Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చేయూత పెన్షన్ల ప్రక్షాళన.. 3 లక్షల మందికి కొత్త పెన్షన్లు!

చేయూత పెన్షన్ల ప్రక్షాళన.. 3 లక్షల మందికి కొత్త పెన్షన్లు!

Big TV Live 1 week ago

Cheyutha Pensions: స్వేచ్ఛ బ్యూరో: ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు,బీడి కార్మికులు, చేనేత, గీత, దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నవారిని ఆర్థికంగా ఆదుకునేందుకు చేయూత పథకం కింద పెన్షన్లు ఇస్తుంది.

అయితే అనర్హులకు అందుతుండటంతో వాటిపై ప్రభుత్వం దృష్టిసారించింది. వాటిని తొలగించేందుకు సోషల్ ఆడిట్ నిర్వహిస్తుండటం, లైవ్ అథెంటిపికేషన్ ప్రక్రియ చేపడుతుండటంతో అక్రమాలు బయటకు వస్తున్నాయి. అర్హులకే పింఛన్ ఇచ్చే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

లైవ్ ఆథెెంటిఫికేషన్ ప్రక్రియలో భారీ అక్రమాలు

చేయూత పెన్షన్ పథకంలో అర్హులైన లబ్ధిదారులకే పెన్షన్ అందేలా చేపట్టిన లైవ్ ఆథెంటిఫికేషన్ ప్రక్రియలో భారీ స్థాయిలో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు నిర్వహించిన ధృవీకరణలో 95 వేల మందిని అనర్హులను గుర్తించారు. దీంతో ప్రభుత్వ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగు వేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 42 లక్షల మంది చేయుత పెన్షన్ దారులుండగా…సుమారు 19 లక్షల మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రతి నెలా కోర్ బ్యాంకింగ్ విధానంలో పెన్షన్ జమ అవుతోంది. సెర్ప్ నిర్వహించిన పైలట్ పరిశీలనలో పెద్దఎత్తున అక్రమాలు బయటపడటంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా లైవ్ ఆథెంటిఫికేషన్ చేపట్టింది. ఇప్పటివరకు సుమారు 17 లక్షల మంది (90 శాతం) లబ్ధిదారుల ధృవీకరణ పూర్తికాగా, మరో 2 లక్షల మంది ధృవీకరణ మిగిలి ఉంది.

చనిపోయినా ఆగని పెన్షన్లు..

ఇప్పటివరకు నిర్వహించిన ధృవీకరణలో ఆందోళనకర విషయాలు వెలుగుచూశాయి. మొత్తం 95 వేల మంది అనర్హులుగా గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. వారిలో దాదాపు 63 వేల మంది మరణించినప్పటికీ వారి పేర్లపై పెన్షన్లు కొనసాగుతున్నట్లు తేలింది. అదేవిధంగా 27 వేల మంది లబ్ధిదారుల ఆచూకీ లభించలేదు. నమోదైన మొబైల్ నంబర్లకు పలుమార్లు సంప్రదించినప్పటికీ స్పందన రాకపోవడంతో వారు వాస్తవంగా ఉన్నారా? లేక వారి పేర్లపై ఎవరైనా అక్రమంగా పెన్షన్లు పొందుతున్నారా అనే అంశంపై మరింత విచారణ కొనసాగుతోంది. దీంతో పాటు సుమారు 5 వేల మంది రాష్ట్రం వెలుపల నివసిస్తున్నట్లు గుర్తించారు. వీరిలో పలువురు ఇతర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా పొందుతున్నట్లు ప్రాథమికంగా తేలింది. మరోవైపు సుమారు 700 మంది లైవ్ ఆథెంటిఫికేషన్‌కు సహకరించకుండా, పెన్షన్ కొనసాగింపుపై ఆసక్తి చూపడం లేదు.

కొత్తగా 3 లక్షల మంది నూతనంగా పెన్షన్లు

సాంకేతిక కారణాలతో కొందరి ధృవీకరణ ప్రక్రియ నిలిచిపోయింది. దాదాపు 12 వేల మంది లబ్ధిదారుల ఆధార్ వివరాల్లో సమస్యలు ఉండగా, మరో 33 వేల మందికి బయోమెట్రిక్ ధృవీకరణలో ఇబ్బందులు ఎదురయ్యాయి. వేలిముద్రలు సరిపోలకపోవడం, ఐరిస్ స్కాన్ నమోదు కాకపోవడం వంటి కారణాలతో వీరి ధృవీకరణ పూర్తికాలేదు. ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది.లైవ్ ఆథెంటిఫికేషన్ ప్రక్రియ ద్వారా నకిలీ, డూప్లికేట్, మరణించిన వారి పేర్లపై కొనసాగుతున్న పెన్షన్ చెల్లింపులకు అడ్డుకట్ట పడుతోంది. ప్రభుత్వ ఖజానాపై పడుతున్న అనవసర భారం తగ్గడంతో పాటు, అర్హులైన పేదలకు మాత్రమే సంక్షేమ ఫలాలు అందేలా వ్యవస్థ మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో పనిచేసే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రస్తుతం మిగిలిన 2 లక్షల మంది లబ్ధిదారుల లైవ్ ఆథెంటిఫికేషన్‌ను కూడా ప్రభుత్వం వేగంగా పూర్తి చేస్తోంది. అదే సమయంలో కొత్తగా 2 లక్షల మంది అర్హులను గుర్తించే ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే గుర్తించిన అనర్హుల స్థానంలో అర్హులైన పేదలకు పెన్షన్లు మంజూరు చేయడం ద్వారా కొత్తగా 3 లక్షల మంది నూతనంగా పెన్షన్లు పొందనున్నారు.

అనర్హత ఏరివేత కార్యక్రమం

మరోవైపు పెన్షన్ల అక్రమాలపై ఫిర్యాదులు రావడంతో సోషల్ ఆడిట్ సైతం నిర్వహిస్తున్నారు. ఈ ఆడిట్ లో విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నట్లు సమాచారం. చనిపోయినవారి పేరుమీద, ఇతర రాష్ట్రాలకు చెందినవారి పేరుతో పెన్షన్లు పొందుతున్నట్లు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టి అనర్హుల ఏరివేత కార్యక్రమం మరింత స్పీడ్ పెంచింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live