Wednesday, 15 Sep, 4.32 pm BBC News తెలుగు

హోమ్
Engineer's day - వీణం వీరన్న: సర్ ఆర్థర్ కాటన్‌తో కలిసి గోదావరిపై ఆనకట్ట కట్టిన తొలి తరం తెలుగు ఇంజనీర్

దేశానికి ధాన్యాగారంగా చెప్పే స్థాయికి ఆంధ్రప్రదేశ్‌ చేరిందంటే దానికి ప్రధాన కారణం కృష్ణా, గోదావరి డెల్టాలే.

రెండు ప్రధాన నదుల నీటిని బీడుబారిన పొలాలకు తరలించడంలో సర్ ఆర్థర్ కాటన్ కృషి కూడా దీనికి కారణం.

170 ఏళ్ల క్రితం ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వ ఉద్యోగిగా భారత్‌కు వచ్చిన ఇంజనీర్ కాటన్‌ను ఇప్పటికీ ఎంతోమంది స్మరించుకుంటున్నారు.

అయితే కాటన్‌కు తోడుగా నిలిచిన తెలుగు ఇంజనీర్ వీణం వీరన్న గురించి మాత్రం చాలామందికి తెలియదు.

కాటన్‌తో కలిసి గోదావరి నదిపై తొలి ఆనకట్ట నిర్మాణానికి వీరన్న చేసిన కృషి చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది.

ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మాణానికి పాటుపడిన భారతీయ నిపుణుల్లో ఆయన ఒకరు.

ఎవరీ వీరన్న

వీణం వీరన్న పూర్వీకులు విజయనగరం సంస్థానంలో ఉండేవారు. వీరన్న జన్మించే నాటికి వారి కుటుంబం కృష్ణా జిల్లాలోని బందరు ప్రాంతంలో నివసించేది. ఆయన తండ్రి కొల్లయ్య బందరులో బ్రిటిష్ ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగి. తల్లి పేరు వీర రాఘవమ్మ. 1794 మార్చి 3న వీరన్న జన్మించారు. ఆయన పుట్టిన తర్వాత ఉద్యోగరీత్యా తండ్రి బదిలీ కావడంతో ఆయన బాల్యం రాజమహేంద్రవరంలో గడిచింది. వీరన్న అక్కడే ప్రాథమిక విద్యను అభ్యసించారు.

ఆ తర్వాత మచిలీపట్నంలోని ఆంగ్లో ఇండియన్ కాలేజీలో ఉన్నత విద్య పూర్తి చేశారు. తండ్రి సూచనతో ఇంజనీరింగ్ చేయడానికి బెంగాల్ వెళ్లారు. ఇండియాలో అప్పుడప్పుడే ఇంజనీరింగ్ కాలేజీలు వస్తున్నాయి. మొదటిసారిగా అప్పటి రాజధాని నగరం కలకత్తాలో ఆ కాలేజీ ఏర్పాటు చేశారు. అక్కడ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వీరన్న తర్వాత ఇంజనీరింగ్ శిక్షణ కోసం మద్రాసు వెళ్లారు.

నీటిపారుదల శాఖలో ఉద్యోగిగా..

ఇంజనీరింగ్ పట్టా సాధించిన తొలితరం తెలుగువారిలో వీణం వీరన్న ఒకరు. అప్పట్లో ఆయన బ్రిటిష్ ప్రభుత్వ నీటిపారుదల శాఖలో సబ్ ఇంజనీర్‌గా చేరారు. 1840 సమయంలో తీవ్ర కరువు పరిస్థితులను అధిగమించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నీటిపారుదల రంగంలో చేయాల్సిన కృషి గురించి వివిధ ప్రతిపాదనలను పరిశీలిస్తోంది.

అదే సమయంలో సర్ ఆర్థర్ కాటన్ కూడా నీటిపారుదల రంగంలో చేయాల్సిన అభివృద్ధి గురించి పరిశీలించడానికి గోదావరి తీరానికి వచ్చారు. గోదావరి పరీవాహక ప్రాంతానికి వచ్చిన కాటన్‌తో వీరన్నకు పరిచయం ఏర్పడింది. 1844 నుంచి ఆయన కాటన్‌కు సహాయకుడిగా విధులు నిర్వహించారు. ఆయన ప్రయత్నాల్లో భాగస్వామి అయ్యారు. ప్రణాళికల్లో పాలు పంచుకున్నారు.

వయసులో తనకంటే పెద్దవాడయినప్పటికీ, స్థానికుడిగా వీరన్నకు కాటన్ ప్రాధాన్యత ఇచ్చేవారని 'గోదావరి నదీ జలాల వినియోగంపై కాటన్ ఆలోచనలు' అనే పరిశోధన చేసిన ఎం.ఆర్.త్రిమూర్తులు బీబీసీకి తెలిపారు.

రవాణా సౌకర్యాలు అంతగాలేని ఆ కాలంలో కాటన్‌తో పాటు వీరన్న గోదావరి తీరం వెంబడి సుదీర్ఘ పర్యటనలు చేశారని ఆయన చెప్పారు. వీరన్న కాలినడకన, గుర్రాల మీద వెళ్తూ ఆనకట్ట నిర్మాణ పనులను పర్యవేక్షించినట్టు ఇరిగేషన్ శాఖ రికార్డులు కూడా చెబుతున్నాయి.

ధవళేశ్వరం కేంద్రంగా ఆనకట్ట నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయకముందే, గోదావరి పుట్టిన నాసిక్ నుంచి, అది సముద్రంలో కలిసే ప్రాంతం వరకూ మొత్తం 1500 కిలోమీటర్ల పొడవునా కాటన్ పరిశీలించారు. నీటి ప్రవాహం అంచనా వేయడానికి, నది సహజ లక్షణాలు తెలుసుకునేందుకు చేసిన ప్రయత్నంలో వీరన్న ఆయనకు తోడుగా ఉన్నారు.

అప్పట్లో రహదారులు, ఆహారం, ఇతర సౌకర్యాలు అందుబాటులో లేకపోయినా కాటన్ ఎంతో శ్రమించారు. ఆయనకు సహాయకుడిగా వీరన్న కూడా ఆయన బాటలోనే దారిలో దొరికిన పళ్లు తింటూ, గోదావరి నీటినే తాగుతూ కాలం గడిపేవారని పరిశోధకులు అంటున్నారు.

కాటన్ బ్యారేజ్ నిర్మాణంలో కీలక పాత్ర..

ఎంతో శ్రమకోర్చి కాటన్ సిద్ధం చేసిన ప్రతిపాదనలను బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించడంతో 1847లో ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట నిర్మాణ పనులు ప్రారంభించారు.

దానికి ముందే తంజావూరు సమీపంలో నిర్మించిన ఆనకట్ట ద్వారా ఆ ప్రాంతంలో మార్పులు తీసుకురావడంలో కాటన్ కీలక పాత్ర పోషించారు. అలా గోదావరిపై ఆనకట్ట నిర్మాణం కోసం బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఆయన అనుమతి సాధించగలిగారు.

ఈస్టిండియా కంపెనీ నిధులతో కాటన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణ పనుల్లో వీణం వీరన్న కూడా ముఖ్య భూమిక పోషించారు. గోదావరి నదికి అడ్డంగా చేపట్టిన ఈ నిర్మాణ పనుల్లో కూలీల కొరత ఏర్పడడంతో దూర ప్రాంతాల నుంచి వందల మందిని తీసుకురావాల్సి వచ్చింది. ఒడిశా, బెంగాల్ నుంచి అప్పట్లోనే వలస కూలీలను తరలించడంలో వీరన్న ఎంతో కృషి చేశారు. కూలీల సంక్షేమం కోసం వీరన్న ప్రాధాన్యత ఇచ్చేవారని చెబుతారు.

చివరకు 1851 నాటికి పదివేల మందికి పైగా కూలీల శ్రమతో ఆనకట్ట నిర్మాణం పూర్తయ్యింది. ఆర్థర్ కాటన్ ఆదేశాలకు అనుగుణంగా స్థానికుడైన వీరన్న నేతృత్వంలో ఈ పనులన్నీ సాగాయని ధవళేశ్వరం ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.

"అప్పట్లో బ్రిటిష్ అధికారులు భారతీయుల పట్ల కొంత దురుసుగా ఉండేవారు. కానీ వీరన్న మాత్రం ప్రభుత్వ ఆదేశాలు అమలు చేసేందుకు సామరస్యంగా ప్రయత్నించడంతో సకాలంలో నిర్మాణ పనులు జరిగాయి. మన్యం ప్రాంతం నుంచి వేలాది మందిని ఈ పనుల కోసం తీసుకొచ్చారు. వారందరికీ గోదావరి తీరంలో నివాసాలు ఏర్పాటు చేసి, కొన్ని సదుపాయాలు కల్పించారు. కూలీల విషయంలో వీరన్న తీరుపై బ్రిటిష్ ప్రభుత్వానికి కొందరు అధికారులు ఫిర్యాదులు కూడా చేశారు" అని రిటైర్డ్ ఇంజనీర్ విప్పర్తి వేణుగోపాల్ బీబీసీకి చెప్పారు.

కానీ ఆయన కష్టాన్ని మెచ్చిన బ్రిటిష్ ప్రభుత్వం వీరన్నకు అండగా నిలిచిందని ఆయన చెప్పారు.

"ఆనకట్ట పనులు ఆగిపోతున్నాయని కూడా అప్పట్లో ప్రచారం సాగింది. కొన్నిసార్లు ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు రాకపోయినా పనులకు ఆటంకం కలగకుండా వీరన్న ప్రయత్నించారు. అది గ్రహించిన ప్రభుత్వం కాటన్ ఆలోచనలు అమలు చేస్తున్న వీరన్నకి అండగా నిలిచింది. ఆనకట్ట నిర్మాణానికి కావాల్సిన డబ్బు, ముడి సరుకులను ఎప్పటిలాగే సరఫరా చేసింది. తద్వారా వీరన్న పాత్ర ముఖ్యమైదని మనం చెప్పవచ్చు" అని వేణుగోపాల్ వివరించారు.

బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖ రాసిన కాటన్

1852 మార్చి 31 నాటికి ఆనకట్ట అందుబాటులోకి వచ్చింది. అప్పటి వరకు ఒకటిగా ఉన్న ప్రాంతాన్ని ఈ ఆనకట్ట తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలుగా విడదీసింది. అంతేగాకుండా రెండు జిల్లాల పరిధిలోనూ సుమారు 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించింది. అప్పటి వరకు వృధాగా సముద్రం పాలవుతున్న గోదావరి జలాలను పొలాల బాట పట్టించడంతో అక్కడి భూములకు ప్రాణం పోసినట్టయ్యింది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో గోదావరి డెల్టా అగ్రస్థానంలో నిలిచేందుకు సహకరించింది.

ఇంతటి మహత్తర కృషి వల్లే సర్ ఆర్థర్ కాటన్ అటు బ్రిటిష్ ప్రభుత్వంలో, ఇటు గోదావరి ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించారు.

అయితే ఆయన కృషిలో తోడుగా నిలిచిన వీరన్నకు తగిన గుర్తింపు రాలేదని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

"వీరన్న అంకితభావంతో పనిచేశారు. దానిని కాటన్ కూడా గుర్తించారు. ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం పూర్తయిన తర్వాత లండన్ వెళ్లిన కాటన్ అక్కడి నుంచే స్వయంగా ఓ లేఖను కూడా రాశారు. వీరన్న లాంటి వారి సహకారం లేకుండా గోదావరి ఆనకట్ట అంత త్వరగా పూర్తి చేయడం సాధ్యమయ్యేది కాదని ఆయన అందులో చెప్పారు. వీరన్న శ్రమకు ఫలితంగా ఆయనకు ఏదైనా మేలు చేయాలని ఈస్టిండియా కంపెనీని, విక్టోరియా మహరాణిని కూడా అభ్యర్థించారు. దానికి అనుగుణంగా గోదావరి ఆనకట్టకు సమీపంలో ఉన్న మోరిపాడు గ్రామ శిస్తు వసూలు చేసుకునే హక్కు వీరన్నకు దఖలు పరిచారు. దాంతో పాటుగా రావు బహుదూర్ బిరుదు కూడా అందించారు" అని కాటన్ కృషి మీద పీహెచ్‌డీ చేసిన త్రిమూర్తులు బీబీసీకి తెలిపారు.

నేటికీ వీరన్న ఆనవాళ్లు...

ఆనకట్ట నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా వీణం వీరన్న ధవళేశ్వరం కేంద్రంగా విధుల్లో పాలుపంచుకున్నారు. వరదల సమయంలో ఆనకట్ట నిర్మాణంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఆయన వెంటనే వాటిని సరిదిద్దే పనిలో పాలుపంచుకున్నారు. వీరన్న 1867లో తను చనిపోయేవరకు ధవళేశ్వరం హెడ్ లాక్ క్వార్టర్స్‌నే తన చిరునామాగా చేసుకున్నారు. చివరకు ఆయన మృతదేహానికి కూడా అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు.

ఆయన మృతదేహాన్ని దహనం చేసిన ప్రాంతంలోని రాతిగోడపై వీరన్న పేరు శాశ్వతంగా నిలిచిపోయేలా ఒక శిలాఫలకం కూడా ఏర్పాటుచేశారు. 'వి.వీరన్న, రావ్ బహుదూర్, సబ్‌ఇంజినీర్ 1867' అంటూ దానిపై ఇంగ్లీషులో చెక్కారు. కానీ ఆ తర్వాత వచ్చిన భారీ వరదల్లో ఆ శిలా ఫలకం కొట్టుకుపోయిందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.

1940 ప్రాంతంలో స్వతంత్య్య సమరయోధుడు బులుసు సాంబమూర్తి ఆధ్వర్యంలో కాటన్‌ విగ్రహం ఏర్పాటు చేశారు. దాంతోపాటూ వీరన్న గురించి ప్రస్తావిస్తూ ఓ శిలాఫలకం కూడా నిర్మించారు. 1986లో వచ్చిన వరదలో కాటన్‌ దొర విగ్రహంతోపాటు ఈ శిలాఫలకం కూడా కొట్టుకుపోయిందని చెబుతున్నారు.

1988లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు ప్రోద్బలంతో ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర నిర్మించిన కాటన్‌ మ్యూజియంలో వీరన్న చిత్రపటాన్ని ఆవిష్కరించారు. సందర్శకుల కోసం అది నేటికీ అక్కడే ఉంది. ధవళేశ్వరం ఇరిగేషన్ కార్యాలయం దగ్గర వీరన్న విగ్రహం ఉంది.

తొలి తెలుగు ఇంజనీర్ అంటూ అప్పట్లో ఏర్పాటు చేసిన బోర్డులు కూడా ఇప్పుటికీ దర్శనమిస్తున్నాయి.

BBC

తగిన గుర్తింపు దక్కలేదు..

వీణం వీరన్న 150వ జయంతిని పురస్కరించుకుని 2017లో అప్పటి కేంద్ర మంత్రి పి.అశోక్ గజపతిరాజు ఒక బ్రోచర్ ఆవిష్కరించారు. వీణం వీరన్న కృషిని తెలియజేస్తూ రీసెర్చ్ స్కాలర్ బుడ్డిగ సాయి గణేష్‌తో కలిసి వీణం వీరన్న వారసుడు, ఐదో తరానికి చెందిన వీణం వరప్రసాద రావు ఆధ్వర్యంలో దానిని రూపొందించారు.

అయినప్పటికీ వీణం వీరన్న కృషిని భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం చాలా ఉందని, వీణం వీరన్న గురించి పలు వ్యాసాలు రాసిన ర్యాలీ ప్రసాద్ బీబీసీతో అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికైనా దాని గురించి ఆలోచించాలని కోరారు.

"వీణం వీరన్న విశేష కృషి చేశారు. కాటన్ లాంటి వారే ఆయన సేవలను కొనియాడారు. బ్రిటిష్ ప్రభుత్వం అప్పుడే రూ.500 వరకు శిస్తు వసూలయ్యే ప్రాంతాన్ని ఆయనకు అప్పగించింది. కానీ మనం మాత్రం వీరన్న వంటి వారిని మరిచిపోతున్నాం. ఆయనకు తగిన గుర్తింపు రాలేదు. దేశంలోనే గోదావరి డెల్టా ప్రాంతం సుస్థిరాభివృద్ధి సాధించడానికి కారణమైన ఆనకట్ట నిర్మాణంలో ఆయన పాత్ర గురించి అందరికీ తెలియాలి. కాటన్ సమకాలీకుడిని మనం గుర్తు చేసుకోడానికి వీలుగా ఆయన జీవిత చరిత్ర అందరికీ తెలిపే ప్రయత్నం జరగాలి. అదే ఆయనకు మనమిచ్చే అసలైన గౌరవం" అన్నారు రచయిత, కవి ర్యాలి ప్రసాద్.

అప్పట్లో వీరన్న సహా ఎంతోమంది త్యాగాల ఫలితంగా ఏర్పడిన ధవళేశ్వరం ఆనకట్టను ఆ తర్వాత సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్‌గా పునర్నిర్మించారు. ప్రస్తుతం ఉన్న బ్యారేజ్ పనులను 1970వ దశకంలో ప్రారంభించి 1982 నాటికి పూర్తి చేశారు.

source: bbc.com/telugu

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: BBC Telugu
Top