Thursday, 29 Jul, 10.04 am BBC News తెలుగు

హోమ్
జమ్మూ: క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి, ఇది ఎందుకు అంత ప్రమాదకరం?

జమ్మూలో కిష్త్వార్ జిల్లాలోని హోంజార్ గ్రామంలో సంభవించిన మేఘాల విస్ఫోటనం (క్లౌడ్ బరస్ట్), భారీ వరదల కారణంగా 20 మందికి పైగా గల్లంతయ్యారు. ఏడెనిమిది ఇళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి.

ఇప్పటి వరకూ ఏడుగురి మృతదేహాలు లభ్యమయ్యాయని, వరదలో కొట్టుకుపోకుండా 12 మందిని కాపాడగలిగారని ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది.

పోలీసులు, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలికి బయలుదేరాయి. హోంజార్ గ్రామానికి సరైన దారి లేదు. అక్కడకు చేరుకోవాలంటే ఒక నాలుగైదు గంటలు నడిచి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి వారు ఆ గ్రామానికి చేరుకునే సరికి కొంత సమయం పట్టొచ్చు.

చాలామంది గ్రామస్థులు గల్లంతైనట్లు సమాచారం. స్థానికులు వారికి చేతనైన సహాయం చేస్తున్నారు.

ఇంతకూ క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి ? దీని గురించి వాతావరణ శాఖ ముందుగానే సమాచారం అందిస్తుందా? క్లౌడ్ బరస్ట్‌కు కారణాలేంటి?

దిల్లీలోని ప్రాంతీయ వాతావరణ సూచన కేంద్రం (వెదర్ ఫోర్‌కాస్టింగ్ సెంటర్) అధిపతి డాక్టర్ కుల్దీప్‌ వీటన్నిటి గురించి ఇలా వివరించారు.

GETTY IMAGES క్లౌడ్ బరస్ట్‌ను అంచనా వేయడం కష్టం

క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి?

వాతావరణ శాఖ నిర్వచనం ప్రకారం, ఒక చిన్న ప్రాంతంలో (ఒకటి నుండి పది కిలోమీటర్ల లోపు) ఒక గంటలో 10 సెం.మీ లేదా అంతకంటే ఎక్కువ వర్షం కురిస్తే దాన్ని మేఘాల విస్ఫోటనం లేదా క్లౌడ్ బరస్ట్ అంటారు.

ఒక్కోసారి ఒకే ప్రాంతంలో ఒకటి కన్నా ఎక్కువసార్లు క్లౌడ్ బరస్ట్ సంభవించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో తీవ్ర నష్టం వాటిల్లుతుంది. 2013లో ఉత్తరాఖండ్‌లో జరిగినట్లుగా భారీ ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. అయితే, కుంభవృష్టి కురిసిన ప్రతిసారీ క్లౌడ్ బరస్ట్ అని చెప్పలేం.

క్లౌడ్ బరస్ట్‌కు కారణాలేంటి?

ఇది భౌగోళిక, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం జమ్మూలో రుతుపవనాల ప్రభావం, పశ్చిమం నుంచి వాతావరణ అలజడి (వెస్ట్రన్ డిస్టర్బెన్స్) రెండూ ఉన్నాయి.

రుతుపవనాలు దక్షిణాన అరేబియా సముద్రం నుంచి కొంత తేమను తీసుకువస్తాయి. వెస్ట్రన్ డిస్టర్బెన్స్ కారణంగా మధ్యధరా తీరం నుంచి వీస్తున్న గాలులు పశ్చిమాన ఇరాన్, పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్ నుంచి తేమను తోడ్కొని వస్తాయి.

ఈ రెండూ ఢీకొన్నప్పుడు ఏర్పడిన మేఘాలు ఎక్కువ సాంద్రతను కలిగి ఉంటాయి. ఇవి అకస్మాత్తుగా తక్కువ సమయంలో భారీగా వర్షిస్తాయి.

పర్వతాలపై తరచూ ఇలాంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తుంటాయి. కొండలపై ఏర్పడిన మేఘాలు అధిక తేమను కలిగి తక్కువ సమయంలో కుంభవృష్టి కురిపిస్తాయి. ఆ కారణంగా పర్వతాలపై క్లౌడ్ బరస్ట్ సంఘటనలు అధికంగా జరుగుతుంటాయి.

వర్షాకాలంలో మాత్రమే క్లౌడ్ బరస్ట్ జరుగుతుందా?

సాధారణంగా రుతుపవనాలు వచ్చే ముందు, వచ్చిన తరువాత కూడా క్లౌడ్ బరస్ట్ జరుగుతుంటుంది.

నెలల్లో చెపాలంటే మే నుంచి జూలై-ఆగస్ట్ వరకు భారతదేశంలోని ఉత్తర ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తాయి.

GETTY IMAGES క్లౌడ్ బరస్ట్ జరిగిన ప్రదేశాలకు సమీపంలో నదులు, సరస్సులు ఉంటే తీవ్ర నష్టం వాటిల్లుతుంది

పర్వత ప్రాంతాల్లోనే మేఘాల విస్ఫోటనం జరుగుతుందా?

అలాగని చెప్పలేం. దిల్లీ, పంజాబ్, హరియాణా లాంటి సమతల ప్రాంతాల్లో కూడా క్లౌడ్ బరస్ట్ సంభవించవచ్చు.

అయితే, భారతదేశంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా ఉత్తరాదినే సంభవిస్తుంటాయి. ఈ ప్రాంతాల్లో ఎక్కువ ఎత్తులో చిన్న చిన్న పర్వతాలు అనేకం ఉంటాయి. అలాంటిచోట క్లౌడ్ బరస్ట్ జరిగే అవకాశాలు అధికం.

ఈశాన్య (నార్త్-ఈస్ట్) ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ జరుగుతుందా?

చిరపుంజీలాంటి ప్రాంతాల్లో ఏడాది పొడుగునా వర్షాలు కురుస్తుంటాయి. బెంగాల్ తీరం నుంచి అధిక తేమతో కూడిన గాలులు వీస్తుంటాయి. కాబట్టి వర్షాకాలంలో క్లౌడ్ బరస్ట్ సంభవమే.

అక్కడ చాలాసార్లు మేఘాల విస్ఫోటనం జరిగింది. కానీ అక్కడి ప్రజలు ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ముందు నుంచి సిద్ధంగా ఉంటారు.

నీరు ఒకేచోట పేరుకుపోదు. త్వరగా పల్లానికి తరలిపోతుంది. ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల్లో ప్రజలు నివసించరు. అందుచేత అక్కడ క్లౌడ్ బరస్ట్ అయినా ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించడం అరుదు.

ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, కేవలం ఒక్క గంటలో 10 సె.మీ వర్షం కురవడం వలనే నష్టం వాటిల్లదు. సమీపంలో నది లేదా సరస్సు ఉంటే, కుంభవృష్టి వలన వాటిల్లో నీరు పొంగి, వరదలు ముంచెత్తడం వలన చుట్టుపక్కల నివాస ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది.

ఈ కారణంగానే జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ ప్రాంతాల్లో సంభవించిన క్లౌడ్ బరస్ట్ సంఘటనల్లో అధిక ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగిన వార్తలు ఎక్కువగా వినిపిస్తుంటాయి.

Reuters ప్రతీకాత్మక చిత్రం

క్లౌడ్ బరస్ట్‌ను ముందే అంచనా వేయొచ్చా?

ఒకటి నుంచి పది కిలోమీటర్ల లోపు ఉన్న ప్రాంతాల్లో వాతావరణ మార్పుల కారణంగా తేమతో నిండిన భారీ మేఘాలు మోహరించడం వలన క్లౌడ్ బరస్ట్ జరుగుతుంది. అందువల్ల వీటిని అంచనా వేయడం కష్టం.

రాడార్ సహాయంతో పెద్ద ప్రాంతంలో కురవబోయే భారీ వర్షాలను వాతావరణ శాఖ అంచనా వేయగలదు. కానీ ఏ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ జరగవచ్చు అనేది అంచనా వేయడం దాదాపు అసాధ్యం.

జమ్మూలోని కిష్త్వార్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారుగానీ క్లౌడ్ బరస్ట్ అవుతుందని ఊహించలేదు.

source: bbc.com/telugu

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: BBC Telugu
Top