Saturday, 28 Mar, 5.27 pm BBC తెలుగు

కరోనా వైరస్
కరోనాపై పోరాటానికి సన్నకారు రైతు పెద్ద సాయం - ప్రెస్ రివ్యూ

ntnews రైతు హన్మాండ్లు

తెలంగాణలో ఒక సాధారణ రైతు తన పంటను అమ్మితే వచ్చిన డబ్బంతా కరోనాపై పోరాటం కోసం విరాళంగా ఇచ్చారంటూ 'నమస్తేతెలంగాణ' కథనం ప్రచురించింది.

''ఆదిలాబాద్‌ జిల్లాలోని లాండసాగ్వీ గ్రామానికి చెందిన సాధారణ రైతు... మోర హన్మండ్లు. ఈయనకు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. భార్య, ఇద్దరు కొడుకులతో కలిసి సేద్యం చేస్తున్నాడు.

కరోనా లాక్‌డౌన్‌ గురించి ఎన్నో కథలు విన్నాడు. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోవడంతో రోజువారీ కూలీలు, పేదలు పడుతున్న ఇబ్బందులూ తెలుసుకున్నాడు. వీరి కోసం ఏదైనా చేయాలనుకున్నాడు. కానీ ఏం చేయగలడు? రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం. పంట డబ్బే జీవనాధారం.

ఈసారి తన పొలంలో సోయాబీన్‌, శనగ పంటలు వేశాడు. కాలం కలిసొచ్చింది. మంచి దిగుబడే వచ్చింది. పంట అమ్మితే వచ్చిన డబ్బులో పెట్టుబడి సొమ్ము తీసేశాడు. ఎక్కడ తెచ్చిన డబ్బు అక్కడ ఇచ్చేశాడు. అన్నీపోగా 50 వేల రూపాయలు మిగిలాయి. ఆ డబ్బు బ్యాంకులో ఉంది. ఆ సొమ్మును విరాళంగా ఇవ్వాలనుకున్నాడు.

కానీ నిర్ణయం తన ఒక్కనిదే కాదుగా. భార్యా పిల్లలున్నారు. వారి పరిస్థితి ఏంటి? వారి కోసమే కదా కష్టపడి సంపాదించింది. అందుకే పిల్లలను అడగాలనుకున్నాడు. వారేమంటారో అని సందేహించాడు.

కానీ బిడ్డల్లో ప్రవహిస్తున్నది కూడా ఆ తండ్రి రక్తమే కదా. సంతోషంగా ఒప్పుకున్నారు.

అనుకున్నదే తడవుగా రూ.50 వేల చెక్కును తన కొడుకులతో కలిసి కలెక్టర్‌ శ్రీదేవసేన, ఎస్పీ విష్ణువారియర్‌లకు అందజేశాడు హన్మండ్లు'' అని ఆ కథనంలో తెలిపారు

BBC
BBC
BBC
BBC మహిళా రైతు (పాత చిత్రం)

పంటలను పొలం దాటనివ్వని కరోనా

పొలాల్లో వేసిన పంటలు కోతకొచ్చిన సమయంలో కరోనా భయంతో కూలీలు దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారని 'ఆంధ్రజ్యోతి' కథనం తెలిపింది.

''ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వెయ్యి హెక్టార్లలో సాగు చేసిన బొప్పాయి పంట పూర్తిగా చేతికొచ్చింది. కానీ, కోసేందుకు కూలీలు రాక, కోసినా రవాణా చేసే వీలులేక.. కాసిన పంటంతా కుళ్లిపోతోంది.

మరోవైపు సుమారు లక్ష హెక్టార్లలో సాగుచేసిన వరి కూడా కోత దశలో ఉంది. కొందరు రైతులు యంత్రాలతో పంటను కోస్తు న్నా.. ధాన్యాన్ని బస్తాల్లో నింపి ఇళ్లకు తరలించేందుకు కూలీ లు రావడంలేదు. మిర్చి రైతులు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మొక్కజొన్న, చెరకు, జామ, పెసర, కంది పంటలు కూడా కోత దశకు రావడం, వీటిపై లాక్‌డౌన్‌ ప్రభా వం పడటంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మిర్చిని కోసేందుకు మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్‌ నుంచి వచ్చిన కూలీలు కరోనా భయంతో స్వరాష్ట్రానికి వెళ్లిపోయారు.

కామారెడ్డి జిల్లాల్లో వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో పనిచేయటానికి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి రావాల్సిన కూలీలు ఇప్పటివరకు రాలేదు.

సిద్దిపేట జిల్లాలో మొక్కజొన్న కోసేందుకు, కూరగాయలు తెంపేందుకు స్థానిక వ్యవసాయ కూలీలెవరూ రావటంలేదు.

నల్లగొండ జిల్లాలో తమిళనాడు నుంచి వరికోత యంత్రాలు వచ్చి కోస్తాయి. కరోనా నేపథ్యంలో గ్రామాల సరిహద్దుల్లో కంచెలు వేసి హార్వెస్టర్లను రానివ్వడంలేదు.

వాస్తవానికి పంటపొలాల్లో కూలీలు ఎవరికివారు సహజదూరం పాటిస్తూనే పంటలు కోయడం, కలుపులు తీయడం లాంటివి చేస్తుంటారు. ఈ దిశగా వారికి మరింత అవగాహన కల్పించి ఇంకొన్ని చర్యలు తీసుకుంటే వ్యవసాయ పనులు సాధ్యమవుతాయని రైతులు అంటున్నారు.

అవసరమైతే కూలీలకు మాస్కులు, శానిటైజర్లు వంటి వాటిని అందించి.. పంట లు కోసేలా చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నా య మార్గాల ద్వారా రైతులను ఆదుకోవాలని కోరుతూ ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.

మరోవైపు లాక్‌డౌన్‌ నిబంధనల నుంచి వ్యవసాయ సంబంధ పనులకు కేంద్రం మినహాయింపునిచ్చింది. పంటల కోత పనులు, మార్కెట్‌ యార్డులు, పంట సేకరణ సంస్థలు, వ్యవసాయ యంత్రాల అద్దె కేంద్రాలను తెరిచేందుకు, పంట ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు అనుమతినిస్తున్నట్లు పేర్కొంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

వ్యవయసాయ కూలీలు, ఎరువులు, పురుగుమందులు, విత్తనాత తయారీ యూనిట్లలో పనిచేసే వారికీ మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింద''ని ఆ కథనంలో వివరించారు.

సద్దుమణిగిన ఆంధ్ర, తెలంగాణ బోర్డర్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల కృష్ణానది వారధి వద్ద శుక్రవారం ప్రశాంత వాతావరణం నెలకొందని 'సాక్షి' కథనం తెలిపింది.

''కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో హెల్త్‌ ప్రొటోకాల్‌ను విస్మరించి తెలంగాణ నుంచి ఆంధ్రలోకి వచ్చేందుకు యత్నించిన వారిని పోలీసులు అడ్డుకోవటంతో రాళ్ల దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.

దీంతో వారధి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. సరిహద్దులోని కృష్ణా నది వారధి వద్ద పోలీస్‌ అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. గురువారం రాత్రి ఆందోళనకారులు పోలీసులపై దాడి చేసిన తర్వాత శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు శ్రమించారు.

వారధిపై ఆగి ఉన్న సుమారు 500కు పైగా ద్విచక్ర వాహనదారుల నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. ఆ తర్వాత వారందరికీ నచ్చజెప్పి తెలంగాణ వైపునకు పంపించారు. శుక్రవారం ఉదయం కృష్ణా నది వారధిపై నుంచి వాహనాలు, ప్రయాణికులు రాకపోకలు సాగించకుండా కంచె ఏర్పాటు చేశారు.

వారధి ప్రారంభంలో ఒక బెటాలియన్, వారధి మధ్యలో మరో బెటాలియన్‌ బలగాలు మోహరించగా, వారధి ఆ చివర తెలంగాణ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పాల వ్యాన్లు, కూరగాయల వాహనాలు, మెడికల్‌కు సంబంధించిన వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి.. ఇటు ఆంధ్ర, అటు తెలంగాణలోకి అనుమతించారు.

ఏఎస్పీ, డీఎస్పీ అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించారు. పూర్తి స్థాయిలో పరిస్థితి అదుపులోకి రావటంతో ప్రభుత్వ యంత్రాంగం ఊపిరి పీల్చుకుంద''ని ఆ కథనంలో తెలిపారు.

https://www.youtube.com/watch?v=HD-xEFd3Gv8

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

BBC
BBC

source: bbc.com/telugu

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: BBC Telugu
Top