Wednesday, 05 Aug, 8.18 am BBC తెలుగు

హోమ్
కరోనావైరస్ వ్యాక్సిన్: వాటర్ బాటిల్ కంటే తక్కువ ధరకే - ప్రెస్‌రివ్యూ

నీళ్ల సీసా కంటే తక్కువ ధరలోనే కరోనావైరస్ టీకా తీసుకొస్తామని భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా తెలిపారని 'ఈనాడు' కథనం రాసింది.

''ప్రపంచం మొత్తానికీ ఒకే నాణ్యతతో టీకా అందిస్తామని.. భారత్‌లో పంపిణీ చేసేవి, విదేశాలకు ఎగుమతి చేసేవి ఒకే నాణ్యతతో ఉంటాయని కృష్ణ ఎల్లా చెప్పారు.

కరోనా టీకా అభివృద్ధి క్రతువును పరిశీలించేందుకు గాను మంగళవారం తెలంగాణ మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లోని జినోమ్ వ్యాలీని సందర్శించారు. అక్కడ 'వ్యాక్సిన్ కోసం పోటీలో సైన్స్, అత్యవసరం, సమతుల్యత' అంశంపై నిర్వహించిన చర్చాగోష్ఠిలో పాల్గొన్నారు.

ఈ చర్చలో భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా, బయోలాజికల్-ఇ లిమిటెడ్ ఎండీ మహిమ దాట్ల, ఐఐఎల్ ఎండీ ఆనంద్, డబ్ల్యూహెచ్‌వో ముఖ్య శాస్త్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ తదితరులు పాల్గొన్నారు. ఈ చర్చలో మాట్లాడిన కృష్ణ ఎల్లా వాటర్ బాటిల్ కంటే తక్కువ ధరలోనే టీకీ తీసుకొస్తామని వెల్లడించార''ని ఆ కథనంలో పేర్కొన్నారు.

రాజధాని తరలింపు వద్దు

ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల వ్యవహారంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిందని 'ఆంధ్రజ్యోతి' వార్తాకథనం వెల్లడించింది.

''ప్రభుత్వ కార్యాలయాల తరలింపు విషయంలో యథాతథ స్థితి (స్టేట్‌సకో) పాటించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అ

దే విధంగా రాజధాని తరలింపునకు సంబంధించిన పిటిషన్లన్నిటినీ ప్రస్తుత పిటిషన్లతో జత చేయాలని రిజిస్ట్రీని నిర్దేశించింది.

స్టేటస్‌ కో పాటించాలంటూ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది.

పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దుకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం గత నెల 31వ తేదీన జారీ చేసిన నోటిఫికేషన్లు, ఉత్తర్వులు, చట్టాలు, అంతకు ముందు అన్ని ప్రాంతాల అభివృద్ధిపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక, దాని పరిశీలనకు నియమించిన ఉన్నతస్థాయి కమిటీ ఇచ్చిన నివేదికలను రాజ్యాంగ విరుద్ధమైనవని పేర్కొంటూ రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి ధనేకుల రామారావు బృందం, టి.శ్రీనివాసరావు, డి.సాంబశివరావు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

రాజభవన్‌, ముఖ్యమంత్రి కార్యాలయం, సచివాలయం, డీజీపీ కార్యాలయం, ప్రభుత్వ శాఖాధిపతుల కార్యాలయాలను తరలించరాదని వారు అభ్యర్థించారు.

ఈ నాలుగు పిటిషన్లపై మంగళవారం త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణ జరిగింద''ని ఆ కథనంలో వివరించారు.

ఇక నటించనందుకు సంతోషం: కాంగ్రెస్‌పై అసదుద్దీన్ ఒవైసీ సెటైర్

అయోధ్యలో రామమందిర నిర్మాణ అంశంపై కాంగ్రెస్‌ నటించనందుకు సంతోషమని ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఎద్దేవా చేశారని 'సాక్షి' కథనం తెలిపింది.

''అయోధ్య అంశంపై కాంగ్రెస్‌ పార్టీ వైఖరికి సంకేతంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ మంగళవారం చేసిన ట్వీట్‌పై ఒవైసీ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు.

కాంగ్రెస్‌ హిందూత్వ భావజాలాన్ని స్వీకరించాలనుకుంటే ఫర్వాలేదని, కానీ, జాతీయ ఐక్యత, సాంస్కృతిక సమ్మేళనం, సోదరభావం లాంటి వ్యాఖ్యలెందుకని దుయ్యబట్టారు.

చరిత్రాత్మక బాబ్రీ మసీదు కూల్చివేతకు కాంగ్రెస్‌ చేసిన కృషికి సిగ్గుపడవద్దు....గర్వపడమని ఎద్దేవా చేశారు.

ఇప్పటికే అయోధ్య రామమందిర నిర్మాణ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిద్ధమవడంపై ఒవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఒక వర్గానికి చెందిన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మోదీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. లౌకిక సూత్రానికి కట్టుబడి విధులు నిర్వర్తిస్తానంటూ రాజ్యాంగంపై ప్రమాణంచేసి దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారని, ఇప్పుడు ఆ ప్రమాణాన్ని ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డార''ని ఆ కథనంలో తెలిపారు.

పీహెచ్‌సీల్లోనూ కరోనా చికిత్స

కరోనాకు అందించే వైద్యాన్ని వికేంద్రీకరించామని, గతంలో హైదరాబాద్‌లో కొన్ని దవాఖానల్లో అందించే చికిత్సను ఇప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) స్థాయికి చేర్చామని.. పెద్ద దవాఖానలు లేదా కార్పొరేట్‌ హాస్పిటళ్ల వెంట పరుగులు పెట్టాల్సిన అవసరం లేదని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారని 'నమస్తే తెలంగాణ' కథనం తెలిపింది.

''మంత్రి ఈటల రాజేందర్‌.. డీఎంఈ రమేశ్‌రెడ్డి, డీహెచ్‌ శ్రీనివాసరావుతో కలిసి మంగళవారం కోఠిలోని కొవిడ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో మీడియాతో మాట్లాడారు. కరోనా లక్షణాలు ఉంటే దగ్గర్లోని పీహెచ్‌సీకి వెళ్లాలని, అక్కడ వారిని పరిశీలించి అవసరమైతే వారిని పై స్థాయి దవాఖానకు రెఫర్‌ చేస్తారని చెప్పారు. హోం ఐసొలేషన్‌ సరిపోతుందా? లేక దవాఖానకు వెళ్లాలా? అన్నది నిర్ణయించే అధికారం పీహెచ్‌సీలకే ఇచ్చినట్లు తెలిపారు.

నాలుగైదు నెలల కింద ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. కరోనా చికిత్సా విధానంపై సోమవారం ప్రపంచస్థాయి వైద్య నిపుణులతో చర్చించామని, రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి చికిత్స అందించాలో గత రెండురోజుల్లో అన్ని జిల్లాల వైద్యాధికారులకు వివరించామని తెలిపార''ని అందులో పేర్కొన్నారు.

source: bbc.com/telugu

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: BBC Telugu
Top