Mahindra Thar Military ATV:దేశీయ ఆటో దిగ్గజం మహీంద్రా తాజాగా భారత భద్రతా దళాల కోసం రూపొందించిన ప్రత్యేక ఆల్ టెర్రైన్ వెహికల్ ను ఆవిష్కరించింది.
ఈ వెహికల్ మహీంద్రా థార్ రాక్స్ ప్లాట్ ఫామ్ మీద తయారైంది. ఈ విషయాన్ని కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పెషల్ వెహికల్ ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వాహనం సైనిక పరీక్షల దశలో ఉందని, అన్ని పరీక్షలు విజయవంతమైతే, భవిష్యత్తులో ఆర్మీలో ఉపయోగించే అవకాశం ఉందన్నారు.
రక్షణ రంగంలో మహీంద్రాకు మంచి అనుభం
మహీంద్రా ఇప్పటికే రక్షణ రంగంలో అనుభవం ఉన్న సంస్థ. మహీంద్రా ఆర్మడో, మహీంద్రా మార్క్స్ మన్, మహీంద్రా స్కార్పియో క్లాసిక్ లాంటి వాహనాలు ఇప్పటికే భారత సాయుధ దళాల్లో ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఈ కొత్త ATVతో మరింత ఆధునిక వాహనాలను అందించబోతోంది.
సాధారణ థార్ తో పోల్చితే కీలక మార్పులు
ఈ కొత్త వాహనం డిజైన్ చూస్తే, సాధారణ థార్‌తో పోలిస్తే చాలా మార్పులు కనిపిస్తాయి. ముందు భాగంలో LED హెడ్ ల్యాంప్స్, బలమైన గ్రిల్ ఉన్నప్పటికీ, దీనికి ప్రత్యేకంగా ఓ హేవీ డ్యూటీ బంపర్ అమర్చారు. కఠినమైన భూభాగాల్లో ఈజీగా బయటపడేందుకు వించ్ కూడా ఉంటుంది. విండ్షీల్డ్ ముందు మెటల్ ఫ్రేమ్ అమర్చి, అదనపు ప్రొటెక్షన్ ను కల్పించారు. సాధారణ డోర్స్ తీసివేసి, వాటి స్థానంలో ఓపెన్ మెటల్ పైప్స్ ఉపయోగించారు. ఇది బరువును తగ్గించడమే కాకుండా, సైనికులు త్వరగా ఎక్కడం, దిగడం ఈజీ చేస్తుంది. పైకప్పు కూడా పూర్తిగా తీసివేసి, రోల్ కేజ్ అమర్చారు. దీనిపై 360 డిగ్రీల టరెట్ ను అమర్చే వీలుంది. దీని ద్వారా మెషిన్ గన్ ను ఉపయోగించవచ్చు.
కష్టమైన మార్గాల్లో ప్రయాణానికి అనుకూలంగా, వాహనం రెండు వైపులా రాక్ స్లైడర్లు, కింద భాగంలో అండర్ బాడీ ప్రొటెక్షన్ ఇచ్చారు. వెనుక భాగంలో అదనపు ఇంధనం కోసం జెర్రీకాన్ హోల్డర్, అలాగే రెండు స్పేర్ వీల్స్ అమర్చారు. సైనిక సామగ్రిని భద్రంగా ఉంచేందుకు ప్రత్యేక స్టోరేజ్ వ్యవస్థ కూడా ఉంది.
ఇంజిన్ గురించి..
ఈ వాహనం 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ తో పనిచేస్తుంది. ఇది సుమారు 172 హార్స్ పవర్ శక్తిని, 400 Nm టార్క్ ను అందిస్తుంది. 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్, 4×4 డ్రైవ్ సిస్టమ్ తో అన్ని రకాల రోడ్లపై సులభంగా నడుస్తుంది. సస్పెన్షన్ కూడా ప్రత్యేకంగా రూపొందించబడింది, కఠినమైన భూభాగాల్లో కూడా సౌకర్యవంతంగా ప్రయాణం చేసేలా ఉంది. ఇంటీరియర్ వివరాలు పూర్తిగా బయటకు రాలేదు. కానీ, సైనిక అవసరాలకు తగ్గట్టు సింపుల్, బలమైన డిజైన్ ఉండే అవకాశం ఉంది. ఆర్మీ గ్రీన్ కలర్ థీమ్ ఇందులో కనిపిస్తోంది. ఈ కొత్త థార్ ఆధారిత ATV భారత సైనిక అవసరాలకు అనుగుణంగా రూపొందించబడిన ఒక బలమైన, సమర్థవంతమైన వాహనంగా చెప్పుకోవచ్చు. పరీక్షలు పూర్తయిన తర్వాత అందుబాటులోకి వస్తే, రక్షణ రంగంలో మరింత ఉపయోగకరంగా మారే అవకాశం ఉంది.
Read Also: మరింత స్టైలిష్‌గా కర్వ్ EV.. కొత్త రంగులో ఏముంది భయ్యా!

