Thursday, 04 Mar, 4.50 pm BBC తెలుగు

హోమ్
మహిళా క్రీడాకారులకు స్పోర్ట్స్ న్యూస్‌లో లభిస్తున్న ప్రాధాన్యం మూడింట ఒక వంతు కూడా లేదు - బీబీసీ పరిశోధన

BBC

భారతీయ పత్రికలలో ప్రచురించే క్రీడా వార్తల్లో క్రీడాకారిణులకు 30 కంటే తక్కువ శాతం ప్రాధాన్యం లభిస్తోందని బీబీసీ నిర్వహించిన ఒక పరిశోధన చెబుతోంది.

బీబీసీ అధ్యయనకారులు రెండు ప్రధాన జాతీయ ఆంగ్ల దిన పత్రికల నుంచి 2017 - 2020 మధ్య కాలంలో అచ్చయిన క్రీడల సమాచారాన్ని సేకరించి విశ్లేషించారు.

ఈ విశ్లేషణ ఆధారంగా ఫ్రంట్ పేజీలో ప్రచురితమయిన మహిళా క్రీడాకారిణులకు సంబంధించిన కథనాలు 1 శాతం కంటే తక్కువ ఉంటున్నట్లు పరిశోధకులు తెలిపారు.

BBC

భారతదేశంలో మహిళా క్రీడాకారిణులకున్న ప్రాముఖ్యం

2017లో క్రీడా రంగానికి సంబంధించిన 10 వార్తలు ప్రచురితమయితే అందులో మహిళా క్రీడాకారిణుల గురించి కేవలం ఒక వార్త మాత్రమే కనిపిస్తోంది. అయితే 2020 చివరి నాటికి ఈ పరిస్థితి మెరుగయిందని చెప్పుకోవచ్చు. కానీ, ఈ మార్పు స్థిరంగా లేదు.

ఆ ఏడాదిలో ప్రకటించిన ఒలింపిక్స్, కామన్ వెల్త్ గేమ్స్, టెన్నిస్ టౌర్నమెంట్స్, బ్యాడ్మింటన్ లీగ్‌ల వలన కూడా మహిళా క్రీడాకారిణులకి వార్తల్లో ఇచ్చే ప్రాముఖ్యత పెరగడానికి కొంత వరకు కారణమయింది. కోవిడ్ మహమ్మారి తలెత్తక ముందు టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్ గురించి తీవ్రమైన చర్చ జరిగింది. దాంతో, ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనే అర్హత ఉన్న క్రీడాకారులు, వారు సాధించిన కొత్త రికార్డుల గురించి వార్తల్లో కనిపించేవి.

2020 ప్రారంభంలో ఐసిసి విమెన్స్ టి 20 వరల్డ్ కప్‌లో భారతీయ జట్టు ఫైనల్స్ కి చేరడం కూడా మరో ఉదాహరణగా చెప్పవచ్చు.

టోర్నమెంట్ జరుగుతున్నంత సేపూ షఫాలి వర్మ తన అసాధారణ బ్యాటింగ్ చేయడం వలన కూడా ఈ ప్రచారానికి కీలకాంశంగా నిలిచింది.

ఆ టోర్నమెంట్ జరుగుతున్నంత సేపు 'షఫాలి వర్మ ఎవరు', 'స్ఫూర్తి నిస్తున్న షఫాలి వర్మ' అనే హెడ్‌లైన్‌లతో పత్రికలు వార్తలు ప్రచురించాయి.

BBC

ఏ క్రీడలకు అధిక ప్రాధాన్యం లభిస్తోంది?

మహిళా క్రీడాకారిణులకు సంబంధించినంతవరకు వార్తల్లో కనిపించడానికి టెన్నిస్‌కి అధిక ప్రాధాన్యం లభిస్తోంది. బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, బాక్సింగ్‌కి కూడా చోటు లభిస్తోంది. ఈ పరిశోధన చేస్తున్న సమయానికి పీవీ సింధు, సానియా మీర్జా, సైనా నెహ్వాల్, మేరీ కోమ్ లాంటి వారికి ఫ్రంట్ పేజీలో స్థానం లభించినట్లు కనిపించింది.

బృందాలలో ఆడిన సభ్యుల కంటే కూడా సింగిల్ ప్లేయర్స్ కి ఎక్కువ కవరేజి లభించడం ఆసక్తిదాయకమైన విషయం. ఇందులో 50 శాతం వార్తలు సింగిల్ మహిళా క్రీడాకారిణుల గురించే ఉండగా 21 శాతం కథనాలు మాత్రం పురుషులు, మహిళలు ఇద్దరి గురించీ కలిపి ఉన్నాయి.

BBC

కవరేజి ఎలా ఉంది?

సాధారణంగా పత్రికల స్పోర్ట్స్ పేజీలో ప్రచురించే వార్తల్లో పురుషులు ఆడే క్రీడలకు పెద్ద పెద్ద యాక్షన్ చిత్రాలతో ఎక్కువ ప్రాధాన్యం లభిస్తుండగా, మహిళలకు సంబంధించిన క్రీడలకు మాత్రం అంతగా ప్రాధాన్యం లభించటం లేదు.

మహిళా క్రీడాకారిణుల కు సంబంధించిన వార్తల్లో వాడే చిత్రాలు పరిమాణంలో చిన్నవిగా ఉండటం కానీ, లేదా ఒక్కొక్కసారి ఫోటోలు లేకపోవడం కానీ జరుగుతున్నట్లు పరిశోధన చెబుతుంది.

బాగా పేరున్న మేరీ కోమ్, పీవీ సింధు, సైనా నెహ్వాల్ లాంటి వారి కథనాలకే చిత్రాలు ఉన్నాయి. ఇలా చూస్తే మహిళా క్రీడాకారిణులు కోసం రాసిన కథనాలలో 40 శాతం వార్తలు చిత్రాలు లేకుండా రాసినవే ఉన్నాయి.

మహిళా క్రీడాకారిణుల గురించి ప్రచురించే కథనాలను అర్ధం చేసుకునేందుకు వీలుగా, పత్రికలో ప్రచురితమైన వార్తా కథనాలను వార్తలు, ఇంటర్వ్యూ, ఫోటో ఫీచర్, ప్రత్యేక కధనాలు, మహిళా క్రీడాకారిణులు రాసిన వ్యాసాలు అనే వివిధ వర్గాలుగా విభజించారు.

చాలా సార్లు,క్రీడాకారులకు సంబంధించిన కధనాలు ఒక ప్రత్యేక క్రీడా కార్యక్రమం చుట్టూ అల్లుకుని ఉన్నాయి. అందులో ఒక క్రీడాకారిణి కోసం ప్రత్యేకంగా సమాచారం ఏమి లేదు. ఉదాహరణకు ఒక క్రీడాకారిణి కోసం ప్రచురించిన ఫోటో ఫీచర్లో దేశీయ, అంతర్జాతీయ క్రీడాకారుల గురించి కూడా ప్రస్తావించారు. ఇలాంటివి మూడేళ్ళలో కేవలం 9 సార్లు మాత్రమే జరిగిన సందర్భాలు ఉన్నాయి.

BBC

పై స్థానంలో ఉన్న హరియాణా

ఈ పరిశోధన మహిళా క్రీడాకారిణులు కోసం ప్రత్యేకంగా రాసిన వ్యాసాలను, ఆ వ్యాసాలలో ప్రస్తావించిన రాష్ట్రాల పేర్లను కూడా పరిశీలించింది. ఈ పరిశోధనలో హరియాణా రాష్ట్రం పేరు 60 సార్లు కనిపించగా, ఆంధ్రప్రదేశ్ 28 సార్లు, మణిపూర్ 20 సార్లు కనిపించాయి.

ఇందులో చాలా రిపోర్టులలో అంతగా పేరు లేని క్రీడాకారిణుల గురించి రాసేటప్పుడు వారి రాష్ట్రాన్ని ప్రస్తావించారు. సాధారణంగా జాతీయ స్థాయిలో ఆడే క్రీడాకారిణులు ఏ రాష్ట్రానికి చెందినవారో చాలా మందికి తెలిసే ఉంటుంది.

క్రీడాకారిణుల సొంత రాష్ట్రాలను గుర్తించేందుకు హర్యానా లాంటి రాష్ట్రాల నుంచి వస్తున్న కొత్త క్రీడాకారిణుల గురించి రాసేటప్పుడు "జజ్జర్ గర్ల్, హర్యానా బాక్సర్, భివాని గర్ల్ లాంటి పదాలను వాడారు. ఇతర రాష్ట్రాల వారి కోసం కూడా అస్సాం గర్ల్, దిల్లీ గర్ల్, మహారాష్ట్ర గర్ల్ అని రాసినట్లు ఈ అధ్యయనం తెలిపింది.

పత్రికలలో క్రీడాకారిణుల గురించి రాసేటప్పుడు వాడిన హెడ్ లైన్ లను, వివరాలను పరిశీలించినప్పుడు మహిళా అథ్లెట్‌లకు, క్రీడాకారిణులకు కొన్ని రకాల విశేషణాలను వాడినట్లు కనిపించింది. ఉదాహరణకు మేరీ కోమ్ గురించి రాసేటప్పుడు 'మాగ్నిఫిషియెంట్ మేరీ' , 'ఐరన్ లేడీ', 'ఏజ్‌లెస్ మేరీ' లాంటి పదాలను వాడారు. క్వీన్ అనే విశేషణాన్ని కూడా చాలా సార్లు వాడారు.

అలాగే, మరి కొంత మందికి 'గ్లామరస్ హైదరాబాదీ', 'స్వీట్ కరోలినా', 'క్వీన్ సోఫియా', 'కెనడా'స్ క్వీన్', 'జపాన్స్ స్విమ్ క్వీన్', 'బ్యాడ్మింటన్ క్వీన్స్', 'స్క్వాష్ క్వీన్', 'టీనేజ్ షూటింగ్ సెన్సేషన్', 'సైమన్ డార్లింగ్ ఆఫ్ ప్యారిస్' , 'షూటింగ్ సెన్సేషన్', 'కం బ్యాక్ క్వీన్స్' , 'ట్రాక్ క్వీన్' లాంటి పదాలను వాడారు.

మహిళా క్రీడాకారిణుల గురించి రాసేటప్పుడు ఫైటర్, రేజర్ షార్ప్, ఐరన్ లేడీ, ఫెన్సర్, ఛాంపియన్ లాంటి పదాలను అరుదుగా వాడారు.

BBC

అధ్యయన విధానం, పరిధి

ఈ అధ్యయనం కోసం దేశంలో అత్యంత అధిక సర్కులేషన్ ఉన్న రెండు ఆంగ్ల జాతీయ పత్రికలు టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూస్తాన్ టైమ్స్ ని ఎన్నుకుని అందులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించారు. దీని కోసం డిసెంబరు 2017 - 2020 వరకు మూడేళ్ళ వ్యవధిలో ప్రచురితమైన కథనాలను విశ్లేషించారు. పత్రికల డిజిటల్ ఆర్క్ హైవ్స్ అందుబాటులో ఉన్న సమయం ఆధారంగా ఈ వ్యవధిని ఎంపిక చేసుకున్నారు. ఈ విశ్లేషణకు దిల్లీ నుంచి ప్రచురితమైన ఎడిషన్‌ని ఎన్నుకున్నారు. శాంపిల్ కోసం పత్రిక ఫ్రంట్ పేజీ ని స్పోర్ట్స్ పేజీని ఎన్నుకున్నారు.

అలాగే, క్రీడలకు సంబంధించిన వార్తలు ఇతర పేజీల్లో కనిపించినప్పుడు వాటిని కూడా పరిశీలించారు.

క్రీడా వార్తలను మినహాయించి మరే ఇతర వార్తలను పరిగణించలేదు.

శాంపిల్ కోసం స్పోర్ట్స్ పేజీలో ప్రచురితమైన అన్ని కధనాలు, చిత్రాలను పరిశీలించారు.

ఫ్రంట్ పేజీలో ప్రచురితమైన స్పోర్ట్స్ కథనాలు, చిత్రాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.

మహిళా క్రీడాకారిణులకు సంబంధించిన కథనాలను వేరుగా లెక్కించారు.

ఇందులో, క్రీడ , క్రీడాకారుల సంఖ్య, వార్తల్లో కేటాయించిన స్థలం, చిత్రాల సంఖ్య, వాటి పరిమాణం, క్రీడాకారుల జాతీయత, వారి సొంత రాష్ట్రాలు, క్రీడాకారులకు ఇచ్చిన ప్రత్యేక విశేషణాలు, వార్తలు, ఇంటర్వ్యూలు, ఫీచర్స్ లాంటి వివరాలను పరిశీలించారు.

ఇంటర్ కోడర్ రిలియబిలిటీ టెస్ట్ స్థాయిలో వేరియబుల్స్ ని గుర్తించారు. కథనాలన్నిటినీ కోడ్ చేయడానికి రెండు కోడ్ లను ఉపయోగించారు.

సమాచార సేకరణలో వ్యత్యాసాలు రాకుండా ఉండేందుకు ముందుగా 15 రోజుల వార్తా పత్రికలను రెండు కోడర్లు ఒకేసారి కోడ్ చేశాయి.

ఇంటర్ కోడింగ్ లో తలెత్తిన అంశాలను రెండు కోడర్ల మధ్య చర్చించి ఒక అంగీకారానికి వచ్చారు.

సమాచారాన్ని సంఖ్యాపరంగా విశ్లేషించేందుకు ఒక కోడ్ షీట్ తయారు చేశారు. వివిధ వేరియబుల్స్‌కి రకరకాల సంఖ్యలను ఇచ్చారు. ఎంపిక చేసుకున్న వేరియబుల్స్‌ని పరిశోధకులు అర్ధం చేసుకునేందుకు వీలుగా ఆపరేషనలైజ్ చేశారు. ఈ పదాలను స్పోర్ట్స్ కథనం లాంటివి నిర్వచించడానికి, మహిళలకు సంబంధించిన వార్తలను వర్గీకరించడానికి వాడారు.

అలా మొత్తం 3563 కథనాలను సేకరించారు. ఇవి కేవలం డిసెంబరు 2017 - 2020 మధ్యలో దిల్లీ సంచికలో ప్రచురితమైనవి. ఈ సమాచారాన్ని సేకరించడానికి పత్రిక ఇ-వెర్షన్‌ని పరిశీలించారు.

క్రీడావార్తలకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించడానికి కాలమ్ సంఖ్యను చూసారు.

ఈ అధ్యయనానికి మూడేళ్ళ వ్యవధిని పరిధిగా నిర్దేశించుకున్నారు. వార్తలకు కేటాయించిన స్థలాన్ని కొలవడానికి కాలమ్‌లను పరిగణనలోకి తీసుకున్నారు.

BBC

source: bbc.com/telugu

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: BBC Telugu
Top