Tuesday, 28 Sep, 10.21 am BBC News తెలుగు

హోమ్
'కాస్ట్ ఆఫ్ వార్': అఫ్గానిస్తాన్ యుద్ధంతో వేల కోట్లు లాభం పొందిన 5 కంపెనీలు ఇవే..

అఫ్గానిస్తాన్‌లో సుదీర్ఘకాలం పాటు అమెరికా పోరాడింది. ఆగస్టు 30న చివరి అమెరికా సైనికుడు కాబుల్ నుంచి వెళ్లిపోవడంతో ఈ పోరాటం ముగిసింది.

బ్రౌన్ యూనివర్సిటీ 'కాస్ట్ ఆఫ్ వార్' ప్రాజెక్ట్ అంచనాల ప్రకారం... ఈ యుద్ధం వల్ల అమెరికా ధనాగారంపై 230 కోట్ల డాలర్ల (సుమారు రూ.17 వేల కోట్లు) భారం పడింది.

అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా బలగాలు వైదొలిగాక... తాలిబాన్లు శక్తిమంతం కావడం, ఆఫ్గాన్‌పై పట్టు సాధించడం, అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొనడం వంటివన్నీ అమెరికా ఓటమిగా చాలామంది నిపుణులు వర్ణించారు.

కొంతమందికి ఇదో ఓడిపోయిన యుద్ధం కావచ్చు. కానీ చాలామందికి ఇదో లాభాదాయక ఒప్పందం.

ఈ యుద్ధం కోసం 2001-2021 మధ్య కాలంలో 230 కోట్ల డాలర్లు (సుమారు రూ.17 వేల కోట్లు) ఖర్చు చేశారు. ఇందులో సుమారు 105 కోట్ల డాలర్ల (రూ. 7,754. 74 కోట్లు) ను అఫ్గానిస్తాన్‌లో రక్షణ మంత్రిత్వ శాఖ కార్యకలాపాలు పూర్తి చేయడానికి వినియోగించారు.

ఇందులో అధిక మొత్తాన్ని అఫ్గానిస్తాన్‌లో అమెరికా ఆపరేషన్స్‌కు మద్దతుగా నిలిచిన ప్రైవేట్ కంపెనీల సర్వీస్ కోసమే ఖర్చు చేశారు.

''ఈ పోరాటంలో అమెరికా సైనికుల సంఖ్య మరీ ఎక్కువగా ఏం ఉండదు. వలంటీర్లందరినీ మిలిటరీ కాంట్రాక్టర్స్ నియమించారు. అమెరికా సైనికుల కంటే కూడా ఈ కాంట్రాక్టు నియామకాలే ఎక్కువ ఉంటాయి. అందుకే యుద్ధంలో పనిచేసిన వారి సంఖ్య రెట్టింపైంది'' అని కాలిఫోర్నియా యూనివర్సిటీలోని కెనడీ స్కూల్ ఆఫ్ గవర్నన్స్‌కు చెందిన ప్రొఫెసర్ లిండా బిల్మ్స్ అన్నారు.

అఫ్గానిస్తాన్‌కు పంపాల్సిన సైనికుల సంఖ్య రాజకీయంగా పరిమితమైందని, దీని ఆధారంగానే కాంట్రాక్టర్ల సంఖ్యను కూడా నిర్ణయించినట్లు లిండా, బీబీసీ ముండోతో చెప్పారు.

''కాంట్రాక్టర్లు వివిధ రకాలు పనులు చేశారు. విమానాల్లో ఇంధనం నింపడం, ట్రక్కులు నడపడం, వంట, క్లీనింగ్, హెలికాప్టర్లను నడపటంతో పాటు అన్ని రకాల యుద్ధ సామగ్రి, పరికరాలను సరఫరా చేసేవారు'' అని ఆమె అన్నారు.

విమానాల్లో ఇంధనం నింపడం, ట్రక్కులు నడపడం, వంట, క్లీనింగ్, హెలికాప్టర్లను నడపటం వంటి పనులను కాంట్రాక్టర్లు చేసేవారు

ఈ 5 కంపెనీలు అధికంగా లాభపడ్డాయి

అఫ్గానిస్తాన్‌లో అన్ని రకాల సర్వీసుల కోసం అమెరికాతో పాటు ఇతర దేశాలకు చెందిన 100కు పైగా కంపెనీలతో యూఎస్ రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందం చేసుకుంది. ఇందులో కొన్ని కంపెనీలు వందల కోట్ల డాలర్లు అందుకున్నాయి.

'20 ఇయర్స్ ఆఫ్ వార్' ప్రాజెక్టు డైరెక్టర్‌, ప్రొఫెసర్ హైడీ పెల్టియర్ కూడా 'కాస్ట్ ఆఫ్ వార్' ప్రాజెక్టులో భాగమే.

ఈ ఒప్పందాల ద్వారా ఏయే కంపెనీలు అత్యధికంగా లాభపడ్డాయో చెప్పేందుకు అధికారిక డేటా లేదని బీబీసీ ముండోతో హైడీ చెప్పారు.

కానీ ఆయన మిగతా ప్రాజెక్టు వివరాలను బీబీసీకి అందజేశారు. ఈ వివరాలను ఇంకా బీబీసీ ప్రచురించలేదు.

అమెరికా ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ ఆధారంగా ఈ ప్రాజెక్టు వివరాలను తయారు చేశారు. ఈ డేటా, అమెరికా ప్రభుత్వ ఖర్చుల్ని అధికారికంగా తెలుపుతుంది. దీన్ని 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత తయారు చేశారు.

''2008-2021 కాలానికి ఈ గణాంకాలు అందజేశారు. కొన్ని ప్రాజెక్టులు 2008 కన్నా ముందే ఉన్నాయి. కాబట్టి మనం 2001 నాటి గణాంకాలను పరిశీలిస్తే, వాస్తవ లెక్కలు మరింత ఎక్కువగా ఉండొచ్చు'' అని హైడీ అన్నారు.

ఈ అంచనాల ప్రకారం, అఫ్గానిస్తాన్‌లో ముగ్గురు అమెరికా కాంట్రాక్టర్లు తొలి మూడు స్థానాల్లో నిలిచారు. వారు డైన్‌కార్ప్, ఫ్లూయర్, కెల్లాగ్ బ్రౌన్ అండ్ రూట్ (కేబీఆర్).

'లాజిస్టిక్స్ ఇంక్రీజ్ ప్రోగ్రామ్ విత్ సివిలియన్ పర్సనల్స్'(ఎల్ఓజీసీఏపీ- లాగ్‌క్యాప్స్)లో భాగంగా ఈ కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి.

''లాగ్‌క్యాప్స్ అనేవి సమగ్రమైన బహుళ సంవత్సరాలకు సంబంధించిన ఒప్పందాలు. ఇవి లాజిస్టిక్స్, మేనేజ్‌మెంట్, రవాణా, పరికరాలు, ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటనెన్స్, సపోర్ట్ తదితర రంగాల్లో సేవలను అందిస్తాయి' అని హైడీ వివరించారు.

అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్‌కి బాడీగార్డులను డైన్‌కార్ప్ కంపెనీ ఏర్పాటు చేసింది.

డైన్‌కార్ప్

అఫ్గానిస్తాన్ పోలీస్‌లతో పాటు మాదక ద్రవ్య నిరోధక బలగాలకు శిక్షణతో పాటు పరికరాలను అందజేయడం డైన్‌కార్ప్ నిర్వహించే అనేక విధుల్లో ఒకటి. అఫ్గాన్ అధ్యక్షుడిగా హమీద్ కర్జాయ్ ఉన్న సమయంలో ఆయనకు బాడీగార్డులను కూడా ఈ కంపెనీయే నియమించింది.

హైడీ లెక్కల ప్రకారం, డైన్‌కార్ప్ కంపెనీ 1440 కోట్ల డాలర్ల (సుమారు రూ. 10,06,310 కోట్లు) విలువైన ఒప్పందాలను అందుకుంది. ఇందులో లాగ్‌క్యాప్స్ ద్వారా 750 కోట్ల డాలర్లు (రూ. 55,351 కోట్లు) అందాయి.

అమెంటమ్ కన్సార్టియం ఇటీవలే డైన్‌కార్ప్ కంపెనీకి గుర్తింపునిచ్చింది.

''2002 నుంచి డైన్‌కార్ప్ ఇంటర్నేషనల్, అఫ్గానిస్తాన్‌లో గవర్నమెంట్ క్లయింట్స్‌తో పాటు వారి భాగస్వాములతో ఏకకాలంలో పనిచేస్తోంది'' అని డైన్‌కార్ప్ కార్యకలాపాల గురించి బీబీసీ ముండోకు ఆ సంస్థ అధికార ప్రతినిధి చెప్పారు.

తమది ఒక ప్రైవేట్ కంపెనీ అయినందున తమ కాంట్రాక్టుల వివరాలు, ఇతర ఆర్థిక లావాదేవీలను బహిరంగంగా చెప్పలేమని ఆయన అన్నారు.

ఫ్లూయర్ కార్పొరేషన్

ఫ్లూయర్ టెక్సాస్‌కు చెందిన కంపెనీ. ఇది దక్షిణ అఫ్గానిస్తాన్‌లో అమెరికా మిలిటరీ స్థావరాల నిర్మాణాన్ని పర్యవేక్షించింది.

ఆ కంపెనీ వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం, ఇది అఫ్గానిస్తాన్‌లో మరో 76 పార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ (చిన్న సైనిక స్థావరాలను)లను నిర్వహించింది. లక్ష మంది సైనికులకు సహాయంగా నిలిచింది. రోజుకు లక్షా 91వేల మందికి పైగా సైనికులకు ఆహారాన్ని అందించింది.

ఫ్లూయర్ కార్పొరేషన్ 13.5 బిలియన్ డాలర్ల (రూ. 99,632 కోట్లు) ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు హైడీ చెప్పారు. ఇందులో 12.6 బిలియన్ డాలర్లు (రూ. 93,000 కోట్లు) లాగ్‌క్యాప్స్ ద్వారా అందాయి.

అఫ్గానిస్తాన్ యుద్ధంలో ఫ్లూయర్ కంపెనీ కార్యకలాపాల గురించి చెప్పాల్సిందిగా బీబీసీ ముండో ఆ కంపెనీ యాజమాన్యాన్ని కోరింది. కానీ ఈ వార్త ప్రచురణ అయ్యే సమయానికి కూడా వారు ఈ అంశంపై స్పందించలేదు.

ఫ్లూయర్, టెక్సాస్‌కు చెందిన కంపెనీ. అది దక్షిణ అఫ్గానిస్తాన్‌లో అమెరికా మిలిటరీ స్థావరాల నిర్మాణాన్ని పర్యవేక్షించింది.

కేబీఆర్

అమెరికా బలగాలకు సహాయకంగా ఇంజనీరింగ్, లాజిస్టికల్ అంశాలను కెల్లాగ్ బ్రౌన్ రూట్ (కేబీఆర్) కంపెనీ పర్యవేక్షించింది. సైనిక బలగాలకు తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేయడం, ఆహారం అందించడం, ఇతర కనీస అవసరాలను చూసుకోవడం లాంటి పనులు ఈ కంపెనీ ఆధ్వర్యంలో జరిగాయి.

నాటో విమానదాడుల కోసం ఈ కంపెనీ అఫ్గానిస్తాన్‌లోని చాలా విమానాశ్రయాలకు గ్రౌండ్ లెవల్ సపోర్ట్‌ను అందించింది. రన్‌ వేల నిర్వహణ, ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్, ఏరోనాటికల్ కమ్యూనికేషన్స్ వంటి అంశాల్లో సహాయపడింది.

హైడీ అంచనా ప్రకారం కేబీఆర్ కంపెనీ, అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖతో 3.6 బిలియన్ డాలర్ల (రూ. 26, 569 కోట్లు) ఒప్పందం కుదుర్చుకుంది.

''లాగ్‌క్యాప్ ప్రోగామ్ కింద, 2002 నుంచి 2010 వరకు అఫ్గానిస్తాన్‌లో అమెరికా బలగాలకు కేబీఆర్ మద్దతుగా నిలిచింది. 2001లో మేం ఈ కాంట్రాక్టును గెలుచుకున్నాం'' అని కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు బీబీసీ ముండోతో చెప్పారు.

''ఈ కార్యక్రమంలో భాగంగా 82 అమెరికా మిలిటరీ స్థావరాలకు కేబీఆర్ కంపెనీ ఆహారం, విద్యుత్, లాండ్రీ, క్లీనింగ్, మెయింటనెన్స్ సర్వీసులను అందించింది'' అని ఆయన చెప్పారు. యూఎస్ మిలిటరీ ఈ కాంట్రాక్టును 2009 జూలైలో డైన్‌కార్ప్, ఫ్లూయర్ కంపెనీలకు సంయుక్తంగా కట్టబెట్టింది. దీంతో 2010లో కేబీఆర్ ఈ బాధ్యతల నుంచి తప్పుకుంది.

రెథియాన్

అత్యధిక మొత్తంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్న నాలుగో కంపెనీ రేథియాన్.

అమెరికాలోని అతిపెద్ద ఏరోస్పేస్, డిఫెన్స్ కంపెనీలలో ఇది ఒకటి. అఫ్గానిస్తాన్‌లో సర్వీస్‌ల కోసం ఈ కంపెనీ 2.5 బిలియన్ డాలర్ల (రూ. 18, 453 కోట్లు) ఒప్పందం చేసుకుంది.

అఫ్గానిస్తాన్ వైమానిక దళానికి శిక్షణ ఇవ్వడం కోసం ఇది 14 కోట్ల డాలర్ల (రూ. 1,033 కోట్లు)కు 2020లో తాజాగా మరో ఒప్పందం కుదుర్చుకుంది.

ఏజీస్ ఎల్‌ఎల్‌సీ

వర్జీనియాకు చెందిన ఏజీస్ ఎల్‌ఎల్‌సీ అనేది సెక్యూరిటీ-ఇంటెలిజెన్స్ కంపెనీ. అఫ్గానిస్తాన్‌లో సర్వీసులు అందించేందుకు అత్యధిక మొత్తం తీసుకున్న ఐదో కంపెనీ ఇది. 1.2 బిలియన్ డాలర్ల (రూ. 8,857 కోట్లు) ఒప్పందం చేసుకుంది.

కాబుల్‌లోని అమెరికా రాయబార కార్యాలయానికి ఇది భద్రతను అందించింది.

అఫ్గానిస్తాన్‌లో ఏజీస్ కంపెనీ కార్యకలాపాల గురించి చెప్పాల్సిందిగా బీబీసీ ముండో ఆ కంపెనీ యాజమాన్యాన్ని కోరింది. కానీ వారు ఈ అంశంపై స్పందించలేదు.

రక్షణ శాఖ కంపెనీలకు కూడా లబ్ధి చేకూరిందా?

బీబీసీ ముండో, నిపుణులతో మాట్లాడగా వారు ఈ ఒప్పందాల ద్వారా అమెరికా రక్షణ శాఖ కాంట్రాక్టర్లు కూడా లబ్ధి పొందారని అంగీకరించారు. అఫ్గానిస్తాన్‌లో యుద్ధం కారణంగా అమెరికా డిఫెన్స్ కాంట్రాక్టర్లు.. బోయింగ్, రేథియాన్, లాక్‌హీడ్ మార్టిన్, జనరల్ డైనమిక్స్, నార్త్‌రోప్ గ్రూమన్‌లు భారీగా లబ్ధి పొందినట్లు వారు చెప్పారు.

''యుద్ధం వల్ల వారు చాలా డబ్బు సంపాదించారు'' అని లిండా పేర్కొన్నారు.

ఈ ఒప్పందాలు, అఫ్గానిస్తాన్‌లో జరుగుతోన్న యుద్ధ కార్యక్రమాలతో నేరుగా ముడిపడి లేనందున వారు వీటి ద్వారా ఎంత మొత్తంలో లాభపడ్డారో చెప్పడం చాలా కష్టం.

ఈ వారం విడుదలైన 'కాస్ట్ ఆఫ్ వార్' నివేదిక ప్రకారం, ఈ ఐదు కంపెనీలు 9/11 తర్వాత యూఎస్ మిలిటరీ ద్వారా అత్యధికంగా ప్రయోజనం పొందినట్లు తెలుస్తోంది.

''2001-2021 ఆర్థిక సంవత్సరాల మధ్య ఈ ఐదు కంపెనీలు 2.1 ట్రిలియన్ డాలర్ల (2021లో డాలర్ విలువ ప్రకారం లెక్కించినప్పుడు -రూ. 155 లక్షల కోట్లు) విలువైన ఒప్పందాలను అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖతో చేసుకున్నట్లు'' నివేదికలో వెల్లడైంది.

లాక్‌హీడ్ మార్టిన్ కంపెనీ, బ్లాక్‌హాక్ హెలికాప్టర్లను తయారు చేస్తుంది.

అఫ్గానిస్తాన్ యుద్ధం వారి వ్యాపారాలను, కాంట్రాక్టులను ఎలా ప్రభావితం చేసింది అని ఈ ఐదు కంపెనీలను బీబీసీ ముండో అడిగింది.

జనరల్ డైనమిక్స్ దీనిపై మాట్లాడటానికి నిరాకరించింది. మిగతా కంపెనీలు కూడా ఈ వార్త ప్రచురించే వరకు కూడా స్పందించలేదు.

రేథియాన్ కంపెనీ 2.5 బిలియన్ డాలర్ల (రూ. 18, 453 కోట్లు)కు పైగా ఆర్జించినట్లు హైడీ ఉదహరించారు.

''ఒకవేళ రేథియాన్... అమెరికాలో తయారై, ఆఫ్గానిస్తాన్‌లో ఉపయోగించే ఆయుధాలు, కమ్యూనికేషన్ వ్యవస్థ కోసం ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లయితే, దాన్ని అఫ్గానిస్తాన్ లింక్ట్ కాంట్రాక్టుగా పిలవరాదు'' అని హైడీ అన్నారు.

బోయింగ్ కూడా ఎఫ్-15, ఎఫ్-18 అనే యుద్ధ విమానాలను తయారు చేస్తుంది. కానీ అది ప్రధాన కాంట్రాక్టర్ల జాబితాలో కనిపించదు.

అలాగే, బ్లాక్‌హాక్ హెలికాప్టర్లను తయారు చేసే లాక్‌హీడ్ మార్టిన్ కూడా ఈ జాబితాలో ఉండదు.

''జనరల్ డైనమిక్స్ విషయానికొస్తే, వారు ఎక్కువగా తేలికపాటి సైనిక విమానాలను తయారు చేశారు. అఫ్గానిస్తాన్‌లో సైబర్ సెక్యూరిటీ అంశంలో విశేషంగా సేవలు అందించారు'' అని లిండా చెప్పారు.

అఫ్గానిస్తాన్‌లో సర్వీసుల పేరిట ఈ ఐదు కంపెనీలు ఎంత ఆర్జించాయో చెప్పడం కష్టమేనని బీబీసీ ముండో అడిగిన ప్రశ్నకు పెంటగాన్ అధికార ప్రతినిధి జెస్సికా మ్యాక్స్‌వెల్ సమాధానమిచ్చారు.

''దాన్ని అంచనా వేయడం అసాధ్యం. రక్షణ శాఖ, ఈ కంపెనీల నుంచి విభిన్న ఉత్పత్తులు, సేవల్ని పొందింది. కానీ అవి కేవలం అఫ్గానిస్తాన్ కోసమే కాదు. ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాల కోసం వాటిని కొనుగోలు చేశారు. వాటిలో కొన్నింటిని అఫ్గానిస్తాన్ కోసం ఉపయోగించారు'' అని ఆమె వివరించారు.

బోయింగ్, ఎఫ్-15, ఎఫ్-18 యుద్ధ విమానాలను తయారు చేస్తుంది.

ధరలపై గుత్తాధిపత్యం

అఫ్గాన్ యుద్ధంలో సేవలు అందించేందుకు ధరల విషయంలో కంపెనీలు ఏకపక్షంగా ఉన్నాయని లిండా అన్నారు.

''చాలా కాంట్రాక్టులు ఎలాంటి పోటీ లేకుండానే కంపెనీలకు దక్కాయి. కొన్ని కాంట్రాక్టులకు మాత్రం చాలా స్వల్ప పోటీ ఎదురైంది. ఇలాంటి సేవలు అందించే కంపెనీల సంఖ్య తక్కువగా ఉండటంతో కంపెనీలు ధరల విషయంలో గుత్తాధిపత్యం చెలాయిస్తాయి'' అని ఆమె వ్యాఖ్యానించారు.

చాలా సందర్భాల్లో కంపెనీలు ధరలను పెంచుతాయని లిండా అన్నారు. పేలవమైన భద్రతా పరిస్థితులు, ఆ ప్రాంతాలకు చేరుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందులను చూపుతూ అవి ధరలను పెంచుతాయని ఉదహరించారు.

''వీలైనంత మేరకు పోటీ ప్రాతిపదికన కాంట్రాక్టులు ఇవ్వాలనేది రక్షణ శాఖ పాలసీ. కానీ చాలా ఆయుధ తయారీ వ్యవస్థలకు అవి అభివృద్ధి దశలో ఉన్న సమయంలోనే టెండర్లను ఆహ్వానించారు '' అని రక్షణ శాఖ అధికార ప్రతినిధి చెప్పారు.

ఇందులో అవినీతి జరిగిందని లిండా అన్నారు. ''ఒక గోడకు పేయిటింగ్ వేయడానికి 20 రెట్లు అధిక ధర తీసుకోవడం వేరే విషయం. కానీ డబ్బు తీసుకొని అసలు పేయిటింగ్ చేయకపోవడం అవినీతి కిందకు వస్తుంది. అక్కడ పెయింటింగ్ జరగలేదు కానీ డబ్బు మాత్రం చేతులు మారింది'' అని లిండా వివరించారు.

తేలికపాటి సైనిక వాహనాలను జనరల్ డైనమిక్స్ తయారు చేస్తుంది

అదే సమయంలో అఫ్గానిస్తాన్‌లో సబ్ కాంట్రాక్టర్లు కూడా పుట్టుకొచ్చారని ఆమె అన్నారు. ప్రభుత్వం నుంచి కాంట్రాక్టు పొందిన కాంట్రాక్టర్లు, ఆ పనిని సబ్ కాంట్రాక్టర్లతో పూర్తి చేపించినట్లు చెప్పారు.

సబ్ కాంట్రాక్టర్లు ఎంత డబ్బు తీసుకున్నారో తెలిసే అవకాశం లేదని లిండా అన్నారు.

అవినీతి ఆరోపణలపై స్పందిస్తూ మ్యాక్స్‌వెల్ 'మోసం, దుర్వినియోగం, అవినీతికి సంబంధించిన ఎలాంటి ఆధారాన్నైనా డిఫెన్స్ జనరల్ ఇన్‌స్పెక్టర్‌కు నివేదించాలని'' అన్నారు.

అఫ్గానిస్తాన్ యుద్ధం వల్ల కేవలం ఒకే కంపెనీ ప్రయోజనం పొందలేదని, చాలా కంపెనీలకు లబ్ధి చేకూరిందని లిండా అన్నారు. రక్షణ శాఖ పరికరాలు, లాజిస్టిక్స్ కంపెనీలు, కన్‌స్ట్రక్షన్ కంపెనీలు, ఇంధన సరఫరాదారులు దీని వల్ల లాభపడ్డారని ఆమె తెలిపారు.

అఫ్గానిస్తాన్ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో జరిగిన అవకతవకల్లో, 2008 -2017 మధ్య కాలంలో అమెరికా దాదాపు 15.5 బిలియన్ డాలర్ల (రూ. 1, 14, 430 కోట్లు) ను నష్టపోయింది అని జనరల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయం వెల్లడించినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.

source: bbc.com/telugu

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: BBC Telugu
Top