Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై బొత్స హాట్ కామెంట్స్.. చంద్రబాబుకు నేరుగా సవాల్!

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై బొత్స హాట్ కామెంట్స్.. చంద్రబాబుకు నేరుగా సవాల్!

Big TV Live 2 weeks ago

Botsa Satyanarayana: విశాఖపట్నం వేదికగా శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం, పోలీసుల వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం నుంచి నిన్నటి వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటన వరకు పలు కీలక అంశాలపై ఆయన స్పష్టతనిచ్చారు.

భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ జగన్‌దే

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆలోచన వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలదేనని బొత్స స్పష్టం చేశారు. వైజాగ్ ఎయిర్‌పోర్ట్ విస్తరణ ప్రతిపాదనలు వచ్చినప్పుడే అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా తాను, ఇతరులు భోగాపురం, యలమంచిలి వద్ద స్థలాలను పరిశీలించామని గుర్తుచేశారు. ఈ వాస్తవాలు చంద్రబాబుకు, అశోక్ గజపతిరాజుకు కూడా తెలుసన్నారు. 2019 వరకు టిడిపి హయాంలో 15 వేల ఎకరాలు కావాలని చెప్పడం తప్ప ఒక్క ఎకరమైనా సేకరించారా అని ప్రశ్నించారు. అసలు భూసేకరణ ఎవరు చేశారు, పరిహారం ఎవరు చెల్లించారో లెక్కలు తీయాలని సవాల్ విసిరారు.

జగన్ పర్యటనకు ప్రజాస్పందన..

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు వచ్చిన వైఎస్ జగన్‌ది విజయవంతమైన పర్యటన అని బొత్స పేర్కొన్నారు. జగన్ ప్రజా నాయకుడని, పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా లెక్కచేయకుండా లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని చెప్పారు. పర్యటనను విజయవంతం చేసిన వైఎస్సార్‌సీపీ శ్రేణులకు ఆయన అభినందనలు తెలిపారు.

పోలీసుల వేధింపులు.. గవర్నర్‌కు లేఖ

రాజకీయ కక్షసాధింపుల్లో భాగంగా కార్యకర్తలపై 'అటెంప్ట్ టు మర్డర్' వంటి తీవ్రమైన కేసులు పెట్టడం దారుణమని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. జైలు వద్దకు తాను అప్పలరాజు కుటుంబ సభ్యులతో వెళ్తుంటే కాన్వాయ్‌లో లేకపోయినా పోలీసులు కావాలనే అడ్డుకున్నారన్నారు. తాను పోలీసులను బెదిరించినట్లు కథనాలు రాయడం సరికాదన్నారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎవరినీ బెదిరించలేదని, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని పోలీసులను హెచ్చరించారు. ప్రభుత్వం ప్రవర్తించిన తీరుపై ఇప్పటికే గవర్నర్‌కు లేఖ రాశామని, ఈ దుష్టపాలనపై భవిష్యత్తులోనూ పోరాడతామని స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live