Wednesday, 05 Aug, 6.16 pm BBC తెలుగు

హోమ్
అయోధ్య భూమిపూజ: లౌకికత్వంపై హిందూత్వ గెలిచిన రోజు ఇది: అసదుద్దీన్ ఒవైసీ

అయోధ్యలో రామమందిరానికి భూమిపూజ ముగిసింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదితయానాథ్‌ సహా పలువురు ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు.

అయితే ఓవైపు భూమిపూజ జరుగుతుండగానే, దీనిపై నిరసన గళాలు కూడా వినిపించాయి.

అయోధ్యలోనే బాబ్రీ మసీదు ఉంటుందని.. హిందూత్వ చేతిలో లౌకికత్వం ఓడిపోయిందని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు.

భారత్ లౌకిక దేశమని.. రామమందిరానికి శంకుస్థాపన చేసి ప్రధాని మోదీ లౌకిక స్ఫూర్తిని ఉల్లంఘించారని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

ఇది లౌకికత్వం, ప్రజాస్వామ్యం హిందూత్వ చేతిలో ఓడిపోయిన రోజని ఆయన ట్వీట్ చేశారు.

"బాబ్రీ మసీదు అక్కడే ఉండేది, అది అక్కడే ఉంటుంది. బాబ్రీ జిందాహై" అంటూ అసదుద్దీన్‌ ఒవైసీ బుధవారం ట్వీట్‌ చేశారు.

అఖిల భారత ముస్లిం పర్సనల్ లాబోర్డు కూడా మంగళవారం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది.

బాబ్రీ మసీదు ఎప్పటికీ మసీదుగానే కొనసాగుందని, టర్కీలోని హయా సోఫియాను ట్వీట్‌లో ప్రస్తావిస్తూ అది తమకు స్ఫూర్తి అని ఆ ప్రకటన పేర్కొంది.

మసీదు భూమిని స్వాధీనం చేసుకోవడం అన్యాయమని, అణచివేత సిగ్గుచేటని పేర్కొంది. మెజారిటీ తీర్పుతో మసీదు స్థితిని మార్చలేరని పేర్కొంది.

ఎవరూ బాధపడవద్దని, పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని తన ట్వీట్‌లో అన్నారు.

అయితే బాబ్రీ మసీదును టర్కీలోని హయా సోఫియాతో పోల్చడంతో ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీన్ని కోర్టు ధిక్కారంగా కొందరు అభివర్ణిస్తున్నారు.

ఇస్తాంబుల్‌లోని చారిత్రక హయా సోఫియా మ్యూజియంను మసీదుగా మారుస్తున్నట్లు టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యప్‌ ఎర్డోగాన్‌ ఇటీవల ప్రకటించారు.

సుమారు 1500 సంవత్సరాల కిందట హయా సోఫియా చర్చిగా ఉండేది. 1453లో ఇస్లాం పాలకులైన ఒట్టోమాన్‌ సామ్రాజ్యాధినేతలు టర్కీని ఆక్రమించుకున్న తర్వాత దానిని మసీదుగా మార్చారు.

ఆధునిక టర్కీ నిర్మాత ముస్తఫా కెమాల్‌ పాషా 1934లో తన దేశాన్ని లౌకికదేశంగా ప్రకటించి హయా సోఫియా మసీదును మ్యూజియంగా మార్చారు.

సుప్రీంకోర్టు తీర్పు తర్వాత

అయోధ్య కేసులో తీర్పు వెలువడిన తరువాత అఖిల భారత ముస్లిం పర్సనల్ లాబోర్డ్‌ సుప్రీం కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే కోర్టు దీన్ని తిరస్కరించింది.

అయోధ్యలో మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఈ భూమిని తీసుకోవద్దని ముస్లిం పర్సనల్ లా బోర్డు పేర్కొంది.

1992 డిసెంబర్‌ 6న బాబ్రీ మసీదు కూల్చివేతతో దేశవ్యాప్తంగా పలుచోట్ల మతఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో సుమారు 2000 మంది మరణించారు. అయోధ్యలోని రామ మందిరం కోసం ఉద్యమిస్తున్ననేతలు ఇది రాముడి జన్మస్థలమని, దాన్ని ధ్వంసం చేసి మసీదును కట్టారని వాదించారు.

గత ఏడాది నవంబర్‌లో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం రామ మందిరానికి ఈ భూమిని ఇవ్వాలని, ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి మందిరాన్ని నిర్మించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ముస్లింలు మసీదు నిర్మించుకునేందుకు అయోధ్య ప్రాంతంలో ఐదు ఎకరాల భూమిని కేటాయించాలని ఆదేశించింది.

సీపీఐ, సీపీఎంలు ఆగస్టు 5ను నిరసన దినంగా పాటిస్తామని తెలిపాయి. మతపరమైన వేడుకను ప్రధానమంత్రి రాజకీయాలకు కోసం వాడుకుంటున్నారని, భూమి పూజలో ప్రధాని పాల్గొనడం నేరమని ఆ పార్టీలు వాదిస్తున్నాయి.

source: bbc.com/telugu

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: BBC Telugu
Top