాం. ఆ నెలలో ఆ ఇంట్లో విద్యుత్ వినియోగం ఎక్కువగా చేసే ఫంక్షన్లు, ఇతర కార్యక్రమాలేవి జరగకపోయినా అనుమానించరు. అలాగే ఎక్కువ బిల్లు రావడానికి టెక్నికల్ ఇష్యూ ఏదైనా ఉందా అని ఆలోచించరు. విద్యుత్ శాఖను తిట్టుకుని బిల్లు కట్టేస్తారు" అని వాసుదేవరావు అన్నారు.

వాసుదేవరావు విద్యుత్ వినియోగదారుల హక్కులు, అవగాహన అనే అంశాలపై 'ఈ-సమాచారం' అనే మ్యాగజైన్ నడుపుతున్నారు. రాష్ట్రంలో విద్యుత్ నియంత్రణ మండలి నిర్వహించే సమీక్ష సమావేశాలకు ఆయన అతిధిగా హాజరవుతుంటారు.

BBC

ఎందుకిలా?

గతంలో విద్యుత్ మీటర్లు అనలాగ్ మోడ్‌లో ఉండేవి. ఈ విధానంలో వినియోగిస్తున్న విద్యుత్‌కు అనుగుణంగా విద్యుత్ మీటరు లోపల ఒక చక్రం తిరుగుతూ, .విద్యుత్ వాడకాన్ని గణిస్తుంది. కానీ ప్రస్తుతం వాడకాన్ని గణించేందుకు డిజిటల్ మీటర్లు వచ్చాయి.

"ప్రస్తుతం అన్నిచోట్లా డిజిటల్ మీటర్లే ఉన్నాయి. ఈ మీటర్లలో కొన్ని సార్లు రీడింగ్ జంప్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. దీంతో, మీటరు రీడింగ్ అధికంగా చూపిస్తుంది. అంటే ఒక యూనిట్ తిరిగితే, దానిని నాలుగు, ఐదు, పది ఇలా తప్పుడు యూనిట్లు చూపిస్తుంది. వినియోగించిన దాని కంటే ఎక్కువ యూనిట్లు చూపిస్తుంది. అంటే ఏదైనా మీటరు ఒక యూనిట్ కు 4 యూనిట్లు జంపైతే...వంద యూనిట్లు విద్యుత్ వినియోగం చేస్తే...అది నాలుగు వందల యూనిట్లుగా చూపిస్తుంది. 10 యూనిట్లు జంపైతే...వెయ్యి యూనిట్లు చూపిస్తుంది" అని వాసుదేవరావు బీబీసీతో చెప్పారు.

"మీటరుతో పాటు మీటరు రీడింగ్ తీసే మిషన్లలో కూడా టెక్నికల్ సమస్యల వల్ల కూడా అధిక బిల్లులు వస్తాయి. మీటర్ రీడింగ్ తీసే మిషన్లలోని చిన్నచిన్న డిజిటల్ పరికరాలు, స్కానర్లు వంటివి పాడైతే కూడా వినియోగంతో పొంతన లేని రీడింగులను చూపిస్తూ అధిక బిల్లులకు కారణమవుతాయి. అయితే విద్యుత్ మీటరు, లేదా మీటరు రీడింగ్ తీసే మిషన్లు ఈ రెండిట్లో తలెత్తే సాంకేతిక సమస్యల కారణంగానే రీడింగ్ జంపింగ్ జరుగుతుంటుంది. ఎక్కువగా విద్యుత్ మీటర్లలో తలెత్తే టెక్నికల్ ఇష్యూస్ వలనే రీడింగ్ ఎక్కువగా చూపిస్తుంది." అని ఆయన వివరించారు.

BBC

మీటరు పాడైతే..

కోట్లలో, లక్షల్లో బిల్లు వస్తే... ఎందుకింత బిల్లు వచ్చిందనే అనుమానం కలుగుతుంది. అదే తక్కువ మొత్తాల్లో వస్తే అనుమానం కలగదు. మన బిల్లు ఎక్కువగా వస్తుందని డౌట్ వచ్చినా అసలు మీటరు సరిగా పని చేస్తుందా లేదా అనే విషయం వినియోగదారులు సైతం ప్రాథమికంగా తెలుసుకునే అవకాశం ఉంది.

"మీటరు పనితీరుపై అనుమానం ఉంటే విద్యుత్ సిబ్బందికి చెప్పాలి. మేం వచ్చి చెక్ చేసి, సందేహం ఉంటే తాత్కాలికంగా వేరేది అమర్చి పాత మీటరును టెస్టింగుకు పంపిస్తాం. మీటరులో ఏదైనా సమస్య బయటపడితే వినియోగదారుడికి వివరించి కొత్త మీటరును బిగిస్తాం. అలా కాకుండా మీటరు బాగానే ఉన్నా కూడా అధిక బిల్లు వస్తే మీటర్ రీడింగ్స్ తీసే మిషన్లను చెక్ చేయిస్తాం. ఈ రెండిటిలోనే ఏదో ఒకటి సమస్యకు కారణమై ఉంటుంది" అని విద్యుత్ పంపిణీ సంస్థ ఈపీడీసీఎల్‌లో ఇంటికి మీటర్లు అమర్చే పని చేస్తున్న రాజారాం చెప్పారు.

"ఇప్పుడు అన్నీ డిజిటల్ మీటర్లు కావడంతో విద్యుత్ వినియోగానికి అనుగుణంగా మీటరుపై ఉన్న ఒక చిన్న బల్బు బ్లింక్ అవుతూ ఉంటుంది. అంటే వెలిగి, ఆరుతూ ఉంటుంది. ఇది 3200 సార్లు వెలిగి, ఆరితే ఒక యూనిట్ విద్యుత్ వినియోగం జరిగిందని అర్థం. వెయ్యి వాట్ల పవర్ ఒక గంటకు వాడితే (అంటే ఒక యూనిట్) 3200 సార్లు బ్లింక్అవుతుంది. ఒక గంటలో 5 యూనిట్లు వాడితే 16 వేల సార్లు బ్లింక్ అవుతుంది. ఇలా మనం గంటకు వినియోగించే విద్యుత్ ను బట్టి బ్లింకింగ్ రేట్ పెరుగుతూ ఉంటుంది. ఒక వేళ బ్లింక్ కాకుండా అలా ఆగిపోతే మీటరులో సాంకేతిక లోపం ఉన్నట్లు లెక్క. దీని కారణంగానే మీటరు రీడింగ్ జంపిగ్ జరుగుతుంది" అని రాజారాం వివరించారు.

బిల్లు కట్టకుండానే ఫిర్యాదు చేయాలి

వినియోగదారుడు విద్యుత్ బిల్లు కట్టకపోతే ఇంటికి వచ్చి సరఫరా నిలిపివేస్తారు. ఆలస్యంగా చెల్లిస్తే పెనాల్టీలు విధిస్తారు. మరి, విద్యుత్ శాఖ చేసే తప్పిదాలు కారణంగా కోట్లు, లక్షల్లో విద్యుత్ బిల్లులు చూసి అందోళనకు గురైన వినియోగదారులు విద్యుత్ శాఖపై ఫిర్యాదు చేయవచ్చా?

"విద్యుత్ శాఖ బిగించిన మీటరులో సాంకేతిక లోపం ఉందనే అనుమానం వచ్చినా...మనం మీటర్లు రీపేరు చేయడం వంటివి చేయకూడదు. ఎందుకంటే అవి సీల్ చేసి ఉంటాయి. ఒక్కసారి వాటిని మనం ఓపెన్ చేస్తే దానికి విద్యుత్ శాఖ బాధ్యత వహించదు. అధిక బిల్లులు కారణంగా అందోళనకు గురైనప్పుడు దానికి కారణమైన సిబ్బందిపై ఫిర్యాదు చేయాలనుకుంటే మాత్రం విద్యుత్ పంపిణీ సంస్థల్లో ఏర్పాటు చేసిన CGRF (Consumer Grievances Redressal Forums)లో ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఫోరం విచారించి వినియోదారుడికి న్యాయం చేస్తుంది. అధిక మొత్తంలో వచ్చిన బిల్లు కట్టకుండానే ఫిర్యాదు చేయాలి. కట్టిన తర్వాత ఫిర్యాదు చేసినా...అ మొత్తం తదుపరి బిల్లులలో సర్దుబాటు చేస్తారే కానీ, డబ్బు రూపంలో తిరిగి రాదు" అని ఈపీడీసీఎల్ లో పని చేస్తున్న అధికారి ఒకరు చెప్పారు.

BBC సూర్యప్రతాప్

బిల్లు భారీగా వస్తే 1912కు కాల్ చేయండి

విద్యుత్ బిల్లులు తీసే పనిని మీటర్ రీడర్స్‌ చేస్తారు. వీరు విద్యుత్ వినియోగానికి సంబంధించిన రీడింగులను రీడింగ్ మిషన్ లో ఎంటర్ చేయడం ద్వారా విద్యుత్ బిల్లులు జనరేట్ అవుతాయి. అయితే ఆ బిల్లులు ఇచ్చే సమయంలో ఒకసారి పరిశీలించి భారీ మొత్తంలో ఉన్నాయోమోననే విషయం గమనించాలని మీటర్ రీడర్స్‌కు పదే పదే చెప్తున్నామని ఈపీడీసీఎల్‌లో సూపరింటెండెంట్ ఇంజనీర్ సూర్యప్రతాప్ బీబీసీతో చెప్పారు.

"విశాఖలో ప్రతి నెల దాదాపు 16 లక్షల విద్యుత్ బిల్లులు వినియోగదారులకు ఇస్తారు. వాటిలో ఒకటో, రెండో మీటర్లు, రీడింగ్ మిషన్లలోని సాంకేతిక కారణాలతో కోట్లు, లక్షలు, వేలలో కట్టాలని చూపిస్తూ తప్పుడు బిల్లులు వస్తుంటాయి.

ఇది ఒక్క విశాఖకే పరిమితం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జరుగుతుంటుంది. అలాంటి బిల్లులు వచ్చిన వారు కంగారు పడకుండా విద్యుత్ సిబ్బంది దృష్టికి తీసుకురండి.

అదే సాంకేతిక సమస్యే కానీ, నిజంగా అంత బిల్లులు రావనే విషయం తెలుసుకోండి. అలాంటి బిల్లులు వచ్చినా మీరు కట్టనవసరం లేదు. మీటర్ రీడర్లకు కూడా అటువంటి బిల్లులు వస్తే వినియోగదారుడికి ఇవ్వవద్దని చెప్పాం. అలా చెప్పినా కొందరు వినియోగదారులకే ఇస్తున్నారు. అటువంటి వారిపై చర్యలు తీసుకుంటున్నాం.

అధిక బిల్లులు వస్తే 1912కు కాల్ చేసి చెప్పండి. విద్యుత్ సిబ్బంది వెంటనే వచ్చి సమస్యను పరిష్కరిస్తారు" అని సూర్యప్రతాప్ చెప్పారు.

source: bbc.com/telugu

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: BBC Telugu
Top