అమెరికా కొత్త గ్రీన్ కార్డు పాలసీని ప్రకటించింది.
ఈ పాలసీ కింద అమెరికాలోని వలసదారులు గ్రీన్ కార్డు పొందాలనుకుంటే ముందు వారు అమెరికాను వీడి తమ స్వదేశానికి వెళ్లి అక్కడి అమెరికా రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
''తమ వీసా హోదాను మార్చుకోవాలనుకునే వారు, 'కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప' దేశం వెలుపల మాత్రమే కాన్సులర్ ప్రాసెసింగ్ ద్వారానే వీసా హోదా మార్చుకోవాల్సి ఉంటుంది'' అని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) శుక్రవారం తెలిపింది.
అక్రమ వలసలను అరికట్టడానికి ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో భాగంగా, వీసాహోల్డర్లు, సందర్శకులు అమెరికాలోనే నివసిస్తూ గ్రీన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించిన చట్టంలోని ఓ లొసుగుకు ఇది చెక్ పెడుతుంది.
ఈ మార్పు తీసుకురావడానికి ముందు సుదీర్ఘమైన గ్రీన్‌కార్డు దరఖాస్తు ప్రక్రియ సమయంలో దరఖాస్తుదారులు అమెరికాలోనే ఉండే వెసులుబాటు ఉండేదని, కానీ ఈ కొత్త విధానం వల్ల ఆ అవకాశం లేకుండా పోయిందని, కొత్త పద్దతిని విమర్శిస్తున్నవారు అంటున్నారు.
గ్రీన్ కార్డు పొందాలనే ఆశతో అమెరికాను వీడే లక్షలాదిమంది వలసదారులకు ఈ కొత్త విధానం తిరిగి అమెరికాకు వెళ్లగలమో లేదో అనే సందిగ్థాన్ని సృష్టించవచ్చు.
గ్రీన్ కార్డు అమెరికాలో శాశ్వత నివాసానికి అనుమతి ఇస్తుంది.
యూఎస్‌సీఐఎస్ తీసుకొచ్చిన ఈ కొత్త విధానం అక్కడ నివసిస్తున్న భారతీయులపై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు.
గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారిలో.. ఇతర దేశాల నుంచి వచ్చే వృత్తి నిపుణుల సంఖ్య కంటే భారత్, చైనా నుంచి వచ్చే దరఖాస్తుల సంఖ్యే ఎక్కువగా ఉందని తెలిసింది.గ్రీన్‌కార్డు పొందేందుకు 2023 నాటికి 10 లక్షల మంది భారతీయులు క్యూలో ఉన్నారని యూఎస్‌సీఐఎస్ తెలిపారు.
క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం కోసం మే 23 నుంచి 26 మధ్యలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో భారత్‌లో పర్యటిస్తున్న సందర్భంగా ఈ నిర్ణయం వెలువడింది.

అమెరికా నిర్ణయంపై ప్రశ్నల వెల్లువ
కొత్త గ్రీన్ కార్డు విధానం భారతీయులకు ఎదురుదెబ్బ అని అమెరికాలోని వలసదారుల హక్కుల కార్యకర్త అజయ్ భూటోరియా అన్నారు.
''చట్టబద్ధంగా నివసిస్తున్న 12 లక్షల మందికి పైగా భారతీయ-అమెరికన్లు ప్రస్తుతం అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం గ్రీన్ కార్డు దరఖాస్తుదారులు అమెరికాను వీడి, ఇమ్మిగ్రేషన్ వీసా ద్వారా తిరిగి ప్రవేశించడాన్ని ఈ కొత్త విధానం తప్పనిసరి చేస్తుంది'' అని
''గత రెండేళ్లుగా చదువుకోవడానికి అమెరికాకు వచ్చే విద్యార్థుల సంఖ్యలో 35 నుంచి 40 శాతం తగ్గుదల కనిపించింది. గత డిసెంబర్‌లో.. వీసా స్టాంపింగ్ కోసం భారత్‌కు వెళ్లిన చాలామంది అక్కడే చిక్కుకుపోవడం చూశాం. వీసా స్టాంపింగ్‌కు వారికి లభించిన తేదీలు ఆగస్టు, అక్టోబర్ వరకు ఉన్నాయి'' అని తెలిపారు.
''ఈ కొత్త నిర్ణయంతో.. గ్రీన్ కార్డును పొందే మార్గం మునపటి లాగా అంత తేలిక కాదు. ఈ నోటిఫికేషన్ అమెరికా తనకు తానే నష్టం కలిగించుకునే చర్య'' అని చెప్పారు.
''గ్రీన్ కార్డు కోసం క్యూలో ఉన్న 12 లక్షల మంది భారతీయ-అమెరికన్లు అత్యధిక ఆదాయం సంపాదించే, పన్నులు చెల్లించే, చట్టాన్ని గౌరవించే వ్యక్తులలో ఉన్నారు. వీరు అమెరికా ఖజానాకు బిలియన్ల డాలర్లను అందిస్తున్నారు'' అని తెలిపారు.
ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారత్‌లోని కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా కూడా ప్రశ్నించారు.
''అమెరికా వలస విధానంలో ఇటీవల తీసుకొచ్చిన మార్పులు వృత్తి నిపుణుల, విద్యార్థుల గ్రీన్ కార్డు ప్రయాణాన్ని అనిశ్చితిలో పడేస్తున్నాయి'' అని
''కొత్త నిబంధనలు గణనీయమైన అంతరాయాన్ని కలిగించవచ్చు. ఈ విధానం వల్ల ప్రజలపై పడే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాన్ని విస్మరించకూడదు'' అన్నారు.
''ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తిరిగి పరిశీలించాలి. ఎందుకంటే, భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రజలు అమెరికా ఆర్థిక వ్యవస్థకు, సమాజానికి ఎనలేని సహకారం అందించారు'' అని చెప్పారు.
''భారత ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని, విదేశాల్లో నివసిస్తున్న వారి ప్రయోజనాల కోసం అండగా నిలబడాలి'' అని తెలిపారు.
ఇటీవల వార్తల్లో నిలిచిన ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ ముత్తుకృష్ణన్ దండపాణి.. ఈ కొత్త నిబంధనల కారణంగా అమెరికాలో ఎన్నారైల జీవితం కష్టతరం కాబోతుందని
''అమెరికాలో నివసిస్తున్న ఎన్నారైలు ఈ విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ మీకు అమెరికా పౌరసత్వంకానీ, గ్రీన్ కార్డు కానీ లేకపోతే.. మీ జీవితం మరింత కష్టతరం కాబోతున్నట్లు అనిపిస్తుంది'' అని రాశారు.

ఎన్‌ఆర్‌ఐలపై పడే ప్రభావమెంత?
గ్రీన్ కార్డులపై ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానం అక్కడ నివసిస్తున్న భారతీయులపై ప్రభావం చూపుతుందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు హర్ష్ పంత్ కూడా భావిస్తున్నారు.
''ఈ కొత్త ప్రక్రియ కచ్చితంగా మార్పు తీసుకొస్తుంది. గతంలో వారికి ప్రయోజనం చేకూర్చిన ప్రక్రియ ఇప్పుడు ముగిసింది. మీరు ఒక దేశానికి వెళ్లి, అక్కడ నివసిస్తూ గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోగలిగినప్పుడు.. అది స్థిరత్వాన్ని కాపాడుతుంది. విదేశాలకు వెళ్లిన వ్యక్తికి ఈ ప్రక్రియ అనుకూలంగా ఉంటుంది'' అని హర్ష్ పంత్ బీబీసీతో అన్నారు.
''కానీ, మీరు మీ దేశానికి వెళ్లి, అక్కడ గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే, అది మరింత కష్టమవుతుంది. దీని ప్రభావం నేరుగా ఉంటుంది'' అని తెలిపారు.
ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందనే ప్రశ్నకు హర్ష్ పంత్ సమాధానమిస్తూ ''ట్రంప్ ప్రభుత్వానికి వలసలు ఒక పెద్ద సమస్యగా మారాయి. వీటిని తగ్గించడానికి సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఒకవేళ వలసల సంఖ్యను తగ్గించలేకపోయినా.. ఈ విషయంలో మేం చర్యలు తీసుకుంటున్నామని ఓటర్లకు చూపించడానికి ప్రయత్నిస్తారు'' అని చెప్పారు.
''ట్రంప్ ఇప్పుడు మధ్యంతర ఎన్నికలకు వెళ్తున్నారు. ఆయన పార్టీ పరిస్థితి అంత బాగోలేదు. వలసల విషయంలో.. మేం కఠినంగా వ్యవహరిస్తున్నామని, వలసదారులకు కష్టతరమయ్యే ప్రక్రియను మేం సృష్టిస్తున్నామని, వలసదారులను రానివ్వడం లేదని ఆయన చూపించగలరు'' అని తెలిపారు.
హర్ష్ పంత్ నుంచి మరో రెండు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు బీబీసీ న్యూస్ ప్రయత్నించింది.
మొదటి ప్రశ్న.. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్నఈ నిర్ణయం అమెరికాలో నివసిస్తున్న భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
రెండవ ప్రశ్న.. భవిష్యత్‌లో గ్రీన్ కార్డు పొందాలని కలలు కంటున్న భారతీయుల ఆశలకు ఈ నిర్ణయం ఏ స్థాయి ఎదురుదెబ్బ అవుతుంది?
ఈ ప్రశ్నలకు స్పందించిన హర్ష్ పంత్.. ''ఈ నిర్ణయం ఇరు పక్షాల్లో నిరాశను పెంచుతుంది. అమెరికా పట్ల ఉన్న ఆసక్తి తగ్గుతుంది. అమెరికా వలస ప్రక్రియను మారుస్తున్న విధానం.. వలసదారుల్లో కలిగిస్తున్న నిరాశ కచ్చితంగా మార్పు తీసుకొస్తుంది. అయితే, ఎలాగైనా అమెరికా వెళ్లాలనుకునే వారు మాత్రం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటారు'' అని అన్నారు.
''అక్కడ చదువుకోవడానికి లేదా పనిచేయడానికి వెళ్లిన వలసదారులకు సమస్యలు పెరుగుతాయి. గ్రీన్ కార్డు దరఖాస్తు కోసం భారత్‌కు తిరిగి రావాల్సి వస్తే, వారు నిరాశ చెందుతారు'' అని చెప్పారు.

గ్రీన్ కార్డు అంటే?
గ్రీన్ కార్డు అమెరికాలో శాశ్వతంగా నివసించడానికి అనుమతించే ఒక డాక్యుమెంట్.
ఈ డాక్యుమెంట్ పొందిన ఏ వ్యక్తికైనా అమెరికా పౌరులకున్న ప్రయోజనాలు, హక్కులు దక్కుతాయి.
గ్రీన్ కార్డు హోల్డర్లకు ఓటు హక్కు ఉండదు. అయితే, దేశంలో ఎక్కడికైనా ప్రయాణించడానికి, పనిచేయడానికి వారు అమెరికన్ల లానే సమాన అవకాశం పొందుతారు.
ఈ కార్డు పొందిన తర్వాత.. అమెరికా శాశ్వత పౌరసత్వానికి మార్గం సుగుమం అవుతుంది.
యూఎస్‌సీఐఎస్.. దీన్ని శాశ్వత నివాస కార్డు అని పిలుస్తోంది.
ఈ కార్డును ఒకేసారి 10 సంవత్సరాల కాలానికి జారీ చేస్తారు. ఆ తర్వాత దీనిని రెన్యూవల్ చేసుకోవచ్చు.
అమెరికాలో దీనిని విదేశీ పౌరులకు పలు కారణాల ఆధారంగా జారీ చేస్తారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
గ్రీన్‌కార్డు పొందేందుకు 2023 నాటికి 10 లక్షలమంది వేచి చూస్తున్నారని యూఎస్‌సీఐఎస్ తెలిపింది. గ్రీన్ కార్డు, అమెరికా, భారత్source: bbc.com/telugu

