Sunday, 24 Jan, 9.01 pm BBC తెలుగు

భారతదేశం
ఆస్ట్రేలియా: 18 రోజుల కిందట తప్పిపోయాడు - పుట్టగొడుగులు తిని బతికాడు - BBC Newsreel

Queensland Police రాబర్ట్‌ వెబర్‌

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో 18రోజుల కిందట తప్పిపోయిన రాబర్ట్‌ వెబర్‌ అనే స్థానిక రాజకీయ నేత చివరకు ప్రాణాలతో కనిపించారు.

కిల్కివాన్‌ అనే పట్టణంలోని ఓ హోటల్‌లో ఉన్న ఆయన జనవరి 6న తన కుక్క తీసుకుని బయటకు వెళుతూ కనిపించారు. కొంత దూరం వెళ్లాక ఆయన కారు బురదలో కూరుకుపోయింది.

కారు బైటికి రాకపోవడంతో మూడు రోజులపాటు అందులోనే గడిపిన ఆయన, ఎలాగోలా బయటకు వచ్చి సమీపంలోని డ్యామ్‌ దగ్గరకు వెళ్లారు. అక్కడే చెట్టు కింద పడుకుని, డ్యామ్‌ నీళ్లు తాగుతూ, ఆకలైనప్పుడు పుట్టగొడుగులు తింటూ కాలం గడిపారని పోలీసులు వెల్లడించారు.

వెబర్‌ కోసం భారీ సెర్చ్‌ నిర్వహించిన పోలీసులు చివరకు ఆయన దొరక్క పోవడంతో ఆపరేషన్‌ను నిలిపేశారు. అయితే డ్యామ్‌ దగ్గర చెట్టుకింద కూర్చున్న ఆయన్ను ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి గుర్తించారని పోలీసులు తెలిపారు.

తప్పిపోయిన రాబర్ట్‌ వెబర్‌ దొరికారని ఎంపీ టోనీ పెరెట్‌ ఆదివారంనాడు ప్రకటించారు. డ్యామ్‌ దగ్గరున్న ఓ చెట్టు కింద కూర్చుని తమను చూసి చేతులూపారని ఎంపీ వెల్లడించారు. " గత వారం ఈ మార్గంలో మేం చాలాసార్లు వెళ్లాం. కానీ ఇప్పుడు కనిపించడం ఆశ్చర్యంగా ఉంది'' అన్నారు పెరెట్‌.

Sameer Sehgal/Hindustan Times via Getty Image

రైతుల నిరసనలు: ట్రాక్టర్ పరేడ్‌కు దిల్లీ పోలీసుల అనుమతి

గణతంత్ర దినోత్సవంనాడు రైతులు నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్ పరేడ్‌పై రైతు సంఘాలు, దిల్లీ పోలీసుల మధ్య అంగీకారం కుదిరింది.దిల్లీ పోలీసులు, రైతుల మధ్య వరుస చర్చల అనంతరం సయోధ్య కుదిరినట్లు స్వరాజ్ అభియాన్ నాయకుడు యోగేంద్ర యాదవ్ మీడియాతో చెప్పారు.గణతంత్ర దినోత్సవ అధికారిక కార్యక్రమాలకు ఈ పరేడ్‌తో ఎలాంటి అవరోధాలు కలగవని ఆయన స్పష్టంచేశారు.మరోవైపు పరేడ్‌లో పాల్గొనే రైతులంతా క్రమశిక్షణతో వ్యవహరించాలని రైతు సంఘాలు కూడా అభ్యర్థించాయి.

''పరేడ్ మార్గానికి సంబంధించి కొన్ని అంశాలపై ఇంకా స్పష్టతరాలేదు. అయితే, పరేడ్ నిర్వహణకు మాత్రం అంగీకారం కుదిరింది''అని దిల్లీ పోలీసు వర్గాలు బీబీసీకి తెలిపాయి. చర్చల అనంతరం పరేడ్ మార్గంపై పూర్తి వివరాలను పోలీసులకు తెలియజేస్తామని రైతు సంఘాల నాయకులు వెల్లడించినట్లు పేర్కొన్నాయి.

EPA

దిల్లీ రాజధాని ప్రధాన మార్గాల్లో ట్రాక్టర్ ర్యాలీ జరగకుండా చూసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కుండ్లి-మానేసర్-పల్వల్ ఎక్స్‌ప్రెస్‌వే మార్గంలో ఈ ర్యాలీ జరిగితే ఇబ్బంది తక్కువగా ఉంటుందని వారు భావిస్తున్నారు. దీనితోపాటు మరో రెండు, మూడు మార్గాలను కూడా పోలీసులు సూచిస్తున్నారు.అయితే, దిల్లీ ఔటర్ రింగ్ రోడ్‌పై ఈ ర్యాలీ చేపట్టాలని రైతులు భావిస్తున్నారు. దీంతో ఇంకా మార్గం విషయంలో స్పష్టత రావడం లేదు.

ఉత్తరాఖండ్‌ రాష్ట్రానికి ఒక రోజు ముఖ్యమంత్రి సృష్టి గోస్వామి

ఉత్తరాఖండ్‌కు ఒక రోజు ముఖ్యమంత్రిగా హరిద్వార్ జిల్లాలోని దౌలత్‌పుర్ గ్రామానికి చెందిన సృష్టి గోస్వామి బాధ్యతలు తీసుకోనున్నారు. జనవరి 24 (ఆదివారం)న జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమె సీఎం పదవిని చేపడుతున్నారు.

ఉత్తరాఖండ్‌కు తొలి మహిళా ముఖ్యమంత్రి సృష్టినే. అయితే, ఈ పదవీ బాధ్యతలు చేపట్టడమనేది అలంకారప్రాయంగా జరుగుతోంది. చిల్డ్రన్స్ అసెంబ్లీలో సీఎంగా బాధ్యతలు తీసుకొని, భిన్న విభాగాల్లో పనులను ఆమె సమీక్షిస్తారు. ఆ సమయంలో అధికారులంతా అక్కడే ఉంటారు. వారికి సృష్టి సలహాలు, సూచనలు ఇస్తుంటారు.

మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య జరిగే ఈ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ కూడా హాజరుఅవుతారు.

19ఏళ్ల సృష్టి.. రూర్కీలోని బీఎస్‌ఎం పీజీ కాలేజీలో అగ్రికల్చర్ బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్నారు.

బాలికల సాధికారతపై అందరికీ అవగాహన కల్పించడమే లక్ష్యంగా సృష్టిని ఒక రోజును ముఖ్యమంత్రిని చేస్తున్నట్లు ఉత్తరాఖండ్ బాల పరిరక్షణ కమిషన్ ఛైర్మన్ ఉష నేగి చెప్పారు.

''ఒక రోజు సీఎంగా పనిచేసే అవకాశం దక్కడంతో చాలా సంతోషంగా ఉంది. భిన్న విభాగాల అధికారులు ప్రెజెంటేషన్లు సమర్పించిన అనంతరం.. నేను నా సలహాలు సూచనలు ఇస్తాను''అని సృష్టి ఓ ప్రటకనలో తెలిపింది.

సృష్టి తండ్రి దౌలత్‌పుర్‌లో ఓ దుకాణాన్ని నడిపిస్తున్నారు. సృష్టి తల్లి అంగన్వాడీ కార్యకర్త. తమ కుమార్తెకు ఇలాంటి అవకాశం ఇవ్వడంపై ముఖ్యమంత్రికి వీరిద్దరూ ధన్యవాదాలు తెలిపారు.

''నాకు చాలా గర్వంగా ఉంది. మన అమ్మాయిలు ఏదైనా సాధించగలరు. వారికి తగిన తోడ్పాటు, సాయం అందిస్తే చాలు. వారు ఎవరికీ తక్కువేం కాదు. ఎలాంటి లక్ష్యాన్నైనా వారు అందుకోగలరు''అని సృష్టి తల్లి సుధా గోస్వామి వ్యాఖ్యానించారు.

source: bbc.com/telugu

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: BBC Telugu
Top