Online AC buying scam: రోజు రోజుకూ ఎండలు పెరగడంతో ఏసీలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్ షాపింగ్ ఫ్లాట్ ఫామ్స్ లో నకిలీ ఆఫర్లతో యూజర్లు బురిడీ కొట్టిస్తున్నారు.
భారీ తగ్గింపులు,అద్భుతమైన ఫీచర్ల పేరుతో.. ప్రకటనలు ఇచ్చి మీ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి.. మీరు ఆన్‌లైన్‌లో ఏసీ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. మోసపోకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్కామర్లు అనుసరించే పద్ధతుల గురించి వివరంగా తెలుసుకుందాం.
ఆన్‌లైన్ ఏసీ స్కామ్ అలర్ట్:
ఆన్‌లైన్ షాపింగ్ ఈజీ అయిన్నప్పటికీ.. ఏసీ లాంటి ఖరీదైన వస్తువులను కొనేటప్పుడు ఏమరపాటుగా ఉంటే వేల రూపాయలు నష్టపోయే అవకాశం ఉంది. స్కామర్ల బారిన పడకుండా ఉండటానికి ఈ కింది అంశాలను తప్పని సరిగా గుర్తుంచుకోండి.
1.అనూహ్యమైన ఆఫర్ల పట్ల జాగ్రత్త :
సాధారణంగా మార్కెట్లో రూ. 40వేల ధర పలికే బ్రాండెడ్ ఏసీని కేవలం రూ. 15వేల లేదా రూ. 18వేలకే ఇస్తున్నామంటూ వచ్చే ప్రకటనలను నమ్మకండి. ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ లో వచ్చే ఇలాంటి యాడ్స్ ఎక్కువగా నకిలీ వెబ్‌సైట్లకు దారితీస్తాయి.
2.అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే ఎంచుకోండి:
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రసిద్ధ ఇ-కామర్స్ సైట్లు లేదా బ్రాండ్ల అధికారిక వెబ్‌సైట్ల నుండి మాత్రమే కొనుగోలు చేయండి. ఏదైనా కొత్త వెబ్‌సైట్ కనిపిస్తే.. దాని URL ని జాగ్రత్తగా గమనించండి. అసలైన వెబ్‌సైట్ పేరులో చిన్న చిన్న అక్షరాల మార్పులు చేసి (ఉదాహరణకు: Flipkart కి బదులుగా Flipkrt) మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది.
3. క్యాష్ ఆన్ డెలివరీ కి ప్రాధాన్యత ఇవ్వండి:
మీరు మునుపెన్నడూ వాడని వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేస్తున్నట్లయితే..ముందుగా డబ్బులు చెల్లించవద్దు.’క్యాష్ ఆన్ డెలివరీ’ ఆప్షన్ ఉంటేనే ఆర్డర్ చేయండి. స్కామర్లు తరచుగా ముందే పేమెంట్ చేయాలని ఒత్తిడి చేస్తారు లేదా కేవలం ఆన్‌లైన్ పేమెంట్ ఆప్షన్ మాత్రమే ఉంచుతారు.
4. వెబ్‌సైట్ భద్రతను చెక్ చేయండి:
వెబ్‌సైట్ అడ్రస్ బార్‌లో తాళం గుర్తు ఉందో లేదో చూడండి. ఇది ఆ సైట్ సురక్షితమని సూచిస్తుంది. ‘http’ (చివరన ‘s’ లేనిది) అని ఉంటే.. అక్కడ మీ కార్డ్ వివరాలు ఇవ్వడం ప్రమాదకరం.
5. కస్టమర్ రివ్యూలు, సెల్లర్ రేటింగ్:
ఆర్డర్ ఇచ్చే ముందు ఆ ఏసీ కి సంబంధించిన రివ్యూలు చదవండి. అలాగే.. ఆ వస్తువును అమ్ముతున్న ‘సెల్లర్’కి ఎంత రేటింగ్ ఉందో గమనించండి. కొత్త సెల్లర్లు లేదా తక్కువ రేటింగ్ ఉన్నవారి దగ్గర ఖరీదైన ఎలక్ట్రానిక్స్ కొనకపోవడమే మంచిది.
6. ఇన్‌స్టాలేషన్, వారంటీ వివరాలు:
చాలా మంది తక్కువ ధరకు ఏసీ కొంటారు కానీ ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు, వారంటీ నిబంధనలు గమనించరు. నకిలీ వెబ్‌సైట్లు వారంటీ కార్డులను ఇవ్వవు లేదా చెల్లని కార్డులను ఇస్తాయి. కొనేముందు ‘బ్రాండ్ వారంటీ’ ఉందో లేదో సరిచూసుకోండి.
7. పేమెంట్ లింక్స్, క్యూఆర్ కోడ్స్:
సెల్లర్ మీకు వాట్సాప్ లేదా ఎస్‌ఎమ్‌ఎస్ ద్వారా ప్రత్యేకమైన పేమెంట్ లింక్స్ పంపినా.. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమని చెప్పినా అస్సలు స్పందించకండి. ఇది మీ యూపీఐ పిన్ దొంగిలించడానికి చేసే ప్రయత్నం కావచ్చు.
డిజిటల్ యుగంలో.. ఆన్‌లైన్ షాపింగ్ సింపుల్ అయినప్పటికీ, భద్రత అనేది మన బాధ్యత. ఏసీ లాంటి వస్తువులు కొనేటప్పుడు ఆతురత పడకుండా.. మార్కెట్ ధరను సరిపోల్చుకుని, నమ్మకమైన ప్లాట్‌ఫారమ్‌లను ఎంచుకోవాలి. వేసవిని చల్లగా గడపాలని కోరుకుంటూనే.. మీ కష్టార్జితం సైబర్ నేరగాళ్ల పాలు కాకుండా జాగ్రత్త వహించండి.

