Saturday, 23 Jan, 7.36 am BBC తెలుగు

హోమ్
సెన్సెక్స్‌ జోరుకు, ఆర్థిక వ్యవస్థ బేజారుకు కారణాలు ఏంటి? స్టాక్‌ మార్కెట్‌లో బుల్‌ రన్‌ ఎన్నాళ్లు కొనసాగుతుంది?

బీఎస్‌ఈలో సెన్సెక్స్‌ 50,000 మార్కును దాటి రికార్డు సృష్టించింది

బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో జనవరి 21 సువర్ణాక్షరాలతో రాయదగిన రోజు. 145 ఏళ్లకు పైబడిన చరిత్ర ఉన్న ఈ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ తొలిసారి 50,000 పాయింట్లను దాటింది.

2020 మార్చి చివరి వారంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ మొదలైనప్పుడు సెన్సెక్స్ 25,638 పాయింట్లకు పడిపోయింది. కానీ పది నెలల తర్వాత అది రెట్టింపై, రికార్డులు బద్దలు కొడుతూ ఆల్‌ టైమ్‌ హైకి చేరుకుంది.

ఒక అంచనా ప్రకారం 2020 సంవత్సరంలో స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టినవారు 15 శాతం లాభపడ్డారు. ఇంత తక్కువ సమయంలో మరే రంగంలోనైనా పెట్టుబడులకు ఈ స్థాయి లాభాలు పొందడం అసాధ్యమంటారు నిపుణులు

గత 10 నెలల్లో స్టాక్‌ మార్కెట్‌లో ఈ విపరీతమైన పెరుగుదలకు కారణాలు ఏమిటి? ఈ ఫీల్‌గుడ్ టైమ్‌ ఎంతకాలం కొనసాగుతుంది?

ఈ రెండు ప్రశ్నలను సమాధానాలు వెతికే ముందు, కరోనా కారణంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుంగిపోగా, 10 నెలల వ్యవధిలో స్టాక్ మార్కెట్‌లోఈ స్థాయి లాభాలు ఎలా సాధ్యమన్న విషయాన్ని కూడా ఆలోచించాలి.

ఆర్థిక వ్యవస్థకు, మార్కెట్‌కు మధ్య తేడా ఎందుకుంది?

దేశ అర్ధవ్యవస్థ కుంగుబాటులో ఉండగా, ముంబైలోని దలాల్‌ స్ట్రీట్‌లో పండుగ వాతావరణం ఎలా సాధ్యమన్నది చాలామందిమదిలో ఉత్పన్నమయ్యే ప్రశ్న. దీనికి నేరుగా సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే ఒక్క భారత్‌లోనే కాదు అమెరికా, దక్షిణ కొరియాలతోపాటు మరికొన్ని ఆర్థిక వ్యవస్థలలో కూడా ఇలాంటి పోకడలు కనిపిస్తున్నాయి.

దీనినే గ్లోబల్‌ ట్రెండ్ అంటారు. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత ఎకానమీ కుచించుకుపోతుందని, అయితే స్టాక్‌మార్కెట్లలో విజృంభణ ఉంటుందని ముంబైకి చెందిన ఆర్థికవేత్త వివేక్ కౌల్ అన్నారు. మార్కెట్లో అదనపు లిక్విడిటీ ఉండటమే దీనికి ప్రధాన కారణమని చెప్పవచ్చు.

ఆర్ధిక వ్యవస్థను, మార్కెట్‌ను విడదీసే ఈ గ్లోబల్ ట్రెండ్‌కు మూడు ప్రధాన కారణాలున్నాయన్నారు వార్టన్‌ బిజినెస్‌ స్కూల్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఇటే గోల్డ్‌స్టెయిన్‌.

మొదటిది, ఇన్వెస్టర్లు భవిష్యత్తు మీద ఎక్కువ దృష్టి పెడతారు. కానీ ఆర్ధికవ్యవస్థ అనేది ప్రస్తుతం ఏం జరుగుతుందనే అంశంపై నిఘా ఉంచుతుంది. ఉత్పత్తి, ఉపాధి రంగాలలో ఏం జరుగుతుందో ఆర్ధిక వ్యవస్థ గమనిస్తూ ఉంటుంది.

రెండో కారణం, కేంద్రీయ బ్యాంకుల నుంచి ఆర్ధిక వ్యవస్థలోకి నగదు ప్రవహించడం. కరోనా మహమ్మారితో పోరాడటానికి పెద్ద పెద్ద ఆర్ధిక వ్యవస్థలు భారీ ప్యాకేజీలు ప్రకటించాయి. దీంతో మార్కెట్‌లోకి నగదు చేరిందని గోల్డ్‌స్టెయిన్‌ అంటారు.

ఇక మూడోది, స్టాక్‌ మార్కెట్‌లో ఉన్న కంపెనీలన్నీ ఆర్ధికవ్యవస్థతో సంబంధం ఉన్నవి కాకపోవడం. ఫేస్‌బుక్‌, గూగుల్, అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌లాంటి సంస్థలను ఉదాహరణగా చూపించారు గోల్డ్‌స్టెయిన్‌. ఈ కంపెనీలేవీ ఆర్ధికవ్యవస్థను నడిపించేవి కావు. వీటి స్టాక్‌ ధరలు విపరీతంగా పెరిగాయి.

మార్కెట్‌ 'బూమ్‌'కు కారణాలు ఏంటి?

గత కొన్ని నెలలుగా భారత్‌తోపాటు ప్రపంచదేశాల మార్కెట్లలో బుల్‌ రన్‌ కనిపిస్తోంది. మహమ్మారిని ఎదుర్కోవడానికి అమెరికా అనేక ఆర్ధిక ప్యాకేజీలు ప్రకటించింది. దీంతో మార్కెట్‌లో లిక్విడిటీ పెరిగిందని స్టాండర్డ్‌ చార్టర్డ్‌ సెక్యూరిటీస్‌కు చెందిన ప్రతీక్‌ కపూర్‌ అభిప్రాయపడ్డారు.

"అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారతదేశం సురక్షితమైన, లాభదాయకమైన మార్కెట్. కాబట్టి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐలు) భారతదేశంలో పెట్టుబడులు పెట్టి మార్కెట్‌ వేగాన్ని పెంచుతున్నారు. మార్కెట్‌ పడిపోతే వారు నగదును వెనక్కి తీసుకుంటారు. కానీ గత కొన్నిరోజులుగా వారు పెట్టుబడులుపెడుతూనే ఉన్నారు" అన్నారు ప్రతీక్‌ కపూర్‌.

వడ్డీరేట్లు తగ్గించడం కూడా మరో కారణమంటారు ప్రతీక్‌ కపూర్‌. అమెరికాలో అధికార మార్పిడి జరగడం, కొత్త అధ్యక్షుడి కొన్ని నిర్ణయాలతో మార్కెట్‌లో సానుకూల వాతావరణం ఏర్పడిందని ప్రతీక్‌ అన్నారు.

2020 సంవత్సరంలో విదేశీ పెట్టుబడిదారులు భారత స్టాక్‌ మార్కెట్‌లో 32 బిలియన్ డాలర్ల ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇది మునుపెన్నడూ లేనంత పెద్ద మొత్తం.

2019లో కూడా ఎఫ్‌ఐఐల నుంచి పెట్టుబడులు బాగానే వచ్చాయి. 2021లో విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్లపై ఆసక్తిని కొనసాగించే అవకాశం ఉంది. ఈ ఏడాది 25- 30 బిలియన్‌ డాలర్ల విదేశీ పెట్టుబడులు రావచ్చని అంచనా.

నగదు లభ్యత కారణంగానే స్టాక్‌ మార్కెట్‌లో జోష్ కనిపిస్తోందని వివేక్‌ కౌల్‌ అన్నారు.

"వడ్డీరేట్లు బాగా పడిపోవడంతో చాలామంది పెట్టుబడిదారులు షేర్లపై ఆసక్తి చూపించారు. ఆర్‌బిఐ ఆర్థిక వ్యవస్థకు ఊపునిచ్చే చర్యలు చేపట్టింది. దీంతో నగదు లభ్యత పెరిగింది. వీటన్నిటి కారణంగా స్టాక్‌ మార్కెట్ పెరుగుతోంది. అయితే ఈ సంవత్సరం కూడా ఇండియన్‌ ఎకానమీలో క్షీణత కొనసాగుతుందని నేను భావిస్తున్నాను'' అన్నారు వివేక్‌ కౌల్‌.

మార్కెట్‌ వృద్ధికి స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టే ధోరణి దేశంలో క్రమంగా పెరుగడం కూడా ఒక కారణం. 2020 సంవత్సరంలో రిటైల్ ఇన్వెస్టర్ల విభాగంలో యువ పెట్టుబడిదారుల సంఖ్య ఒక కోటి పెరిగిందని ఇటీవల విడుదలైన ఒక నివేదిక పేర్కొంది.

దీర్ఘకాలిక పెట్టుబడులపై ఆసక్తి ఉన్నవారు బ్యాంకుల్లోకన్నా రియల్‌ ఎస్టేట్‌, స్టాక్‌ మార్కెట్‌లలో పెట్టుబడులకు ఇష్టపడుతుంటారు.

INDRANIL MUKHERJEE/GETTY IMAGES

ఈ విజృంభణ కొనసాగుతుందా?

మార్కెట్‌లో ఏదైనా అనిశ్చితి ఉందా? లేదంటున్నారు నిపుణులు. మార్కెట్ మరింత పెరుగుతుందని వారు స్పష్టం చేస్తున్నారు."విదేశీ పెట్టుబడిదారులు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. బైడెన్‌ కొత్త ఆర్థిక ప్యాకేజీ మార్కెట్‌కు మరింత శోభను తెచ్చింది. అయితే రాబోయే రోజులలో కొంత కరెక్షన్‌ ఉండవచ్చు. హెచ్చుతగ్గులు నమోదవుతాయి. కొన్ని కంపెనీల స్టాక్‌ ధరలు తగ్గుతాయి'' అన్నారు మార్కెట్‌ నిపుణుడు ప్రతీక్‌ కపూర్‌.

ఆర్థిక స్థిరత్వం అవసరాన్ని నొక్కిచెప్పిన రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌, మార్కెట్‌కు, ఆర్ధిక వ్యవస్థకు సంబంధాలు తెగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ధోరణిపై నిఘా ఉంచడం ముఖ్యమని ఆయన అన్నారు.

  • కరోనావైరస్‌కు పుట్టిన కవలపిల్లలు: పేదరికం - పొదుపు.. కలిసి పెరుగుతున్నాయిలా...

source: bbc.com/telugu

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: BBC Telugu
Top