Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
8 భాషల్లో నెట్‌ఫ్లిక్స్ ఫస్ట్ ఒరిజినల్ తెలుగు సిరీస్.. 'సూపర్ సుబ్బు' అనిపించారా ?

8 భాషల్లో నెట్‌ఫ్లిక్స్ ఫస్ట్ ఒరిజినల్ తెలుగు సిరీస్.. 'సూపర్ సుబ్బు' అనిపించారా ?

Big TV Live 1 week ago

Super Subbu Review : నెట్‌ఫ్లిక్స్ మొట్టమొదటి తెలుగు ఒరిజినల్ సిరీస్ 'సూపర్ సుబ్బు'. మల్లిక్ రామ్ సృష్టించి, దర్శకత్వం వహించిన ఈ కామెడీ డ్రామాలో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటించగా, ఈ సిరీస్ తో మిథిలా పాల్కర్ తెలుగు ఓటీటీ రంగ ప్రవేశం చేసింది.

ప్రతి ఎపిసోడ్ 30 నిమిషాలకు పైగా నిడివి ఉండగా, మొత్తం ఏడు ఎపిసోడ్లతో ఈ సిరీస్ ఈరోజే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కి వచ్చింది. తెలుగుతో పాటు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో కూడా అందుబాటులో ఉంది. అంతేకాదు ప్రేక్షకులు ఈ సిరీస్‌ను ఇంగ్లీష్, స్పానిష్, పోర్చుగీస్ ఆడియో ఆప్షన్‌లతో కూడా చూడవచ్చు. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక, భరత్ లక్ష్మీపతి నిర్మించిన ‘సూపర్ సుబ్బు’లో మురళీ శర్మ, బ్రహ్మానందం, మానస చౌదరి, గెటప్ శ్రీను, జీవన్, సంపూర్ణేష్ బాబు, హైపర్ ఆది తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మరి మొత్తానికి ఈ సిరీస్ ప్రేక్షకుల చేత సూపర్ అన్పించుకుందా లేదా ? అన్నది రివ్యూలో తెలుసుకుందాం.

కథ

హైదరాబాద్‌లో ఉండే నిజాయితీ గల యువకుడు సుబ్రహ్మణ్యం చిలుకూరి రావు అలియాస్ సుబ్బు (సందీప్ కిషన్). అతని తండ్రి కుక్కుటేశ్వర్ (మురళీ శర్మ) కఠినమైన, పెత్తనం చెలాయించే స్కూల్ టీచర్. సుబ్బు తండ్రి మెచ్చే కొడుకుగా మారాలని ఎంతగానో ట్రై చేస్తాడు. అయితే అందులో భాగంగా నిరంతరం వచ్చే విమర్శలను మౌనంగా భరిస్తాడు. ఈ నేపథ్యంలోనే మాకిపూర్ అనే గ్రామంలో అడల్ట్ ఎడ్యుకేషన్ అధికారిగా అతనికి పోస్టింగ్ వస్తుంది. నిజానికి అక్కడికి వెళ్ళడానికి ఒక్కరు కూడా ఇష్టపడరు. కానీ హీరో మాత్రం తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, ప్రేయసి కోసం చాలా ఉత్సాహంగా అక్కడికి ఎంట్రీ ఇస్తాడు.

మాకిపూర్ గ్రామం జననాల రేటు ఎక్కువగా ఉన్న, ప్రైవేట్ విషయాలను చర్చించడం నిషిద్ధంగా భావించడం వంటి సాంప్రదాయవాద సమాజం. సుబ్బు అక్కడికి వెళ్లి, ఋతుస్రావం, గర్భనిరోధకాలు, సురక్షిత సంబంధాలు వంటి అంశాలపై అవగాహన కల్పించాల్సి వస్తుంది. ఊహించిన దానికంటే ఆ ఊరు చాలా వింతగా ఉంటుంది. అక్కడ చిన్న విషయాన్ని కూడా పెద్ద రాద్దాంతంగా మారుస్తాయి. ఏం చేద్దామనుకున్నా పుకార్లు, అపార్థాలతో సుబ్బు జీవితం తలకిందులు అవుతుంది. మరి ఇలాంటి మూర్ఖులున్న గ్రామంలో సుబ్బు తన బాధ్యతలు ఎలా నెరవేర్చాడు ? ఆ గ్రామంలోని మనుషులలో మార్పు తీసుకురావడానికి ఏం చేశాడు ? చివరికి తండ్రి, ప్రియురాలి చేత సూపర్ అనిపించుకున్నాడా ? అన్నదే కథ.

విశ్లేషణ

ఇంత వరకూ ఎవ్వరూ టచ్ చేయని స్టోరీ లైన్ తో ఈ సిరీస్ ను తెరకెక్కించి దర్శకుడు మల్లిక్ రామ్ పెద్ద సాహసమే చేశారు. ఆత్మవిశ్వాసం లోపం ఉన్న యువకుడి నుండి సమాజం పట్ల బాధ్యత గల వ్యక్తిగా హీరో మారే ఆ ప్రయాణం హృదయాన్ని తాకుతుంది. ఇంత సున్నితమైన అంశాన్ని కామెడీతో కలగలిపి ఆయన చేసిన ప్రయత్నాన్ని అభినందించాల్సిందే. ఏదో నీతిబోధలా కాకుండా, సహజంగా అందరికీ అర్థమయ్యేలా చూపించారు. గ్రామీణ నేపథ్యం, సంభాషణలు, సన్నివేశాలు సహజంగా ఉండటంతో సిరీస్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక సుబ్బుగా సందీప్ కిషన్ అద్భుతమైన నటనను కనబరిచాడు. మురళీ శర్మ పోషించిన తండ్రి పాత్ర, మిథిలా పాల్కర్, గెటప్ శ్రీను సహాయక పాత్రలు కథకు మరింత బలాన్ని చేకూరుస్తాయి. అయితే కథలో ఉపకథలు ఉండటం వల్ల మెయిన్ స్టోరీ కొన్నిసార్లు దారి తప్పుతున్నట్టు అన్పిస్తుంది. చివరి ఎపిసోడ్ లో కొన్ని అంశాలను అసంపూర్తిగా వదిలేసి, రెండవ సీజన్‌కు సెటప్ చేయడం నిరాశను కలిగిస్తుంది.

చివరగా

‘సూపర్ సుబ్బు’ కామెడీ, ఎమోషనల్, సోషల్ మెసేజ్ ను మేళవించిన ఒక సరదా రూరల్ కామెడీ డ్రామా. మొత్తం మీద ఇదొక ఆహ్లాదకరమైన వీకెండ్ వాచ్ సిరీస్.

Super Subbu Review and Rating : 2.5 /5

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live