Baby Girl Born After 200 Years:మహారాష్ట్రలోని ఓ కుటుంబంలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల నిజమైంది. దాదాపు 200 ఏళ్ల తర్వాత ఆ కుటుంబంలో ఆడపిల్ల జన్మించడంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
తరతరాలుగా మగపిల్లలే పుడుతున్న ఆ కుటుంబంలో చిన్నారి అడుగుపెట్టడంతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది.
నాలుగు తరాలుగా ఎదురుచూపులు
దహిఫలే కుటుంబంలో గత నాలుగు తరాలుగా ఆడపిల్ల పుట్టలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దాదాపు రెండు శతాబ్దాలుగా కుటుంబంలో మగపిల్లలే జన్మించడంతో.. తమ వంశంలో ఆడపిల్ల ఎప్పుడు పుడుతుందా? అని కుటుంబ సభ్యులు ఎదురుచూస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఇటీవల ఓ పాప జన్మించడంతో వారి సంతోషం మాటల్లో చెప్పలేనంతగా మారింది. చిన్నారికి మహాలక్ష్మి అని పేరు పెట్టుకున్నారు. ముద్దుగా గార్గి అని పిలుచుకుంటున్నారు.
చిన్నారి రాకతో ఆనందం
మహాలక్ష్మి పుట్టిన విషయం తెలియగానే కుటుంబ సభ్యులు, బంధువులు ఎంతో సంతోషించారు. తమ కుటుంబానికి ఇంత ప్రత్యేకమైన సందర్భం రావడంతో ఈ ఆనందాన్ని తమ ఇంటికే పరిమితం చేయకూడదనుకున్నారు. చిన్నారి తల్లి, బిడ్డ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ప్రత్యేకంగా ఇంటికి తీసుకురావాలని ప్లాన్ చేశారు. ఇందుకోసం అందంగా అలంకరించిన రథాన్ని సిద్ధం చేశారు.
రథంపై తల్లీకూతుళ్లకు ఘన స్వాగతం
ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన తల్లీకూతుళ్లను కుటుంబ సభ్యులు ప్రత్యేక రథంలో ఇంటికి తీసుకెళ్లారు. డప్పుచప్పుళ్లు, ఆనందోత్సాహాల మధ్య రథయాత్ర సాగింది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని చిన్నారికి స్వాగతం పలికారు. ఇంట్లోకి అడుగుపెట్టే సమయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి చిన్నారిని ఘనంగా ఆహ్వానించారు. కుటుంబానికి కొత్త వెలుగును తీసుకొచ్చిందంటూ బంధువులు, సన్నిహితులు ఆనందం వ్యక్తం చేశారు.
ఊరంతా గుర్తుండిపోయేలా..
సాధారణంగా ఇంట్లో ఆడపిల్ల పుడితే కుటుంబ సభ్యులు ఆనందంగా వేడుకలు చేసుకుంటారు. కానీ, దహిఫలే కుటుంబానికి ఇది మామూలు సందర్భం కాదు. తరతరాలుగా ఎదురుచూసిన తర్వాత ఆడపిల్ల పుట్టడంతో ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. చిన్నారి పుట్టిన విషయాన్ని ఊరంతా తెలుసుకునేలా వేడుక చేయాలనే కుటుంబ సభ్యుల ఆలోచన స్థానికులను ఆకట్టుకుంది. తల్లీకూతుళ్లను రథంలో ఊరేగిస్తూ ఇంటికి తీసుకెళ్లిన దృశ్యాలు అక్కడి ప్రజల్లో ఆసక్తిని కలిగించాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ చిన్నారికి, కుటుంబానికి శుభాకాంక్షలు చెప్తున్నారు.
ఎన్నో ఏళ్ల ఎదురుచూపుల తర్వాత తమ ఇంట్లోకి అడుగుపెట్టిన ఈ చిన్నారిని కుటుంబ సభ్యులు ఎంతో ప్రత్యేకంగా భావిస్తున్నారు. అందుకే ఆమె రాకను జీవితాంతం గుర్తుండిపోయేలా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కుటుంబంలో ఎక్కడ చూసినా చిన్నారి నవ్వులే వినిపిస్తున్నాయి.

