Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అర్జునుడిని మించిన విలుకాడు.. అయినా జీవితమంతా అవమానాలే. ఓటీటీలోకి తెలుగులోనే కర్ణుడి కథ

అర్జునుడిని మించిన విలుకాడు.. అయినా జీవితమంతా అవమానాలే. ఓటీటీలోకి తెలుగులోనే కర్ణుడి కథ

Big TV Live 2 months ago

Mythological Web Series: మహాభారతంలో అర్జునుడు, భీష్ముడు, శ్రీకృష్ణుడు వంటి మహా వీరుల గురించి చాలా మందికి తెలుసు. కానీ అందరిలోనూ అత్యంత విషాదకరమైన జీవితం గడిపిన యోధుడు ఎవరు అంటే చాలామంది కర్ణుడి పేరే చెబుతారు.

పుట్టుకతోనే దైవ వరం పొందినా… జీవితమంతా అవమానాలు, తిరస్కారాలు, విధి వెక్కిరింపు, అన్యాయాల మధ్య పోరాడిన కర్ణుడి కథ తాజాగా అద్భుతమైన యానిమేషన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. The Legend of Karna అనే టైటిల్ తో మహాభారతంలోని ఈ శక్తివంతమైన పాత్రను కొత్త తరానికి దగ్గర చేసే ప్రయత్నంగా రూపొందిన ఈ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. మరి ఈ సిరీస్ తెలుగులో ఉందా ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనేది వివరంగా తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

సూర్యదేవుని అనుగ్రహంతో జన్మించిన శిశువు కర్ణుడు. జన్మించగానే కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా తన తల్లి నుంచి దూరమవుతాడు. ఆ తల్లి బిడ్డను నదిలో వదిలి పెడుతుంది. నదిలో అలా కొట్టుకొచ్చిన ఆ చిన్నారిని అధిరథుడు, రాధ దంపతులు పెంచుతారు. వారి ప్రేమలో పెరిగినా… సమాజం మాత్రం అతనిని “సూతపుత్రుడు” అనే ముద్రతోనే చిన్నచూపు చూస్తుంది.

చిన్నప్పటి నుంచే అసాధారణమైన విలు విద్యపై ఆసక్తి చూపిన కర్ణుడు గొప్ప యోధుడిగా ఎదగాలని కలలు కంటాడు. కానీ కులం పేరుతో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటాడు. అయినప్పటికీ తన లక్ష్యాన్ని వదలకుండా కఠిన సాధన చేసి అర్జునుడికి సైతం సవాల్ విసిరే స్థాయికి చేరుకుంటాడు.

హస్తినాపురంలో జరిగిన శౌర్య ప్రదర్శనలో తన ప్రతిభను చూపించేందుకు వచ్చిన కర్ణుడు, జన్మ కారణంగా మళ్లీ అవమానానికి గురవుతాడు. అదే సమయంలో అతని ప్రతిభను గుర్తించిన దుర్యోధనుడు అతనికి అంగదేశ రాజ్యాన్ని బహూకరిస్తాడు. ఆ క్షణం నుంచి ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం మహాభారత చరిత్రనే మార్చేస్తుంది.

కర్ణుడు తన జీవితంలో ఎదుర్కొన్న అన్యాయాలు ఏమిటి ? అతను దుర్యోధనుడి పక్షాన ఎందుకు నిలబడ్డాడు ? విధి అతనికి ఎందుకు పదేపదే పరీక్షలు పెట్టింది ? కురుక్షేత్ర యుద్ధానికి ముందు అతని జీవితంలో జరిగిన సంఘటనలు ఎలా అతని నిర్ణయాలను ప్రభావితం చేశాయి ? అనే అంశాల చుట్టూ ఈ సిరీస్ ఆసక్తికరంగా సాగుతుంది.

తెలుగులో కూడా ఉంది

ప్రస్తుతం ‘ది లెజెండ్ ఆఫ్ కర్ణ’ సిరీస్ Sony LIVలో ఉంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అద్భుతమైన యానిమేషన్, శక్తివంతమైన నేపథ్య సంగీతంతో, మహాభారతంలోని ప్రసిద్ధ ఘట్టాలను విజువల్‌ వండర్ గా ఆవిష్కరించారు. మహాభారతంపై ఆసక్తి ఉన్నవారికి మాత్రమే కాదు… గొప్ప యోధుడి కథ వెనుక దాగి ఉన్న విషాద జీవితాన్ని తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఇది తప్పకుండా చూడదగ్గ సిరీస్. కర్ణుడి ధైర్యం, త్యాగం, స్నేహం, విధి చేసిన అన్యాయాన్ని భావోద్వేగంగా చూపించే ఈ యానిమేటెడ్ సిరీస్ ను కుటుంబమంతా కలిసి చూసేలా తెరకెక్కించారు. పురాణ గాథలను ఆధునిక విజువల్స్‌తో ఆస్వాదించాలని అనుకుంటే ఈ వీకెండ్‌లో దీన్ని మీ వాచ్‌లిస్ట్‌లో చేర్చుకోవచ్చు.

ప్రాణాలు తీసిన ప్రాంక్… ఓటీటీని షేక్ చేస్తున్న షాకింగ్ టీన్ థ్రిల్లర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live