Sunday, 09 May, 10.04 pm BBC తెలుగు

హోమ్
కోవిడ్ వ్యాక్సీన్ పేటెంట్ వివాదం ఏంటి... ఈ హక్కులు తొలగిస్తే టీకా అందరికీ అందుతుందా?

Reuters కోవిడ్ వ్యాక్సీన్ పేటెంట్లను వదులుకోవాలనే ప్రతిపాదనను జర్మనీ వ్యతిరేకించింది

"ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండేంత వరకూ అందరూ సురక్షితంగా లేనట్లే." కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఈ ఒక్క విషయాన్ని ప్రపంచ నాయకులంతా ముక్తకంఠంతో ఏకీభవిస్తున్నారు.

కానీ, అభివృద్ధి చెందిన దేశాల్లో, పేద దేశాల్లో వ్యాక్సీన్ ధరల్లో నెలకొన్న భారీ వ్యత్యాసాల నడుమ వాటి ఉత్పత్తిని పెంచే విషయంలో మాత్రం చాలా సతమతమవుతున్నారు.

వ్యాక్సీన్ల పై పేటెంట్లను నిర్మూలించేందుకు అమెరికా ఈ వారం మద్దతు ప్రకటించింది. కానీ, కొన్ని దేశాలు మాత్రం పేటెంట్ల తొలగింపు కాకుండా ఉత్తమమైన మార్గాలున్నాయని చెబుతూ వెనుకంజ వేస్తున్నాయి.

ఈ పేటెంట్ వివాదం ఏమిటి?

సాధారణంగా కొత్త ఔషధాలు, వ్యాక్సీన్ల లాంటివి కనిపెట్టినప్పుడు ఆ సంస్థలు లేదా కంపెనీలకు వాటి మీద మేధాపరమైన హక్కులు లభిస్తాయి. వారి అనుమతి లేకుండా, ఇతరులు వాటిని తయారు చేయడానికి వీలు లేదు.

అలా మేధాపరమైన హక్కు లేదా పేటెంట్ పొందిన కంపెనీలు మాత్రమే వాటిని మార్కెట్ అవసరాలకు తయారు చేసి విక్రయిస్తుంటాయి. ఇతర సంస్థలు వాటిని తయారు చేయాలంటే పేటెంట్ కలిగిన కంపెనీతో రాయల్టీ చెల్లించడానికి సంబంధించిన ఒప్పందాలు ఖరారు చేసుకోవాలి.

Reuters

అంటే, ఔషధాలను కనిపెట్టిన కంపెనీలకు పేటెంట్ హక్కులు ఉంటాయి కాబట్టి, వాటి మీద అవి ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించడానికి వీలవుతుంది.

ఈ పద్ధతులు కొత్త ఆవిష్కరణలు చేసేవారికి ప్రోత్సాహం అందిస్తాయి.

అయితే, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు అసాధారణమైనవి. అందుకని కోవిడ్ వ్యాక్సీన్, దానికి సంబంధించిన ఔషధాలపై పేటెంట్లను తొలగించమని భారతదేశం, దక్షిణ ఆఫ్రికా నేతృత్వంలో కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు గత ఏడాది ప్రపంచ వాణిజ్య సంస్థ (వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్)కు ప్రతిపాదన చేశాయి.

మహమ్మారి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మనుషుల ప్రాణాలను కాపాడగలిగే ఈ వ్యాక్సీన్లను అందరికీ సులభంగా అందుబాటులోకి తేవాలని, దాంతో వాటిని స్థానికంగా తయారు చేసుకునే వీలుంటుందని వాదించాయి.

సమస్య ఏమిటి?

అయితే, ఈ దేశాలు చేసిన ప్రతిపాదనలకు ఔషధ తయారీ సంస్థలు అభ్యంతరం తెలిపాయి. అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా అలా వీలు కాదన్నాయి.

వ్యాక్సీన్ల తయారీలో చాలా నిధులను పరిశోధన అభివృద్ధికి వినియోగించారు. దీని తయారీకి అయ్యే ఖర్చు పరిశోధనకు అయ్యే ఖర్చు కంటే తక్కువగానే ఉంటుంది.

పేటెంట్లను తొలగిస్తే ఆదాయానికి గండిపడి కొత్త ఆవిష్కరణలు తగ్గిపోతాయమోననే భయమే వీటి పట్ల ఉండే అభ్యంతరాలకు కారణం అని అంటారు.

EPA యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్

ఇదంతా డబ్బుతో ముడిపడి ఉందా?

ఈ పేటెంట్ల పై హక్కులను తొలగించడం కేవలం తాత్కాలికం. పేటెంట్ల తొలగింపు వల్ల ఆదాయం తగ్గిపోతుందనేది సమస్య కాదు.

ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ తయారీదారులు వ్యాక్సీన్ డోసులను ఒక ధరకు అమ్ముతున్నారు.

వ్యాక్సీన్ల పై పేటెంట్లను తొలగించడం వల్ల సమస్య పరిష్కారం అవ్వదని వ్యాక్సీన్ ఉత్పత్తిదారులు, తయారీ చేస్తున్న దేశాలు వాదిస్తున్నాయి.

పేటెంట్లను తొలగించడం అంటే వంటకంలో ఉండే పదార్ధాలు, చేసే విధానం వివరించకుండా వంటకాన్ని అందించినట్లు ఉంటుందని ఉత్పత్తిదారులు అంటున్నారు.

ఒక వ్యాక్సీన్ తయారీ బ్లూ ప్రింట్లో ఆచ్చాదన లేని ఎముకలను మాత్రమే పేటెంట్ కవర్ చేస్తుంది కానీ, దాని తయారీ విధానం మొత్తాన్ని కాదు. ఇదే ఇక్కడ కీలకమైన అంశం. కొత్త రకమైన ఎమ్‌ఆర్ఎన్ఏ తరహా ఫైజర్, మోడర్నా వ్యాక్సీన్ల తయారీ విధానం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.

వ్యాక్సీన్ తయారీ ప్రక్రియను అభివృద్ధి చేయడానికి ఒక దశాబ్ధ కాలం పడితే, ఉత్పత్తి ప్రక్రియను ఆమోదించటానికి మరో ఏడాది పడుతుంది అని ఫైజర్‌ భాగస్వామి అయిన జర్మనీ సంస్థ బయోఎన్‌టెక్ తెలిపింది.

వ్యాక్సీన్ తయారీకి కావల్సిన ముడి సరుకు లభ్యత కూడా మరొక ముఖ్యమైన సమస్య అని చెబుతున్నారు.

ఈ వ్యాక్సీన్ తయారీ సామర్థ్యం అందుబాటులో లేకుండా కేవలం పేటెంట్లను తొలగించడం వల్ల వ్యాక్సీన్ల నాణ్యత, సురక్షిత, సమర్ధత పై ప్రభావం పడుతుందని ఉత్పత్తి సంస్థలు భయపడుతున్నాయి. నకిలీ వ్యాక్సీన్లు తయారయ్యే అవకాశం ఉందని కూడా భయపడుతున్నారు. .

పేటెంట్ ఉల్లంఘించిన వారి పై చట్టబద్ధమైన చర్యలు తీసుకోమని ఇప్పటికే మోడర్నా ప్రకటించింది. కానీ, మిగిలిన వారెవరూ ఇటువంటి ప్రకటన చేయలేదు.

Reuters

దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి?

పేటెంట్ల తొలగింపు అంశం గురించి చర్చించేందుకు బ్రిటన్ సంసిద్ధత వ్యక్తం చేసింది. కానీ, వ్యాక్సీన్ సరఫరా వ్యవస్థను మెరుగుపర్చడం ద్వారా, ధనిక దేశాలు వ్యాక్సీన్ డోసులను అధికంగా ఎగుమతి చేయడం ద్వారా సమస్యను తాత్కాలికంగా పరిష్కరించవచ్చని గతంలో సూచించింది.

పేద దేశాలకు వ్యాక్సీన్ అందించేందుకు రూపొందించిన కోవాక్స్‌కు బ్రిటన్ అతి పెద్ద దాతగా ఉంది.

సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆఫ్ ఇండియా, ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా లాంటి సంస్థల మధ్య స్వచ్ఛంద లైసెన్సింగ్ విధానాన్ని కూడా బ్రిటన్ సమర్ధిస్తోంది.

అంతర్జాతీయ వాణిజ్య నియమాలను పర్యవేక్షించే ప్రపంచ వాణిజ్య సంస్థ (వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్) ఇలాంటి భాగస్వామ్యాలను ప్రోత్సహించాలని కోరుతోంది.

ఇలాంటి స్వచ్చంద లైసెన్సింగ్ విధానాలు మరింత ముందుకు వెళ్లేందుకు ప్రపంచ వాణిజ్య సంస్థ కూడా అనుమతిస్తుంది.

వ్యాక్సీన్ తయారీదారుల పై ప్రభుత్వాలు తప్పనిసరిగా లైసెన్సులు విధించవచ్చు. దాంతో, వారు వ్యాక్సీన్ పరిజ్ఞానాన్ని, తయారీ విధానాన్ని ఇతరులతో పంచుకోవచ్చు. కానీ, అలా చేసినందుకు సదరు ఉత్పత్తి సంస్థలకు తగిన పారితోషికం ఇవ్వవలసి ఉంటుంది.

Reuters

అమెరికా మనసెందుకు మార్చుకుంది?

వ్యాక్సీన్ ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు అమెరికా వాణిజ్య ప్రతినిధి కేథరిన్ టాయ్ వ్యాక్సీన్ ఉత్పత్తిదారులతో సమావేశాలు నిర్వహించిన తర్వాత అమెరికా పేటెంట్లను వదులుకునే ప్రతిపాదనకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటన చేసింది.

కానీ, ఈ చర్య వ్యాక్సీన్ ఉత్పత్తిదారులు స్వచ్చందంగా లేదా తక్కువ ధరకు, లైసెన్సింగ్ విధానంతో సహకరించడానికి ఒప్పించేందుకు అవలంబించిన కిటుకేమోనని కొంత మంది వాణిజ్య నిపుణులు భావిస్తున్నారు.

తర్వాత ఏమవుతుంది?

ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రపంచ వాణిజ్య సంస్థలో చర్చలు జరుగుతాయి.

అయితే, కీలకమైన దేశాల మద్దతు లేకుండా ఈ ప్రతిపాదనలు ముందుకు కదలవు. కానీ, వ్యాక్సీన్ ఉత్పత్తి పెంచేందుకు ఈ చర్చలు ఒక దారి చూపించవచ్చు.

కానీ, ఇది ఎప్పటికి జరుగుతుంది? ఎంత మొత్తంలో జరుగుతుందనేది కీలకమైన ప్రశ్న.

source: bbc.com/telugu

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: BBC Telugu
Top