Monday, 09 Mar, 12.53 am BBC తెలుగు

తెలంగాణ
#BBCISWOTY పీవీ సింధుకు బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు.. పీటీ ఉషకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్-2019 పురస్కారానికి బ్యాడ్మింటన్ తార పీవీ సింధు ఎంపికయ్యారు.

BBCISWOTY పురస్కారం ప్రదానోత్సవం దిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్‌లో జరిగింది. ఈ పురస్కారాన్ని అందించడం ఇదే తొలిసారి.

BBC

పురస్కారానికి ఎంపిక కావడంపై సింధు హర్షం వ్యక్తంచేశారు.

"బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ బృందానికి నా కృతజ్ఞతలు. ఈ అవార్డుకు ఎంపికవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత గొప్ప పురస్కారాన్ని ప్రవేశపెట్టినందుకు బీబీసీ ఇండియాకు, నా అభిమానులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా" అని ఆమె చెప్పారు.

పీవీ సింధు ఖాతాలో ఇప్పటివరకూ ఐదు వరల్డ్ చాంపియన్‌షిప్ పతకాలున్నాయి. ఆమె ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచిన మొదటి భారత సింగిల్స్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కూడా.

"నాకు ఓటు వేసి మద్దతు తెలిపిన వారికి, నా అభిమానులకు ఈ అవార్డును అంకితం చేస్తున్నా. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్ లాంటి అవార్డులు మాకు మరింత సాధించడానికి కావలసిన స్ఫూర్తిని, ప్రోత్సాహాన్ని అందిస్తాయి. యువ మహిళాక్రీడాకారులకు నేను చెప్పేదేంటంటే... మహిళలుగా మనపై మనకు నమ్మకం ఉండాలి. విజయానికి మార్గం కష్టపడటమే. త్వరలోనే మరెందరో క్రీడాకారిణులు దేశానికి మరిన్ని పతకాలు సాధించిపెడతారని నేను కచ్చితంగా చెప్పగలను" అని సింధు వ్యాఖ్యానించారు.

ద్యుతీ చంద్, మానసి జోషి, మేరీ కోమ్, పీవీ సింధు, వినేష్ ఫోగట్ ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు. భారత్‌లోని ప్రముఖ క్రీడా జర్నలిస్టులు, నిపుణులు, రచయితలతో కూడిన జ్యూరీ వీరిని నామినీలుగా ఎంపిక చేసింది.

పురస్కార విజేత ఎంపికకు బీబీసీ తెలుగు సహా బీబీసీ భారతీయ భాషలు, స్పోర్ట్స్ వెబ్‌సైట్‌లలో ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 24 వరకు ఓటింగ్ జరిగింది.


బీబీసీ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుకు పరుగుల రాణి పీటీ ఉష ఎంపికయ్యారు.

కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, బీబీసీ వరల్డ్ సర్వీస్ డైరెక్టర్ జేమీ ఆంగస్‌ చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

BBC కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, బీబీసీ వరల్డ్ సర్వీస్ డైరెక్టర్ జేమీ ఆంగస్‌ చేతుల మీదుగా బీబీసీ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారాన్ని అందుకున్న పీటీ ఉష

భారత క్రీడారంగానికి చేసిన సేవలకు, ఎన్నో తరాల క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచినందుకు పీటీ ఉషను జీవితసాఫల్య పురస్కారంతో బీబీసీ సత్కరించింది.

ఈ పురస్కారం రావడంపై ఉష సంతోషం వ్యక్తంచేశారు.

కెరీర్ ఆసాంతం ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్న పీటీ ఉష అంతర్జాతీయ స్థాయిలో 100 పతకాలు, అవార్డులను సాధించారు. భారత ఒలింపిక్ సంఘం కూడా ఆమెను 'ఈ శతాబ్దపు ఉత్తమ క్రీడాకారిణి'గా గుర్తించింది. 1984 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌ మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌ విభాగంలో ఆమె నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకం చేజార్చుకున్నారు.

అంతకుముందు ముఖ్య అతిథిగా కిరణ్ రిజిజు ప్రసంగిస్తూ- బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ప్రవేశపెట్టినందుకు బీబీసీని అభినందించారు. క్రీడల్లో మహిళల అంశంపై బీబీసీ చేసిన పరిశోధనను ప్రశంసించారు.

భారత్‌లో క్రీడల అభివృద్ధికి నరేంద్ర మోదీ ప్రభుత్వం, తమ శాఖ చేపడుతున్న చర్యలను ఆయన వివరించారు.

https://www.youtube.com/watch?v=0YvPrn72Nxo

బీబీసీ డైరెక్టర్ జనరల్ టోనీ హాల్ తన ప్రసంగంలో ప్రస్తావించినట్లు క్రీడలు పెద్ద పెద్ద కలలు కనేందుకు ప్రేరణ ఇస్తాయని మంత్రి వ్యాఖ్యానించారు.

2020 టోక్యో ఒలింపిక్స్ పోటీలకు ముందెన్నడూ లేనంత పెద్ద బృందాన్ని పంపిస్తున్నామని ఆయన తెలిపారు.

2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌ పతకాల పట్టికలో భారత్‌ను టాప్-10లో నిలపాలనే లక్ష్యంతో సాగుతున్నామని మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.

కరణం మల్లీశ్వరి సిడ్నీ ఒలింపిక్స్‌లో పతకం గెలిచి ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించారని ఆయన ప్రస్తావించారు.

BBC BBCISWOTY పురస్కారం క్రీడల్లో మహిళలకు మరింత గుర్తింపు, మరింత ప్రాతినిధ్యం, మరింత ప్రేరణను ఇస్తుందని ఆశిస్తున్నట్లు బీబీసీ డైరెక్టర్ జనరల్ టోనీ హాల్ తెలిపారు.

క్రీడల్లో మహిళల భాగస్వామ్యానికి బీబీసీ ఇస్తున్న ప్రాధాన్యాన్ని బీబీసీ డైరెక్టర్ జనరల్ టోనీ హాల్ తన ప్రసంగంలో వివరించారు.

క్రీడల్లో ఒక తరం సాధించే విజయాలు మరో తరానికి ప్రేరణగా నిలుస్తాయని ఆయన చెప్పారు. BBCISWOTY పురస్కారం క్రీడల్లో మహిళలకు మరింత గుర్తింపు, మరింత ప్రాతినిధ్యం, మరింత ప్రేరణను ఇస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

BBC పురస్కార ప్రదానోత్సవంలో బీబీసీ డైరెక్టర్ జనరల్ టోనీ హాల్‌తో 'పరుగుల రాణి' పీటీ ఉష

బీబీసీ వరల్డ్ సర్వీస్ డైరెక్టర్ జేమీ ఆంగస్‌ మాట్లాడుతూ- "నా కుటుంబం, బీబీసీలో ఉద్యోగం తర్వాత జీవితంలో క్రీడలే నాకు అత్యంత ఇష్టమైన వ్యాపకం" అని చెప్పారు.

"ఈ రోజుల్లో క్రీడల్ని చూడటం కన్నా అందులో భాగస్వామ్యం కావడం చాలా ముఖ్యం. బహుశా మీలో చాలా మంది నాతో ఏకీభవిస్తారనుకుంటున్నాను. క్రీడల్లో విజయం సాధించడం ముఖ్యం కాదు. అందులో భాగస్వామ్యం ముఖ్యం. ఎందుకంటే విజేతకు, పరాజితులకు మధ్య తేడా ఒక్కోసారి సెకన్లో పదో వంతు కూడా ఉండదు. ముఖ్యంగా ఇక్కడ మనతో ఉన్న అథ్లెట్స్‌కు ఆ విషయం బాగా తెలుసు" అని జేమీ ఆంగస్ వ్యాఖ్యానించారు.

BBC బీబీసీ వరల్డ్ సర్వీస్ డైరెక్టర్ జేమీ ఆంగస్‌తో ప్రముఖ క్రీడాకారిణి ద్యుతీ చంద్

"అమెచూర్ స్పోర్ట్స్ విషయానికొస్తే జట్టు విజయం సాధించినా, అపజయం పాలైనా అది ఒక అనుభవం మాత్రమే. అది అందర్నీ ఒక్క చోట చేరుస్తుంది. క్రీడలతో మనకున్న భావోద్వేగ బంధం చాలా ముఖ్యం. ఇటు భారత్‌లో కానీ, ప్రపంచ వ్యాప్తంగా కానీ బీబీసీ ఉద్ధేశం అదే. వార్తల విషయంలో కానీ లేదా క్రీడల విషయంలో కానీ లేదా ఇతర కథనాల విషయంలో కానీ ప్రేక్షకులందర్నీ ఒక్క చోట చేర్చి వారి అభిప్రాయాలను పంచుకునేలా చేయడమే బీబీసీ లక్ష్యం" అని జేమీ ఆంగస్ వివరించారు.

ఇటీవల కాలంలో ఇండియన్ జర్నలిజంపై బీబీసీ పెట్టే పెట్టుబడుల విషయంపై తాను చాలా గర్విస్తున్నానని ఆయన చెప్పారు.

BBC

"భారతీయఆడియన్స్ కోసం విస్తృతమైన కంటెంట్‌ను అందిస్తున్నాం. మా సంస్థలో సుమారు 300 మంది జర్నలిస్టులు ఉన్నారు. వాళ్లలో చాలా మంది దిల్లీ కేంద్రంగానే పని చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మా ఆడియన్స్ కోసం వాళ్లే స్వయంగా కథనాలను అందిస్తున్నారు. భారత్‌లో ఉంటూ వార్తా ప్రసారాలందించేందుకు బీబీసీ ఏ పాటి ప్రాధాన్యం ఇస్తుందో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. భారత్-బ్రిటన్‌ దేశాల మధ్య ఉన్న బలమైన సంబంధాలకు కూడా ఇది నిదర్శనం" అని జేమీ ఆంగస్ వివరించారు.

BBC కార్యక్రమంలో మాట్లాడుకొంటున్న కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్, బీబీసీ డైరెక్టర్ జనరల్ టోనీ హాల్

కార్యక్రమం చివర్లో బీబీసీ ఇండియన్ లాంగ్వేజెస్ హెడ్ రూపా ఝా మాట్లాడుతూ- పురస్కారాల విజేతలు పీవీ సింధు, పీటీ ఉషలకు అభినందనలు తెలిపారు.

BBCISWOTY అవార్డు నామినీలందరికీ అభినందనలు ఆమె తెలిపారు. BBCISWOTY ప్రాజెక్టులో భాగస్వాములైన అందరికీ కృతజ్ఞతలు చెప్పారు.

"స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా, పుల్లెల గోపీచంద్ అకాడమీ, కళింగ ఇండస్ట్రియల్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్, రైల్వే వెల్ఫేర్ బోర్డ్ ముఖ్యంగా భారతీయ మహిళా క్రీడాకారులందరికీ మా కృతజ్ఞతలు. నెలల పాటు పడ్డ శ్రమ, టీం వర్క్, ఎన్నో వాదప్రతివాదాలు, భావోద్వేగాల మధ్య ఈ ప్రయాణం నడిచింది" అని ఆమె చెప్పారు.

BBC కార్యక్రమంలో మాట్లాడుతున్న మానసి జోషి. చిత్రంలో బీబీసీ ఇండియన్ లాంగ్వేజెస్ హెడ్ రూపా ఝా

కార్యక్రమానికి హాజరైన నామినీలు ద్యుతీ చంద్, మానసి జోషి మాట్లాడుతూ తమ ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు.

"నా శరీరంలో పురుష హార్మోన్లు ఎక్కువగా ఉన్నాయంటూ నాపై అనర్హత వేటు వేశారు. నా జెండర్ ఆధారంగా నన్ను ప్రశ్నించినప్పుడు నేను ఎంతో సంఘర్షణకు లోనయ్యాను" అని ద్యుతీ చంద్ చెప్పారు.

తాను పడిన కష్టాలను బీబీసీ తన కథనాల ద్వారా ప్రపంచానికి చూపించిందని, ఇందుకు బీబీసీకి ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆమె చెప్పారు

"నాకో ఆశయం ఉండేది... నేను కూడా పీటీ ఉషలా పరిగెత్తాలని, నా దేశం గర్వపడేలా చేయాలని. ​100 మీటర్ల పరుగులో నా రికార్డును నేను 10 సార్లు తిరగరాశాను" అని ద్యుతీ చంద్ చెప్పారు.

మానసి జోషి ప్రసంగిస్తూ- "పారా స్పోర్ట్స్‌లోకి ప్రవేశించిన తర్వాత అందరూ నన్ను ఎంతో ప్రోత్సహించారు. నా బాధ నుంచి బయటకు రావడానికి నేను క్రీడలను ఎంచుకున్నా. ఫిట్‌గా ఉండాలనుకున్నా. నేను పతకాల కోసం ఆడట్లేదు. నా కోసం నేను ఆడుకుంటున్నా. ఇది నాకెంతో స్థైర్యాన్నిస్తోంది. ఒలింపిక్ పతకం సాధించడమే నాముందున్న లక్ష్యం" అని తెలిపారు.

పురస్కార ప్రదానోత్సవం బీబీసీ తెలుగు, బీబీసీ హిందీ సహా బీబీసీ భారతీయ భాషల వెబ్‌సైట్లలో ప్రత్యక్ష ప్రసారం అయ్యింది. ప్రముఖ క్రీడాకారులు, రచయితలు, జర్నలిస్టులు, ఇన్‌ఫ్లూయెన్సర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

కార్యక్రమంలో బీబీసీ ప్రతినిధి యోగితా లిమయే ప్రయోక్తగా వ్యవహరించారు.


పురస్కార విజేతకు అందించిన ట్రోఫీ ఎలా తయారైందో మీరూ చూడండి.

https://business.facebook.com/BBCnewsTelugu/videos/209810320131953/


అవార్డు నామినీలు:

BBC

ద్యుతీ చంద్

వయసు: 23 ఏళ్లు, క్రీడ: అథ్లెటిక్స్

మహిళల 100 మీటర్ల విభాగంలో ద్యుతీ చంద్ ప్రస్తుతం భారత జాతీయ ఛాంపియన్. 2016లో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్‌లో మహిళల 100 మీటర్ల పరుగులో పాల్గొనేందుకు ఎంపికైన భారతీయులలో ద్యుతి మూడవ వ్యక్తి. 2018లో జకార్తా వేదికగా జరిగిన ఆసియాన్ క్రీడల్లో మహిళల 100 మీటర్ల పరుగులో రజతం గెలుచుకుంది. ఇది 1998 తర్వాత భారత్‌కు వచ్చిన తొలి అవార్డు. తనకు ఎదురైన ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ ద్యుతి... దేశంలో సమర్ధవంతమైన మహిళా క్రీడాకారిణిగా నిలిచారు.

BBC

మానసి జోషి

వయసు: 30 ఏళ్లు, క్రీడ: పారా బ్యాడ్మింటన్

మానసి జోషి 2019లో స్విట్జర్లాండ్‌లోని బాజెల్‌లో జరిగిన పారా బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలుచుకున్నారు. ప్రపంచంలోనే టాప్ ర్యాంక్ కలిగిన పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుల్లో మానసి ఒకరు.

2018లో జకార్తాలో జరిగిన ఆసియాన్ పారా గేమ్స్‌లో కాంస్యం సాధించారు. 2011లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఆమె ఎడమ కాలును కోల్పోయారు. అయితే, ప్రపంచంలోనే ఉత్తమ పారా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అయ్యేందుకు ఆమెకు ఆ వైకల్యం అడ్డురాలేదు.

BBC

మేరీ కోమ్

వయసు: 36 ఏళ్లు, క్రీడ: బాక్సింగ్ (ఫ్లైవెయిట్ విభాగం)

ఎనిమిది ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకాలు సాధించిన ఏకైక బాక్సర్ మేరీ కోమ్‌గా సుపరిచితమైన మాంగ్తే చుంగ్‌నీజంగ్. ఆమె పాల్గొన్న ఏడు ఛాంపియన్‌షిప్స్‌లోనూ వరసగా పతకాలను కైవసం చేసుకుంది. ఆరుసార్లు ప్రపంచ అమెచూర్ బాక్సింగ్ ఛాంపియన్, బాక్సింగ్‌లో ఒలింపిక్ పతకం గెలుచుకున్న ఏకైక మహిళ కూడా ఈమే.

మేరీ కోమ్ రాజ్యసభకు నామినేటెడ్ సభ్యురాలు. ప్రపంచ ఒలింపిక్స్ అసోసియేషన్ ఆమెను 'ఓలి' అనే బిరుదుతో సత్కరించింది.

BBC

పీవీ సింధు

వయసు 24 ఏళ్లు, క్రీడ: బ్యాడ్మింటన్

స్విట్జర్లాండ్‌లోని బాజెల్‌లో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెల్చుకున్న తొలి భారతీయురాలు పీవీ సింధు. ఆమె ఐదు ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకాలను గెలుచుకుంది. రియో ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో రజతం సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది.

పదిహేడేళ్ల వయసుకే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (2012) టాప్ 20 ర్యాంకింగ్స్‌లో స్థానం సంపాదించుకుంది. గత నాలుగేళ్లలో టాప్ 10లో నిలిచింది. ఈ ఏడాది జరగనున్న టోక్యో ఒలింపిక్స్‌లోనూ ఆమె పతకం తెస్తారని భారత్ ఆశలు పెట్టుకుంది.

BBC

వినేష్ ఫోగట్

వయసు: 25 ఏళ్లు, క్రీడ: ఫ్రీస్టైల్ రెస్లింగ్ (కుస్తీ)

వినేష్ ఫోగట్ 2018లో జకార్తాలో జరిగిన ఆసియాన్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ మహిళా రెజ్లర్. వినేష్ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మహిళా రెజ్లర్ల కుటుంబానికి చెందినవారు. కామన్వెల్త్ క్రీడల్లోనూ రెండు బంగారు పతకాలు గెలుచుకున్నారు. 2019లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తొలిసారి కాంస్యం సాధించారు.

BBC

source: bbc.com/telugu

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: BBC Telugu
Top