Congress Strategy: స్వేచ్ఛ బ్యూరో: యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం భువనగిరి పట్టణంలో విస్తృత స్థాయిలో నిర్వహించబడింది.
ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ కార్యక్రమాల అమలు, నాయకత్వ సమన్వయం వంటి అంశాలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయడం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో, ప్రతి బూత్‌లో పార్టీకి బలమైన నిర్మాణం ఉండాలని, అందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలతో నిరంతరం మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడం ప్రతి నాయకుడి బాధ్యత అని పేర్కొన్నారు.
భువనగిరి నియోజకవర్గంలో..
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు సకాలంలో, సమర్థంగా చేరవేసి వారి విశ్వాసాన్ని గెలుచుకోవాలని ఆయన సూచించారు. పథకాల అమలులో ఎటువంటి లోపాలు లేకుండా చూసుకోవడంతో పాటు, లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. రాబోయే పార్టీ కార్యక్రమాలు, సభ్యత్వ నమోదు విస్తరణ, సంగఠన్ సృజన్ అభియాన్ కార్యక్రమాల సమర్థవంతమైన అమలు, గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు కమిటీల ఏర్పాటు, కోఆర్డినేటర్లతో సమన్వయం వంటి కీలక అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. పార్టీని కేడర్ స్థాయిలో బలపరిచేందుకు స్పష్టమైన కార్యాచరణ రూపొందించుకోవాలని నాయకులు నిర్ణయించారు. అదేవిధంగా భువనగిరి నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజలకు కనిపించే విధంగా ఫలితాలు అందించాలని ఎమ్మెల్యే కుంభం సూచించారు. ప్రతి ప్రాజెక్ట్‌ను సమయానికి పూర్తి చేసి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా పనిచేయాలని అన్నారు.
పాలమూరులో ఇసుక మాఫియా అరాచకం.. దందా అడ్డుకుంటే పై నుంచి ఫోన్లు..?
ఈ సమావేశంలో..
ఈ సమావేశంలో భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ & SSA కో-ఆర్డినేటర్ కె. శంకర్ నాయక్, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్, డిసిసి అధ్యక్షులు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, నకిరేకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే (ప్రభుత్వ విప్) వేముల వీరేశం, తుంగతుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మందుల శామ్యూల్, డిసిసి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, డిసిసి సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, డిసిసి జనగాం జిల్లా అధ్యక్షురాలు దమయంతి, జనగాం, భువనగిరి, ఇబ్రహీంపట్నం, మునుగోడు, తుంగతుర్తి తదితర నియోజకవర్గాల కోఆర్డినేటర్లు నూతి శ్రీకాంత్ గౌడ్, ఈ.వి. శ్రీనివాస్ రావు, చైతన్య కృష్ణ రెడ్డి, రుద్ర సంతోష్ కుమార్, కొండేటి మల్లయ్య , ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

