Petrol Pump Controversy:తక్కువ పెట్రోల్ కొట్టి.. ఎక్కువ కొట్టినట్లు చూపించడం, డబ్బులు వసూలు చేయడం పెట్రోల్ బంకుల్లో తరచుగా చూస్తుంటాం. తూనికలు, కొలతల అధికారులు అప్పుడప్పుడు తనిఖీలు చేసినా, క్షేత్ర స్థాయిలో ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉన్నాయి.
తాజాగా ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఓ షాకింగ్ పెట్రోల్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. 45 లీటర్ల ఫ్యూయల్ పట్టే కారు ట్యాంకులో, ఓ బంక్ సిబ్బంది 52 లీటర్ల పెట్రోల్ నింపినట్లు బిల్లు ఇవ్వడంతో కారు యజమాని షాకయ్యాడు. అధికారులకు ఫిర్యాదు చేయడంతో.. విచారణ మొదలుపెట్టారు.
అసలు ఏం జరిగిందంటే?
చరణ్ సింగ్ అనే వ్యక్తి తాజాగా వోక్స్ వ్యాగన్ వర్టస్ కారును కొనుగోలు చేశారు. పెట్రోల్ కొట్టించుకునేందుకు కాన్పూర్ లోని ఓ పెట్రోల్ బంక్ కు తీసుకెళ్లారు. ఫ్యూయల్ ఇండికేటర్ దాదాపు ఖాళీగా చూపించడంతో, ట్యాంక్ ఫుల్ చేయాలని సిబ్బందిని కోరారు. సుమారు 41 లీటర్ల వరకు మొదట ఇంధనం నింపిన తర్వాత టెక్నికల్ ప్రాబ్లమ్ తో మిషన్ పని చేయడం ఆగిపోయింది. ఆ తర్వాత మళ్లీ ట్యాంక్ ను పూర్తిగా నింపినట్లు చెప్పి మొత్తం 52 లీటర్లకు బిల్లు ఇచ్చారు. ఆ బిల్లు చూసి చరణ్ సింగ్ ఒక్కసారిగా షాకయ్యాడు. ట్యాంక్ కెపాసిటీ 45 లీటర్లు అయితే, 52 లీటర్లు ఎలా నింపారని బంక్ సిబ్బందిని ప్రశ్నించాడు. కానీ, సిబ్బంది నుంచి సరైన సమాధానం రాలేదు. అదే సమయంలో కారు షో రూమ్ కు కాల్ చేసి, తన కారులో ఎంత పెట్రోల్ పడుతుందో చెక్ చేసుకున్నాడు. వాళ్లు కూడా గరిష్టంగా 45 లీటర్ల వరకు మాత్రమే పడుతుందని చెప్పారు.
విచారణ మొదలు పెట్టిన అధికారులు
ఈ ఘటనను సాధారణ పొరపాటుగా కాకుండా స్కామ్ గా కొనసాగుతున్నట్లు చరణ్ సింగ్ ఆరోపించారు. తూనికలు, కొలతల శాఖ అధికారులకు తెలిసే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయేమో అనే అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో స్థానిక జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించింది. సంబంధిత పెట్రోల్ పంప్ లోని ఫ్యూయల్ డిస్పెన్సింగ్ యంత్రాలు సరిగా పనిచేస్తున్నాయా? లేదా? అనే దానిపై విచారణ ప్రారంభించింది. అవసరమైతే సాంకేతిక తనిఖీలు కూడా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
దేశ వ్యాప్తంగా సంచలనం
ఈ ఘటనతో కాన్పూర్ తో పాటు దేశ వ్యాతంగా ఉన్న వాహనదారుల్లో కూడా ఆందోళన కలిగించింది. పెట్రోల్ బంక్ లలో నిజంగా సరైన కొలతల్లో ఫ్యూయల్ పోస్తున్నారా? లేదా? అనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

