Wednesday, 25 Nov, 2.48 pm BBC తెలుగు

హోమ్
అమెరికా అధ్యక్ష ఎన్నికలు: జో బైడెన్ టీమ్‌లో ఎవరెవరు...

Reuters

అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన జో బైడెన్ త్వరలో ఏర్పడబోయే తమ ప్రభుత్వంలో కీలకమైన ఆరు పదవులకు ఎవరెవరిని తీసుకోబోతున్నది ప్రకటించారు.

నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా అవ్రిల్ హెయినెస్‌ను నియమించాలని నిర్ణయించినట్లు బైడెన్ తెలిపారు. ఈ నియామకం జరిగితే, ఈ పదవి చేపట్టిన తొలి మహళగా అవ్రిల్ ఘనత అందుకోనున్నారు.

ఇక హోంల్యాండ్ భద్రత శాఖ సెక్రటరీ (మంత్రి) పదవికి అలెజాండ్రో మయోర్కాస్‌ను బైడెన్ ఎంచుకున్నారు. ఈ పదవి చేపట్టబోతున్న మొదటి లాటినో (లాటిన్ అమెరికా మూలాలు ఉన్న వ్యక్తి) అలెజాండ్రోనే.

అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ప్రస్తుత అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్... బైడెన్ చేతిలో తన ఓటమిని అంగీకరించేందుకు నిరాకరిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే, బైడెన్‌కు అధికారం బదిలీ చేసేందుకు ట్రంప్ అంగీకరించారు.

అధ్యక్షుడికి రోజువారీగా సమర్పించే రహస్య నిఘా సమాచార నివేదిక (ప్రెసిడెన్షియల్ డైలీ బ్రీఫ్)ను బైడెన్‌కూ అందజేసేలా వైట్ హౌస్ అవసరమైన ఆదేశాలు జారీ చేసింది.

కీలకమైన ప్రభుత్వ అధికారులతోపాటు, మిలియన్ల డాలర్ల నిధులు బైడెన్‌కు ఇప్పడు అందుబాటులోకి వచ్చాయి. వచ్చే ఏడాది జనవరి 20న ఆయన అధ్యక్ష పదవి చేపడతారు.

బైడెన్ ఏమన్నారు?

అమెరికా చరిత్రాత్మకంగా పోషిస్తున్న అంతర్జాతీయ నాయకత్వ పాత్రను బలోపేతం చేయడం కోసం కృషి చేస్తానని బైడెన్ అన్నారు.

''ట్రంప్ మొత్తం వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారు. 'అమెరికా ఫస్ట్, అమెరికా మాత్రమే' అనే పరిస్థితికి తెచ్చారు. మన మిత్రులు భయాందోళనల్లో ఉన్నారు. మిత్ర కూటములను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కరోనావైరస్, వాతావరణ మార్పుల ముప్పులను కూడా మనం ఎదుర్కోవాల్సి ఉంది'' అని ఆయన వ్యాఖ్యానించారు.

''అమెరికా వెనుకంజ వేయడం కాదు, ప్రపంచానికి దారి చూపేందుకు సిద్ధంగా ఉంది'' అని బైడెన్ అన్నారు.

కరోనావైరస్ వ్యాక్సీన్ పంపిణీ విషయమై కోవిడ్ కార్యాచరణ బృందంతో వైట్ హౌస్‌లో సమావేశమయ్యే ఆలోచనలో ఉన్నట్లు కూడా చెప్పారు.

/Reuters జెక్ సల్లివాన్, లిండా థామస్-గ్రీన్ ఫీల్డ్, అంటోనీ బ్లింకెన్‌లను కీలక పదవులకు ఎంచుకున్న బైడెన్

ఎంచుకుంది వీరినే...

  • ఆంటోనీ బ్లింకెన్, సెక్రటరీ ఆఫ్ స్టేట్. వివిధ దేశాలతో తమ దేశ బంధాలను పునర్నిర్మించేందుకు వినమ్రత, విధేయతతో వ్యవహరిస్తామని ఆంటోని అంటున్నారు.
  • జాన్ కెర్రీ, వాతావరణ మార్పుల రాయబారి. పారిస్ వాతావరణ ఒప్పందం కుదరడంలో కీలక పాత్ర పోషించినవారిలో జాన్ కెర్రీ ఒకరు. అయితే ఈ ఒప్పందం నుంచి అమెరికాను ట్రంప్ బయటకు తీసుకువచ్చారు. వాతావరణ మార్పుల సంక్షోభాన్ని నివారించేందుకు ప్రపంచమంతా ఏకం కావల్సిన అవసరం ఉందని జాన్ కెర్రీ చెబుతున్నారు.
  • అవ్రిల్ హెయినెస్, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్. నిజాలను నిర్భయంగా చెప్పాలంటూ గట్టిగా పోరాడే అవ్రిల్‌ను ఈ పదవికి తాను ఎంచుకున్నానని బైడెన్ అన్నారు.
  • అలెజాండ్రో మయోర్కాస్, హోంల్యాండ్ భద్రత విభాగం సెక్రటరీ. అందరినీ ఆహ్వానించే దేశంగా అమెరికాకు ఉన్న చరిత్రను, దేశ భద్రతను కాపాడే పవిత్ర బాధ్యత తమ శాఖ మీద ఉందని అలెజాండ్రో అన్నారు.
  • జేక్ సల్లివాన్, వైట్ హౌస్ జాతీయ భద్రతా సలహాదారు. పాలన వ్యవహారాలకు సంబంధించి బైడెన్ నుంచి తాను ఎంతో తెలుసుకున్నానని, ముఖ్యంగా మానవ విలువల గురించి నేర్చుకున్నానని జేక్ అంటున్నారు.
  • లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్, ఐరాసకు అమెరికా రాయబారి. తన దక్షిణ లూసియానా మూలాలను కార్యనిర్వహణలోనూ మరిచిపోనని లిండా అంటున్నారు.
/Alamy అలెజాండ్రో మయోర్కాస్ (ఎడమ), అవ్రిల్ హెయిన్స్ (కుడి), జానెట్ యెలెన్ (మధ్యలో)

కీలకమైన ఈ ఆరు పదవులకు బైడెన్ ఎంచుకున్న వ్యక్తుల విషయమై డెమొక్రటిక్ పార్టీ సెంటరిస్ట్ వర్గాల నుంచి సంతోషం వ్యక్తమవుతోంది.

విదేశాంగ విధాన నిపుణులు, విజయవంతమైన మహిళలు, నల్ల జాతీయులు... ఇలా భిన్న నేపథ్యాలు, అనుభవాలు ఉన్న వాళ్లు ఈ పదవులు చేపట్టబోతున్నవారిలో ఉన్నారు.

అయితే డెమొక్రటిక్ పార్టీలోని అభ్యుదయవాదులు మాత్రం బైడెన్ ఎంపికలపై పెదవి విరుస్తున్నారు.

ఒబామా, క్లింటన్ హయాంల్లో ఉన్నవారితోనే ప్రభుత్వం మళ్లీ నిండుతోందని విమర్శిస్తున్నారు.

ఇక బైడెన్ చుట్టూ 'పాండాను కౌగిలించుకునేవాళ్లే' ఉన్నారని, చైనా పట్ల వాళ్లు మెతక వైఖరి చూపుతారని అర్కాన్సస్ సెనేటర్, రిపబ్లికన్ పార్టీ నాయకుడు టిమ్ కాటన్ అభిప్రాయపడ్డారు.

source: bbc.com/telugu

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: BBC Telugu
Top