Cow Protection: స్వేచ్ఛ బ్యూరో: అక్రమంగా తరలించే గోవులను రక్షించే బాధ్యత పోలీసులదని హైదరాబాద్ కమిషనర్ వీ.సీ.సజ్జనార్ చెప్పారు. గోవులను తరలింపు సమాచారం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
తప్పితే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దాడుల వంటివి జరపొద్దని చెప్పారు. బక్రీద్ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ఆదివారం ఆయన బంజారాహిల్స్ లోని ఐసీసీసీలో వేర్వేరు గో రక్షక్ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పండుగ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు కమిషనరేట్ సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పకడ్భంధీ చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. గోరక్షకులు చట్టాన్ని పాటించాలన్నారు.
వారిపై క్రిమినల్ కేసులు..
పశువుల అక్రమ రవాణాకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసులకు తెలియ చేయాలని సూచించారు,. అలా కాకుండా పశువులను తరలిస్తున్న వారిపై ప్రత్యక్ష దాడులకు పాల్పడి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దన్నారు. అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పశు వధకు సంబంధించి ప్రజల మనోభావాలు దెబ్బ తీసేలా, రెచ్చగొట్టేలా, ఉద్రిక్త పెంచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని చెప్పారు. అలా చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. గో రక్షక్ ప్రతినిధులు పోలీసులతో కలిసి చెక్ పోస్టుల వద్దకు వెళ్ల వద్దని చెప్పారు. ఫోటోలు తీయటం, నిందితుల వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేయటం వంటివి చేయవద్దన్నారు. సమన్వయం కోసం ప్రతీ గో రక్షక్ సంఘం ఒక ప్రతినిధి ఫోన్ నెంబర్ ను పోలీసులకు అందచేయాలని సూచించారు.
Also read: తెలంగాణ రైల్వే రంగంలో చారిత్రాత్మక అడుగు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..!
కేవలం పండుగ సమయంలోనే..
వాలంటీర్లు తప్పనిసరిగా గుర్తింపు కార్డులను ధరించాలన్నారు. తనిఖీల పేర గో రక్షకులు తమ వద్ద ఎలాంటి ఆయుధాలు, పదునైన వస్తువులను పెట్టుకోవద్దని చెప్పారు. పోలీసుల స్వాధీనంలో ఉన్న వాహనాలను వెంబడించటం, దారిలో అడ్డంకులు సృష్టించటం వంటివి చేయవద్దని చెప్పారు. కేవలం పండుగ సమయంలోనే కాకుండా ఏడాది పొడవునా పశు వైద్యుల ధృవీకరణ లేకుండా జరిగే పశువుల అక్రమ రవాణాపై పోలీసుల నిఘా ఉంటుందని చెప్పారు. ఎలాంటి సమాచారం ఉన్నా 8712661000 నెంబర్ కు తెలియ చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు సీపీలు తఫ్సీర్ ఇక్భాల్, ఎం.శ్రీనివాసులు, జాయింట్ సీపీ శ్వేత, యుగ తులసీ ఫౌండేషన్ ఛైర్మన్ కొలిశెట్టి శివకుమార్, గో రక్షక్ దళ్ ప్రతినిధి దీపక్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

