Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'దేవాన్ష్‌' పుష్కర ఘాట్‌పై జరుగుతున్న చర్చ ఏంటి, అసలేం జరిగింది?

'దేవాన్ష్‌' పుష్కర ఘాట్‌పై జరుగుతున్న చర్చ ఏంటి, అసలేం జరిగింది?

UGC

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలి దగ్గర ఉన్న పుష్కర ఘాట్‌కి ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ కుమారుడు దేవాన్ష్‌ పేరు పెట్టడం చర్చనీయాంశమైంది.

ఆ ఘాట్‌ను మోడల్‌ ఘాట్‌గా అభివృద్ధి చేయాలని తమ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదేశించారని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వెల్లడించారు.

అయితే, ఇది హాస్యాస్పదంగా ఉందని, ఏ ఘాట్‌కి కూడా దేవాన్ష్ పేరు పెట్టకూడదని ఆదేశాలు జారీ చేశామంటూ ఎక్స్‌లో మంత్రి నారా లోకేశ్ పోస్ట్‌ చేశారు.

అయితే ఆ ఘాట్‌కు తాము కొత్తగా ఇప్పుడు పేరు పెట్టలేదని, ఎప్పటి నుంచో అదే పేరు ఉందని బీబీసీతో ఎమ్మెల్యే రామకృష్ణ అన్నారు.

గత పుష్కరాల (2015) సమయంలో ఘాట్‌కి ఆ పేరు పెట్టారని బీబీసీకి రాజమహేంద్రవరం ఆర్డీవో శివరామ్‌ చెప్పారు. అసలు ఈ వివాదం పూర్వాపరాలు పరిశీలిస్తే..

 UGCమీడియాతో మాట్లాడుతున్న రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ

గోదావరి పుష్కరాల కోసం ఏర్పాట్లు..

ఆంధ్రప్రదేశ్‌లో 2027 జూన్‌ 26 నుంచి జులై 7 వరకు 12 రోజుల పాటు జరిగే గోదావరి పుష్కరాల కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ క్రమంలో మునికూడలి వద్ద 'దేవాన్ష్ ఘాట్' పేరిట ఉన్న ఘాట్‌ను మోడల్‌ ఘాట్‌గా అభివృద్ధి చేయాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదేశించారని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శుక్రవారం మీడియాకు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో దాన్ని మోడల్ పుష్కర ఘాట్‌గా అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ చేపడుతున్నట్లు తెలిపారు.

ఈ ఘాట్‌ అభివృద్ధికి దాదాపు కోటి రూపాయలు ఖర్చవుతుందని, వారం రోజుల్లోనే పనులు మొదలుపెట్టనున్నట్లు ఎమ్మెల్యే బలరామకృష్ణ చెప్పారు.

ఆ తర్వాత ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గోదావరి పుష్కరాల ఘాట్‌కు దేవాన్ష్‌ పేరు పెట్టడం ఏంటనే చర్చ మొదలైంది.

ఈ నేపథ్యంలోనే మంత్రి నారా లోకేష్ ఎక్స్‌లో ట్వీట్ చేస్తూ దేవాన్ష్ పేరు ఏ ఘాట్‌కు పెట్టకూడదని ఆదేశాలు జారీ చేశారు.

 UGC

'ఆ పేరు ఎప్పటినుంచో ఉంది'

పుష్కర ఘాట్‌కు 'దేవాన్ష్ ఘాట్' అనే పేరు ఎప్పటినుంచో ఉందని, ఇప్పుడు పెట్టిన పేరు కాదని బీబీసీకి ఎమ్మెల్యే రామకృష్ణ తెలిపారు. మంత్రి లోకేశ్ ట్వీట్‌ను తాను చూడలేదని అన్నారు.

''ఆ ప్రాంతం చాలా విశిష్టమైనది. పుణ్యక్షేత్రం ఉన్న కూడలి అది. అందుకే ఆ ఘాట్‌ను అభివృద్ధి చేయాలని మా పార్టీ అధినేత ఆదేశించారు. పేరు వివాదం సంగతి నాకు తెలియదు'' అని ఎమ్మెల్యే అన్నారు.

'2015 నుంచే ఆ పేరు..'

ఈ అంశం గురించి బీబీసీతో రాజమహేంద్రవరం ఆర్డీవో శివరామ్ మాట్లాడారు.

''2015 పుష్కరాల సందర్భంగా ఆ ఘాట్‌కి దేవాన్ష్‌ పేరు పెట్టారు. అది అప్పటి నుంచో ఉంది. దాన్ని మోడల్‌ ఘాట్‌గా చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఈ మేరకు చర్యలు తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నాం'' అని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలి వద్ద ఉన్న పుష్కరఘాట్‌ UGC

source: bbc.com/telugu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: BBC Telugu