Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారత్‌లో జరగాల్సిన 'ఇండియా - ఆఫ్రికా సదస్సు' ఎబోలా కారణంగా వాయిదా

భారత్‌లో జరగాల్సిన 'ఇండియా - ఆఫ్రికా సదస్సు' ఎబోలా కారణంగా వాయిదా

భారత్‌లో వచ్చే వారం జరగాల్సిన 'ఇండియా-ఆఫ్రికా ఫోరమ్ సదస్సు' డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, యుగాండా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి కారణంగా వాయిదా పడింది.

ఆఫ్రికా ఖండంలోని దేశాలకు, భారత్‌కు మధ్య దౌత్యపరమైన సంబంధాలను పెంపొందించే ఈ సదస్సు నాలుగో ఎడిషన్, దాదాపు పదేళ్ల విరామం తర్వాత మే 28 నుంచి 31 వరకు దిల్లీలో జరగాల్సి ఉంది.

అయితే, ఆఫ్రికా ఖండంలో "తీవ్రమవుతున్న ప్రజారోగ్య పరిస్థితి" (ఎబోలా వ్యాప్తి) కారణంగా ఈ సదస్సును వాయిదా వేస్తున్నట్లు, తదుపరి తేదీని తర్వాత ప్రకటిస్తామని గురువారం భారత్, ఆఫ్రికన్ యూనియన్ సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపాయి.

ఇటీవలి ఎబోలా విజృంభణను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) 'అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి' (గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ) గా ప్రకటించిన కొన్ని రోజులకే ఈ నిర్ణయం వెలువడింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం, ఇప్పటివరకు 600 ఎబోలా అనుమానిత కేసులు నమోదవగా, 139 మంది అనుమానాస్పద స్థితిలో మరణించారు.

ప్రస్తుతానికి ఈ కేసులు ఆఫ్రికా ఖండానికే పరిమితమైనప్పటికీ, నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ తాజా వైరస్ విజృంభణ తీవ్ర సవాలుగా మారింది.

ఎందుకంటే, ఇది ఒక అరుదైన ఎబోలా రకానికి చెందింది. దీనికి ఎటువంటి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. అంతేకాకుండా, ఈ వ్యాప్తికి ప్రధాన కేంద్రంగా ఉన్న ప్రాంతం తీవ్రమైన అంతర్గత ఘర్షణలు, గొడవలతో అతలాకుతలమవుతోంది.

నిజానికి ఎబోలా అనేది వైరస్ వల్ల వచ్చే అరుదైన, అత్యంత ప్రాణాంతకమైన వ్యాధి.

సాధారణంగా ఎబోలా వైరస్‌లు జంతువులకు, ముఖ్యంగా 'ఫ్రూట్ బ్యాట్స్' (పండ్లను తినే గబ్బిలాల)కు సోకుతాయి.

అయితే, ఈ ఇన్ఫెక్షన్ సోకిన జంతువులను తినడం లేదా వాటిని తాకడం వల్ల మనుషుల్లో కూడా వ్యాపించే ప్రమాదం ఉంటుంది.

 BBC

'ఎబోలా' లక్షణాలు...

శరీరంలోకి వైరస్ ప్రవేశించిన తర్వాత లక్షణాలు కనిపించడానికి రెండు నుంచి 21 రోజులు పడుతుంది. ఇవి అకస్మాత్తుగా మొదలవుతాయి. ప్రారంభంలో జ్వరం, తలనొప్పి, తీవ్రమైన అలసట వంటి ఫ్లూ లేదా మలేరియా తరహా లక్షణాలు కనిపిస్తాయి.

వ్యాధి ముదురుతున్న కొద్దీ వాంతులు, విరేచనాలు మొదలవుతాయి. ఇది చివరికి అవయవాల వైఫల్యానికి దారితీయవచ్చు.

రోగులందరిలో కాకపోయినా, కొంతమందిలో అంతర్గత, బాహ్య రక్తస్రావం కూడా జరుగుతుంది.

ఎబోలా సోకిన రోగుల రక్తం లేదా వాంతులు వంటి శరీర ద్రవాలను తాకితే ఈ వైరస్ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాపిస్తుంది.

గతంలో ఎబోలా వ్యాప్తి చాలా తక్కువగా, కేవలం మారుమూల గ్రామీణ ప్రాంతాలకే పరిమితంగా ఉండేది.

అయితే, పట్టణీకరణ పెరగడం వల్ల జనాలు ఈ ఎబోలా సహజ నివాస ప్రాంతాలైన అడవులకు దగ్గరగా వెళ్లాల్సి వస్తోంది. ఇది వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదాన్ని మరింత పెంచుతోంది.

భారత్‌లో ఇప్పటివరకు ఎలాంటి ఎబోలా కేసులు నమోదు కానప్పటికీ, ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చే లేదా ఆ దేశాల మీదుగా వచ్చే ప్రయాణికుల కోసం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ గురువారం ఆరోగ్య మార్గదర్శకాలను జారీ చేసింది.

ప్రయాణికులకు జ్వరం, వాంతులు, విరేచనాలు లేదా రక్తస్రావం వంటి లక్షణాలు కనిపించినా లేదా వారు ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తులతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నా వెంటనే విమానాశ్రయ ఆరోగ్య అధికారులకు నివేదించాలని, 21 రోజుల్లోపు వైద్య సహాయం పొందాలని ఆ మార్గదర్శకాల్లో సూచించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

ఆఫ్రికా, ఆసియా, భారత్, ఎబోలా వైరస్, ఆరోగ్యం

source: bbc.com/telugu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: BBC Telugu