Friday, 29 Jan, 5.42 pm BBC తెలుగు

హోమ్
రైతుల నిరసనలు: ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గొద్దు.. రైతులకు సూచించిన రాహుల్ గాంధీ

రైతులు ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గరాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.

ఎర్రకోట వద్ద జరిగిన వ్యవహారంపైనా స్పందించిన ఆయన ప్రభుత్వం నిరసనకారులను ఎందుకు లోనికి అనుమతించిందని ప్రశ్నించారు.

'ఎర్రకోటలోకి నిరసనకారులను ఎందుకు అనుమతించారు? వారినెందుకు ఆపలేదు? వారిని లోపలికి వెళ్లినివ్వడానికి గల కారణమేంటో హోం మంత్రి చెప్పాలి.

ప్రభుత్వం రైతులతో చర్చించి ఒక పరిష్కారానికి రావాలి. ఆ మూడు చట్టాలను రద్దు చేసి చెత్తబుట్టలో పడేయడమే పరిష్కారం.

ఆందోళన చేస్తున్న రైతులు ఇళ్లకు తిరిగి వెళ్తారని అనుకోవద్దు.. పరిస్థితి జటిలమవుతుందన్నదే నా ఆందోళన. అలా జరగకూడదు. దీనికి పరిష్కారం కావాలి'' అన్నారు రాహుల్ గాంధీ.

BBC

ఉద్రిక్తంగా సింఘు బోర్డర్

సింఘు బోర్డర్ వద్ద పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారుతోంది.

సింఘు బోర్డర్ వద్ద స్థానికులు కొందరు గుమిగూడి రైతులను ఖాళీ చేయించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా రైతులు, స్థానికులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నట్లు వార్తా ఏజెన్సీలు వెల్లడిస్తున్నాయి. దీంతో భద్రతా బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించినట్లుగా చెబుతున్నారు.

స్థానికుల నిరసనకు సంబంధించిన వీడియోలను ఏఎన్ఐ వార్తాసంస్థ ట్వీట్ చేసింది.

EPA

'కార్పొరేట్ చేతిలో ధాన్యం బందీ కాకూడదనే ఈ పోరాటం' - రాకేశ్ టికైత్

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఈ పోరాటం ఆగదని భారత్ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికైత్ అన్నారు.

ధాన్యాన్ని ఖజానాలో బంధించాలని కార్పొరేట్ కోరుకుంటోందని, దీనిని వ్యతిరేకించాలని ఆయన అన్నారు. "మా పోరాటం పూర్తి కాగానే మేం మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపోతాం" అని టికైత్ అన్నారు.

"మా సమస్యల గురించి ప్రభుత్వం మాతో మాట్లాడాలి. రైతులు నిరసన ప్రదర్శన నిర్వహించే ప్రదేశాల్ని అనుమతించాలి. సౌకర్యాలు కల్పించాలి" అని ఆయన విజ్ఞప్తి చేశారు.

అంతేకాకుండా, తమ పోరాటం ప్రభుత్వంతో కానీ, స్థానిక పాలన యంత్రాంగంతో కాదని కూడా ఆయన వివరించారు. "మాకు ప్రభుత్వం మీద నమ్మకం లేదు. వారు రైతులను దేశద్రోహులని అంటున్నారు. మాకు నీళ్లు అందకుండా చేశారు. కరెంటు కట్ చేశారు. అందుకే, మేం మా ఊరి నుంచి నీళ్లు వచ్చేంతవరకు నీళ్లు తాగం" అని ఆయన టికైత్ అన్నారు.

శశి థరూర్, రాజ్‌దీప్ సర్దేశాయ్‌లపై దేశద్రోహం కేసు.. ఎఫఐఆర్‌లో ఏముంది?

గణతంత్ర దినోత్సవం రోజు రైతుల నిరసన యాత్రలో జరిగిన హింసాకాండకు సంబంధించి ఉత్తరప్రదేశ్ పోలీసులు కాంగ్రెస్ నేత శశిథరూర్, జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ సహా 8 మందిపై దేశద్రోహం కేసులు పెట్టారు.

ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్లు 153A, 153B, 295A, 298, 504, 506, 505(2),124A, 34, 120Bతోపాటు ఐటీ యాక్ట్ సెక్షన్ 66 కింద కేసులు పెట్టారు.

''దేశ రాజధానిలో కొందరు హింసకు పాల్పడ్డారు. ప్రణాళికాబద్ధంగా అల్లర్లకు పాల్పడుతూ ప్రభుత్వ ఉద్యోగులను చంపడానికి కుట్ర చేశారు'' అని ఫిర్యాదుదారుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

రిపబ్లిక్ డే రోజున శాంతియుతంగా నిరసన తెలిపేందుకు అనుమతి ఇచ్చారని, అయితే కొందరు నిబంధనలను ఉల్లంఘిస్తూ, అనుమతించిన మార్గంలో వెళ్లకుండా చట్టాలను ఉల్లంఘించారని, పోలీసు సిబ్బందిని తీవ్రంగా గాయపరిచారని, ప్రజల ఆస్తులకు నష్టం కలిగించారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.

''మృణాల్ పాండే, జాఫర్ అఘా, పరేశ్ నాథ్, అనంత్ నాథ్, వినోద్ కె. జోస్ అనే వ్యక్తులు వారి వార్తాపత్రికలు, డిజిటల్ ప్రసారాలు, సోషల్ మీడియాలో పోస్టులకు పూర్తి బాధ్యత వహించాలి" అని ఎఫ్ఐఆర్ పేర్కొంది.

''వీరంతా తప్పుడు సమాచారాన్ని, రెచ్చగొట్టే వార్తలను ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేశారు. ఒక ట్రాక్టర్ డ్రైవర్ మరణానికి పోలీసుల కాల్పులే కారణమని రైతుల ఆరోపణలను ట్విటర్ హ్యండిల్లో ట్వీట్ చేశారు.

"వీరు హానికరమైన, తప్పుదోవ పట్టించే, రెచ్చగొట్టే వార్తలను ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేసారు. ఒక ట్రాక్టర్ డ్రైవర్ పోలీసుల కాల్పుల్లో మరణించాడని ట్విట్టర్ హ్యాండిల్ నుండి ట్వీట్ చేశారు. దీనిని చూసిన రైతులు మరింత ఆగ్రహంతో పోలీసులు మీద దాడికి దిగి వారిని తీవ్రంగా గాయపరిచారు. పోలీసులు తమపై దాడులు జరుగుతున్నా ఎంతో సయమనం పాటించి ఆందోళనకారులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు'' అని పేర్కొన్నారు.

"తమ రాజకీయ, వ్యక్తిగత లాభాల కోసం తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రసారం చేయడం, తద్వారా నిరసనకారులను హింసకు పాల్పడేలా చేయడం వారి ఉద్దేశం. వారి ట్వీట్ల ద్వారా ఏర్పడిన ఆగ్రహంతో నిరసనకారులు ఎర్రకోట ప్రాంగణానికి చేరుకున్నారు. జాతీయ జెండాను ఎగురవేసేచోట మతపరమైన జెండాను ఎగరేశారు'' అని పేర్కొన్నారు.

''గతంలో కూడా వీరు ఇలాంటి చర్యలుకు పాల్పడ్డారు. 72వ గణతంత్ర వేడుకలకు ఎంతోమంది ప్రముఖులు విచ్చేస్తారు. అలాంటి సమయంలో వీరు తమ ట్వీట్ల ద్వారా పోలీసులు, భద్రతాదళాల ప్రతిష్టను మసకబార్చేందుకు ప్రయత్నించారు. ఇలాంటి చర్యల ద్వారా దేశంలో అశాంతిని, వివిధ సమూహాల మధ్య ద్వేషం, హింస, అరాచకత్వం అనే విషబీజాలను నాటడమే వీరి ఉద్దేశం'' అని ఎఫ్ఐఆర్ పేర్కొంది.

ANI ఘాజీపూర్ సరిగహద్దు వద్ద కంటతడి పెట్టిన రైతు నేత రాకేశ్ టికైత్

కంటతడి పెట్టిన కర్షక నేత

ఘాజీపూర్ బార్డర్ వద్ద గురువారం రాత్రి ఉద్రిక్తత పెరగడంతో టీక్రీ బార్డర్, సింఘు బార్డర్‌ల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పోలీసులన ఆ ప్రాంతాలలో భారీగా మోహరించారు.

ప్రజలను సమీకరించడాన్ని నిషేధిస్తూ అక్కడ 144వ సెక్షన్ విధించారు. ఘాజియాబాద్ నుంచి దిల్లీకి వచ్చే దారిని మూసేశారు.

కాగా, సీఆర్‌పీసీ సెక్షన్ 133 సెక్షన్ కింద రైతులకు వివాదాస్పద ప్రదేశాలను ఖాళీ చేయాలని నోటీసు ఇచ్చామని ఘాజియాబాద్ ఏడీఎం శైలేంద్ర కుమార్ సింగ్ ఘాజీపూర్ వద్ద చెప్పినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.

అయితే, భారత రైతు సంఘం నాయకుడు రాకేశ్ టికైత్ నాయకత్వంలో అక్కడ ధర్నా కొనసాగుతోంది. ఉద్యమం కొనసాగుతుంది, అరెస్టులేమీ ఉండవని ఆయన అక్కడ ఉన్న ప్రదర్శనకారులతో అన్నారు. నిరసనకారులపై కాల్పులు జరిపే అవకాశం ఉందని కొందరు బీజేపీ నాయకులు అంటున్నారు, అలాంటిదేదైనా జరిగితే అందుకు పోలీసు శాఖ బాధ్యత వహించాల్సి ఉంటుందని టికైత్ అన్నారు.

ఈ సందర్భంగా భావోద్వేగానికి గురై కంటతడి పెట్టిన టికైత్, ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని అన్నారు.

నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న చోటు నుంచి ఏమాత్రం కదలేది లేదని చెప్పిన టికైత్, తాము నిరహార దీక్షను మొదలు పెడుతున్నామని చెప్పారు. 'మేం ఘాజియాబాద్ నీళ్లు తాగం. మా ఊరి నుంచి నీళ్లు వచ్చిన తరువాత, అవే తాగుతాం" అని అన్నారు.

సింఘూ బార్డర్ వద్ద ఉద్యమానికి సంఘీభావం తెలిపేందుకు గురువారం మధ్యాహ్నం రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. అయితే, సింఘూ సరిహద్దు ప్రాంతంలో ఏం జరుగుతోందన్నది ఘాజీపూర్ సరిహద్దు వద్ద ఉన్న వారికి పెద్దగా తెలియదు. దిల్లీలో పలు చోట్ల ఇంటర్నెట్ సేవల వేగం తగ్గించడం, కొన్ని చోట్ల నెట్ వర్క్ పూర్తిగా డౌన్ అవడంతో ఇక్కడేం జరుగుతుందన్న దానిపై ప్రజలకు కూడా సరైన సమాచారం అందడం లేదు.

"ఇంటర్నెట్ లేకపోవడంతో పుకార్లు కూడా వ్యాపించాయి" అని రైతు నాయకుడు రాజీంద్ర సింగ్ దీప్ సింగ్వాలా అన్నారు. పోలీసులు చర్యలు తీసుకుంటే ఏం చేస్తారన్న ప్రశ్నకు ఆయన, "మమ్మల్ని తొలగించాలని ప్రయత్నిస్తే కుదరదు. మేం అంత తేలికగా కదలం. ఉద్యమం కొనసాగుతుంది" అని ఆయన అన్నారు.

టీక్రీ సరిహద్దు వద్ద రైతులు త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు. రైతులు నిరసన తెలుపుతున్న ప్రదేశాలలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఉద్యమ నేతలు రైతుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ప్రయత్నిస్తున్నారు.

'25 కేసులు నమోదు చేసి, 19 మందిని అరెస్ట్ చేశాం' - దిల్లీ పోలీసు కమిషనర్

దిల్లీలో మంగళవారం జరిగిన రైతుల ట్రాక్టర్ ర్యాలీలో హింసాత్మక ఘటనలకు సంబంధించి 25కు పైగా కేసులు నమోదు చేశామని దిల్లీ పోలీసు కమిషనర్ ఎస్ఎన్ శ్రీవాస్తవ బుధవారం సాయంత్రం ప్రకటించారు.

విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ కేసులకు సంబంధించి 19 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. మరో 50 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. "పోలీసులతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రైతు నాయకులు ఉల్లంఘించారు. నమ్మక ద్రోహానికి పాల్పడ్డారు. ఈ అపరాధాలకు సంబంధించి ఎవరినీ విడిచి పెట్టేది లేదు. అందరి మీదా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం" అని శ్రీవాస్తవ అన్నారు.

ఇంకా, "మంగళవారం నాటి ఘటనల్లో 394 మంది పోలీసులు గాయపడ్డారు. కొందరు ఇప్పటికీ ఐసీయూలో న్నారు. 428 బారికేడ్లు, 30 పోలీసు వాహనాలు, 6 కంటైనర్లు దెబ్బ తిన్నాయి. ఎర్రకోట మీద మతం జెండాను ఎగురవేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా నిందితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం" అని కూడా చెప్పారు.

పాకిస్తాన్‌కు సంబంధించిన 308 ట్విటర్ హ్యాండిల్స్‌ను నిషేధించినట్లు తెలిపిన కమిషనర్, పోలీసుల వల్ల ఏ ఒక్కరూ చనిపోలేదు. వారు పరిస్థితిని సమర్థంగా అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారని తెలిపారు. అంతేకాదు, రైతులు ట్రాక్టర్ ర్యాలీ చేయబోతున్నరన్న సంగతి తమకు జనవరి రెండో తేదీనే తెలిసిందన్నారు.

రైతుల ఉద్యమాన్ని అణచివేసేందుకు నీచమైన కుట్ర జరుగుతోందన్న రైతు సంఘాలు

రైతు సంఘాలు బుధవారం నాడు బల్బీర్ సింగ్ రాజేవాల్ నాయకత్వంలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా రైతు రిపబ్లిక్ డే పరేడ్‌కు ఊహించిని స్థాయిలో స్పందించిన రైతులందరికీ వారు ధన్యవాదాలు తెలిపారు.

వ్యవసాయ చట్టాలకు నిరసనగా కొనసాగుతున్న ఆందోళనల్లో భాగమైన సంఘాల నేతలు దిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనల గురించి చర్చించారు. రైతులు చేపట్టిన ఈ ఉద్యమం కేంద్ర ప్రభుత్వాన్ని కుదిపేసిందని వారన్నారు. అందుకే, కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీతో పాటు మరికొన్ని వర్గాలతో కలిసి నీచమైన కుట్రకు పథకం పన్నారని వారు ఆరోపించారు. శాంతియుతంగా సాగుతున్న రైతుల ధర్నా మీద బురద జల్లే ప్రయత్నం చేశారన్నారు. వారెవరూ రైతు ఆందోళనను కలిసి కట్టుగా నడిపిస్తున్న సంఘాలకు చెందిన వారు కారని చెప్పారు.

సమావేశం అనంతరం చైర్మన్ బల్బీర్ సింగ్ రాజేవాల్‌తో పాటు జగ్‌జీత్ సింగ్ డల్లేవాల్, డాక్టర్ దర్శన్ పాల్ తదితర రైతు సంఘాల నాయకులు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.

BBC బల్బీర్ సింగ్ రాజేవాల్‌

"జనవరి 26న కిసాన్ పరేడ్ నిర్వహిస్తున్నట్లు రైతు సంఘాలు ప్రకటించగానే, మాతో సంబంధం లేని ఆ రైతు సంఘంతో దీప్ సిద్ధు వంటి అసాంఘిక శక్తులు చేతులు కలిపి ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాయి. ఈ కుట్రలో భాగంగానే సదరు రైతు సంఘం వారు, మరికొందరు కలిసి రింగ్ రోడ్డు మీదుగా ప్రదర్శన నిర్వహించి ఎర్రకోట మీద జెండా ఎగరవేస్తామని ప్రకటించారు. నిర్ణీత సమయానికి రెండు గంటలు ముందుగా కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ రింగ్ రోడ్ మీద ప్రదర్శన ప్రారంభించింది. ఇదంతా, శాంతియుతంగా సాగుతున్న రైతుల ఆందోళనను అణచివేసేందుకు జరిగిన లోతైన కుట్ర" అని ఆ ప్రకటనలో తెలిపారు.

సంయుక్త కిసాన్ మోర్చా కూటమిలోని సభ్య సంఘాలన్నీ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాయని కూడా వారన్నారు.

ఎర్రకోట వద్ద రైతుల నిరసనలు

"ఆందోళనలో భాగమైన రైతు సంఘాలకు చెందిన రైతులందరూ నిరసన ప్రదేశాలకు పరిమితమైన శాంతియుత ఆందోళన కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నాం" అని చెప్పిన రైతు సంఘాల నాయకులు ఉద్యమం కొనసాగుతుందని అన్నారు. ప్రభుత్వం, పాలక యంత్రాంగం తీరును, రైతుల ఆందోళనను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసిన ఆ రైతు సంఘం చర్యలను వారు తీవ్రంగా ఖండించారు.

రిపబ్లిక్ డే నాటి ఘటనలతో రైతు వ్యతిరేక శక్తులెవరో తేటతెల్లమైందని ఈ సమాశం ప్రకటించింది. రైతు ఆందోళనల భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించేందుకు బుధవాం నాడు జరిగిన ఈ సమావేశంలో 32 రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.

భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికైత్ కూడా దీప్ సిద్ధు సిక్కు కాదని, ఆయన బీజేపీ కార్యకర్త అని అన్నారు.

"ఆయన ప్రధానితో దిగిన ఫోటో కూడా బయటకు వచ్చింది. ఇది రైతుల ఉద్యమం. రైతు ఉద్యమంగానే కొనసాగుతుంది. బారికేడ్లను తోసుకుని వెళ్లిన వారంతా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి" అని అన్నారు.

బీకేయూ మహిళా విభాగం అధ్యక్షురాలు హరీందర్ బిందు కూడా రైతుల ఉద్యమాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని బీబీసీతో అన్నారు.

"రైతుల ఆందోళనలను పక్కదారి పట్టించి, అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రభుత్వం పన్నిన కుట్ర ఇది. లేకపోతే, అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన ఎర్రకోట మీదకు ఎక్కడం ఎవరికీ సాధ్యమయ్యేది కాదు" అని ఆమె అన్నారు.

source: bbc.com/telugu

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: BBC Telugu
Top