Thursday, 26 Nov, 11.12 am BBC తెలుగు

హోమ్
RCEP: చైనా ముందుండి నడిపించిన ఈ ఒప్పందంలో భారత్ ఎందుకు చేరలేదు?

MANAN VATSYAYANA

ఆసియా దేశాల స్వేచ్ఛ వాణిజ్యం ఒప్పందం రీజినల్ కాంప్రెహెన్సివ్ ఎకనమిక్ పార్ట్‌నర్‌షిప్ (ఆర్‌సీఈపీ)ని ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య ఒప్పందంగా పిలుస్తున్నారు. 30 శాతం ప్రపంచ జనాభాను వాణిజ్య పరంగా అనుసంధానించడమే లక్ష్యంగా ఈ ఒప్పందాన్ని తయారుచేశారు.

ముఖ్యంగా దిగుమతులపై సుంకాలు తగ్గస్తూ, ఆసియా దేశాల మధ్య పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచడమే ఆర్‌సీఈపీ లక్ష్యం.

అయితే, ఆర్‌సీఈపీలో చైనా భాగస్వామ్యం కావడంతో, ఈ దేశాల వాణిజ్యంలో చైనా ఆధిపత్యం మరింత పెరుగుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ ఒప్పందానికి దూరంగా ఉండాలని గతేడాది భారత్ నిర్ణయం తీసుకుంది. చైనా చౌక ఉత్పత్తులు భారతీయ మార్కెట్లోకి కుప్పలుతెప్పలుగా వస్తే, ఇక్కడి పరిశ్రమలకు తీవ్రమైన నష్టం జరుగుతుందని భారత్ భావించింది. మరోవైపు వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి భారత్, చైనాల మధ్య కొన్ని నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటుచేసుకుంటున్నాయి.

అయితే, తాజా ఒప్పందంతో జపాన్, దక్షిణ కొరియా, చైనా ఒకే వేదికపైకి వచ్చాయి. ఈ దేశాల మధ్య ఎప్పటినుంచో విభేదాలు ఉన్నాయి.

మరోవైపు చైనా వాణిజ్యంలో కీలకపాత్ర పోషించే ఆస్ట్రేలియా కూడా ద్వైపాక్షిక బంధాల్లో ఒడిదొడుకులను పక్కనపెట్టి ఆర్‌సీఈపీలో చేరేందుకు అంగీకారం తెలిపింది.

దక్షిణాసియాలోని పది దేశాలు ఆర్‌సీఈపీలో సభ్యులుగా ఉన్నాయి. జపాన్, చైనా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌తోపాటు సింగపూర్, మలేసియా, ఇండోనేసియా, మయన్మార్ కూడా దీనిలో సభ్యత్వం తీసుకున్నాయి. నవంబరు 15న జరిగిన వర్చువల్ సదస్సులో ఈ దేశాల నాయకులు ఆర్‌సీఈపీ ఒప్పందంపై సంతకం చేశారు.

ఆస్ట్రేలియాతో ఇబ్బందులు తప్పవా?

నవంబరు 2019లో ఆర్‌సీఈపీ ఒప్పంద చర్చల నుంచి భారత్ తప్పుకున్నప్పుడు, జపాన్ ఆర్థిక శాఖ సహాయక మంత్రి హేదికి మాకిహారా స్పందించారు. ''ఆర్‌సీఈపీలో పాల్గొనేలా భారత్‌ను మేం ఒప్పిస్తాం. ఎందుకంటే ఆర్థికంగా, రాజకీయంగా, వ్యూహాత్మకంగా భారత్ ఆర్‌సీఈపీలో ఉండటం చాలా ముఖ్యం''అని ఆయన అన్నారు.

సుదీర్ఘ మంతనాల తర్వాత, భారత్ సమ్మతి తెలపకపోవడంతో, జపాన్ ఈ ఒప్పందంపై సంతకం చేసింది. కరోనావైరస్ వ్యాప్తితో ఆర్థిక వ్యవస్థలు కుదేలైన నడుమ, ఈ బ్లాక్‌లో చైనా ఆధిపత్యం మరింత పెరుగుతుందనే ఊహాగానాల నడుమ జపాన్ ఇందులో చేరివుండొచ్చు.

గత దశాబ్దంలో ఇలాంటి చాలా వాణిజ్య ఒప్పందాలను జపాన్ కుదుర్చుకుంది. కాంప్రెహెన్సివ్ అండ్ ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్ ఫర్ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్‌నర్‌షిప్ (సీపీటీపీపీ), జపాన్-యూరోపియన్ యూనియన్ ఎకనమిక్ పార్ట్‌నర్‌షిప్ తదితర ఒప్పందాలు వీటిలో ఉన్నాయి.

ఆర్‌సీఈపీపై ఆగస్టు 3న, ద డిప్లమాట్, వెబ్‌సైట్‌లో ఓ కథనం ప్రచురితమైంది. ''ఆర్‌సీఈపీలో చేరకూడదని భారత్ తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోకుంటే, దక్షిణాసియా దేశాల్లో చైనా వాణిజ్య ఆధిపత్యం కొనసాగుతుంది''అని దానిలో పేర్కొన్నారు.

వాణిజ్య పరంగా చూస్తే జపాన్‌కు ఇది మంచి అవకాశం. ఎందుకంటే దక్షిణ కొరియా, చైనా మార్కెట్లలోకి జపాన్ ఆటోమొబైల్ సంస్థలు మరింతగా చొచ్చుకువెళ్లేందుకు అవకాశం లభిస్తుంది. అదే సమయంలో వరి, గోధుమ, డెయిరీ ఉత్పత్తులపై దిగుమతి సుంకాల విషయంలోనూ మేలు జరుగుతుంది.

''చైనాకు దిగుమతయ్యే వాణిజ్య సరకులపై దాదాపు 86 శాతం సుంకాలు తగ్గిపోతాయి. ఫలితంగా జపాన్ ఎగుమతిదారులకు ఎంతో మేలు జరుగుతుంది''అని బిజినెస్ పేపర్ నిక్కీ విశ్లేషించింది.

మరోవైపు ఆర్‌సీఈపీలో చేరినప్పటికీ ద్వైపాక్షిక వివాదాల విషయంలో వెనక్కి తగ్గబోమని ఆస్ట్రేలియా సంకేతాలు ఇస్తోంది.

''ఆర్‌సీఈపీపై సంతకం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వాణిజ్య ఒప్పందంతో పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదు. మేం అంత సంతోషపడాల్సిన అవసరంలేదు. చైనాను ఇప్పుడు ప్రశంసించాల్సిన అవసరంలేదు''అని ఆస్ట్రేలియా మాజీ ప్రధాని మాల్కోమ్ టర్న్‌బుల్ వ్యాఖ్యానించినట్లు నవంబరు 13న సౌత్‌చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది.

ఆస్ట్రేలియా, చైనాల మధ్య ఇప్పటికే ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలులో ఉంది. అయినప్పటికీ, రెండు దేశాలు చాలా సరకులపై సుంకాలు విధించుకుంటున్నాయి. ఆర్‌సీఈపీ అమలులోకి వచ్చినా పరిస్థితి మారుతుందని అనుకోవడానికి వీల్లేదు.

చైనా ప్రాబల్యం పెరుగుతుందా?

దక్షిణ కొరియా, జపాన్‌లతో చైనా కుదుర్చుకుంటున్న తొలి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇది. మరోవైపు చైనాకు కూడా ఇదే తొలి బహుళపక్ష స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.

''చైనా, మిగతా భాగస్వామ్య దేశాల మధ్య పెట్టుబడులు, వాణిజ్య వృద్ధికి ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది. ఎన్నో సైద్ధాంతిక విభేదాలతోపాటు వివాదాలున్నప్పటికీ ఈ ఒప్పందంతో చాలా మేలు జరుగుతుంది''అని నవంబరు 16న సౌత్‌చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది.

అయితే, చాలా వివాదాలు ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్నాయని, అందుకే ఒప్పందం నుంచి వైదొలుగుతున్నామని గత ఏడాది భారత్ తెలిపింది.

''ఇలాంటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో భారత్‌కు అంత మేలు జరగదు. ఎందుకంటే భారత్‌ది ఎగుమతుల ఆధారిత ఆర్థిక వ్యవస్థ కాదు. ఇక్కడ దిగుమతులే కీలకపాత్ర పోషిస్తాయి. ఒకవేళ ఆర్‌సీఈపీలో భారత్ చేరితే, చైనా బాగా లబ్ధి పొందుతుంది''అని ఆసియా టైమ్స్‌లో నవంబరు 15న ఓ కథనం ప్రచురితమైంది.

డెయిరీ, జౌళి, వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతి సుంకాలను తగ్గించాలనే నిబంధనను భారత్ వ్యతిరేకిస్తోంది. మరోవైపు సాంకేతిక సమాచార సేవలకూ దీనిలో భాగస్వామ్యం కల్పించాలని చెబుతోంది. ఎందుకంటే వీటి వాటా భారత జీడీపీలో 8 శాతం వరకు ఉంటుంది.

చైనాతో సరిహద్దు వివాదాల నడుమ కొన్ని నెలలుగా భారత్‌లో చైనా ఉత్పత్తులపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీంతో ఈ సమయంలో ఆర్‌సీఈపీలో చేరడం మంచిదికాదని భారత్ ప్రభుత్వం భావించింది.

''ఆర్‌సీఈపీతో చైనా, జపాన్‌ల ప్రాబ్యలం పెరగుతుందని భారత్ భావించింది. అందుకే ఈ ఒప్పందంలో భారత్ చేరలేదు''అంటూ భారత్ చర్యలను చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ విమర్శించింది.

మరోవైపు ఆర్‌సీఈపీని చైనా నేతృత్వంలో, చైనా నడిపిస్తున్న ఒప్పందంగా అంతర్జాతీయ మీడియా అభివర్ణించింది. అయితే, చైనా పాత్రను ఎక్కువగా ఉందన్న వాదనను చైనా మీడియా తప్పుపట్టింది. ఈ ఒప్పందాన్ని ఆగ్నేయ ఆసియా దేశాలే తెరపైకి తీసుకొచ్చాయని వివరించింది.

బీఆర్‌ఐకు వాణిజ్య రూపమా?

ఆర్‌సీఈపీని చూస్తుంటే చైనా బెల్డ్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్‌ఐ)కి వాణిజ్య ఒప్పంద రూపంలా కనిపిస్తోందని ఆస్ట్రేలియ మాజీ ప్రధాని టోనీ అబాట్ గత నవంబరులో భారత్‌లో పర్యటించినప్పుడు వ్యాఖ్యానించారు.

ఈ ఒప్పందం అమలులోకి వస్తే, సభ్య దేశాలు 20ఏళ్లలోగా దిగుమతి సుంకాలను 90 శాతం వరకు తగ్గించాల్సి ఉంటుంది. దీని కోసం సభ్యదేశాలు ప్రత్యేక నిబంధనలను సిద్ధంచేసుకున్నాయి. మరోవైపు పురాతన సిల్క్ రూట్‌కు మళ్లీ జీవం పోయడమే లక్ష్యంగా తెరపైకి తెచ్చిన బీఆర్‌ఐలో భాగంగా సభ్యదేశాల్లోని మౌలిక సదుపాయాల్లో చైనా పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది. అందుకే ఆర్‌సీఈపీలో చైనా చేరినట్లు కథనాలు వస్తున్నాయి.

''ఆర్‌సీఈపీ, బెల్డ్ అండ్ రోడ్ ప్రాజెక్టుల్లో ఒకదానితో మరొకటికి మేలు జరుగుతుంది. విధానపరమైన అవరోధాలను మొదటి ఒప్పందం తొలగిస్తే.. మౌలిక సదుపాయల్లో అడ్డుగోడలను రెండోది తొలగిస్తుంది. ఫలితంగా వాణిజ్య సహకారం పెరుగుతుంది''అని చైనా ప్రభుత్వ టీవీ ఛానెల్ సీజీటీవీ వ్యాఖ్యానించింది.

బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుకు సంబంధించి పెట్టుబడుల నిబంధనలు సరళీకరించడానికి ఆర్‌సీఈపీ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆసియాన్ దేశాల్లో రవాణా సదుపాయాల అభివృద్ధికి తోడ్పడుతుంది. చివరగా సిల్కు మార్గం లక్ష్యం చేరుకునేందుకు చైనాకు తోడ్పడుతుంది.

బెల్ట్ అండ్ రోడ్డు ప్రాజెక్టులో చైనాదే ఆధిపత్యం. ప్రస్తుతం ఆర్‌సీఈపీలో చేరిన జపాన్, దక్షిణ కొరియా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి.

ఇది చైనాకు తొలి బహుళపక్ష స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కావడంతో, చైనా దౌత్య నైపుణ్యాలకు ఇదొక పరీక్ష లాంటిది. అమెరికాతోపాటు కొన్ని ఐరోపా దేశాలతో సంబంధాలు క్షీణిస్తున్న నేపథ్యంలో చైనాకు ఇది చాలా కీలకం.

ఆర్‌సీఈపీపై సంతకం చేసిన రెండు రోజుల తర్వాత, నవంబరు 17న.. జపాన్, ఆస్ట్రేలియా భద్రతా ఒప్పందమైన ద రెసిప్రోకల్ యాక్సెస్ అగ్రిమెంట్ (ఆర్‌ఏఏ)పై సంతకాలు చేశాయి. వివాదాస్పద అంశాల విషయంతో తాము ఎలాంటి వెనకడుగు వేయడంలేదని దీని ద్వారా చైనాకు రెండు దేశాలూ సంకేతం పంపాయి.

source: bbc.com/telugu

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: BBC Telugu
Top