Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమరావతిలో మినీ అమెజాన్.. ఐదు ఎకరాల్లో అద్భుత వర్షారణ్యం!

అమరావతిలో మినీ అమెజాన్.. ఐదు ఎకరాల్లో అద్భుత వర్షారణ్యం!

Big TV Live 4 days ago

Mini Amazon in Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్ రూపుదిద్దుకోబోతోంది. పర్యాటకాన్ని పెంచడంతో పాటు నగరంలో పచ్చదనాన్ని, జీవవైవిధ్యాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సరికొత్త కృత్రిమ వర్షారణ్యాన్ని ఏర్పాటు చేబోతున్నారు.

సాధారణ పార్కులకు భిన్నంగా ఉండేలా దీనిని తీర్చిదిద్దుతున్నారు. దట్టమైన అడవి, జలపాతాలు, సెలయేర్లు, పొగమంచు లాంటి అనుభూతులతో సందర్శకులకు కొత్త అనుభవాన్ని అందించబోతున్నారు.

ఐదు ఎకరాల్లో భారీ ప్రాజెక్ట్

అమరావతిలోని సఖమూరు పార్కులో సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ మినీ అమెజాన్ ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ.18 కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు తెలుస్తోంది. నగరానికి వచ్చే పర్యాటకులు ప్రకృతిని దగ్గరగా ఆస్వాదించేలా ఈ ప్రాంతాన్ని రూపొందిస్తున్నారు. ఒకసారి లోపలికి వెళ్లిన తర్వాత సాధారణ పట్టణ వాతావరణానికి భిన్నంగా, అడవిలో ఉన్న అనుభూతి కలిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ కృత్రిమ వర్షారణ్యంలో పెద్ద సంఖ్యలో మొక్కలను నాటనున్నారు. దాదాపు 400 రకాల జాతులకు చెందిన 20 వేలకు పైగా మొక్కలను ఇక్కడ పెంచనున్నారు. మొక్కలను ఒకే ఎత్తులో కాకుండా వివిధ స్థాయిల్లో పెరిగేలా ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం మియావాకి పద్ధతిని ఉపయోగిస్తున్నారు. ఈ విధానంలో మొక్కలను దగ్గరగా, దట్టంగా నాటడం వల్ల తక్కువ స్థలంలోనే వేగంగా పచ్చదనం ఏర్పడుతుంది. దీంతో కొద్దికాలంలోనే ఈ ప్రాంతం దట్టమైన అడవిని తలపించే అవకాశం ఉంటుంది.

ఎప్పుడూ వర్షం కురుస్తున్నట్లుగా..

ఈ పార్కులో మరో ప్రత్యేక ఆకర్షణ వర్షపు అనుభూతి. ఇందుకోసం రెయిన్ గన్స్ ద్వారా కృత్రిమంగా నీటిని జల్లుల రూపంలో కురిపించనున్నారు. దీంతో సందర్శకులకు నిజమైన వర్షారణ్యంలోకి వెళ్లిన అనుభూతి కలిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు.. కృత్రిమ జలపాతాలు, చిన్న చిన్న సెలయేర్లు, పొగమంచు తోటలు కూడా ఏర్పాటు చేయనున్నారు. వీటన్నింటి కలయికతో ఈ ప్రాంతం ఎప్పుడూ చల్లగా, పచ్చగా కనిపించేలా తీర్చిదిద్దుతున్నారు.

దట్టమైన చెట్లు, నీటి వనరులు, పొగమంచు వంటి ఏర్పాట్ల కారణంగా ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత బయట ప్రాంతంతో పోలిస్తే 3 నుంచి 4 డిగ్రీల వరకు తక్కువగా ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. అమరావతి వంటి వేడి వాతావరణం ఉండే ప్రాంతంలో ఇలాంటి పచ్చని ప్రదేశం ప్రజలకు కొంత ఉపశమనం కలిగించనుంది. కుటుంబాలతో కలిసి వచ్చి ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు ఇది మంచి ప్రదేశంగా మారే అవకాశం ఉంది.

ఈ ప్రాజెక్టు కేవలం పర్యాటకుల కోసమే కాకుండా స్థానిక జీవవైవిధ్యానికి కూడా ఉపయోగపడేలా రూపొందిస్తున్నారు. దట్టమైన చెట్లు, మొక్కలు పెరగడంతో పక్షులు, సీతాకోకచిలుకలు, వివిధ రకాల కీటకాలు, చిన్న వన్యప్రాణులకు అనువైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. అమరావతిలోని ఈ 'మినీ అమెజాన్' ఒక సాధారణ పార్కుగా కాకుండా ప్రకృతి, పర్యాటకం, జీవవైవిధ్యాన్ని ఒకే చోట కలిపే ప్రత్యేక పట్టణ అడవిగా రూపుదిద్దుకోనుంది. ప్రాజెక్టు పూర్తయితే అమరావతికి మరో కొత్త పర్యాటక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది.

మహాభారత ఆనవాళ్లు.. బౌద్ధ మహాస్తూపం.. రామదాసు జన్మస్థలం.. ఈ ఊరి కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live