Wednesday, 25 Nov, 8.21 am BBC తెలుగు

హోమ్
బండి సంజయ్: 'బిడ్డా... పాత బస్తీలో సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తాం, పాకిస్తానీలను, రోహింజ్యాలను తరిమికొడతాం' - ప్రెస్ రివ్యూ

facebook/bandisanjaykumar

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే, హైదరాబాద్‌లోని పాత బస్తీపై 'సర్జికల్ స్ట్రైక్స్' చేస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించినట్లు 'ఆంధ్రజ్యోతి' దినపత్రిక ఓ వార్త ప్రచురించింది.

''మేయర్‌ పీఠం దక్కించుకుంటే బిడ్డా.. పాతబస్తీ మీద సర్జికల్‌ స్ట్రైక్స్ చేసి పాకిస్తానీలు, రోహింజ్యాలను ఇక్కడి నుంచి తరిమితరిమి కొట్టే బాధ్యతను బీజేపీ తీసుకుంటుంది'' అని బండి సంజయ్ అన్నారు.

హిందూ ధర్మ పరిరక్షణ కోసం బీజేపీ పోరాడుతుందని, జనాభాలో 80శాతం ఉన్న ప్రజల మనోభావాలు, సంక్షేమం కోసం పాటుపడుతుందని ఆయన చెప్పారు.

ముస్లిం ఓట్లతో గెలిచే ప్రయత్నం చేస్తున్న వాళ్లు లౌకికవాదులు ఎలా అవుతారని సంజయ్ ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే ఎంఐఎంకు ఓటు వేసినట్లేనని ఆయన అన్నారు.

బండి సంజయ్‌ వ్యాఖ్యలపై ఎంఐఎం పార్టీ నేత అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. తాము 24 గంటల సమయం ఇస్తున్నామని, పాతబస్తీలో ఉన్న పాకిస్తానీలు ఎవరో తేల్చాలని సవాల్‌ విసిరారు.

'స్థానిక ఎన్నికలంటే వైఎస్సార్సీపీకి భయం'

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే గెలవలేమన్న భయంతోనే వాటి నిర్వహణకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వెనుకంజ వేస్తోందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించినట్లు 'ఈనాడు' దినపత్రిక ఓ వార్త రాసింది.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల్లో వైఎస్సార్సీపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే అంతా ఏకమై ఓడిస్తారనే ఆందోళన ఆ పార్టీ నేతల్లో నెలకొందని చంద్రబాబు అన్నారు.

అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా ఏపీలో మాత్రం ప్రభుత్వం అడ్డుపడుతుందని ఆయన విమర్శించారు. ప్రజలు తిరగబడితే డబ్బులు, అధికార బలం పనిచేయదనే వాస్తవాన్ని వైఎస్సార్సీపీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని టీడీపీ కార్యకర్తలకు సూచించారు.

'కరోనా వ్యాక్సీన్‌ పంపిణీకి మేం సిద్ధం'

కరోనావైరస్ వ్యాక్సీన్‌ను ప్రజలకు ప్రాధాన్యతా క్రమంలో అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) వెల్లడించినట్లు 'సాక్షి' దినపత్రిక ఓ వార్త రాసింది.

ప్రధాని నరేంద్ర మోది మంగళవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వ్యాక్సీన్ వచ్చాక దాన్ని ప్రజలకు అందించే విషయంలో అనుసరించాల్సిన విధానంపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ తన అభిప్రాయాలను చెప్పారు.

ప్రాధాన్యత క్రమంలో ప్రజలకు వ్యాక్సీన్ అందించడానికి అనుగుణమైన కార్యాచరణను రూపొందించామని, వ్యాక్సీన్ వల్ల దుష్ప్రభావాలు ఏమైనా ఉంటాయా అన్నది కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని కేసీఆర్ అన్నారు.

''దేశంలో వివిధ ప్రాంతాల్లో వేర్వేరు వాతావరణ పరిస్థితులున్నాయి కరోనా వైరస్‌ కూడా దేశమంతటిపై ఒకే రకమైన ప్రభావం చూపలేదు. వ్యాక్సీన్ కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. అందువల్ల మొదట రాష్ట్రానికి కొన్ని చొప్పున వ్యాక్సీన్ డోసులు పంపి వాటిని కొంతమందికి ఇవ్వాలి. 10 - 15 రోజులు పరిస్థితిని పరిశీలించాక మిగతా వారికి ఇవ్వాలి'' అని అభిప్రాయపడ్డారు.

ఆరోగ్య కార్యకర్తలకు, కోవిడ్‌పై పోరాడుతున్న పోలీసులు, ఇతర శాఖల సిబ్బందికి, అరవై ఏళ్లు దాటిన వారికి, తీవ్ర జబ్బులతో బాధపడుతున్న వారికి మొదట వ్యాక్సీన్ ఇవ్వాలని కేసీఆర్‌ కోరారు.

'తెలంగాణలో అశోకుడి కాలం నాటి అరుదైన శాసనం'

తెలంగాణలో అశోకుడి కాలం నాటి అరుదైన బ్రాహ్మి శాసనం వెలుగుచూసిందంటూ 'నమస్తే తెలంగాణ' దినపత్రిక ఓ వార్త రాసింది.

భారత పురావస్తు విభాగం మూడునెలలుగా మెదక్‌లోని రాక్‌బెడ్స్‌, మంజీరా నది ఒడ్డున సమగ్ర సర్వే, పరిశోధన చేసి బ్రాహ్మి శాసనాన్ని గుర్తించింది.

మంజీరాలోయలోని బండరాళ్లపై దీన్ని గుర్తించినట్టు పరిశోధకుల బృందం ప్రతినిధి శ్రీనివాసన్‌ తెలిపారు.

శాసనం దొరికిన ప్రదేశానికి కిలోమీటర్‌ దూరంలో ఉన్న రాక్‌షెల్టర్లలో బౌద్ధుల కాలంనాటి మూడు శాసనాలు కూడా గుర్తించినట్టు పేర్కొన్నారు. ఇవి కూడా బ్రాహ్మి లిపిలో ఉన్నాయని చెప్పారు.

తెలంగాణ చరిత్రలో ఇదో కొత్త అధ్యాయమని, మంజీరా లోయలో ఇంత విలువైన సాక్ష్యాలను గుర్తించడం ఇదే మొదటిసారని శ్రీనివాసన్‌ అన్నారు.

source: bbc.com/telugu

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: BBC Telugu
Top