Saturday, 25 Sep, 2.45 pm BBC News తెలుగు

హోమ్
మోదీ-బైడెన్ సమావేశం: 'మనం బంధువులమా' అని అడిగిన బైడెన్, 'అవును' అన్న మోదీ

Reuters

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో శుక్రవారం వైట్‌హౌస్‌లో సమావేశమయ్యారు.

సరాదాగా, చతురోక్తులతో మొదలైన వారి సంభాషణ ద్వైపాక్షిక వ్యాపార సంబంధాలు, వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి మీదుగా సాగింది.

"ఈ దశాబ్ధంలో వ్యాపార రంగం చాలా కీలకమైంది. ఈ రంగంలో భారత్, అమెరికాలు ఇచ్చి పుచ్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి'' అని ప్రధానమంత్రి మోదీ అన్నారు.

భారత-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించేందుకు నాటిన విత్తనం ఇప్పుడు బైడెన్ నేతృత్వంలో "పరివర్తన దశ"కు చేరుకుందని మోదీ అన్నారు.

వాణిజ్య సంబంధాల గురించి ప్రస్తావిస్తూ, ఇరు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు సాఫీగా సాగుతున్నాయని, ఈ దశాబ్దంలో అవి మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటాయని అన్నారు.

Reuters

ఇరు దేశాల సంబంధాల మధ్య ఒక "కొత్త అధ్యాయం" ప్రారంభం కాబోతోందని బైడెన్ పేర్కొన్నారు. అయితే, అనేక సవాళ్లు ముందున్నాయని, వాటిల్లో కోవిడ్-19కు ప్రథమ స్థానమని ఆయన అన్నారు.

"భారత-అమెరికా సంబంధాలు బలపడడం ప్రపంచానికి మేలు చేస్తుంది" అని బైడెన్ అన్నారు. అమెరికా, భారతదేశాల మధ్య భాగస్వామ్యం ప్రజాస్వామిక విలువలతో కూడి ఉందని అన్నారు.

ఇరువురు అగ్రనేతలూ మహాత్మా గాంధీని గుర్తుచేసుకున్నారు. గాంధీజీ సహనం, అహింసా మార్గం గురించి బైడెన్ ప్రస్తావించగా, భూమిని పరిరక్షించడం పట్ల గాంధీ ఆలోచనలపై మోదీ మాట్లడారు.

అలాగే, ఇద్దరి మధ్య కొన్ని సరదా సంభాషణలు సాగాయి.

భారతదేశంతో తనకున్న బంధం గురించి బైడెన్ ప్రస్తావించారు. మొదటిసారి అమెరికా సెనేట్‌గా ఎన్నికైనప్పుడు ముంబై నుంచి తనకు ఒక ఉత్తరం వచ్చిందనీ, రాసిన వ్యక్తి ఇంటి పేరు కూడా బైడెన్ అని చెప్పారని, ఆ తరువాత దాని గురించి ఎలాంటి సమాచారం తెలియలేదని చెప్పారు.

Reuters

అమెరికా ఉప రాష్ట్రపతిగా ఉన్నప్పుడు భారతదేశ పర్యటనకు వచ్చిన సందర్భంలో ఈ లేఖ గురించి మీడియా ఎదుట ప్రస్తావించానని, భారతదేశంలో చాలామంది బైడెన్‌లు ఉన్నారని భారత మీడియా తనకు చెప్పిందని అన్నారు.

"అయితే, నాకు భారతదేశంతో చుట్టరికం ఉందని అనుకోను. ఈస్ట్ ఇండియా టీ కంపెనీలో ఒకప్పుడు కెప్టెన్ జార్జ్ బైడెన్ అనే వ్యక్తి పనిచేసేవారని తెలిసింది. ఆయన భారతదేశంలో నివసించినప్పుడు భారతీయ మహిళను వివాహం చేసుకొని ఉండవచ్చు. ఇంతకు మించి వివరాలు తెలీవు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మోదీ సహకరిస్తారని ఆశిస్తున్నాను" అంటూ బైడెన్ చమత్కరించారు.

బైడెన్‌కు ముంబైతో ఉన్న సంబంధాలను వెలుగులోకి తెచ్చే కొన్ని పత్రాలను తాను తీసుకువచ్చానని మోదీ చెప్పారు.

"మనం బంధువులమా?" అని బైడెన్ సరదాగా అడిగారు. భారత ఉపఖంఢంతో బైడెన్‌కు చుట్టరికం ఉందని మోదీ స్పష్టం చేశారు.

"ఈ విషయాన్ని మేం ముందుకు తీసుకువెళతాం. బహుశా ఈ పత్రాలు మీకు ఉపయోగపడవచ్చు" అంటూ మోదీ జవాబిచ్చారు.

''ఈ దశాబ్ధంలో వ్యాపార రంగం చాలా కీలకమైంది. ఈ రంగంలో భారత్, అమెరికాలు ఇచ్చి పుచ్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి'' అని ప్రధానమంత్రి మోదీ అన్నారు.

అంతకు ముందు తాను భారత ప్రధానమంత్రి చర్చలు జరపబోతున్నానని, ఆయనను వైట్‌హౌస్‌కు ఆహ్వానించానని జో బైడెన్ ట్వీట్ చేశారు.

రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలు కావాలని తాను కోరుకుంటున్నానని బైడెన్ అన్నారు. పలురంగాల్లో కలిసి పని చేయాలని కోరుకుంటున్నట్లు బైడెన్ తన ట్వీట్‌లో వెల్లడించారు.

ఎన్నో ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపించడంలో భారత్-అమెరికా సంబంధాలు సాయం చేస్తాయని బైడెన్ అన్నారు.

ఈ సందర్భంగా అమెరికా ఉపాధ్యక్షుడిగా గతంలో భారత్ వచ్చిన విషయాన్ని బైడెన్ గుర్తు చేసుకున్నారు.

GETTY IMAGES భారత ప్రధాని మోదీ, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్

కమలా హారిస్‌ మోదీ భేటీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను తొలిసారిగా గురువారం వాషింగ్టన్‌లో కలిశారు.

అమెరికా చరిత్రలో ఉపాధ్యక్ష పదవిని చేపట్టిన తొలి మహిళ, తొలి దక్షిణాసియా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్.

అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ఎన్నిక కావడం చరిత్రాత్మకమని పేర్కొంటూ మోదీ ఆమెకు అభినందనలు తెలియజేశారు. భారతదేశానికి రమ్మని ఆహ్వానించారు.

"భారత ప్రజలు మీకు స్వాగతం పలకడానికి వేచి చూస్తున్నారు" అని మోదీ అన్నారు.

'కమలా హారిస్‌ను కలవడం సంతోషంగా ఉంది. ఆమె విజయం ప్రపంచానికే స్ఫూర్తినిచ్చింది. భారత్, అమెరికాల స్నేహబంధం మరింత బలోపేతం అయ్యేలా మేం ఇద్దరం చాలా విషయాలు మాట్లాడుకున్నాం' అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

కాగా, నవంబర్‌లో అమెరికా ఎన్నికల ఫలితాలు వెల్లడించిన అనంతరం, కమలా హారిస్ గెలుపును పురస్కరించుకుని ఆమె పూర్వీకుల గ్రామం తులసేంద్రపురంలో టపాసులు వెలిగించి సంబరాలు చేసుకున్నారు.

మోదీ శుక్రవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో తొలిసారిగా సమావేశం కానున్నారు. దాంతో, మూడు రోజుల పాటు కొనసాగిన భారత ప్రధాని అమెరికా పర్యటన ముగియనుంది.

అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా దళాలు వెనుదిరిగిన కొన్ని వారాల్లోనే తాలిబాన్ ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ నెల ప్రారంభంలో తాలిబాన్ ప్రతినిధి బీబీసీతో మాట్లాడుతూ, "భారతదేశంలో కశ్మీరీ ముస్లింల కోసం గొంతు విప్పుతాం" అన్నారు.

2019లో అమెరికా ఎన్నికల ప్రచార సమయంలో, భారతదేశంలో ఆర్టికల్ 377 రద్దును కమలా హారిస్ ఖండించారు.

శుక్రవారం బైడెన్‌తో పాటూ మోదీ "క్వాడ్" సమావేశానికి హాజరయ్యారు. ఇందులో భాగంగా ఆస్ట్రేలియా, జపాన్ అధ్యక్షులతోనూ సమావేశమయ్యారు.

ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో పరస్పర సంబంధాలను, సహకారాన్ని పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన ప్రయత్నమే "క్వాడ్".

source: bbc.com/telugu

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: BBC Telugu
Top