Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గోవా తరహాలో విశాఖ, చీరాలలో 'బీచ్ షాక్స్'.. ఇంతకూ ఏమిటివి?

గోవా తరహాలో విశాఖ, చీరాలలో 'బీచ్ షాక్స్'.. ఇంతకూ ఏమిటివి?

Frank Bienewald/LightRocket via గోవా బీచ్

గోవా తరహాలో బీచ్ ఒడ్డున ఆహారం, పానీయాలు, వినోద సదుపాయాలు అందించే 'బీచ్ షాక్స్'ను విశాఖపట్నం, చీరాల తీరాలలో ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.

పర్యటక రంగాన్ని ప్రోత్సహించడం, స్థానికంగా ఉపాధిని పెంచడం, తీర ప్రాంతాల్లో కొత్త ఆర్థిక కార్యకలాపాలు సృష్టించడం దీని లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది.

అయితే, బీచ్ షాక్స్ పర్యటకాభివృద్ధికి దోహదపడతాయని ప్రభుత్వం చెబుతుండగా, పర్యావరణవేత్తలు, మత్స్యకార సంఘాలు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఈ నెల 5న జరిగిన మంత్రివర్గ సమావేశంలో బీచ్ షాక్స్‌కు సంబంధించిన మార్గదర్శకాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

పైలట్ ప్రాజెక్టుగా విశాఖలో రెండు, చీరాలలో రెండు ప్రాంతాల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రతిపాదించింది.

బీచ్ షాక్స్ అంటే ఏమిటి?

బీచ్ ఒడ్డున తాత్కాలికంగా ఏర్పాటు చేసే చిన్న నిర్మాణాలనే బీచ్ షాక్స్ అంటారు. సాధారణంగా వెదురు, కలప, తేలికపాటి నిర్మాణ సామగ్రితో వీటిని నిర్మిస్తారు.

ఆహారం, పానీయాలు, విశ్రాంతి సదుపాయాలు, కుర్చీలు, గొడుగులు వంటివి ఏర్పాటు చేయడంతో పాటు.. సంగీత కార్యక్రమాలు, వాటర్ స్పోర్ట్స్ బుకింగ్ వంటి సేవలు అందిస్తారు. పర్యటక సీజన్ ముగిసిన తర్వాత వీటిని తొలగించాల్సి ఉంటుంది.

"రాష్ట్రంలో పర్యటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సీప్లేన్ సర్వీసులు, హోం స్టేలు వంటి కొత్త విధానాలు తీసుకొస్తోంది. దేశంలోనే పొడవైన తీరాల్లో ఏపీ తీరం ఒకటి. ఈ నేపథ్యంలో తీర ప్రాంత పర్యటకాన్ని గోవా తరహాలో మరింత అభివృద్ధి చేయాలనే ఆలోచనతో బీచ్ షాక్స్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది" అని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు బీబీసీతో చెప్పారు.

 EyesWideOpen/

గోవా మోడల్ ఏమిటి?

భారత్‌లో బీచ్ షాక్స్‌కు అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రాంతం గోవా. 1970లలో విదేశీ బ్యాక్‌ప్యాకర్ పర్యటకులు ఎక్కువగా రావడం ప్రారంభమైన తర్వాత స్థానిక మత్స్యకారులు, చిన్న వ్యాపారులు తాత్కాలిక ఆహార కేంద్రాలు ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. తరువాత అవి పర్యటక పరిశ్రమలో భాగమయ్యాయి.

గోవా ప్రభుత్వం ప్రస్తుతం లైసెన్స్ విధానంలో షాక్స్‌కు అనుమతులు ఇస్తోంది. ప్రతి ఏడాది వాటి సంఖ్య, వాటిని ఏర్పాటుచేసే స్థానం, పర్యావరణ నిబంధనలను నిర్ణయిస్తుంది.

గోవా పర్యటక శాఖ వెబ్‌సైట్‌లో పేర్కొన్న గోవా టూరిజం పాలసీ (2022-23) నిబంధనల ప్రకారం...

  • వెదురు, కాడలు, తాటి ఆకులు వంటి సహజ పదార్థాలతో వీటిని నిర్మించాలి.
  • కాంక్రీట్, పీసీసీ, ఆర్సీసీ, ప్లాస్టరింగ్ వంటి శాశ్వత నిర్మాణాలకు అనుమతి లేదు.
  • ఒక్కో షాక్ గరిష్ఠ వైశాల్యం 18×8 మీటర్లు (144 చ.మీ.).
  • ఎత్తు 5.5 మీటర్లకు మించకూడదు.
  • రెండో అంతస్తు నిషేధం.
  • సెప్టెంబర్ 1 నుంచి మే 31 వరకు మాత్రమే నిర్వహణకు అనుమతి.
  • జూన్ 10 నాటికి పూర్తిగా తొలగించడం తప్పనిసరి.

ఏపీ మద్యం పాలసీలో కీలక మార్పులు

బీచ్ షాక్స్‌కు అనుమతులిచ్చేందుకు ఏపీ మద్యం పాలసీలో కీలక మార్పులు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.

ఇప్పటి వరకు బీచ్ ప్రాంతాల్లో మద్యం విక్రయాలకు సాధారణంగా అనుమతి లేకపోయినా, కొత్త విధానంలో బీచ్ షాక్స్‌కు ప్రత్యేక లైసెన్సులు ఇవ్వాలని ప్రతిపాదించింది.

పని గంటలను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పరిమితం చేయాలని సూచించింది.

పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే ఇతర తీర ప్రాంతాలకూ విస్తరించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.

 BBC

బీచ్ షాక్స్‌పై మంత్రి గతంలో ఏమన్నారంటే...

బీచ్ షాక్స్ అంశంపై ఏపీ పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌తో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. అయితే, ఆయన కేరళ పర్యటనలో ఉండటంతో అందుబాటులోకి రాలేరని ఆయన కార్యాలయం తెలిపింది.

గతంలో అంటే 2025 మార్చిలో విశాఖ రుషికొండ బీచ్‌లో బ్లూ ఫ్లాగ్ హోదా పునరుద్ధరణ కార్యక్రమంలో పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ బీచ్ షాక్స్ అంశంపై మాట్లాడారు.

"విదేశీ పర్యటకులను ఆకర్షించేందుకు బీచ్ షాక్స్‌లో బీర్, వైన్ విక్రయాలకు అనుమతి ఇచ్చే ప్రతిపాదన ఉంది. బీచ్‌ల వద్ద పర్యటక అనుభవాన్ని మెరుగుపర్చడం, సందర్శకుల సంఖ్యను పెంచడమే లక్ష్యం" అని ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు.

అదే సమయంలో అసెంబ్లీలో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో పర్యటకాభివృద్ధికి ప్రస్తుత సీఆర్‌జెడ్ నిబంధనలు అడ్డంకిగా మారాయని, పర్యటక ప్రాజెక్టులు చేపట్టేందుకు కొన్ని ప్రాంతాల్లో సడలింపులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామని చెప్పారు.

దీనిపై కూడా అప్పట్లో ప్రజాసంఘాలు, పర్యావరణవేత్తల నుంచి వ్యతిరేకత వచ్చింది. పర్యావరణవేత్తలు తీర ప్రాంత జీవవైవిధ్య సంరక్షణ, మత్స్యకారుల జీవనాధారంపై ప్రభావం చూపుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

 BBC

బీచ్ షాక్స్ వంటి పర్యటక ఆకర్షణలతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది.

పర్యటకులు బీచ్ వద్ద ఎక్కువసేపు గడపడానికి అవకాశం ఉంటుంది. హోటళ్లు, టాక్సీలు, వాటర్ స్పోర్ట్స్, హస్తకళల విక్రయాలు వంటి అనుబంధ వ్యాపారాలకు డిమాండ్ పెరగవచ్చునని ప్రభుత్వ అధికారులు అంచనా వేస్తున్నారు.

విశాఖ వంటి నగరాల్లో దేశీయ, విదేశీ పర్యటక ఆదాయం పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

"విశాఖకు వచ్చే విదేశీ పర్యటకులకు బీచ్ అనుభవం మరింత ఆకర్షణీయంగా మారితే.. హోటళ్లు, రవాణా, చిన్న వ్యాపారాలకు లాభం చేకూరుతుంది. అయితే, పరిశుభ్రత, భద్రత, పార్కింగ్ వంటి మౌలిక సదుపాయాలు కూడా సమాంతరంగా అభివృద్ధి చేయాలి. ముఖ్యంగా అక్కడ పోలీసింగ్ కూడా ఉండటం అవసరం" అని ఆంధ్రప్రదేశ్ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఓ. నరేష్ కుమార్ బీబీసీతో అన్నారు.

 BBC

మత్స్యకార సంఘాలు, పర్యావరణవేత్తలు ఏమంటున్నారు?

బీచ్ షాక్స్‌పై కేబినెట్ నిర్ణయం తర్వాత మత్స్యకార సంఘాలు, పర్యావరణవేత్తలు, కొన్ని ప్రజాసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

తీర ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు, శబ్ద కాలుష్యం, సముద్ర జీవులకు ఇబ్బందులు, మురుగునీటి నిర్వహణ వంటి అంశాలు సవాలుగా మారవచ్చని, జాగ్రత్త అవసరమని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

"బీచ్ షాక్స్‌ను పూర్తిగా తాత్కాలిక నిర్మాణాలుగా మాత్రమే ఉంచాలి. కాంక్రీట్ నిర్మాణాలు, వ్యర్థాల నిర్వహణలో నిర్లక్ష్యం, సముద్ర తీర జీవావరణానికి హాని జరిగితే దీర్ఘకాలంలో సమస్యలు తలెత్తుతాయి. సీఆర్‌జెడ్ నిబంధనల అమలు కీలకం" అని ఏయూ పర్యావరణశాస్త్ర మాజీ విభాగాధిపతి ప్రొఫెసర్ ఈయూబీ రెడ్డి బీబీసీతో అన్నారు.

"బీచ్‌లలో పడవలు నిలిపే ప్రదేశాలు, వలలు ఆరేసే ప్రాంతాలు, సంప్రదాయ మత్స్యకార కార్యకలాపాలకు ఆటంకం కాకూడదు. స్థానిక మత్స్యకార కుటుంబాల అభిప్రాయాలను తీసుకుని ప్రణాళిక రూపొందించాలి" అని మత్స్యకార సంఘం నాయకుడు జానకిరామ్ చెప్పారు.

'గోవాలో బీచ్ షాక్స్ పర్యటకానికి ప్రధాన ఆకర్షణగా మారినా, లైసెన్సుల కేటాయింపు, అక్రమ నిర్మాణాలు, పర్యావరణ ఉల్లంఘనలు, శబ్ద కాలుష్యం, బీచ్ పరిశుభ్రత వంటి అంశాలపై వివాదాలున్నాయి.

దీంతో, అక్కడ ప్రభుత్వం షాక్స్ సంఖ్యను పరిమితం చేయడం, సీజనల్ అనుమతులు, కఠిన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు అమలు చేయడం వంటి చర్యలు చేపట్టింది' అని జానకిరామ్ అన్నారు.

"గోవా అనుభవం చూపించిన పాఠం ఏమిటంటే.. నియంత్రణలు బలంగా ఉంటేనే బీచ్ షాక్స్ పర్యటకానికి మేలు చేస్తాయి. లేకపోతే ఆక్రమణలు, వ్యర్థాల సమస్యలు, స్థానిక ప్రజలతో ఘర్షణలు పెరగవచ్చు" అని విశాఖపట్నానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఎం. యుగంధర్ రెడ్డి చెప్పారు.

గతంలో ఇలాగే...

గోవాలో ఉన్న స్థాయిలో బీచ్ పర్యటక వ్యవస్థ విశాఖలో ఇంకా అభివృద్ధి చెందలేదని, రెండు ప్రాంతాలను నేరుగా పోల్చకూడదని యుగంధర్ రెడ్డి బీబీసీతో అన్నారు.

గతంలో ఇలాంటిదే ఒక ప్రతిపాదన తెచ్చి మళ్లీ వెనక్కి తగ్గిన సంఘటనను ఆయన గుర్తు చేశారు.

"2017 ఫిబ్రవరి 14న (ప్రేమికుల దినోత్సవం) విశాఖపట్నం బీచ్‌లో "బీచ్ లవ్ ఫెస్టివల్" నిర్వహించేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఈ కార్యక్రమం కోసం దేశ విదేశాల నుంచి సుమారు 9 వేల జంటలను ఆహ్వానించాలని నిర్ణయించింది. సముద్ర తీరంలో టెంట్లు ఏర్పాటు చేసి, వారికి మూడు రోజుల పాటు వసతి కల్పించడంతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ కళాకారులతో నృత్య, సంగీత కార్యక్రమాలు నిర్వహించాలని భావించింది.

అయితే, ఈ ప్రతిపాదనపై రాజకీయ, సామాజిక వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇది స్థానిక సంస్కృతికి విరుద్ధమని విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చివరకు వెనక్కి తగ్గింది. బీచ్ లవ్ ఫెస్టివల్‌ను రద్దు చేస్తున్నట్లు అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు'' అని చెప్పారు యుగంధర్ రెడ్డి.

 Frank Bienewald/LightRocket via

ఆంధ్రప్రదేశ్‌కు సుమారు 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. విశాఖపట్నం, భీమిలి, చీరాల, సూర్యలంక, కాకినాడ, ఉప్పాడ వంటి ప్రాంతాలను పర్యటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ విధానాన్ని ముందుకు తెస్తుందని గాజువాక ఎమ్మేల్యే పల్లా శ్రీనివాసరావు బీబీసీతో అన్నారు.

"పర్యటక అభివృద్ధి అవసరమే. కానీ, అది మద్యం విక్రయాలతో సాగే బీచ్ షాక్స్ వంటి విధానంలో కాదు. పర్యావరణ రక్షణ, స్థానిక ప్రజల అభిప్రాయ భాగస్వామ్యం లేకుండా ప్రాజెక్టు అమలు చేస్తే భవిష్యత్తులో వివాదాలకు దారితీసే అవకాశం ఉంది" అని మాజీ మంత్రి, వైకాపా నాయకులు గుడివాడ అమర్నాథ్ అన్నారు.

అయితే, బీచ్ షాక్స్ వంటి ప్రాజెక్టుల విజయాన్ని నిర్ణయించేది షాక్స్ సంఖ్య కాదని... పర్యావరణ నిబంధనల అమలు, చెత్త నిర్వహణ, స్థానిక ప్రజల భాగస్వామ్యం, మత్స్యకారుల హక్కుల పరిరక్షణ, తీర ప్రాంత జీవవైవిధ్య సంరక్షణ వంటి అంశాలే కీలకమని పర్యావరణవేత్త ఆర్. సుందరరావు బీబీసీకి చెప్పారు.

పర్యటక అభివృద్ధి, తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ, మత్స్యకారుల జీవనాధార రక్షణ మధ్య సమతుల్యత సాధించినప్పుడే గోవా తరహా బీచ్ షాక్స్ ఆంధ్రప్రదేశ్‌లో దీర్ఘకాలిక విజయంగా నిలిచే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

గోవా బీచ్ గోవా బీచ్ Frank Bienewald/LightRocket via

source: bbc.com/telugu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: BBC Telugu