Wednesday, 25 Nov, 9.59 am BBC తెలుగు

తెలంగాణ
తెలంగాణలో సినిమా థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతి... మరి బొమ్మ పడుతుందా?

తెలంగాణలో సినిమా థియేటర్లు తెరచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీని కోసం కోసం కొన్ని నిబంధనలు విధించింది. మరి థియేటర్లు తెరుచుకుంటాయా?

సగం మందితో థియేటర్లు నడపవచ్చని అక్టోబరు 7నే కేంద్రం అనుమతిచ్చింది. దానికి అనుగుణంగా సినీ పరిశ్రమకు చెందిన వారితో కేసీఆర్ సమావేశం తరువాత, తెలంగాణ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఈ ఉత్తర్వు ప్రకారం, కంటైన్మెంట్ జోన్లకు బయట ఉన్న అన్ని రకాల థియేటర్లూ సగం కెపాసిటీతో నడపవచ్చు.

థియేటర్లు తెరచుకోవడానికి సమస్య లేదు కానీ, అంతకు మించిన సమస్యలు యజమానులను వేధిస్తున్నాయి.

నిజానికి కరోనావైరస్ కంటే ముందు నుంచీ తెలంగాణలో సినిమా థియేటర్ల వ్యాపారం బాగా దెబ్బతింది. పార్కింగ్ ఆదాయం కోల్పోడంతో థియేటర్ల నిర్వహణలో చాలా పెద్ద ఆదాయ లోటు ఏర్పడిందని చెబుతున్నారు యజమానులు.

''మాకు మూడు రకాల ఆదాయాలు ఉంటాయి. ఒకటి టికెట్, రెండు పార్కింగ్, మూడు క్యాంటీన్. టికెట్ ధరలో ఎక్కువ భాగం నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌కే పోతుంది. క్యాంటీన్, పార్కింగ్ ఆదాయంతోనే మేం నడపాలి. కానీ పార్కింగ్ ఆదాయం లేకపోవడంతో మాపై దెబ్బ పడింది. ప్రభుత్వం కనీస పార్కింగ్ ధరను అనుమతించాలి. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం'' అన్నారు బాల గోవింద రాజ్. ఆయన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని దేవి, సుదర్శన్ థియేటర్లలో పార్టనర్‌గా ఉన్నారు. థియేటర్లు బతకాలంటే పార్కింగ్ చార్జీలు వసూలు చేయడానికి అనుమతి ఉండాలని ఆయన అంటున్నారు.

Reuters పాత చిత్రం

మాల్స్/వినోద ప్రదర్శన స్థలాలకు దగ్గరకు వచ్చే వారికి పార్కింగ్ సౌకర్యం కల్పించాలన్న కొన్ని చట్టాల్లోని క్లాజులను అమలు చేసే క్రమంలో ఈ నిబంధన తెచ్చింది ప్రభుత్వం. అయితే దానివల్ల ప్రజలకు జరిగే మేలు కంటే, పరిశ్రమకు జరిగే నష్టం శాతం ఎక్కువ ఉందని వివరించారు హైదరాబాద్లోని సుధా మల్టీప్లెక్స్ పార్టనర్ అనుపమ్ రెడ్డి.

''సగటున సినిమా చూడ్డానికి వచ్చేవారు నెలకు ఒకటి లేదా రెండు సార్లు వస్తారు. టూవీలర్ 20, కారు 30 రూపాయలు వేసుకున్నా నెలకు వారిపై భారం 40-60 రూపాయలు మాత్రమే. ఇద్దరు ముగ్గురు కలసి వస్తే ఆ భారం ఇంకా తగ్గుతుంది. దీన్ని రద్దు చేయడం వల్ల ప్రేక్షకులకు గొప్ప మిగులు ఏమీ ఉండడం లేదు. అదే సందర్భంలో దానిపై ఆధారపడ్డ వారి ఉపాధి మాత్రం తీవ్రంగా దెబ్బతింది. వేలాది మందిపై ప్రభావం పడింది. ప్రజలకూ లాభం లేక, పరిశ్రమా దెబ్బతిని.. ఇద్దరూ నష్టపోతున్నారు'' అంటూ పార్కింగ్ చార్జీల సమస్యను వివరించారు అనుపమ్ రెడ్డి.

లాక్‌డౌన్ సమయంలో హైదరాబాద్‌లో 8 థియేటర్లు మొత్తానికి మూతబడ్డాయని చెబుతున్నారు థియేటర్ యజమానులు.

''ప్రభుత్వాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటుంటారు. పెద్ద పెద్ద అంతర్జాతీయ సంస్థలకు ఎన్నో సదుపాయాలు కల్పిస్తాయి. మేమూ వ్యాపారం చేస్తున్నాం. మేమూ ఉపాధి కల్పిస్తున్నాం. పన్నులు కడుతున్నాం. కానీ మాకు ఉన్న ఆదాయ మార్గాలు కూడా రద్దు చేసేస్తే ఎలా? ప్రజలకు ధరలు తగ్గించాలి కానీ, ఇండస్ట్రీ కూలిపోయేలాచేస్తే ఎవరికీ మంచిది కాదు కదా?'' అన్నారు బాల గోవింద రాజ్.

లాక్‌డౌన్‌లోనూ లక్షల్లో కరెంటు బిల్లులు

థియేటర్లు నడవకపోయినా మినిమమ్ కరెంటు బిల్లులు కట్టాలి. మినిమమ్ అంటే ఒక పెద్ద థియేటర్ దాదాపు 50 వేల వరకూ కట్టాల్సి వస్తోంది. లాక్‌డౌన్‌లో తాను మినిమమ్ కరెంటు బిల్లుగా అక్షరాలా 16 లక్షల రూపాయలు కట్టినట్టు చెప్పారు సుధా మల్టీప్లెక్స్ యజమాని.

సినిమా టికెట్ ధరలను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. డిమాండ్‌ను బట్టి రేటు పెంచడం, తగ్గించడానికి అవకాశం లేదు. రేటు పెంచుకోవాలి అంటే వారు ప్రత్యేక ఆర్డర్లు తెచ్చుకోవాలి. అంటే భారీ సినిమా రిలీజ్ అయిన ప్రతీసారీ థియేటర్ యజమానులు లైసెన్సింగ్ అథారిటీ లేదా కోర్టుకు వెళ్లి రేట్లు పెంచుకునే ఆర్డర్ తెచ్చుకుంటారు.

అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, తీరా రేటు పెంచాక, సినిమా సరిగా ఆడకపోతే, దానికి తగ్గట్టుగా రేటు తగ్గించుకోవడానికి అవకాశం ఉండదు. అంటే సినిమా ఫ్లాప్ అయినా రేటు తగ్గించడానికి రూల్స్ ఒప్పుకోవు. దీంతో ఎవరూ రాకపోయినా టికెటును ఎక్కువ ధరకే అమ్మాలి.

కేసీఆర్ హామీలు

హైదరాబాద్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ థియేటర్ల నిర్వహణకు సంబంధించిన కొన్ని నిబంధనలు సడలిస్తామని ప్రకటించారు.

ఇతర రాష్ట్రాల తరహాలోనే ఒక రోజులో ఎన్నైనా షోలు వేసుకునేలా కూడా అనుమతిస్తామని ఆయన చెప్పారు. ఇకపై తెలంగాణలో కూడా టికెట్ రేటు విషయంలో ప్రభుత్వ నియంత్రణ లేకుండా థియేటర్లకు హక్కు ఉండేలా చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అలాగే లాక్‌డౌన్‌లో వసూలు చేసిన కరెంటు బిల్లుల నుంచి ఉపశమనం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయితే వీటిపై ఉత్తర్వలు రావాల్సి ఉంది.

సినిమా రంగంపై జీఎస్టీ 18 శాతం ఉంది. అందులో 9 శాతం రాష్ట్ర ప్రభుత్వానికీ, 9 శాతం కేంద్ర ప్రభుత్వానికీ వస్తుంది. అయితే చిన్న సినిమాల విషయంలో, అంటే 10 కోట్ల కంటే తక్కువ బడ్జెట్‌తో తీసే సినిమాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా జీఎస్టీని తిరిగి రీయంబర్సుమెంటు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

''కరోనాతో కుదేలైన సినిమా రంగానికి వరాల జల్లు కురిపించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. చిన్న సినిమాలకు జీఎస్టీ రాష్ట్ర వాటా రీయంబర్సుమెంటు, సినిమా థియేటర్లకు విద్యుత్ కనీస డిమాండ్ చార్జీల రద్దు, షోల సంఖ్య పెంచేందుకు అనుమతి, మహరారాష్ట్ర, కర్ణాటక, దిల్లీ తరహాలో టికెట్ ధరల సవరణ అవకాశం వంటి చర్యలు పరిశ్రమకూ, దానిపై ఆధార పడ్డ లక్షలాది మందికి ఎంతో తోడ్పాటుగా ఉంటుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన విజన్‌కి తగ్గట్టగా తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి సాధించి దేశంలో మొదటి స్థానాన్ని పొందుతుందన్న పూర్తి విశ్వాసం మాకుంది.'' అని ట్విట్టర్లో ప్రకటించారు చిరంజీవి.

ఇంతకీ థియేటర్లు ఎప్పుడు తెరుస్తారు?

''థియేటర్లు తెరవచ్చు అన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఎనిమిదిన్నర నెలల నుంచి మా వ్యాపారం ఆగిపోయింది. అయితే థియేటర్లు తెరవడానికి ఉన్న ఒకే ఒక ఇబ్బంది కరోనా ప్రభావం. కరోనా ప్రభావం తగ్గితేనే వ్యాపారం పెరుగుతుంది. 50 శాతం నిబంధనలు, సినిమాలు లేకపోవడం ఇలాంటివన్నీ తాత్కాలికమే. వీటిని అధిగమించవచ్చు. కానీ కరోనా మరో వేవ్ వస్తుందన్న వార్తలే పెద్ద సమస్య. కరోనా ప్రభావం తగ్గితే, జనవరి నాటికి పెద్ద సినిమాలు కనుక వస్తే ఈ సమస్యను అధిగమించవచ్చు. బహుశా అప్పుడు ప్రభుత్వం 75 శాతం వరకూ అనుమతించొచ్చు'' అన్నారు బాల గోవింద రాజ్.

అయితే, ఇప్పటికిప్పుడు మాత్రం సినిమా థియేటర్ ఓపెన్ అయ్యే అవకాశం కనిపించడం లేదు.

థియేటర్లు తీసుకోవల్సిన జాగ్రత్తలు

  • సిబ్బంది, ప్రేక్షకులు, అమ్మేవాళ్లూ.. అందరూ ఎల్లప్పుడూ మాస్కులు వేసుకోవాలి.
  • లోపలికి వెళ్లేప్పుడు, బయటకు వచ్చేప్పుడూ, అందరూ తిరిగే చోటా శానిటైజర్లు ఉంచాలి.
  • గుమిగూడకుండా, దూరం పాటించేలా చూడాలి.
  • ప్రతీ షో తరువాతా శానిటైజేషన్ జరగాలి.
  • ఏసీలు 24-30 డిగ్రీల మధ్య ఉండాలి. గాలిలో తేమ 40-70 శాతం ఉండాలి. థియేటర్లో గాలి బయటకు వెళ్లేలా, కొత్త గాలి నిరంతరం వచ్చేలా ఏర్పాట్లు ఉండాలి (ఫ్రెష్ ఎయిర్).
  • అన్ని షోల ఇంటర్వెల్‌లూ ఒకేసారి రాకుండా ఉండేలా షో టైమ్ ఉండాలి.

కరోనా రెండోసారి విజృంభించే అవకాశం ఉన్నందున, థియేటర్ల యజమానులు ఆ విషయాలను దృష్టిలో ఉంచుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని కేసీఆర్ సూచించారు.

source: bbc.com/telugu

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: BBC Telugu
Top