Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలను ఎస్ఐఆర్ ప్రభావితం చేసిందా?

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలను ఎస్ఐఆర్ ప్రభావితం చేసిందా?

Sajjad HUSSAIN / AFP via

దేశ ప్రజలందరూ ఉత్కంఠగా ఎదురు చూసిన పశ్చిమ బెంగాల్ తీర్పు వచ్చేసింది.

మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 206 స్థానాలను గెలుచుకుని పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది.

15 ఏళ్లుగా బెంగాల్‌లో అధికారంలో ఉన్న మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ 80 స్థానాలకే పరిమితమైంది.

ఒక సీటు(రాజర్హాట్ న్యూ టౌన్) కౌంటింగ్ ఇంకా ముగియలేదు. అలాగే, మరో సీటు ఫాల్తా రీపోలింగ్ మే 21న నిర్వహించనున్నారు.

అయితే, ఎన్నికలకు ముందు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ఆ రాష్ట్రంలో నిరంతరం చర్చనీయాంశంగా నిలిచింది.

రాష్ట్ర ఓటర్ల జాబితా నుంచి సుమారు 91 లక్షల మంది ఓటర్లను తొలగించారు. ఈ ఓటర్లలో చనిపోయిన వారు, వలసవెళ్లిన వారు, డూప్లికేట్ ఓటర్లు, 2002 ఓటర్ల జాబితాతో మ్యాప్ కాని వారు, తల్లిదండ్రులు లేదా తాతముత్తాలతో పోలిస్తే వయసులో అసాధారణమైన వ్యత్యాసం ఉన్న ఓటర్లు ఉన్నారు.

ముస్లిం ఓటర్లను లక్ష్యంగా చేసుకునే ఈ తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారని టీఎంసీ తరచూ ఆరోపించింది. టీఎంసీకి కీలకమైన మద్దతు ఉన్నది ఈ ఓటర్ల నుంచే.

టీఎంసీ ఈ వాదనకు రాజకీయ విశ్లేషకులలో కొందరు మద్దతు ఇచ్చారు.

ఎస్ఐఆర్ వాస్తవానికి ఎంత పెద్ద అంశంగా మారింది?

పశ్చిమ బెంగాల్‌లో 112 నియోజకవర్గాల్లో ఓట్ల తొలగింపు ఒక్కో చోట నికరంగా 25 వేల కంటే ఎక్కువగా ఉంది.

నికర తొలగింపుల్లో మరణించిన వారు కాకుండా.. తొలగించిన మిగిలిన ఓటర్లందరూ ఉన్నారు. బీబీసీ ఈ నికర తొలగింపులనే పరిగణనలోకి తీసుకుంది.

ఎందుకంటే, మరణించిన ఓటర్లు కాకుండా.. ఎస్ఐఆర్ కింద తొలగింపులకు గురైన వారందరూ అప్పీల్‌కు వెళ్లొచ్చు. దీంతో, తిరిగి ఓటర్ల జాబితాలో వారు చేరే అవకాశం ఉంది.

నికరంగా 25 వేలకు పైగా తొలగింపులున్న 112 సీట్లలో.. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ 86 సీట్లను గెలుచుకోగా.. బీజేపీ 26 సీట్లను గెలిచింది. ఈసారి పరిస్థితులు పూర్తిగా తలకిందులయ్యాయి. ఈ సీట్లలో బీజేపీ 72 సీట్లను గెలుచుకుంది.

అందులో మమతా బెనర్జీ ఓడిపోయిన భవానీపుర్ సీటు కూడా ఉంది.

టీఎంసీ ఈ 112లో 39 నియోజకవర్గాల్లో గెలుపొందింది. వీటిలో కాంగ్రెస్ ఒక్క సీటును తన ఖాతాలో వేసుకుంది.

 BBC

''ఎస్ఐఆర్‌లో తొలగింపులు కూడా ఈ ఫలితాల్లో కచ్చితంగా ఒక కీలక అంశంగా మారాయి'' అని ఎస్ఐఆర్ కింద చేపట్టిన ఓటర్ల జాబితా సమీక్షలను పరిశీలించిన సాబర్ ఇన్‌స్టిట్యూట్ చీఫ్ రీసెర్చర్ సాబిర్ అహ్మద్ అన్నారు.

మరింత సూక్ష్మ స్థాయిలో కూడా ఎస్ఐఆర్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

నికరంగా లేదా మరణం కారణంగా కాకుండా ఎస్ఐఆర్ తొలగింపులు అత్యధికంగా చేపట్టిన 10 స్థానాలను పరిగణనలోకి తీసుకుంటే.. 2021లో వాటన్నింటినీ టీఎంసీ గెలుచుకుంది.

2011లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ, దాని మిత్రపక్షాలు ఈ 10 స్థానాలలో తొమ్మిదింటిని కనీసం రెండు రాష్ట్ర ఎన్నికలలో గెలుచుకున్నాయి. ఈ విశ్లేషణ ప్రకారం, ఈ స్థానాలు టీఎంసీకి కంచుకోటలు అని అర్థమవుతోంది.

అయితే, ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఈ పది స్థానాల్లో రెండింటినీ జోరసంకో, హౌరా ఉత్తర్‌ను కోల్పోయింది.

మిగిలిన అన్ని స్థానాల్లో కూడా టీఎంసీ గెలుపు మార్జిన్ తగ్గిపోయింది.

 Debajyoti Chakraborty/NurPhoto via

లాజికల్ డిస్క్రిపెన్సీస్ పేరుతో తొలగించిన 27 లక్షల మంది ఓటర్లు రాష్ట్ర ఓటర్ల జాబితాలో సుమారు 5 శాతమని రాజకీయ విశ్లేషకులు యోగేంద్ర యాదవ్ అన్నారు. టీఎంసీపై బీజేపీ ఆధిక్యం సాధించిన ఓటు షేర్ కూడా 5 శాతంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

''ఇది యాధృచ్చికమే అయినా.. ఎస్ఐఆర్ పాత్ర కచ్చితంగా ఉందని చూపిస్తోంది'' అని యోగేంద్ర యాదవ్ అన్నారు.

అయితే, మమతా బెనర్జీ ఓటమికి కేవలం ఎస్ఐఆర్ మాత్రమే ఒక అంశంగా మారిందా?

అత్యధిక నికర ఎస్ఐఆర్ తొలగింపులున్న పది స్థానాల్లో నాలుగింటిలో పోల్ అయిన ఓట్ల సంఖ్య వాస్తవానికి 2021 కంటే అత్యధికంగా ఉన్నాయి. మిగిలిన ఆరు స్థానాల్లో పోల్ అయిన ఓట్ల సంఖ్య తగ్గింది. అయితే, తొలగించిన ఓట్ల సంఖ్యతో పోలిస్తే ఈ మార్పు చాలా తక్కువ.

ఇతర రాష్ట్రాల్లో వలస కార్మికులుగా పనిచేసే పెద్ద సంఖ్యలో ఓటర్లు ఈసారి ఎన్నికలకు తిరిగి పశ్చిమ బెంగాల్‌కు రావడం కూడా దీని వెనకున్న ఒక కారణమని విశ్లేషకులు అంటున్నారు.

ఎన్నికలకు ముందు చేపట్టిన ఎస్ఐఆర్‌కు వ్యతిరేకంగా తమ ఆగ్రహాన్ని వెల్లబుచ్చేందుకు, ఆ ప్రక్రియ కారణంగా తమ ఓటు హక్కును కోల్పోతామనే భయంతో ప్రజలు ఓటు వేశారని చాలామంది విశ్లేషకులు భావించారని సీనియర్ జర్నలిస్ట్ మణిదీప బెనర్జీ బీబీసీకి తెలిపారు.

''అయితే, ఈ ఓటర్లలో పెద్ద ఎత్తున ప్రజలు టీఎంసీకి వ్యతిరేకంగా ఓటేసినట్లు ఫలితాలు చూపించాయి'' అని అన్నారు.

''ఎస్ఐఆర్, దాని చుట్టూ జరిగిన చర్చ టీఎంసీ దృష్టి మళ్లించినట్లు నిరూపితమైంది'' అని ఆమె అన్నారు.

''ఎస్ఐఆర్‌ ప్రక్రియ మమతా బెనర్జీని తీవ్ర ఆగ్రహానికి గురయ్యేలా చేసింది. ప్రజల నుంచి వెల్లువెత్తే ప్రభుత్వ వ్యతిరేకతను పట్టించుకోనీయకుండా టీఎంసీ దృష్టి మళ్లించింది'' అని చెప్పారు.

అయితే, పశ్చిమ బెంగాల్ ఫలితాలకు కేవలం ఎస్ఐఆర్ మాత్రమే కారణం కాదని రాజకీయ విశ్లేషకులు స్నిగ్ధేందు భట్టాచార్య తెలిపారు.

''ఎస్ఐఆర్ కచ్చితంగా తృణమూల్ ఓట్ షేర్‌ను కొంత తగ్గించింది. కానీ, తృణమూల్ వ్యతిరేక ఓటర్లలో ఒక పెద్ద వర్గాన్ని ప్రోత్సహించింది. ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఇదే ఉత్తమ అవకాశంగా ఈ ఓటర్లు భావించారు'' అని స్నిగ్ధేందు భట్టాచార్య అన్నారు.

ఉద్యోగాల కొరత, తృణమూల్ క్షేత్రస్థాయి కార్యకర్తల దురుసుతనం వంటి కారణాల వల్ల ఓటర్లలో ప్రభుత్వ వ్యతిరేకత భారీగా నెలకొందని బెనర్జీ, భట్టాచార్య అన్నారు.

ఎస్ఐఆర్, రాష్ట్రంలో కేంద్ర బలగాలను భారీగా మోహరించడం వల్ల ప్రభుత్వాన్ని నిజంగానే కూలదోయవచ్చనే నమ్మకం ఓటర్లలో ఏర్పడింది.

 Debajyoti Chakraborty/NurPhoto via

ఫలితాలు వెలువడటానికి ముందు, ముస్లిం ఓట్లు మరింత ఏకీకృతం కావడం టీఎంసీకి అనుకూలించవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. పశ్చిమ బెంగాల్‌లో 27 శాతం ముస్లిం ఓటర్లు ఉండగా, వారిలో అత్యధికులు 2011 నుంచి మమతా బెనర్జీ పార్టీకే మద్దతు ఇస్తున్నారు.

అయితే, ఈసారి ముస్లిం ఓట్లు చీలిపోయినట్లు కనిపిస్తోంది.

''పోటీతత్వ మత రాజకీయాల'' కారణంగా ముస్లిం ఓటర్లలో కాస్త నిరాశ నెలకొందని అహ్మద్ అన్నారు.

''ఫలితంగా తృణమూల్ కంచుకోటలుగా భావించే మాల్దా, ముర్షిదాబాద్ వంటి జిల్లాల్లో మెరుగైన పనితీరు కనబర్చడం వల్ల కాంగ్రెస్ ఓట్ షేర్ పెరిగింది'' అని తెలిపారు. ''ఎస్ఐఆర్ కనుక చేపట్టి ఉండకపోతే.. మరింత ఓట్ షేర్ కాంగ్రెస్ పొందే అవకాశం ఉంది'' అని పేర్కొన్నారు.

ముస్లిం ఓట్లలో చీలిక వచ్చినట్లు బెనర్జీ కూడా తెలిపారు.

''పశ్చిమ బెంగాల్‌లో 90 నుంచి 100 సీట్లను ముస్లిం ఓట్లు నిర్ణయిస్తాయి'' అని చెప్పారు. తృణమూల్ గెలుపొందిన ప్రాంతాలు తగ్గిపోవడాన్ని ప్రస్తావిస్తూ.. ముస్లిం ఓటర్లకు చెందిన ఒక వర్గం పార్టీకి దూరమై పోయిందని వివరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

నరేంద్ర మోదీ Sajjad HUSSAIN / AFP via

source: bbc.com/telugu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: BBC Telugu