Saturday, 25 Sep, 10.13 pm BBC News తెలుగు

హోమ్
గాయని చిత్ర: 'నాకు తెలుగు నేర్పించింది ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం.. ఆయన పాటల్లో నాకు బాగా నచ్చిన పాట..'

"ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం ఒక అగ్రస్థాయి గాయకుడు. అయినప్పటికీ సంగీతకారులందరి సంక్షేమం గురించి ఆయన ఎంతో పట్టించుకునేవారు" అని చెప్పారు నేపథ్య గాయని చిత్ర.

ఆమె 25,000 పాటలు పాడారు. ఆరు జాతీయ అవార్డులు అందుకున్నారు. దాదాపు అన్ని భారతీయ భాషల్లో ఆమె పాటలు పాడారు. కొన్ని విదేశీ భాషల్లో కూడా ఆమె గీతాలు పాడారు. దాదాపు 40 సంవత్సరాలుగా నేపథ్య గాయనిగా ఉన్నారు. అంతేకాదు.. పద్మ భూషణ్ పురస్కారం కూడా అందుకున్నారు చిత్ర.

ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం మొదటి వర్ధంతి సందర్భంగా బీబీసీ ఆమెను ఇంటర్వ్యూ చేసింది.

ఆనందప్రియ: నేపథ్య గాయనిగా కెరీర్ ప్రారంభించి 40 సంవత్సరాలు అవుతోంది. ఈ ఫీల్డ్‌లో ఇంతకాలం ఉంటానని మీరెప్పుడైనా అనుకున్నారా? మీరు కెరీర్ ప్రారంభించినప్పుడు మీ లక్ష్యం ఏమిటి?

చిత్ర: నేపథ్య గాయని కావాలని నేనెప్పుడూ అనుకోలేదు. స్కూల్ లేదా కాలేజీలో మ్యూజిక్ టీచర్ కావొచ్చనే ఉద్దేశంతో నేను మ్యూజిక్ నేర్చుకున్నాను. నా స్నేహితుల్లో చాలామంది మ్యూజిక్ టీచర్లే. నా తల్లిదండ్రులు కూడా సంగీతం నేర్పిస్తారు.

మా గురువు డాక్టర్ ఒమనకుట్టీ సోదరుడు ఎంజీ రాధాకృష్ణణ్ ఆల్ ఇండియా రేడియోలో మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉండేవారు. ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్. త్రివేండ్రంలో వాళ్లు మ్యూజిక్ స్టూడియో ప్రారంభించారు. ఆ స్టూడియోలో రికార్డింగ్‌లు మొదలుపెట్టినప్పుడు, స్థానికులకు అవకాశాలు ఇవ్వాలని అనుకున్నారు. నా స్నేహితులు కొందరికి ఆ అవకాశం వచ్చింది.

మేము కథలను పాటల్లోకి మార్చి వాటిని రికార్డింగ్ చేసేవాళ్లం. ఆ సమయంలో మాకు యేసుదాస్‌తో పాడే అవకాశం వచ్చింది.

అప్పుడు కూడా నేను ప్లేబ్యాక్ సింగర్ అవుతానని అనుకోలేదు. వాళ్లకు అవసరమైనప్పుడు నేను వెళ్లి స్టేజ్ షోలు ఇచ్చేదాన్ని. క్రమంగా యేసుదాస్‌ బృందంలో నా గొంతును ప్రజలు గుర్తించారు. త్రివేండ్రం నుంచి నాకు అవకాశాలు రావడం మొదలైంది. రవీంద్రన్ మాస్టర్ కోసం నేను ఒక పాట పాడాను. ఆయనే నన్ను చెన్నైకి తీసుకొచ్చారు.

ఆనందప్రియ: తమిళ్‌లో మీరు పాడిన మొదటి పాట ఏంటి?

చిత్ర: ఇళయరాజా కోసం నేను తమిళ్‌లో మొదటి పాట పాడాను. అసలు ఆ అవకాశం నాకెలా వచ్చిందనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

ఫాసిల్ (Fahsil) దర్శకత్వంలో వచ్చిన ఒక మలయాళ సినిమాలో నేనొక పాట పాడాను. ఆ సినిమా హీరోయిన్‌కు నా అంత వయసే ఉంటుంది. మేమిద్దరం కూడా కొత్తగానే ఇండస్ట్రీకి వచ్చాం. నా స్వరం ఆమెకు సూట్ అయింది. అందుకే తమిళ్‌లో కూడా నేనే పాడాలని ఇళయరాజా కోరుకున్నారు. రికార్డింగ్ కోసం చెన్నైకి వెళ్లినప్పుడు ఆయన్ను కలవమని నాకు చెప్పారు.

ఫాసిల్ సార్ జోక్ చేస్తున్నారని అనుకున్నాను. కానీ ఆయన సీరియస్‌గానే చెబుతున్నారని తర్వాత అర్థమైంది. ఒక మలయాళం పాట రికార్డింగ్ కోసం చెన్నై వెళ్లినప్పుడు నేను ఇళయరాజాను కలిశాను. వాళ్లు 'పూవే పోచూడవా..' అనే నా పాటకు నా వాయిస్ టెస్ట్ చేశారు. కానీ భారతీరాజా సినిమాలో నా తొలి పాటను రికార్డ్ చేశారు. 'పచై కోడి' సినిమా కోసం ఆ పాటను రికార్డ్ చేస్తున్నామని వాళ్లు చెప్పారు. కానీ 'నీధాన అంధ కుయిల్' అనే సినిమాలో అది వచ్చింది.

ఆనందప్రియ: తమిళ్, మలయాళం, తెలుగులో చాలా పాటలు పాడారు. అన్నీ లెక్కపెట్టుకుంటారా?

చిత్ర: ఆ రోజుల్లో పాట పాడిన తర్వాత వాళ్లు ఒక మ్యూజిక్ సీడీ ఇచ్చేవాళ్లు. అయితే, ఇప్పుడు ఆ పద్ధతి పాటించడం లేదు. నేను పాడిన అన్ని పాటలను రాసిపెట్టుకున్నాను. నా నోట్స్‌ను తిరిగేస్తున్నాను. త్వరలోనే ఎన్ని పాటలు పాడానో చెబుతాను.

ఇన్ని భాషల్లో ఎలా పాడగలిగారని మీరు నన్ను అడిగితే.. నాకు మళయాలం తెలుసు. కేరళలో హిందీ నేర్చుకోవడం తప్పనిసరి. హిందీ చదవడం, రాయడం నాకొచ్చు. కానీ బాగా మాట్లాడలేను. నాకు తెలుగు, తమిళ్ కొద్దిగా తెలుసు. కానీ అంత బాగా రాదు. తమిళ్ రాయడం, చదవడం సింగర్ లతికా నాకు నేర్పించింది. నేను చెన్నైకి వచ్చినప్పుడు బాలు సార్ నాకు తెలుగు నేర్పించే వారు.

ఆనందప్రియ: 25వేల పాటల తర్వాత కూడా మీరింకా పాడుతూనే ఉన్నారు. ఇండస్ట్రీలో మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవడంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? మీ కుటుంబ సభ్యులు మీకు అండగా ఉన్నారా?

ముందుగా నా కుటుంబ సభ్యులకు నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఒక తల్లిగా, భార్యగా నేను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. కానీ నా భర్త, నా కూతురు నన్ను అర్థం చేసుకున్నారు. వాళ్ల సహకారం వల్లే నేను ఇన్ని పాటలు పాడగలిగాను.

నా విజయంలో మా నాన్న పాత్ర కూడా చాలా ఉంది. ఆయనకు ఓరల్ క్యాన్సర్ ఉన్పప్పటికీ.. నొప్పిని భరిస్తూ నన్ను స్టూడియోలకు తీసుకెళ్లేవారు. ఆయన అనారోగ్యంగా ఉన్నప్పుడే నాకు పెళ్లి జరిగింది.

ఆ తర్వాత మా నాన్నలాగే నా భర్త కూడా నన్ను బాగా చూసుకున్నారు. నేను పని నుంచి ఎప్పుడూ బ్రేక్ తీసుకోలేదు. ఎక్కడికైనా వెళ్లినప్పుడు కూడా తోడుగా మ్యూజిక్ బాక్స్‌ను తీసుకెళ్తాను. అక్కడ కూడా నేను, నా పని చూసుకునేదాన్ని.

ఆనందప్రియ: ఒక కూతురిగా, భార్యగా, తల్లిగా, ఒక సింగర్‌గా మీకు అనేక బాధ్యతలు ఉన్నాయి. ఒక మహిళగా వ్యక్తిగత సవాళ్లను, విషాదాలను ఎదుర్కోవడం కొద్దిగా కష్టం. మీకు ఎదురైన సమస్యలను ఎలా ఎదుర్కొన్నారు?

చిత్ర: మా ఇంట్లో నేను అల్లారుముద్దుగా పెరిగాను. నాకు వంట చేయడం రాదు. ఒక తల్లిగా నా బిడ్డలకు ఎన్నో విషయాలు బోధించాలని అనుకుంటాను. పండగలు, బర్త్ డేలను మేమందరం స్నేహితులు, బంధువులతో కలిసి జరుపుకుంటాం.

దేవుడు ఏది తలిస్తే అదే జరుగుతుంది కదా? కానీ కష్టకాలంలో స్నేహితులు నాకు అండగా నిలిచారు. నాకంటే ఎక్కువ బాధలు పడ్డవాళ్లు తమ అనుభవాలను నాతో పంచుకున్నారు. వాళ్లలో కొంతమంది నాకు తెలియదు. కానీ వాళ్లు కూడా వచ్చి నన్ను ఓదార్చారు. వాళ్లు చూపించిన ప్రేమ, అప్యాయత, ఇచ్చిన మానసిక ధైర్యంతో నేను మళ్లీ కోలుకున్నాను. వాళ్లు లేకుంటే నేనసలు కోలుకునేదాన్నే కాదేమో. అలాంటి వాళ్లు దొరకడం నిజంగా నా అదృష్టం.

జనం చెప్పేదాంట్లో మంచిని మాత్రమే మనం గ్రహించాలి. చాలా మంది నేను కోలుకోవాలని కోరుకుంటున్నారు. నేను కచ్చితంగా కోలుకోవాలి. ఎందుకు కోలుకోకూడదు అనే ఆలోచించాను. ఆ ఆలోచనే నన్ను ఇంతదూరం తీసుకొచ్చింది.

ఎ.ఆర్.రెహ్మాన్

ఆనందప్రియ: ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ డైరెక్షన్‌లో మీరు వందకు పైగా పాటలు పాడారు. ఆయన మ్యూజిక్ ఆల్బమ్స్‌లో మీ చెవుల్లో ఎప్పటికీ వినిపించే పాట ఏది? ఆయనతో పని చేయడం ఎలా ఉండేది?

చిత్ర: ఆయన దర్శకత్వంలో మర్చిపోలేని మధురమైన పాటలను నేను పాడాను. ఆయనతో తొలిసారి రికార్డింగ్ చేసిన అనుభవం నాకు కొత్తగా అనిపించింది. అలాంటి అనుభవం అదివరకెప్పుడూ నాకు ఎదురుకాలేదు. వాయిస్ రికార్డ్ చేసిన తర్వాత దానికి ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాడ్ చేస్తారు. అంటే ఆ పాట ఎలా వచ్చిందనేది అది విడుదలైన తర్వాతే మనకు తెలుస్తుంది.

ఒకసారి మర్చిపోలేని సంఘటన జరిగింది. తెలుగులో లవ్ బర్డ్స్‌ సినిమాలోని 'మనసున.. మనసున..' పాట రికార్డింగ్ సమయంలో నేను పాడిన విధానం ఆయనకు నచ్చలేదేమోనని నాకు అనిపించింది. ఆయన నా నుంచి మరో రకమైన గాత్రాన్ని ఆశిస్తున్నారేమో అనుకున్నాను. కానీ ఆ పాట విడుదలైన తర్వాత దానికి ఎన్నో ప్రశంసలు వచ్చాయి.

'ఓకే కన్మనీ' (తెలుగులో ఓకే బంగారం) సినిమాలో పాడమని ఆయన నన్ను అడిగారు. ఆ సమయంలో నేను ఊళ్లో లేను. దాంతో ఆయన ఆ పాటను మరొకరితో పాడిస్తారని అనుకున్నాను. కానీ నాతో పాడించడానికి మూడు నెలలు ఎదురు చూశానని ఒక టీవీ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఆ పాటే 'మనసే తీయగా స్వరములు చిందెనే..'

ఆయన కోసం ఒక హిందీ పాట, ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ఆయన తీసిన ఆల్బమ్‌లో మరో పాట కూడా పాడాను.

ఆనందప్రియ: చాలా మ్యూజిక్ రియాలిటీ షోల్లో మీరు జడ్జిగా వ్యవహరించారు. ఒకరిని ఎలిమినేట్ చేస్తున్నప్పుడు మీరు చాలా మృదువుగా విమర్శిస్తుంటారు. ఈ విషయంలో మీరెలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు?

చిత్ర: కంటెస్టెంట్ల గురించి నేను ఏదైనా చెప్పే ముందు, నన్ను నేను వారి స్థానంలో ఊహించుకుంటాను. నా కామెంట్లతో వాళ్ల మనసును గాయపర్చడం నాకిష్టం ఉండదు. అందుకే వాళ్ల పాటలో కరెక్షన్స్ చెబుతుంటాను. మనల్ని పొగిడే వారితో పోలిస్తే మన తప్పుల్ని సరిచేయడానికి విమర్శించే వాళ్లే మన మంచిని ఎక్కువగా కోరుకుంటారని మా నాన్న చెప్పేవారు. నేను దీన్ని వంద శాతం నమ్ముతాను.

నేను ఇళయరాజా కోసం పాట రికార్డింగ్ చేసినప్పుడు, ఆయన ఆ పాటను నాకు వినిపించి, తప్పులెక్కడున్నాయో చెప్పమని అడిగేవారు. మనల్ని మనం సరిదిద్దుకోవడానికి ఇదొక మంచి అవకాశం. అవి జీవితం నేర్పిన పాఠాలు. మీ జీవితాన్ని మీరు తీర్చిదిద్దుకుంటున్నప్పుడు ఉలి దెబ్బలను కూడా భరించాల్సి ఉంటుంది. కఠినమైన విమర్శలను కూడా సానుకూలంగా తీసుకుంటేనే మీరు జీవితంలో పైకి వస్తారు.

ఆనందప్రియ: ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి మీరెన్నో పాటలు పాడారు. ఆయన లేకుండా ఏమనిపిస్తోంది?

చిత్ర: గత కొన్ని సంవత్సరాలుగా నేను ఆయనతో కలిసి పాడలేదు. కలిసి పనిచేసేటప్పుడు, మేము రోజుకు ఐదు పాటలు రికార్డింగ్ చేసేవాళ్లం. ఆధునిక టెక్నాలజీ సాయంతో ఒకే పాటను ఇద్దరం వేర్వేరు చోట్ల ఉండి ఒకే సమయంలో ఒకే పాటను పాడేవాళ్లం. అందుకే మేము కలుసుకోవడం కాస్త తక్కువే.

కోవిడ్ సమయంలోనూ ఆయన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. సంగీతకారుల కోసం డబ్బులు సేకరించారు. డాక్టర్లు, నర్సుల సేవలను కొనియాడుతూ పాటలు పాడారు.

లాక్‌డౌన్‌ సమయంలో నేను పని చేయలేదు. చాలా ఒత్తిడికి లోనయ్యాను. కానీ ఆయన చేసిన పనులను చూసిన తర్వాత కరోనాపై అవగాహన కోసం నేను కూడా ఒక పాట రాశాను.

ఆనందప్రియ: ఆయన తరచుగా మీతో ఏం చెప్పేవారు?

ఆయన తన సహచరులను సంతోషంగా ఉంచుతారు. విదేశాల్లో సంగీత కార్యక్రమాలు నిర్వహించినప్పుడు మాకు ఫ్రీ టైం చాలా తక్కువగా ఉంటుంది. మాతో పాటు ఉండే సంగీతకారులు ఎన్నో పనులు చేయాల్సి ఉంటుంది. కార్యక్రమానికి అందరికంటే ముందే వచ్చి, కార్యక్రమం ముగిసే వరకు స్టేజీ మీదే ఉంటారు.

ఒకసారి ఏమైందంటే.. గాయకులకు ముందే గదులు కేటాయించారు. కానీ మిగిలిన సంగీతకారులకు ఇంకా గదులు సిద్ధం కాలేదు. అప్పుడు రాత్రి 12 అవుతోంది. వాళ్లందరికీ గదులు దొరికే వరకు ఎస్‌పీబీ అక్కడే ఉండి, ఆ తర్వాతే తన గదిలోకి వెళ్లారు. మరో ప్రముఖ గాయకుడైతే అలా చేసి ఉండేవారో లేదో నాకు తెలియదు. కానీ ఆయన నుంచి మనం ఇలాంటి విషయాలు నేర్చుకోవాలి.

ఆనందప్రియ: రికార్డింగ్ సమయంలో కామ్‌గా ఉండే చిత్రను ఎస్‌పీబీ చూశారు. కానీ రియాలిటీ షోల్లో మనో, సుబాలను మీరు ఆటపట్టిస్తూ ఉంటారు. పిల్లలతో సరదాగా ఉంటారు. దాని గురించి ఆయన ఏమైనా అన్నారా?

ఆయన నాకు సీనియర్. ఆయనంటే నాకెంతో గౌరవం ఉంది. కానీ మనో, సుబా నాకంటే చిన్నవాళ్లు. నేను ఏమన్నా వాళ్లు సరదాగా తీసుకుంటారు. అసలు నేను అలా ఉండటానికి కారణం మనోనే. ఇవన్నీ చూసిన తర్వాత 'నీలో ఈ కోణం కూడా ఉందా..' అని ఎస్‌పీబీ అడిగారు.

facebook/KSChithraOfficial

ఆనందప్రియ: ఎస్‌పీబీతో కలిసి చివరగా పాడిన పాట ఏంటి?

చిత్ర: మేము ఒక కన్సర్ట్ కోసం కలిసి పాడాము. ఇటీవల కాలంలో మేమిద్దరం కలిసి పాడలేదు. చివరిసారిగా మేమిద్దరం కలిసి పాడింది పార్టీ సినిమా కోసం కావొచ్చు.

ఆనందప్రియ: ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. కానీ ఆయనలో మీకు ఎక్కువగా నచ్చేది ఏంటి?

చిత్ర: ఆయనలోని గాయకుడు నాకు చాలా ఇష్టం. ఇందులో అనుమానం లేదు.

స్టేజ్ షోల్లో ఆయన యాంకరింగ్ చేస్తూ పాటలు పాడుతూ ఉంటారు. యాంకరింగ్ చేస్తున్నప్పుడు బిగ్గరగా మాట్లాడాల్సి ఉంటుంది. ఇలా చేస్తే గాత్రంపై ప్రభావం పడుతుందా అని నేను ఆయన్ను అడిగాను. ఏ పని చేసినా వంద శాతం కష్టపడాలని ఆయన చెప్పారు.

ఆనందప్రియ: ఆయనతో కలిసి మీరెన్నో పాటలు పాడారు. వాటిలో మీకు ఎక్కువగా నచ్చి పాటేంటి?

చిత్ర: ఆయన పాడిన ఎన్నో పాటలు నాకిష్టం. తెలుగులో కీరవాణి సంగీత దర్శకత్వంలో ఆయన ఒక పాట పాడారు. ఒక మహిళ జీవితంలోని వేర్వేరు దశలను ఆ పాట వివరిస్తూ ఉంటుంది. ఆ పాటలోని ప్రతి పదానికి లోతైన అర్థం ఉంది. ఆ పాటలోని భావోద్వేగాలను ఆయన తన స్వరంలో పలికించారు. అదే సినిమాలో శైలజతో కలిసి మరో పాట ఉంది. అందులో చాలాచోట్ల నవ్వులు ఉంటాయి. నవ్వులోని చిన్న చిన్న తేడాలను కూడా ఆయన తన స్వరంలో వినిపించారు. జానకమ్మ కూడా అంతే. పాటల ద్వారా భావోద్వేగాలను వాళ్లు ఎలా పలికించారో చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది.

శంకరాభరణం సినిమాలోని పాటలు నిజంగా చాలా గొప్పగా అనిపిస్తాయి. ఒక పాటలో ఎస్పీబీ.. మాట్లాడుతున్నట్లుగా మొదలుపెట్టి స్వరాన్ని పెంచుకుంటూ పతాకస్థాయికి తీసుకెళ్తారు. ఈరోజుకు కూడా దాని గురించి ఆలోచిస్తే అద్భుతమని అనిపిస్తుంటుంది. (శంకరాభరణం సినిమాలో 'ఓంకార నాదాను సంధానమౌ గానమే' పాటకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 1979లో ఉత్తమ నేపథ్య గాయకుడిగా జాతీయ అవార్డు కూడా స్వీకరించారు. ఈ సినిమాకు సంగీతం అందించిన కేవీ మహదేవన్‌కు కూడా జాతీయ అవార్డు లభించింది. ఈసినిమాలో మొత్తం 10 పాటలకు గాను 8 పాటల్ని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. ఈ సినిమాలో 'శంకరా నాదశరీరాపరా' పాట రాసిన వేటూరి సుందరరామమూర్తికి ఉత్తమ రచయితగా నంది అవార్డు లభించింది. ఈ పాటను పాడింది కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.)

అలాగే సాగర సంగమం సినిమాలో ఎస్పీబీ పాడిన 'తకిట తదిమి తకిట తదిమి తందాన' పాట కూడా చాలా బాగుంటుంది.

ఇవి కూడా చదవండి

source: bbc.com/telugu

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: BBC Telugu
Top