Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన 'సింపతీ స్కెచ్' వర్కౌట్ అవుతుందా?

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన 'సింపతీ స్కెచ్' వర్కౌట్ అవుతుందా?

Big TV Live 4 days ago

Abhishek Banerjee: ఈ సీన్‌ జరిగింది మే30న.. కానీ దీని తాలుకు రాజకీయం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.. సోనార్‌పూర్‌లో ఎన్నికల అనంతరం జరిగిన దాడుల్లో చనిపోయిన ఒక టీఎంసీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి అభిషేక్ బెనర్జీ వెళ్లాడు.

అభిషేక్ ఎనర్జీ ఎంట్రీతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం మారిపోయింది. కొందరు వ్యక్తులు అభిషేక్‌ను టార్గెట్ చేసి చోర్ చోర్ అంటూ నినాదాలు చేశారు. ఆ వెంటనే కోడిగుడ్లు, రాళ్లు, చెప్పులతో దాడి చేశారు. అభిషేక్ బెనర్జీ తన తలకు ఎలాంటి గాయాలు కాకుండా ఒక హెల్మెట్ ధరించారు. సో.. పెద్దగా గాయాలైతే కాలేదు.

దాడి రాజకీయ మైలేజ్‌గా మారుతుందా?

ఇష్యూ ఏదైనా తమకు అనుకూలంగా వాడుకోవడంలో రాజకీయ నేతలను మించిన వారు ఉండరు. ఇప్పుడు ఈ దాడి కూడా అలాంటిదే అనే చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత తీవ్ర నిరాశలో ఉన్న టీఎంసీ క్యాడర్‌లో జోష్‌ పెరుగుతుందనే చర్చ ఇప్పుడు మొదలైంది. ఎందుకంటే మూడున్నర దశాబ్దాల క్రితం ఇలాంటి ఘటనే మమతా బెనర్జీని ఓ రెబల్‌ స్టార్‌గా మార్చింది. ఇప్పుడు అభిషేక్ బెనర్జీకి కూడా ఇది ఒక పొలిటికల్ మైలేజ్‌గా మారే అవకాశం కనిపిస్తోంది.

అభిషేక్ ఘటనపై ఏకమైన ప్రతిపక్షం

అంతేకాదు ఈ కష్టకాలంలో మమతా బెనర్జీకి ఇండి కూటమి నుంచి అనూహ్య మద్దతు లభించింది. గతంలోని రాజకీయ విభేదాలను పక్కనపెట్టి పలువురు జాతీయ నేతలు ఆమెకు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్వయంగా మమతకు ఫోన్ చేసి పరామర్శించారు. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని ఖండించారు. అవసరమైతే అభిషేక్‌కు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించేందుకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఇది బీజేపీ కక్షసాధింపు రాజకీయాలకు నిదర్శనమని ఆరోపించారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కోల్‌కతాకు వచ్చి మరీ మమతను పరామర్శించారు. అరవింద్ కేజ్రీవాల్, తేజస్వి యాదవ్ వంటి వారు కూడా మద్దతు ప్రకటించారు.

బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ

అయితే ఈ దాడిపై ఇప్పుడు కొత్త చర్చ జరుగుతోంది. లైవ్ కెమెరాల ముందే ఆయనపై రాళ్లు, కోడిగుడ్లతో విరుచుకుపడటం అయితే సింపతి స్టంట్ లేదా ప్రజల్లో నరనరాల్లో ఉన్న ఆగ్రహం అంటూ బీజేపీ ఆరోపిస్తోంది. ఈ దాడి జరిగిన తర్వాత కూడా ఆయన అలానే కార్యకర్త ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆ తర్వాత నేరుగా హాస్పిటల్‌కు వెళ్లారు. ఇక అక్కడి నుంచి మొదలైంది పొలిటికల్ హీట్.

అభిషేక్ డిశ్చార్జ్‌పై దీదీ ఆగ్రహం

దాడి తర్వాత అభిషేక్ బెనర్జీని బెల్‌ వ్యూ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స తర్వాత అతడికి పెద్ద గాయాలు ఏం కాలేదని డిశ్చార్జ్ చేశారు. దీనిపై దీదీ ఫుల్ సీరియస్ అయ్యారు. ఆ హాస్పిటల్ సీఈవో ప్రదీప్ టాండన్‌కు వార్నింగ్ ఇచ్చారు. టాండన్‌ మీరు తప్పుచేశారని.. తాము చేసిన సాయాన్ని గుర్తుచేసుకోవాలన్నారు… దేవుడు మిమ్మల్ని క్షమించడని.. మీ అహంకారాన్ని గుర్తుంచుకుంటామన్నారు దీదీ. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉందని.. తర్వాత వాళ్లు అధికారం కోల్పోతే.. మేం చేయాల్సింది చేస్తామంటూ దీదీ వార్నింగ్ ఇస్తున్నారు.

అభిషేక్ దాడి.. అసలు కారణం ఏంటి?

అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తమ నేతను అంతమొందించడానికే ఈ ప్లాన్ చేసిందని మమతా బెనర్జీ, టీఎంసీ ఆరోపిస్తున్నాయి. కావాలనే అభిషేక్‌కు భద్రత తగ్గించారని, ఇది బీజేపీ స్పాన్సర్డ్ దాడి అని వారు చెప్తున్నారు. కాదు.. అభిషేక్ బెనర్జీ అహంకారమే కారణమనేది బీజేపీ కౌంటర్. గత 15 ఏళ్లుగా టీఎంసీ సాగించిన అణచివేత, అవినీతిపై స్థానిక ప్రజల్లో ఉన్న తీవ్ర ఆగ్రహమే ఇలా దాడి రూపంలో వ్యక్తమైందని, ఇందులో తమ ప్రమేయం లేదని బీజేపీ అంటోంది.

టీఎంసీపై బీజేపీ ఫైర్

అంతేకాదు.. గతంలో టీఎంసీ నేతలు, కార్యకర్తలు, కొందరు గూండాలు తమ పార్టీ నేతలపై చేసిన దాడులను గుర్తు చేస్తోంది బీజేపీ. 2021 అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన అప్పటి బీజేపీ చీఫ్ జేపీ నడ్డాపై రాళ్లతో దాడులు చేశారు. అభిషేక్ బెనర్జీ నియోజకవర్గం డైమండ్ హార్బర్ వైపు వెళ్తుండగా సిరకోల్ వద్ద ఈ దాడులు జరిగాయి. గతేడాది ఆగస్టులో సువేందు అధికారి కాన్వాయ్‌పై కూడా రాళ్ల వర్షం కురిపించారు నిరసనకారులు. ఇక గతేడాది అక్టోబర్‌లో బీజేపీ ఎంపీ ఖగెన్ ముర్ముపై కూడా దాడి చేశారు. ఈ దాడిలో ఆయన తలకు తీవ్ర గాయమైంది. ఇక సెంట్రల్ మినిస్టర్‌గా ఉన్న సుకాంత మజుందార్ కాన్వాయ్‌పై కూడా దాడి జరిగింది. ఇది ప్రముఖ లీడర్ల లిస్ట్ మాత్రమే.. ఇక చోటా మోటా నేతలు, కార్యకర్తలపై దాడులకు అయితే లెక్కలేదు. ఇప్పడీ దాడులన్నింటిని గుర్తు చేస్తోంది బీజేపీ.

అభిషేక్‌పై దాడి.. రాజకీయంగా ఎవరికీ లాభం?

ఏదేమైనా అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి మాత్రం కొన్ని పరిస్థితులను తెరపైకి తీసుకొస్తోంది. మమతా బెనర్జీ తర్వాత పార్టీలో నంబర్-2 అయిన అభిషేక్ బెనర్జీపైనే దాడి జరగడం అనేది అసాధారణం. ఇక మరో యాంగిల్‌లో చూస్తే ఎన్నికల ఓటమి తర్వాత డీలా పడ్డ టీఎంసీ శ్రేణుల్లో ఈ దాడి ఒక కసిని పెంచే అవకాశం ఉంది. మరో కోణంలో చూస్తే ఒకప్పుడు బెంగాల్‌ను శాసించిన టీఎంసీ నేతలకు ఇప్పుడు సొంత నియోజకవర్గాల్లోనే రక్షణ కరువైందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

దాడి దుమారం మధ్య టీఎంసీకి మరో షాక్

టీఎంసీ అధినేత మమతా బెనర్జీకి షాక్ ఇచ్చే మరో ఘటన కూడా జరిగింది. తన పార్టీ ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేసిన సమావేశానికి కేవలం 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. మిగిలిన 60 మంది డుమ్మా కొట్టారు. ఇది కూడా ఓ హాట్‌ టాపిక్‌గా మారింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలే మొఖం చాటేస్తున్నారనే చర్చ మొదలైంది. అయితే తృణమూల్ ఈ ఘటనపై వివరణ ఇచ్చింది. అన్ని నియోజకవర్గాల్లో నిరసనలకు పిలుపునిచ్చామని.. ఆ ఏర్పాట్ల కోసమే ఎమ్మెల్యేలు సమావేశానికి రాలేదని ప్రకటించింది. ఏదేమైనా ఈ కొడిగుడ్ల దాడిని మాత్రం తమ రాజకీయ అస్త్రంగా మార్చుకునేందుకు టీఎంసీ చేయాల్సిందంతా చేస్తుందని మాత్రం అర్థమవుతోంది. అయితే ఇది ప్రజల్లోకి ఎలా వెళుతుందనేది చూడాలి.

ఎవరీ అభిషేక్ బెనర్జీ?

ఈ దాడి జరిగిందని కాదు కానీ.. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారిన పేరు అభిషేక్ బెనర్జీ. ఈ అభిషేక్ బెనర్జీ మరెవరో కాదు.. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సొంత మేనల్లుడు. అందుకే మమతా మాటకు ఎంత విలువ ఉంటుందో.. అభిషేక్ బెనర్జీ మాటకు కూడా అంతే. అందుకే బెంగాల్ పొలిటికల్ సర్కిల్స్‌లో అతడిని భైపో అని పిలుస్తారు. భైపో అంటే.. బెంగాలీలో మేనల్లుడు అని అర్థం.

అభిషేక్ సెన్సేషనల్ జర్నీ!

ఎంబీఏ చదివిన అభిషేక్ 2011లో మమతా బెనర్జీ బెంగాల్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వచ్చారు. 2014 లో కేవలం 26 ఏళ్ల వయసులోనే డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచి లోక్‌సభలో అడుగుపెట్టారు. దీదీ వారసుడిగా పేరు ఉండటంతో అతి త్వరలోనే పార్టీలో కీలక సభ్యుడిగా మారాడు అభిషేక్. కేవలం వారసత్వం అనే కార్డుతోనే కాకుండా తన వ్యూహాలతో పార్టీపై పట్టు సాధించాడనే చెప్పాలి.

టీఎంసీ విజయాల వెనుక వ్యూహకర్త ఎవరు?

అభిషేక్‌ మొదట యూత్‌లో తన గ్రాఫ్‌ను పెంచుకున్నారు. మొదట తృణమూల్ యువ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి, రాష్ట్రవ్యాప్తంగా యువతను పార్టీ వైపు తిప్పడంలో కీలక పాత్ర పోషించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ టీమ్‌ను బెంగాల్‌కు తీసుకురావడంలో, సరికొత్త డిజిటల్ ప్రచార వ్యూహాలను అమలు చేయడంలో అభిషేక్ కీలక పాత్ర పోషించారు. ఆ ఎన్నికల్లో టీఎంసీ భారీ విజయం సాధించడంతో ఆయన గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం ఆయన టీఎంసీ జాతీయ జనరల్ సెక్రటరీ. మమతా బెనర్జీ తర్వాత పార్టీలో ఏ నిర్ణయమైనా అభిషేక్ బెనర్జీ అనుమతి లేకుండా జరగదు.

అభిషేక్‌కు కీలక మలుపు

నిజానికి అభిషేక్ దీదీ వారసుడు అనేది ఓపెన్ సీక్రెట్‌. మమతా బెనర్జీ తన రాజకీయ వారసుడిగా అభిషేక్ బెనర్జీని ఎప్పుడో ప్రకటించారు. ఇన్నాళ్లు అధికారంలో ఉండేసరికి ఏం తెలియలేదు. కానీ రీసెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓడిపోయి బీజేపీ అధికారంలోకి రావడంతో అభిషేక్ నాయకత్వానికి పెద్ద పరీక్ష ఎదురవుతోంది. పార్టీ ఓడినా.. క్యాడర్‌ను కాపాడుకునే బాధ్యతను ఆయనే భుజాన వేసుకున్నారు.

టీఎంసీ పవర్ సెంటర్‌పై ఆరోపణల వరద

బట్.. అభిషేక్ బెనర్జీ ఎంత వేగంగా ఎదిగారో, అంతకంటే ఎక్కువ వివాదాల్లో చిక్కుకున్నారనే చెప్పాలి. మమతా బెనర్జీ పార్టీలోని సీనియర్ నేతలను పక్కన పెట్టి, తన మేనల్లుడికే సర్వాధికారాలు ఇచ్చారనే ఆరోపణలున్నాయి. సువేందు అధికారి వంటి సీనియర్లు టీఎంసీని వీడటానికి అభిషేక్ బెనర్జీ ఒక కారణమనే చర్చ ఉంది. అంతేకాదు పశ్చిమ బెంగాల్‌లోని ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ పరిధిలో జరిగిన వేల కోట్ల రూపాయల అక్రమ బొగ్గు రవాణా కేసులో ఈడీ, సీబీఐలు అభిషేక్ బెనర్జీతో పాటు ఆయన భార్య రుజిరా బెనర్జీలను కూడా పలుసార్లు విచారించాయి. అంతేకాదు స్కూల్ జాబ్స్ స్కామ్‌లో కూడా అభిషేక్ పేరు వినిపించింది. టీచర్ల రిక్రూట్‌మెంట్‌లో జరిగిన భారీ అవినీతికి సంబంధించి కూడా ఈడీ ఆయనకు నోటీసులు ఇచ్చి విచారించింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎంపికకు సంబంధించి ఒక టీఎంసీ తీర్మానంపై ఫోర్జరీ సంతకం చేశారనే ఆరోపణలపై బెంగాల్ సీఐడీ నోటీసులు ఇచ్చింది.

టీఎంసీ ఓటమికి అభిషేక్ బాధ్యతేనా..?

అంతేకాదు బెంగాల్‌లో జరిగిన అనేక అల్లర్లు, ఆందోళనలు, హింసకు అభిషేక్ బెనర్జీనే ఒక రకంగా కారణమనే చర్చ ఉంది. నిజానికి మొన్నటి ఎన్నికల్లో టీఎంసీ ఓటమికి దీదీ ఎంత కారణమో.. అభిషేక్ కూడా అంతే కారణమనే చర్చ ఉంది. అభిషేక్ బెనర్జీ నంబర్ 2గా ఉన్నప్పటికీ, సీనియర్ నాయకులలో ఆయనపై తీవ్ర అసంతృప్తి ఉంది. అయితే అధికారం లేకపోవడంతో ఇప్పుడు అసంతృప్త నేతలు అయితే ఇతర పార్టీలో చేరాలి.. లేదంటే అభిషేక్‌ను తమ నాయకుడిగా అంగీకరించాలి. గతంలో అభిషేక్ నిర్వహిస్తున్న జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని రద్దు చేసేశారు. ఇదే కాకుండా… పార్టీలోని ఇతర పదవులను కూడా రద్దు చేసేశారు దీదీ. అప్పట్లో జూనియర్లు, సీనియర్లకు మధ్య గ్యాప్‌ను తగ్గించేందుకు ఈ పని చేశారు.

సెంటిమెంట్ కార్డ్‌తో టీఎంసీ కొత్త వ్యూహం

ప్రస్తుతం అభిషేక్ బెనర్జీని హైలేట్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు మమతా బెనర్జీ. దానికి ఆయనపై జరిగిన దాళ్ల దాడిని ఫుల్‌ ఫ్లెడ్జ్‌గా ఉపయోగించుఉంటున్నారు. టీఎంసీ మనుగడకు, అభిషేక్ బెనర్జీ పొలిటికల్ రీ-లాంచ్‌కు ఈ ఘటన ఒక పెద్ద అస్త్రంగా మారిందనే చెప్పాలి. రాజకీయాల్లో సెంటిమెంట్, విక్టిమ్ కార్డ్ అనేవి అత్యంత శక్తివంతమైన ఆయుధాలు. మమతా బెనర్జీ ఈ విద్యలో దిట్ట. 1990లలో లెఫ్ట్ ఫ్రంట్ హయాంలో మమతా బెనర్జీపై ఇలాగే దాడులు జరిగాయి. ఆ గాయాలు, ఆ హాస్పిటల్ విజువల్సే ఆమెను బెంగాల్ ప్రజల్లో ఒక ఫైటర్‌గా మార్చాయి. 2021 ఎన్నికల్లో కూడా కాలికి కట్టుతో వీల్‌చైర్‌పై ప్రచారం చేసి సింపతీతో గెలిచారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత, అభిషేక్ బెనర్జీ నాయకత్వంపై పార్టీలోనే అనుమానాలు మొదలయ్యాయి. కానీ ఇప్పుడు జరిగిన దాడితో… అభిషేక్ బెనర్జీ ప్రజల కోసం, కార్యకర్తల కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్నాడు, అందుకే బీజేపీ ఆయనపై దాడులు చేయిస్తోంది అనే ఇమేజ్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు.

టీఎంసీ భవిష్యత్తు అభిషేక్ చేతుల్లోనేనా?

ఇదే సమయంలో మమతా బెనర్జీ వయసును లెక్క వేసుకొని ముందుకు వెళుతున్నట్టు కనిపిస్తోంది. భవిష్యత్తులో పార్టీని నడిపించే వారసుడు అభిషేక్ మాత్రమేనని క్లియర్ సిగ్నల్ ఇస్తున్నారు దీదీ. ఈ దాడి తర్వాత పార్టీలోని సీనియర్ నేతలంతా అభిషేక్ వెనుక నిలబడక తప్పని పరిస్థితిని మమత క్రియేట్ చేశారు. టీఎంసీ అంటే మమత-అభిషేక్ మాత్రమే అనే ఫీల్‌ను తీసుకురావడంలో సక్సెస్ అవుతున్నారు.

సింపతీ కార్డ్ వర్కౌట్ అవుతుందా..?

బెంగాలీ ప్రజల్లో సాధారణంగా హింసను ఎదుర్కొని నిలబడే నేతలకు ఒక రకమైన గౌరవం ఉంటుంది. అభిషేక్ బెనర్జీని భయపెట్టాలని చూస్తే ఆయన మరింత దూకుడుగా మారారనే సంకేతం వెళ్తే, అది యువతను ఆకట్టుకోవచ్చు. అయితే గత 15 ఏళ్లుగా బెంగాల్‌లో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ టీఎంసీ శ్రేణులు ప్రత్యర్థులపై విపరీతమైన దాడులు చేశాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అభిషేక్‌పై దాడి జరగగానే టీఎంసీ సింపతీ కోరడాన్ని సామాన్య ప్రజలు ఎంత మేర నమ్ముతారనే దానిపైనే ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉంది. మమతా బెనర్జీ ప్లాన్ ప్రకారం అభిషేక్‌ను విక్టిమ్‌గా, హీరోగా చూపించే ప్రయత్నం అయితే గట్టిగానే జరుగుతోంది. కానీ బెంగాల్ ప్రజలు ఇప్పటికే టీఎంసీ హింసాత్మక రాజకీయాలపై విసిగిపోయి మార్పు కోరుకున్నారు. కాబట్టి ఈ సింపతీ కార్డ్ మునుపటిలా వంద శాతం వర్కవుట్ అవ్వడం కాస్త కష్టమే.

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

Story by: Anup, Big Tv

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live