West Bengal Politics: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు పెను సంచలనం దిశగా అడుగులు వేస్తున్నాయి. రాష్ట్ర చరిత్రలో తొలిసారి సీఎం పీఠం అధిరోహించేందుకు బీజేపీ పార్టీ వడివడిగా అడుగులు వేస్తోంది.
ఎన్నికల ఫలితాల్లో ఇప్పటికే మెజారిటీ మార్క్ దాటేసిన కాషాయ దళం.. 15 ఏళ్ల మమతా పాలనను పునాదులతో సహా పెకలించేందుకు రెడీ అవుతోంది. బెంగాల్లో మెుత్తం 294 స్థానాలకు గానూ ప్రస్తుతం బీజేపీ మెజారిటీ మార్క్ (148) దాటి 191కి పైగా స్థానాల్లో ముందంజలో ఉంది. అటు మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ 98 స్థానాల్లో ఆధిక్యంలో ఉండి 100లోపే పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ – అమిత్ షా ద్వయం అనుసరించిన వ్యూహాలు టీఎంసీ కోటను ఏవిధంగా బద్దలు కొట్టాయో ఇప్పుడు చూద్దాం.
క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం..
2021 బెంగాల్ ఎన్నికల్లో 77 స్థానాలకే పరిమితమైన బీజేపీ.. ఈసారి గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంలో సూపర్ సక్సెస్ అయ్యింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ.. టీఎంసీలోని అసంతృప్త నేతలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా సువేందు అధికారి వంటి బలమైన నేతలను తమ వైపు తిప్పుకోవడంలో ఆయన విజయం సాధించారు.
టీఎంసీ అవినీతిపై అటాక్..
తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలు, ఈడీ – సీబీఐ దాడులను తనకు ప్రచార అస్త్రాలుగా మలుచుకొని బీజేపీ విజయవంతమైంది. ముఖ్యంగా టీచర్ ఉద్యోగాల్లో చోటుచేసుకున్న భారీ కుంభకోణాన్ని ఎక్కడికక్కడ తన ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు ఎండగడుతూ వచ్చారు. తద్వారా నిరుద్యోగ యువతలో మరింత అసంతృప్తిని రాజేయడంలో బీజేపీ విజయం సాధించింది. దీంతో పెద్ద ఎత్తున యువత బీజేపీ వైపు ర్యాలీ అయ్యి.. టీఎంసీకి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మహిళా ఓటర్ల మద్దతు
గత మూడు పర్యాయాలు మమతా అధికారం చేపట్టడం వెనుక మహిళా ఓటర్ల పాత్ర ఎంతో ఉంది. అయితే ఈసారి మహిళా ఓటర్లు మమతకు దూరమైనట్లు తెలుస్తోంది. ఆర్జీకర్ ఆస్పత్రిలో మహిళా డాక్టర్ హత్యోదంతం.. రాష్ట్రంలోని స్త్రీల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తాయి. ఈ క్రమంలోనే బాధితురాలి తల్లి రత్నా దేబ్ నాథ్ ను బీజేపీ ఎన్నికల బరిలోకి దింపి.. మహిళా సెంటిమెంట్ ను ఓట్లుగా మార్చుకోవడంలో విజయవంతమైంది.
డబుల్ ఇంజిన్ సర్కార్..
ప్రధాని మోదీ తన బెంగాల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ను ప్రధానంగా హైలెట్ చేశారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఒకే పార్టీ అధికారంలో ఉండటం ద్వారా అభివృద్ధిలో దూసుకుపోవచ్చని పేర్కొన్నారు. దీనికి తోడు మమతా బెనర్జీ హయాంలో పెరిగిపోయిన నిరుద్యోగం, అవినీతి, అభివృద్ధి లేమిని ఆయన ప్రస్తావించారు. ఇది కూడా బీజేపీ వైపు ఓటర్లు మెుగ్గు చూపడానికి సాయపడిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
సామాజిక సమీకరణాలు
సీఏఏ (CAA) అమలు వంటి అంశాలతో బెంగాల్లో పెద్ద ఎత్తున ఉన్న మతువా వర్గం ఓట్లను బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. ముస్లిం ఓట్ల కోసం టీఎంసీ చేస్తున్న రాజకీయాలను బాహాటంగా ప్రశ్నిస్తూ.. హిందూ ఓటర్లను ఏకతాటిపైకి తేవడంలో అమిత్ షా వ్యూహాలు ఫలించాయి. దీంతో భారీగా హిందువులు.. మమతకు వ్యతిరేకంగా బీజేపీ పక్షాన చేరినట్లు రిజల్ట్స్ ను బట్టి అర్ధమవుతోంది.
విజయ్ సునామీలో.. కొట్టుకుపోయిన ద్రవిడ సిద్దాంత పార్టీలు.. 6 దశాబ్దాల చరిత్రకు 6 నెలల్లో చెక్!
ఎస్ఐఆర్ ప్రభావం..
గత కొంతకాలంగా బెంగాల్‌లో సాగుతున్న రాజకీయ హింసను దేశవ్యాప్తంగా చర్చకు పెట్టడం ద్వారా టీఎంసీ నైతికతను బీజేపీ భారీగా దెబ్బతీసింది. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ.. ఎన్నికల కమిషన్‌పై ఒత్తిడి పెంచడం బీజేపీకి కలిసొచ్చింది. బెంగాల్లో నిర్వహించిన ఎస్ఐఆర్ (స్పెషన్ ఇంటెన్సివ్ రివిజన్)లో ఏకంగా 91 లక్షల ఓటర్ల పేరు తొలగించబడ్డాయి. అయితే తమ మద్దతుదారుల ఓట్లను తొలగిస్తున్నారని మమతా బెనర్జీ సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. పైగా దీని ద్వారా ప్రజల్లో సానుభూతి పొందాలని దీదీ చేసిన ప్రయత్నం కూడా వర్కౌట్ కాలేదు. మెుత్తం మీద వచ్చే 5ఏళ్ల బీజేపీ పాలనలో మమతాకు తీవ్ర ఇబ్బందులు తప్పవని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఆ పార్టీ కథ ముగిసినట్లేనన్న అభిప్రాయాలను సైతం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.
2026 ఎన్నికల ఫలితాలు.. బీజేపీదే హవా.. 'ఇండియా' కూటమికి అంతిమ ఘడియలు అంటున్న జీవీఎల్

