Friday, 30 Jul, 7.35 pm BBC News తెలుగు

హోమ్
టోక్యో ఒలింపిక్స్: మేరీ కోమ్ ఓటమి, క్వార్టర్ ఫైనల్స్‌లో భారత హాకీ జట్టు, షట్లర్ పీవీ సింధు

టోక్యో ఒలింపిక్స్‌ నుంచి భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ అవుట్ అయ్యారు. కొలంబియాకు చెందిన ఇంగ్రిట్ వెలెన్సియా చేతిలో 3-2 తేడాతో మేరీ కోమ్ ఓడిపోయారు.

మ్యాచ్‌లో ఓటమి అనంతరం మేరీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

అయితే, మేరీపై తమ అభిమానం ఎప్పటికీ తగ్గబోదని షూటర్ అభినవ్ బింద్రా ట్వీట్ చేశారు.

చాలా మంది మేరీ కోమ్‌ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు.

మేరీ కోమ్ ఖాతాలో ఎన్నో పతకాలు

38 ఏళ్ల మేరీ ఏడుసార్లు వరల్డ్ చాంపియన్‌షిప్‌ బంగారు పతకాలు సాధించారు. ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకున్నారు. ఒలింపిక్ పతకం గెలిచిన తొలి, ఏకైక భారతీయ మహిళా బాక్సర్ మేరీయే. ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లోనూ ఆమె పసిడి పతకాలు గెలుపొందారు.

ఈ పతకాల్లో అత్యధికం 2007లో సిజేరియన్ కాన్పులో కవలలకు జన్మనిచ్చిన తర్వాత సాధించినవే. అత్యున్నత స్థాయి పోటీల్లో తలపడి రాణించడానికి ఏం కావాలో, ఏం చేయాలో మేరీకి తెలుసు. తన కఠోర శ్రమే ఆమెకు ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది.

మేరీ ఐదడుగుల రెండు అంగుళాల ఎత్తు ఉంటారు. బరువు 48 కేజీలు. బాక్సింగ్ చాంపియన్‌కు మైక్ టైసన్‌లా ప్రత్యర్థిని భయపెట్టే కళ్లు, మొహమ్మద్ అలీ లాంటి బాడీ లాంగ్వేజ్ ఉండాలని చాలా మంది అనుకుంటారు. మేరీ అలా ఉండరు. 'రింగ్' లోపల, వెలుపల చిరునవ్వుతో ఉంటారు. వేగం, చెక్కు చెదరని ఏకాగ్రతతో తనదైన శైలిలో ప్రత్యర్థితో పోరాడతారు.

"కోచ్, సహాయ సిబ్బంది, కుటుంబ సభ్యుల అండ మనకు ఒక దశ వరకే తోడ్పడతాయి. బరిలోకి దిగాక మనం ఒంటరి. రింగ్‌లో ఆ తొమ్మిది-పది నిమిషాలే అత్యంత కీలకం. మన పోరాటం మనమే చేయాలి. ఇదే మాట నాకు నేను ఎప్పుడూ చెప్పుకొంటుంటాను.

ఈ పోరాటానికి సిద్ధమయ్యేందుకు శారీరకంగా, మానసికంగా నన్ను నేను మెరుగుపరచుకొనేందుకు ప్రయత్నిస్తాను. కొత్త టెక్నిక్‌లు నేర్చుకుంటాను. నా బలాలను పెంచుకోవడానికి, బలహీనతలను అధిగమించడానికి ప్రయత్నిస్తాను. ప్రత్యర్థుల గురించి బాగా అధ్యయనం చేస్తా. చురుగ్గా పోరాడటాన్ని నేను నమ్ముతా" అని మేరీ బీబీసీతో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

అంతర్జాతీయ ప్రస్థానం 2001లో మొదలు

బాక్సింగ్‌లో మేరీ అంతర్జాతీయ ప్రస్థానం 2001లో మొదలైంది. ఆమె మొదట్లో అపారమైన తన శక్తి, సామర్థ్యం (స్టామినా)పై ఎక్కువగా ఆధారపడేవారు. ఇప్పుడు నైపుణ్యాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు.

మేరీ ఆరుసార్లు 'వరల్డ్ అమెచ్యూర్ బాక్సింగ్ చాంపియన్' అయిన ఏకైక మహిళ. తొలి ఏడు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో ప్రతి చాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన ఒకే ఒక్క మహిళా బాక్సర్. ఎనిమిది ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాలు సాధించిన ఏకైక బాక్సర్ (మహిళలు, పురుషుల్లో) కూడా.

ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ (ఏఐబీఏ) 'వరల్డ్ విమెన్స్ ర్యాంకింగ్ లైట్ ఫ్లైవెయిట్' విభాగంలో ఆమె గతంలో నంబర్ 1 ర్యాంకు దక్కించుకున్నారు.

2014లో దక్షిణ కొరియాలోని ఇన్‌చియాన్ నగరంలో ఆసియా క్రీడల్లో బంగారు పతకం గెలుపొంది, ఈ క్రీడాపోటీల చరిత్రలోనే తొలిసారి పసిడి పతకం సాధించిన భారత మహిళా బాక్సర్‌గా ఆమె రికార్డు నెలకొల్పారు. 2018 కామన్‌వెల్త్ క్రీడాపోటీల్లో బంగారు పతకం గెలిచి, ఈ పోటీల చరిత్రలో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్న తొలి భారత మహిళా బాక్సర్‌గా మరో రికార్డు సృష్టించారు.

ఐదుసార్లు 'ఏసియన్ అమెచ్యూర్ బాక్సింగ్ చాంపియన్‌' అయిన ఏకైక బాక్సర్ మేరీ.

బాల్యం

మేరీ కోమ్ మణిపూర్‌లోని ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు. ఆమె బాక్సింగ్ నేర్చుకోవడం ఆమె కుటుంబంలో ఎవరికీ ఇష్టం లేదు. దీంతో ఆమె పొలంలో పని చేస్తూ, ఇంటి పనులు చేసుకుంటూ, తోడబుట్టిన వాళ్లను చూసుకుంటూనే బాక్సింగ్ ప్రాక్టీస్ చేసేవారు.

చాలాకాలం పాటు ఆమె బాక్సింగ్ నేర్చుకుంటోందని ఇంట్లో తెలీనే తెలీదు.

2000లో రాష్ట్ర ఛాంపియన్‌షిప్ పోటీల ఫొటోలు పత్రికల్లో ప్రచురితం కావడంతో ఆమె ఇంట్లో బాక్సింగ్ గురించి తెలిసింది.

క్వార్టర్ ఫైనల్స్‌లో భారత హాకీ జట్టు

భారత పురుషుల హాకీ జట్టు అర్జెంటీనాను 3-1 తేడాతో ఓడించి టోక్యో ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. బ్యాడ్మింటన్‌లో పివి సింధు విజయం తర్వాత భారతదేశానికి ఇది మరో శుభవార్త. ఈ విజయంతో భారత హాకీ జట్టు పతకం గెలుస్తుందన్న ఆశలు మరింత బలపడ్డాయి.

ఈ పూల్ ఎ మ్యాచ్‌లో, అర్జెంటీనాతో పోటాపోటీగా సాగిన మ్యాచ్‌లో భారత్ చివరికి పైచేయి సాధించింది. ఫస్టాఫ్‌ ముగిసే వరకు ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. ఆ తరువాత మూడో క్వార్టర్‌లో భారత్ ఒక గోల్ సాధించి ఆధిక్యం కనబరించింది.

ఆట తొలి అర్ధభాగంలో ఒక్క గోల్ కూడా సాధించని జట్లు రెండవ భాగంలో మూడు గోల్స్ సాధించాయి. సెకండాఫ్‌లో దొరికిన పెనాల్టీ కార్నర్‌లో అర్జెంటీనాకు చెందిన మైకో కాసెల్లా ఒక గోల్ సాధించి స్కోర్ సమం చేశాడు.

సెకండాఫ్ ముగిసేలోపు వివేక్ సాగర్ ఒక గోల్ చేసి భారత్‌కు 2-1 ఆధిక్యాన్ని ఇచ్చాడు.మరి కాసేపటికే హర్మన్‌ప్రీత్ సింగ్ మరో గోల్ కొట్టి భారత విజయాన్ని ఖాయం చేశాడు.

భారత్ తదుపరి మ్యాచ్ జపాన్‌తో జరుగుతుంది.

క్వార్టర్ ఫైనల్స్‌లో పీవీ సింధు

పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ పోటీలలో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. గురువారం జరిగిన మ్యాచ్‌లో సింధు డెన్మార్క్‌కు చెందిన మియా బ్లిచ్‌ఫెల్ట్‌ను 21-15, 21-13 స్కోర్‌తో ఓడించారు.

ఈ మ్యాచ్‌లో మొదటి నుంచి సింధు ఆధిక్యం కనబరిచారు.

టోక్యో ఒలింపిక్స్‌లో కచ్చితంగా మెడల్ సాధిస్తారని భావిస్తున్న సింధు బుధవారం నాటి మ్యాచ్‌లో కూడా చక్కని ప్రతిభ కనబరిచారు. హాంకాంగ్‌కు చెందిన చోంగ్ నంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో సింధు విజయం సాధించారు.

ఐదేళ్ల క్రితం రియో ఒలింపిక్స్‌లో ఆమె రజత పతకం గెలుచుకున్నారు. ఒలింపిక్ క్రీడల్లో బ్యాడ్మింటన్‌లో భారత్‌కు రజత పతకం అందించిన మొదటి క్రీడాకారిణిగా ఆమె చరిత్ర సృష్టించారు.

ఈసారి సింధు స్వర్ణ పతకం గెలిచే అవకాశాలున్నాయని క్రీడా నిపుణులు చెబుతున్నారు. అయితే, ఆమె గత ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనడానికి, ఈసారీ పాల్గొనడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది.

ఇంతకు ముందు సింధు అండర్ డాగ్‌గా బరిలోకి దిగారు. కానీ, ఈసారీ గత ఒలింపిక్ క్రీడల్లో రజత పతకం సాధించిన ప్లేయర్‌గా పోటీపడనున్నారు. అందుకే దేశమంతా ఆమెపై చాలా ఆశలు పెట్టుకుంది.

"నేను ఎప్పుడైనా, ఏదైనా మేజర్ టోర్నమెంటులో కోర్టులోకి అడుగుపెడితే, పతకం గెలవాలనే ఆశతోనే దిగుతాను. కానీ, ఆ అంచనాలను అందుకునేలా ఆడడం అంత సులభం కాదు. ఆ ఆశల ఒత్తిడికి గురికాకుండా నేను నా ఆటపై ఫోకస్ చేస్తుంటాను" అని ఒలింపిక్స్‌కు వెళ్లడానికి ముందు సింధు బీబీసీతో అన్నారు.

source: bbc.com/telugu

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: BBC Telugu
Top