Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
BREAKING: తమిళనాడు సీఎంగా విజయ్..? టీవీకేఎల్పీ నేతగా ఏకగ్రీవ ఎన్నిక

BREAKING: తమిళనాడు సీఎంగా విజయ్..? టీవీకేఎల్పీ నేతగా ఏకగ్రీవ ఎన్నిక

Big TV Live 5 months ago

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన తమిళగ వెట్రి కళగం (TVK) ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు దిశగా కీలక అడుగులు వేస్తోంది.

చెన్నై పనైయూర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన నూతన ఎమ్మెల్యేల సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో టీవీకే అధినేత విజయ్‌ను ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ నిర్ణయంతో విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించేందుకు మార్గం సుగమమైంది. అంతకుముందు విజయ్ పెరియార్, అంబేడ్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించి సామాజిక న్యాయం పట్ల తన నిబద్ధతను చాటుకున్నారు.

తమిళనాడు శాసనసభలో 108 స్థానాలను కైవసం చేసుకుని టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. స్పష్టమైన మెజారిటీకి చేరువలో ఉన్న విజయ్ ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు కోసం మిత్రపక్షాల వేటలో పడ్డారు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో చర్చలు జరిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఈ చర్చలు సఫలమైతే మ్యాజిక్ ఫిగర్‌ను సునాయాసంగా చేరుకుని తొలిసారిగా ఒక సినీ నటుడు రాజకీయాల్లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే అత్యున్నత పదవిని దక్కించుకున్న రికార్డును విజయ్ సృష్టించనున్నారు.

ఎన్నికల్లో విజయ్ రెండు చోట్ల పోటీ చేసి రెండింటిలోనూ ఘనవిజయం సాధించారు. పెరంబూరు నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థి ఆర్‌డీ శేఖర్‌పై 53,715 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. తిరుచ్చి ఈస్ట్ స్థానంలో ఎస్. ఇరుదయరాజ్‌పై 27,416 ఓట్ల ఆధిక్యంతో విజేతగా నిలిచారు. చట్ట ప్రకారం ఒక వ్యక్తి రెండు స్థానాలకు ప్రాతినిధ్యం వహించడం సాధ్యం కాకపోవడంతో ఆయన ఒక సీటును వదులుకోవాల్సి ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం విజయ్ తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు.

పెరంబూరు ఎమ్మెల్యేగానే కొనసాగి అక్కడి ప్రజలకు అందుబాటులో ఉండాలని విజయ్ భావిస్తున్నారు. రాజధాని నగర పరిధిలోని నియోజకవర్గం కావడం, పాలనాపరంగా సౌలభ్యం ఉండటం వల్ల ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా టీవీకే శ్రేణులు ఇప్పుడు పండుగ వాతావరణంలో మునిగిపోయారు. మరోవైపు విజయ్ తన క్యాబినెట్ కూర్పుపై కూడా కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం. అనుభవం కలిగిన నేతలు, యువ రక్తం కలయికతో ఒక సమర్థవంతమైన టీమ్‌ను రూపొందించాలని ఆయన యోచిస్తున్నారు.

పెరంబూరు ఎమ్మెల్యేగా విజయ్‌.. తిరుచ్చి ఈస్ట్ సీటుకు త్వరలో రాజీనామా!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live