Friday, 24 Sep, 8.04 am BBC News తెలుగు

భారతదేశం
తెలంగాణలో ప్రభుత్వ పరిధిలోకి మాంసం షాపులు - ప్రెస్ రివ్యూ

తెలంగాణ రాష్ట్రంలో అన్ని మాంసం దుకాణాలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలని పశుసంవర్ధక శాఖ యోచిస్తున్నట్లు 'నమస్తే తెలంగాణ' కథనం రాసింది.

''ఇందులో భాగంగానే మొదటగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా కబేళాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తున్నది.

జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రతిజోన్‌ పరిధిలో ఒక కబేళా, జిల్లాల్లో ఒకటి లేదా రెండు ఏర్పాటుచేయాలని భావిస్తున్నది.

వీటిని స్థానికంగా ఉండే మటన్‌ దుకాణాలకు లింక్‌ చేసి.. అక్కడి నుంచే మాంసం సరఫరా చేస్తారు. దుకాణదారులు ప్రభుత్వం అందించిన మాంసాన్నే విక్రయించాల్సి ఉంటుంది.

దీనిద్వారా వినియోగదారులకు శుద్ధమైన మాంసం అందడంతోపాటు, తక్కువ ధరకు లభించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

మాంసం దుకాణాల్లో శుభ్రత పాటించేలా నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.

దుకాణాల ఆధునికీకరణకు అవసరమైతే బ్యాంకుల నుంచి రుణం కూడా ఇప్పించేందుకు చర్యలు తీసుకోనున్నారు.

ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో సుమారు 10 వేలదాకా మటన్‌ షాపులు ఉండగా.. రెండువేల దుకాణాలకు మాత్రమే ప్రభుత్వ అనుమతి ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ షాపులన్నింటినీ ప్రభుత్వ ఆధీనంలోకి తేవాలని భావిస్తున్నట్లు'' కథనంలో రాసుకొచ్చింది.

పూర్తి స్థాయిలో పాస్‌పోర్టు అపాయింట్‌మెంట్లు

పాస్‌పోర్టు దరఖాస్తుదారులకు 100 శాతం అపాయింట్‌మెంట్లు ఇస్తున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య తెలిపారని 'ఈనాడు' పేర్కొంది.

''గతంలో కోవిడ్‌ను దృష్టిలో పెట్టుకొని పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, పాస్‌పోర్టు సేవా లఘు కేంద్రాలు, పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో అపాయింట్‌మెంట్లను కుదించామని అన్నారు.

ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో వాటిని పూర్తి స్థాయిలో పునరుద్ధరించామని పేర్కొన్నారు.

సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కేంద్రంలోని విచారణ కౌంటర్ కూడా పనిదినాల్లో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తుందని ఆయన వివరించినట్లు'' కథనంలో పేర్కొన్నారు.

దుర్గమ్మ దర్శనానికి.. వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్లు తప్పనిసరి

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై అక్టోబర్‌ 7 నుంచి ప్రారంభమయ్యే దసరా మహోత్సవాలను కోవిడ్‌ నిబంధనల మేరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు 'సాక్షి' వెల్లడించింది.

''ఇందుకు సంబంధించి గురువారం కార్పొరేషన్‌ కౌన్సిల్‌ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా కలెక్టర్‌ జే నివాస్‌ మాట్లాడుతూ.. దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకున్నట్లుగా సర్టిఫికెట్‌ను వెంట తెచ్చుకోవాలని సూచించారు.

అలాగే, భవానీలు తమతమ స్వస్థలాల్లోనే దీక్ష విరమణ చేయాలన్నారు. కొండపైకి వాహనాలను అనుమతించబోమని, వీఐపీ భక్తులకోసం 15 వాహనాలను ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇక మూలా నక్షత్రం రోజున పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల వీఐపీ, ప్రొటోకాల్, బ్రేక్‌ దర్శనాలను రద్దుచేస్తున్నట్లు జే. నివాస్ ప్రకటించారు.

మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ.. తెల్లవారుజామున 4 నుంచి రాత్రి 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో టికెట్లు పొందిన భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపారు.

ప్రతిరోజు ఉచిత దర్శనం ద్వారా 4 వేలు, రూ.300 టికెట్‌పై 3 వేలు, రూ.100 టికెట్‌పై మరో 3 వేల మందిని మాత్రమే అనుమతించాలని నిర్ణయించినట్లు '' సాక్షి కథనంలో రాసుకొచ్చింది.

source: bbc.com/telugu

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: BBC Telugu
Top