Sunday, 20 Sep, 10.46 pm BBC తెలుగు

హోమ్
ఐపీఎల్ 2020: ధోనీ డీఆర్ఎస్ నిర్ణయాలు.. రాయుడి పరుగుల దాహం

కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో జరుగుతోంది. అనేక పరిమితుల మధ్య, ఆట చూసేందుకు ప్రేక్షకులు లేకుండానే మ్యాచులు ప్రారంభమయ్యాయి.

ఐపీఎల్‌లో రెండు బలమైన జట్లు.. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ శనివారం జరిగింది.

ఈ మ్యాచ్ పోటాపోటీగా జరిగినప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో మ్యాచ్ గెలుచుకుంది.

ముంబై ఇండియన్స్ ఆరంభంలో బాగా ఆడినా మంచి స్కోర్ చెయ్యలేకపోయారు. చెన్నై సూపర్ కింగ్స్ మొదట్లో తడబడినప్పటికీ, చివర్లో పుంజుకుని మ్యాచ్ గెలుచుకున్నారు.

అయితే మ్యాచ్ జరుగుతున్నంతసేపూ ఎవరైనా గెలవొచ్చు అనిపించేలా సాగింది. చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలుచుకుని బౌలింగ్ ఎంచుకున్నారు.

బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ క్యాప్టన్ రోహిత్ శర్మకు సైట్ స్క్రీన్‌తో ఇబ్బందులు రావడంతో కొన్ని నిముషాలు ఆలశ్యంగా ఆట ప్రారంభమయ్యింది.

ధోనీ - డీఆర్ఎస్

ఈ ఆటలో ధోనీ డీఆర్ఎస్ నిర్ణయంపై ఎక్కువ చర్చ జరిగింది. ముంబై ఇండియన్స్ 14 వ ఓవర్లో ఉండగా పీయూష్ చావ్లా వేసిన బంతికి సౌరవ్ తివారీ ఎల్‌బీడబ్ల్యూ అయ్యారని అప్పీల్ చేశారు. అంపైర్ నాట్ అవుట్ అన్నారు. కానీ వికెట్ల వెనకాల నిల్చున్న ధోనీ డీఆర్ఎస్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. బంతి వేసిన పీయూష్ చావ్లాకే ఇది అవుట్ అని తోచలేదు. అయినా ధోనీ డీఆర్ఎస్ అడిగారు. ధోనీ నిర్ణయం తప్పయ్యింది. అది నాట్ అవుట్ అని డీఆర్ఎస్‌లో తేలింది.

సాధారణంగా డీఆర్ఎస్ విషయంలో ధోనీ నిర్ణయానికి తిరుగుండదు. కానీ ఈసారి ఆ నిర్ణయం తప్పవ్వడంతో... ట్విట్టర్‌లో ఇదే ముఖ్యాంశమయ్యింది. నిజంగానే 2020 చెడ్డ సంవత్సరమని, ఏదీ సరిగ్గా జరగట్లేదని నెటిజన్లు చర్చించారు.

అయితే సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో ధోనీ తన తప్పును తానే సరిదిద్దుకున్నారు. ధోనీ బ్యాటింగ్ మొదలవ్వగానే బౌలర్ క్యాచ్ పట్టారు. ధోనీ డీఆర్ఎస్ అప్పీల్ చేసుకున్నారు. ఈసారి ధోనీ నిర్ణయం తప్పవ్వలేదు. అది అవుట్ కాదని నిర్ణయించారు. అయినప్పటికీ ధోనీ ఈ మ్యాచ్‌లో ఒక్క రన్ కూడా చెయ్యకుండా వెనుదిరిగారు. కానీ అతని టీం బాగా ఆడి మ్యాచ్ గెలుచుకుంది.

కోవిడ్ 19 ప్రభావం

కోవిడ్ 19 కారణంగా ఆటగాళ్లకు సరైన శిక్షణ లభ్యం కాలేదు. ప్రాక్టీస్ చేసే అవకాశం దొరకలేదు. చాలామంది ఆటగాళ్లు బరువు పెరిగినట్టు కనిపించారు.

అయితే, విరాట్ కోహ్లీలాంటి కొందరు ఆటగాళ్లు మాత్రం లాక్‌డౌన్ సమయంలో కూడా తమ ఫిట్‌నెస్ పెంచుకోవడానికి చేసిన ప్రయత్నాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉన్నారు.

రోహిత్ శర్మ, పీయూష్ చావ్లాలాంటి వాళ్లందరూ బాగా బరువు పెరిగినట్టు కనిపించింది. చర్చ మాత్రం సౌరవ్ తివారీ మీదే ఎక్కువ జరిగింది. ముంబై ఇండియన్స్ బౌలింగ్ చేస్తున్నప్పుడు మైదానంలో కొన్నిసార్లు సౌరవ్ తివారీని పోల్చుకోవడం కష్టమైంది. సౌరవ్ తివారీ అధిక బరువు పెరగడానికి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమవ్వడం కూడా ఒక కారణమయ్యుండొచ్చని అనేకమంది భావిస్తున్నారు.

అయితే, బరువు పెరిగినా తన ఆట తీరు మారలేదని రుజువు చేస్తూ సౌరవ్ తివారీ ముంబై ఇండియన్స్ తరపున అత్యధికంగా 42 పరుగుల స్కోర్ చేశారు.

కరోనావైరస్ ప్రభావం ఆటగాళ్ల ఫిట్‌నెస్ మీద పడిందని మాత్రం స్పష్టంగా తెలుస్తూ ఉంది.

మురళీ విజయ్ బ్యాడ్ లక్

మురళీ విజయ్, షేన్ వాట్సన్ సీఎస్‌కే తరపున ఆట ఆరంభించినప్పుడు వారిద్దరి మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. కానీ ముంబై ఇండియన్స్ బౌలర్స్ బోల్ట్, ప్యాటిన్సన్ . వారిద్దరినీ తిప్పలు పెట్టారు.

మొదట షేన్ వాట్సన్ అవుట్ అయ్యారు. బోల్ట్ వేసిన అద్భుతమైన బంతి బ్యాట్ ఫుట్‌లో తగిలి ఎల్‌బీడబ్ల్యూ కింద అవుట్ అయ్యారు.

తరువాతి ఓవర్‌లో ప్యాటిన్సన్ వేసిన బంతికి మురళీ విజయ్ ఎల్‌బీడబ్ల్యూ అయ్యారని అప్పీల్ చేసారు కానీ అంపైర్ అవుటివ్వలేదు. చాలాసేపు చర్చించిన మీదట క్యాప్టన్ రోహిత్ శర్మ డీఆర్ఎస్ తీసుకోలేదు.

అయితే, అదే ఓవర్‌లో ప్యాటిన్సన్ వేసిన మరో బంతికి మురళీ విజయ్ మళ్లీ ఎల్‌బీడబ్ల్యూ అయ్యారు. ఈసారి అంపైర్ అవుటిచ్చేసారు. అతను డీఆర్ఎస్ అడగకుండా వెనుదిరుగాడు.

కానీ, రీప్లేలో చూస్తే మొదటిసారి అంపైర్ అవుట్ ఇవ్వనప్పుడు నిజానికి మురళీ విజయ్ అవుటయ్యారు. రెండోసారి అంపైర్ అవుట్ ఇచ్చినప్పుడు, అతను అవుటవ్వలేదు. క్రికెట్లో అప్పుడప్పుడూ ఇలాంటివి జరగడం సాధారణమే.

డూ ప్లెసీ పట్టిన మూడు అద్భుతమైన క్యాచులు

మ్యాచ్ తరువాత..తమ జట్టు మరో 20-25 పరుగులు అధికంగా చేసి ఉండాల్సిందని ముంబై ఇండియన్స్ క్యాప్టన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డారు.

ముంబై ఇండియన్స్ జట్టు ఆట గొప్పగా ప్రారంభించింది. సులువుగా 200 పరుగులు సాధించగలరని అనుకున్నారు.

కానీ సీఎస్‌కే ఆటగాడు డూ ప్లెసీ అసాధారణ రీతిలో, చాలా ఎత్తులో పట్టుకున్న మూడు క్యాచులు ముంబై ఇండియన్స్ పరుగులను నిలువరించాయి. వీటిల్లో సౌరవ్ తివారీ, హార్దిక్ పాండ్యా క్యాచులు కూడా ఉన్నాయి.

సౌరవ్ తివారీ 42 పరుగుల అత్యధిక స్కోరుతోనూ, హార్దిక్ పాండ్యా కళ్లు చెదిరే రెండు సిక్స్‌లతోనూ ముంబై ఇండియన్స్ స్కోరు నిలబెట్టే ప్రయత్నం చేసినప్పటికీ వరుసగా సౌరవ్ తివారీ, హార్దిక పాండ్యా తరువాత ప్యాటిన్సన్ క్యాచులు పట్టి డూ ప్లెసీ ముంబై ఇండియన్స్ స్కోరు కట్టడి చేసారు.

సామ్ కరెన్‌ను ముందు బ్యాటింగ్‌కు పంపించిన ధోనీ

ధోనీ జట్టు బ్యాటింగ్‌కు దిగితే.. ఐదు లేదా ఆరో స్థానంలో ధోనీ వచ్చి బ్యాట్ ఝళిపించి, హెలికాఫ్టర్ షాట్లతో రంజింపజేస్తాడని క్రికెట్ అభిమానులు ఆశిస్తారు.

అయితే, ఎప్పుడూ ప్రయోగాలను ఇష్టపడే ధోనీ ఈ మ్యాచ్‌లో తన కంటే ముందు సామ్ కరెన్‌ను బ్యాటింగ్‌కు పంపించారు.

మొదట రవీంద్ర జడేజాను పంపించారు. తరువాత సామ్ కరెన్‌కు పంపించారు. సామ్ కరెన్ బ్యాటింగ్‌కు దిగినప్పుడు వ్యాఖ్యాతలు కూడా ఆశ్చర్యపోయారు.

6 పరుగుల్లో 18 పరుగులు చేసి కరెన్ వెనుదిరిగారు. ఇలాంటి సమయంలో కరెన్‌లాంటి ఆటగాళ్లు దూకుడుగా ఆడతారు. అందుకే అతన్ని పంపించానని మ్యాచ్ తరువాత ధోనీ చెప్పారు.

సౌండ్ ట్రాక్ ఉపయోగించారు

క్రికెట్ చూస్తున్నప్పుడు ప్రేక్షకుల చప్పట్లు, అరుపులు, ఈలలు లేకపోతే ఆటలో మజా ఉండదు.

ప్రేక్షకులు లేకుండా ఆడడం ఆటగాళ్లకూ ఒకింత నిరుత్సాహంగానే ఉంటుంది. అయితే టీవీల ముందు కూర్చుని చూస్తున్న వీక్షకులకు మరీ కష్టంగా ఉంటుంది.

అందుకని ఈసారి సౌండ్ ట్రాక్‌లను ఉపయోగించి. మైదానంలో ప్రేక్షకులు ఉన్నారన్న అనుభూతిని కలిగించే ప్రయత్నం చేశారు.

ఈ పద్ధతిని అనేక అంతర్జాతీయ, క్లబ్ ఫుట్బాల్ మ్యాచులలో ఉపయోగిస్తున్నారు. ఈసారి ఐపీఎల్‌లోనూ వాడారు.

ఆటగాళ్లు అవుటయినప్పుడు, సిక్సులు, ఫోర్లు కొట్టినప్పుడు టీవీలముందు కూర్చుని చూస్తున్న ప్రేక్షకులకు ఈలలు, చప్పట్లు, నవ్వులు వినిపించేలా చేశారు.

...చివరిగా రాయుడి ప్రతాపం

అంబటి రాయుడి గురించి చెప్పకుండా ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే అసలు మనం ఈ మ్యాచ్ గురించి ఏమీ మాట్లాడుకోనట్టే లెక్క.

సీఎస్‌కే మ్యాచ్‌ను గెలిపించడంలో అంబటి రాయుడు ముఖ్య పాత్ర పోషించారు. ప్రశాంతంగా, నిగ్రహంతో ఆడగల సత్తా ఉన్న రాయుడ్ సీఎస్‌కేకు పెద్ద బలం అని నిరూపించారు.

ఈ మ్యాచ్‌లో రాయుడు కొట్టిన షాట్లు చూస్తే ఇతను ఎందుకింత త్వరగా అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్ అయ్యాడు అనే సందేహమొస్తుంది.

ప్రపంచ కప్ జట్టులో చోటు దొరకక, నిరాశతో రిటైర్ అవుతున్నట్టు ప్రకటించారన్నది అందరికీ తెలిసిన విషయమే.

అంతర్జాతీయ క్రికెట్ జట్టు్‌లో రాయుడికి సరైన స్థానం దక్కకపోవడం అన్యాయమని క్రికెట్ నిపుణులు కూడా అభిప్రాయపడ్డారు.

కానీ రాయుడు ఐపీఎల్‌లో తన సత్తా చూపిస్తూనే ఉన్నారు. ఈసారి కూడా సీఎస్‌కే మ్యాచుల్లో ప్రధాన పాత్ర పోషించనున్నారని ఈ మ్యాచ్‌తో రుజువు చేశారు.

source: bbc.com/telugu

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: BBC Telugu
Top