Sunday, 08 Mar, 9.09 pm BBC తెలుగు

మీకు ఇష్టమైన క్రీడాకారిణి ఎవరు ?
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు-2019 విజేత పీవీ సింధు #BBCISWOTY

BBC పీవీ సింధు

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్-2019 పురస్కారానికి బ్యాడ్మింటన్ తార పీవీ సింధు ఎంపికయ్యారు.

పురస్కారానికి ఎంపిక కావడంపై సింధు హర్షం వ్యక్తంచేశారు.

ఈ BBCISWOTY పురస్కారం ప్రదానోత్సవం దిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్‌లో జరుగుతోంది. ఈ పురస్కారాన్ని అందించడం ఇదే తొలిసారి.

ద్యుతి చంద్, మానసి జోషి, మేరీ కోమ్, పీవీ సింధు, వినేష్ ఫోగట్ BBCISWOTY అవార్డుకు నామినేట్ అయ్యారు. భారత్‌లోని ప్రముఖ క్రీడా జర్నలిస్టులు, నిపుణులు, రచయితలతో కూడిన జ్యూరీ వీరిని నామినీలుగా ఎంపిక చేసింది.

బీబీసీ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుకు పరుగుల రాణి పీటీ ఉష ఎంపికయ్యారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, బీబీసీ వరల్డ్ సర్వీస్ డైరెక్టర్ జేమీ ఆంగస్‌ చేతు మీదుగా ఆమె ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

BBC కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, బీబీసీ వరల్డ్ సర్వీస్ డైరెక్టర్ జేమీ ఆంగస్‌ చేతు మీదుగా బీబీసీ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారాన్ని అందుకున్న పీటీ ఉష

జీవితకాల సాఫల్య పురస్కారం అందుకోవడంపై ఉష సంతోషం వ్యక్తంచేశారు.

BBC

అంతకుముందు ముఖ్య అతిథిగా కిరణ్ రిజిజు ప్రసంగిస్తూ- బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ప్రవేశపెట్టినందుకు బీబీసీని అభినందించారు. క్రీడల్లో మహిళల అంశంపై బీబీసీ చేసిన పరిశోధనను ప్రశంసించారు.

క్రీడలను ప్రోత్సహించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం, తమ శాఖ చేపడుతున్న చర్యలను ఆయన వివరించారు.

ఒలింపిక్స్, ఏసియన్ గేమ్స్ లాంటి అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు పెన్షన్ ప్రవేశపెట్టామని మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు.

https://www.youtube.com/watch?v=0YvPrn72Nxo

2020 టోక్యో ఒలింపిక్స్ పోటీలకు ముందెన్నడూ లేనంత పెద్ద బృందాన్ని పంపిస్తున్నామని ఆయన తెలిపారు.

2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌ పతకాల పట్టికలో భారత్‌ను టాప్-10లో నిలపాలనే లక్ష్యంతో సాగుతున్నామని మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.

కరణం మల్లీశ్వరి సిడ్నీ ఒలింపిక్స్‌లో పతకం గెలిచి ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించారని ఆయన ప్రస్తావించారు.

BBC

కార్యక్రమంలో బీబీసీ డైరెక్టర్ జనరల్ టోనీ హాల్ మాట్లాడుతూ- క్రీడల్లో మహిళల భాగస్వామ్యం అంశానికి బీబీసీ ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరించారు.

బీబీసీ వరల్డ్ సర్వీస్ డైరెక్టర్ జేమీ ఆంగస్‌ మాట్లాడుతూ- "నా కుటుంబం, బీబీసీలో ఉద్యోగం తర్వాత జీవితంలో క్రీడలే నాకు అత్యంత ఇష్టమైన వ్యాపకం" అని చెప్పారు.

BBC బీబీసీ వరల్డ్ సర్వీస్ డైరెక్టర్ జేమీ ఆంగస్‌తో ప్రముఖ క్రీడాకారిణి ద్యుతీ చంద్

"ఈ రోజుల్లో క్రీడల్ని చూడటం కన్నా అందులో భాగస్వామ్యం కావడం చాలా ముఖ్యం. బహుశా మీలో చాలా మంది నాతో ఏకీభవిస్తారనుకుంటున్నాను. క్రీడల్లో విజయం సాధించడం ముఖ్యం కాదు. అందులో భాగస్వామ్యం ముఖ్యం. ఎందుకంటే విజేతకు, పరాజితులకు మధ్య తేడా ఒక్కోసారి సెకన్లో పదో వంతు కూడా ఉండదు. ముఖ్యంగా ఇక్కడ మనతో ఉన్న అథ్లెట్స్‌కు ఆ విషయం బాగా తెలుసు" అని జేమీ ఆంగస్ వ్యాఖ్యానించారు.

BBC

"అమెచూర్ స్పోర్ట్స్ విషయానికొస్తే జట్టు విజయం సాధించినా, అపజయం పాలైనా అది ఒక అనుభవం మాత్రమే. అది అందర్నీ ఒక్క చోట చేరుస్తుంది. క్రీడలతో మనకున్న భావోద్వేగ బంధం చాలా ముఖ్యం. ఇటు భారత్‌లో కానీ, ప్రపంచ వ్యాప్తంగా కానీ బీబీసీ ఉద్ధేశం అదే. వార్తల విషయంలో కానీ లేదా క్రీడల విషయంలో కానీ లేదా ఇతర కథనాల విషయంలో కానీ ప్రేక్షకులందర్నీ ఒక్క చోట చేర్చి వారి అభిప్రాయాలను పంచుకునేలా చేయడమే బీబీసీ లక్ష్యం" అని జేమీ ఆంగస్ వివరించారు.

ఇటీవల కాలంలో ఇండియన్ జర్నలిజంపై బీబీసీ పెట్టే పెట్టుబడుల విషయంపై తాను చాలా గర్విస్తున్నానని ఆయన చెప్పారు.

"భారతీయఆడియన్స్ కోసం విస్తృతమైన కంటెంట్‌ను అందిస్తున్నాం. మా సంస్థలో సుమారు 300 మంది జర్నలిస్టులు ఉన్నారు. వాళ్లలో చాలా మంది దిల్లీ కేంద్రంగానే పని చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మా ఆడియన్స్ కోసం వాళ్లే స్వయంగా కథనాలను అందిస్తున్నారు. భారత్‌లో ఉంటూ వార్తా ప్రసారాలందించేందుకు బీబీసీ ఏ పాటి ప్రాధాన్యం ఇస్తుందో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. భారత్-బ్రిటన్‌ దేశాల మధ్య ఉన్న బలమైన సంబంధాలకు కూడా ఇది నిదర్శనం" అని జేమీ ఆంగస్ వివరించారు.

BBC కార్యక్రమంలో మాట్లాడుకొంటున్న కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్, బీబీసీ డైరెక్టర్ జనరల్ టోనీ హాల్

ఐదుగురు నామినీల్లో ఒకరైన అథ్లెట్ ద్యుతీ చంద్ కార్యక్రమంలో మాట్లాడుతూ- "నా శరీరంలో పురుష హార్మోన్లు ఎక్కువగా ఉన్నాయంటూ నాపై అనర్హత వేటు వేశారు. నా జెండర్ ఆధారంగా నన్ను ప్రశ్నించినప్పుడు నేను ఎంతో సంఘర్షణకు లోనయ్యాను" అని చెప్పారు.

తాను పడిన కష్టాలను బీబీసీ తన కథనాల ద్వారా ప్రపంచానికి చూపించిందని, ఇందుకు బీబీసీకి ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆమె తెలిపారు.

"నాకో ఆశయం ఉండేది... నేను కూడా పీటీ ఉషలా పరిగెత్తాలని, నా దేశం గర్వపడేలా చేయాలని. ​100 మీటర్ల పరుగులో నా రికార్డును నేను 10 సార్లు తిరగరాశాను" అని ద్యుతీ చంద్ చెప్పారు.

పురస్కార ప్రదానోత్సవం బీబీసీ భారతీయ భాషల వెబ్‌సైట్లలో ప్రత్యక్ష ప్రసారం అవుతోంది.

కార్యక్రమానికి బీబీసీ ప్రతినిధి యోగితా లిమయే ప్రయోక్తగా వ్యవహరిస్తున్నారు.


BBCISWOTY పురస్కారానికి సంబంధించి జ్యూరీ సభ్యుల నుంచి అత్యధిక ఓట్లు పొందిన టాప్ ఐదుగురు మహిళా క్రీడాకారులు ఆన్‌లైన్ ఓటింగ్ కోసం నామినేట్ అయ్యారు.

పురస్కార విజేతకు అందించే ట్రోఫీ ఎలా తయారైందో మీరూ చూడండి.

https://business.facebook.com/BBCnewsTelugu/videos/209810320131953/

BBC
BBC

బీబీసీ భారతీయ భాషలు, స్పోర్ట్స్ వెబ్‌సైట్‌లలో ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 24 వరకూ ఈ ఓటింగ్ జరిగింది.

BBC

ఇందులో అత్యధిక ఓట్లు పొందిన క్రీడాకారిణిని 'ఇండియన్ స్పోర్ట్స్‌ వుమన్ ఆఫ్ ద ఇయర్'గా బీబీసీ ప్రకటిస్తుంది.

అవార్డు నామినీలు:

BBC

ద్యుతీ చంద్

వయసు: 23 ఏళ్లు, క్రీడ: అథ్లెటిక్స్

మహిళల 100 మీటర్ల విభాగంలో ద్యుతీ చంద్ ప్రస్తుతం భారత జాతీయ ఛాంపియన్. 2016లో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్‌లో మహిళల 100 మీటర్ల పరుగులో పాల్గొనేందుకు ఎంపికైన భారతీయులలో ద్యుతి మూడవ వ్యక్తి. 2018లో జకార్తా వేదికగా జరిగిన ఆసియాన్ క్రీడల్లో మహిళల 100 మీటర్ల పరుగులో రజతం గెలుచుకుంది. ఇది 1998 తర్వాత భారత్‌కు వచ్చిన తొలి అవార్డు. తనకు ఎదురైన ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ ద్యుతి... దేశంలో సమర్ధవంతమైన మహిళా క్రీడాకారిణిగా నిలిచారు.

BBC

మానసి జోషి

వయసు: 30 ఏళ్లు, క్రీడ: పారా బ్యాడ్మింటన్

మానసి జోషి 2019లో స్విట్జర్లాండ్‌లోని బాజెల్‌లో జరిగిన పారా బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలుచుకున్నారు. ప్రపంచంలోనే టాప్ ర్యాంక్ కలిగిన పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుల్లో మానసి ఒకరు.

2018లో జకార్తాలో జరిగిన ఆసియాన్ పారా గేమ్స్‌లో కాంస్యం సాధించారు. 2011లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఆమె ఎడమ కాలును కోల్పోయారు. అయితే, ప్రపంచంలోనే ఉత్తమ పారా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అయ్యేందుకు ఆమెకు ఆ వైకల్యం అడ్డురాలేదు.

BBC

మేరీ కోమ్

వయసు: 36 ఏళ్లు, క్రీడ: బాక్సింగ్ (ఫ్లైవెయిట్ విభాగం)

ఎనిమిది ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకాలు సాధించిన ఏకైక బాక్సర్ మేరీ కోమ్‌గా సుపరిచితమైన మాంగ్తే చుంగ్‌నీజంగ్. ఆమె పాల్గొన్న ఏడు ఛాంపియన్‌షిప్స్‌లోనూ వరసగా పతకాలను కైవసం చేసుకుంది. ఆరుసార్లు ప్రపంచ అమెచూర్ బాక్సింగ్ ఛాంపియన్, బాక్సింగ్‌లో ఒలింపిక్ పతకం గెలుచుకున్న ఏకైక మహిళ కూడా ఈమే.

మేరీ కోమ్ రాజ్యసభకు నామినేటెడ్ సభ్యురాలు. ప్రపంచ ఒలింపిక్స్ అసోసియేషన్ ఆమెను 'ఓలి' అనే బిరుదుతో సత్కరించింది.

BBC

పీవీ సింధు

వయసు 24 ఏళ్లు, క్రీడ: బ్యాడ్మింటన్

స్విట్జర్లాండ్‌లోని బాజెల్‌లో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెల్చుకున్న తొలి భారతీయురాలు పీవీ సింధు. ఆమె ఐదు ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకాలను గెలుచుకుంది. రియో ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో రజతం సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది.

పదిహేడేళ్ల వయసుకే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (2012) టాప్ 20 ర్యాంకింగ్స్‌లో స్థానం సంపాదించుకుంది. గత నాలుగేళ్లలో టాప్ 10లో నిలిచింది. ఈ ఏడాది జరగనున్న టోక్యో ఒలింపిక్స్‌లోనూ ఆమె పతకం తెస్తారని భారత్ ఆశలు పెట్టుకుంది.

BBC

వినేష్ ఫోగట్

వయసు: 25 ఏళ్లు, క్రీడ: ఫ్రీస్టైల్ రెస్లింగ్ (కుస్తీ)

వినేష్ ఫోగట్ 2018లో జకార్తాలో జరిగిన ఆసియాన్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ మహిళా రెజ్లర్. వినేష్ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మహిళా రెజ్లర్ల కుటుంబానికి చెందినవారు. కామన్వెల్త్ క్రీడల్లోనూ రెండు బంగారు పతకాలు గెలుచుకున్నారు. 2019లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తొలిసారి కాంస్యం సాధించారు.

BBC

source: bbc.com/telugu

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: BBC Telugu
Top