Chilkur Balaji Temple: డొనాల్డ్ ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు, రిపబ్లికన్ల హవా నడుస్తున్నప్పుడు.. అమెరికన్ల ఉద్యోగాలను భారతీయులు కొల్లగొడుతున్నారనే నెపంతో..
అక్కసు వెళ్లగక్కడం కొత్తేం కాదు. అమెరికాలో ఏ చిన్న రాజకీయ పరిణామం జరిగినా, అక్కడ ఏ ఎన్నికలు వచ్చినా.. మొదటి టార్గెట్ మాత్రం భారతీయులే! ఇప్పుడు.. అమెరికా సెనేటర్ ఎరిక్ స్మిత్ చేసిన కామెంట్స్.. తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయ్. భారతీయుల ప్రతిభను, వారు చట్టబద్ధంగా సాధిస్తున్న హెచ్1-బీ వీసాలను టార్గెట్ చేయడమే కాదు.. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని వివాదంలోకి లాగడంపై.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజం, భారతీయ ప్రవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చిలుకూరు బాలాజీ ఆలయం టార్గెట్!
అమెరికా ఐటీ రంగాన్ని, ఇతర టెక్నాలజీ రంగాలను భారతీయులు ఆక్రమించేస్తున్నారని, అక్రమ పద్ధతుల్లో హెచ్1-బీ వీసాలను దక్కించుకుంటున్నారనే ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయ్. మెరిట్ ఉన్న అమెరికన్లను పక్కనబెట్టి కంపెనీలు కూడా భారతీయులకే ప్రాధాన్యత ఇస్తున్నాయనే విమర్శలు కూడా వస్తుంటాయ్. అంతటితో ఆగకుండా, ఈసారి హైదరాబాద్ శివార్లలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, వీసా దేవుడిగా పాపులర్ అయిన చిలుకూరు బాలాజీ టెంపుల్‌ని కూడా టార్గెట్ చేస్తూ.. అడ్డగోలు కూతలు కూశాడు యూఎస్ సెనేటర్ ఎరిక్ స్మిత్.
అమెరికా ఉద్యోగాలపై భారతీయులే దండయాత్ర?
మిస్సౌరీ స్టేట్‌కి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎరిక్.. అమెరికన్ల ఉద్యోగాలను భారతీయులు కొల్లగొడుతున్నారంటూ వరుస ట్వీట్లలో అక్కసు వెళ్లగక్కాడు. భారతీయుల విశ్వాసాలను కించపరిచేలా కామెంట్లు చేశాడు. యూఎస్ వీసా వ్యవస్థపై తీవ్ర ఆరోపణలు చేసిన ఎరిక్ స్మిత్ అమెరికన్లను ఉద్యోగాల నుంచి తొలగించేందుకు ఓ మాఫియా పనిచేస్తోందని నోరు పారేసుకున్నాడు. వీసా మాఫియా నెట్‌వర్క్ బలంగా పనిచేస్తోందని, ఇంటర్వ్యూలలో అడిగే ప్రశ్నలను కూడా వారు దరఖాస్తుదారులతో పంచుకుంటూ అమెరికా వీసాలు పొందుతున్నారన్నాడు ఎరిక్ స్మిత్.
చిలుకూరు ఆలయంపై అవమానకర వ్యాఖ్యలు
ఈ క్రమంలోనే చిలుకూరు బాలాజీ ఆలయ ఫోటోను ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఎరిక్.. వీసా మాఫియాకు హైదరాబాద్‌లో ఓ వీసా టెంపుల్ ఉందంటూ తన అక్కసు వెళ్లగక్కాడు. వేల మంది ఈ ఆలయం చుట్టూ తిరుగుతుంటారు. అమెరికా వర్క్ వీసాలు లభించేలా చూడాలని తమ పాస్‌పోర్టులు అక్కడ పెట్టి ఆశీర్వాదం తీసుకుంటారు. భారతీయులతో పాటు వీసా కార్టెల్.. అమెరికా వీసాల కోసం ఇక్కడ పూజలు చేస్తుంటుందని.. అవహేళన చేస్తూ నోటికొచ్చినట్లు వాగాడు. ఉన్నత పదవిలో ఉన్న సెనేటర్.. ఇతర దేశాల సంస్కృతిని, మతాచారాలను ఇంత హీనంగా మాట్లాడటం అందరినీ షాక్‌కి గురిచేసింది.
చిలుకూరు బాలాజీపై ఎరిక్ వ్యాఖ్యలు
శతాబ్దాల చరిత్ర కలిగిన చిలుకూరు ఆలయంలో కనీసం హుండీ కూడా ఉండదు. అలాంటి పవిత్ర దేవాలయాన్ని వీసా మాఫియా కేంద్రమంటూ స్మిత్ వాగడంపై హిందూ సమాజం, ఇండో-అమెరికన్ వర్గాలు ఫైర్ అవుతున్నాయి. భారతీయ సనాతన ధర్మంలో ప్రతి హిందువుకూ ఓ సెంటిమెంట్ ఉంటుంది. కొత్త పని ప్రారంభించినా, ఉన్నత చదువులకు వెళ్లాలన్నా, విదేశీ ప్రయాణాలకు సిద్ధమవ్వాలన్నా తమ ఇష్ట దైవాన్ని దర్శించుకుని, ఆశీస్సులు తీసుకుంటారు. అమెరికాలో క్రైస్తవులు చర్చిల్లో ప్రార్థనలు చేసినట్లే.. హిందువులు ఆలయాల్లో పూజలు చేస్తారు.
చిలుకూరు బాలాజీపై వివాదం
కేవలం దేవుడిని నమ్ముకుని ప్రదక్షిణలు చేయడాన్ని వీసా మాఫియాతో పోల్చిన సెనేటర్ ఎరిక్.. హిందూ సంప్రదాయాన్ని, కోట్లాది మంది ఆరాధ్య దైవాన్ని అవమానించడమేనని హిందువులు మండిపడుతున్నారు. మా నమ్మకాలను కించపరిచే హక్కు అమెరికా సెనేటర్‌కు ఎక్కడిదంటూ ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. హెచ్1-బీ వీసాలు లాటరీ పద్ధతి, కఠినమైన అర్హత పరీక్ష ద్వారా చట్టబద్ధమైన పద్ధతుల్లోనే లభిస్తాయని చెబుతున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ ఐటీ సంస్థలను నడిపిస్తోంది భారతీయుల మేధస్సేనని, ఇది అమెరికా పెడుతున్న భిక్ష కాదని గుర్తుచేస్తున్నారు.
మా భక్తిని అవమానించే హక్కు నీకెక్కడిది?
బేసిగ్గా.. మన ఇండియన్స్‌కి సెంటిమెంట్, భక్తి ఎక్కువ. అందులోనూ.. చిలుకూరు బాలాజీ ఆలయానికి ఓ ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఇక్కడ రూపాయి కానుక తీసుకోకుండా, కేవలం ప్రదక్షిణలతోనే భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఇది.. కోట్లాది మంది నమ్మకం. ఇంతటి పవిత్రమైన ఆలయాన్ని, హిందూ సంప్రదాయాలను.. ఓ అమెరికన్ సెనేటర్ అవహేళన చేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. మా నమ్మకాలను విమర్శించే హక్కు నీకెక్కడిది? అంటూ ఎరిక్ స్మిత్‌ను నిలదీస్తున్నారు. ట్రంప్ ప్రెసిడెంట్‌గా ఉంటే.. ఇలాంటి వలస వ్యతిరేక, వర్ణ వివక్ష పూరిత వ్యాఖ్యలు ఎక్కువ అవుతుంటాయని చెబుతున్నారు. తమ సొంత దేశంలో ఉన్న నిరుద్యోగానికి, ప్రభుత్వ వైఫల్యాలకు.. భారతీయులను బలిపశువులను చేయడయం అమెరికన్ రాజకీయ నాయకులకు అలవాటుగా మారింది. ఇది కేవలం.. రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న చాకబారు విమర్శలని ఎన్నారై సంఘాలు కొట్టిపారేస్తున్నాయి.
ఎరిక్ స్మిత్‌పై మండిపాటు
అమెరికా అభివృద్ధిలో భారతీయ ఐటీ నిపుణుల పాత్ర ఎంత ఉందో ప్రపంచం మొత్తానికి తెలుసు. సిలికాన్ వ్యాలీ విక్టరీల్లో.. భారతీయుల చెమట చుక్కలున్నాయి. కేవలం రాజకీయ లబ్ధి కోసమో, స్థానిక ఓటర్లను ఆకట్టుకోవడానికో.. ఎరిక్ స్మిత్ లాంటి వాళ్లు భారతీయుల ప్రతిభను, హిందూ దేవాలయాలను టార్గెట్ చేయడం వారి సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం. అమెరికా ప్రభుత్వం, అక్కడి సెనేట్ ఈ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలని, ఎరిక్ స్మిత్ వెంటనే భారతీయ సమాజానికి, హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్లు వస్తున్నాయి.
వీసా బాలాజీ వెనుక కథేంటి?
చిలుకూరు.. హైదరాబాద్ శివార్లలో ఉంటుంది. చిలుకూరు పేరు వినగానే.. కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం బాలాజీనే గుర్తొస్తారు. ఆ బాలాజీనే.. వీసా బాలాజీగా గ్లోబ్ మొత్తం ఫేమస్. యూఎస్ సెనేటర్ ఎరిక్ స్మిత్ లాంటి వ్యక్తి.. భారతీయుల హెచ్1-బీ వీసాల గురించి, ఇక్కడి ఐటీ నిపుణుల ప్రతిభ గురించి చేసిన కామెంట్లు ఒకెత్తయితే.. చిలుకూరు బాలాజీ చుట్టూ ఉన్న నమ్మకం, ఆధ్యాత్మికత, అమెరికన్ ఐటీ రంగానికి ఉన్న లింక్ మరో ఎత్తు. ఈ చిన్న గుడికి, అమెరికా వీసాకు ఉన్న కనెక్షన్ ఏంటి? భారతీయుల ప్రతిభను ఎందుకు కొందరు అమెరికన్లు ప్రశ్నిస్తున్నారనేదే ఇప్పుడు బిగ్ పాయింట్.
వీసా బాలాజీ గా చిలుకూరు ఎలా మారింది?
చిలుకూరు బాలాజీని వీసా గాడ్‌గా కొలవడం, వీసా బాలాజీగా కొలవడం వెనుక ఆసక్తికరమైన చరిత్ర, బలమైన భక్తుల నమ్మకం ఉన్నాయి. 1980, 90ల కాలంలో.. ఐటీ రంగం ఊపందుకుంటున్న రోజుల్లో.. కొందరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, విద్యార్థులు.. తమ యూఎస్ వీసా ఇంటర్వ్యూలకు వెళ్లే ముందు చిలుకూరు బాలాజీని దర్శించుకొని మొక్కుకున్నారు. అప్పుడు.. చాలా మందికి పెద్దగా ప్రయాస లేకుండానే వీసాలు వచ్చేశాయ్. అలా.. వీసా వచ్చిన వాళ్లు.. నేను చిలుకూరు వెళ్లాను.. అందుకే వీసా వచ్చిందని చెప్పడంతో.. మాత్ పబ్లిసిటీ బాగా పెరిగిపోయింది. అలా.. వీసా కావాలంటే చిలుకూరు బాలాజీని దర్శించుకుంటే చాలనే నమ్మకం బాగా వ్యాపించింది.
వీసా బాలాజీ ప్రత్యేకత ఏంటి?
ఇక్కడి ఆచారం ప్రకారం, వీసా కావాలనుకునే వారు మొదటి వచ్చి 11 ప్రదక్షిణలు చేస్తారు. వీసా అప్రూవ్ అయ్యాక.. తాము కోరిన కోరిక తీరిన తర్వాత.. స్వామికి కృతజ్ఞతగా 108 ప్రదక్షిణలు చేసి మొక్కు తీర్చుకుంటారు. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే.. ఇదంతా భక్తులకు, భగవంతుడికి మధ్య ఉన్న నమ్మకం మాత్రమే తప్ప.. మరొకటి కాదంటున్నారు. చిలుకూరు ఆలయంలో ఎలాంటి హుండీ లేదు, విఐపి పాస్‌లు లేవు, స్పెషల్ దర్శనాలు లేవు. పేద, ధనిక అనే తేడా లేకుండా అంతా ఒకే క్యూలో నిలబడాలి. ఇక్కడి అర్చకులు భక్తులకు భగవంతుడిపై నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నూరిపోస్తారు. వీసా ఇంటర్వ్యూలో భయాన్ని పోగొట్టి, మానసిక ప్రశాంతతను ఇచ్చే ప్లాసిబో ఎఫెక్ట్, బలమైన సంకల్ప శక్తి.. ఇక్కడి ఆధ్యాత్మికతతో ముడిపడి పనిచేస్తుందనే వాదనలు కూడా ఉన్నాయి.
చిలుకూరు కథలో ఆసక్తికర మలుపు
చిలుకూరు బాలాజీని ఇంతలా నమ్మడానికి.. ఈ ఆలయానికి ఉన్న చరిత్ర, స్థల పురాణమే కారణం. తెలంగాణలోనే అత్యంత ప్రాచీనమైన, విశిష్టమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా విలసిల్లుతున్న చిలుకూరు ఆలయానికి సుమారు 500 సంవత్సరాల ఘన చరిత్ర ఉంది. విజయనగర సామ్రాజ్య కాలంలో ఆలయ నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతోంది. ఆ రోజుల్లో.. శ్రీనివాసుడికి ఓ పరమ భక్తుడు ఉండేవారు. ఆయన ప్రతి ఏటా తిరుమల వెళ్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేవారు. వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా.. ఒక సంవత్సరం ఆయన తిరుపతి వెళ్లలేకపోయారు. తన ఇష్టదైవాన్ని దర్శించుకోలేకపోయానని ఆయన తీవ్ర విచారంలో మునిగిపోయారు.
చిలుకూరు బాలాజీ ఆవిర్భావ గాథ ఇదే..
ఆ భక్తుడి భక్తికి మెచ్చిన వేంకటేశుడు.. కలలో కనిపించి.. నువ్వు నాకోసం అంత దూరం రానవసరం లేదు.. నీకు సమీపంలోనే నేను ఓ పుట్టలో ఉన్నానని చెప్పారు. కలలో స్వామివారు చెప్పిన ప్రదేశానికి వెళ్లి పుట్టని తవ్వతుండగా.. పొరపాటున గునపం తగిలి రక్తం చిమ్మింది. భయాందోళనతో స్వామివారిని క్షమించమని ప్రార్థించగా.. అక్కడ శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి విగ్రహం ప్రత్యక్షమైందని చెబుతారు. ఆ విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి, ఆలయాన్ని నిర్మించారు. ఐటీ బూమ్ మొదలయ్యాక.. విదేశాలకు వెళ్లాలనుకునే సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, విద్యార్థులు వీసా ఇంటర్వ్యూలకు వెళ్లే ముందు స్వామిని దర్శించుకోవడం ప్రారంభించారు. అలా.. మొక్కుకున్న వారికి వీసాలు త్వరగా రావడంతో.. స్వామికి వీసా బాలాజీ అనే పేరొచ్చింది. కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి భక్తుల కోరికలు నెరవేర్చేందుకే.. ఇక్కడ కొలువై ఉన్నాడని నమ్ముతారు. అందుకోసమే.. వేలాది మంది భక్తులతో ఆలయం కిటకిటలాడుతూ ఉంటుంది.
ఎరిక్ ఆరోపణలకు కౌంటర్
అయితే, అమెరికా సెనేటర్ ఎరిక్ స్మిత్ ఆరోపించినట్లు ఇండియన్లు అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొట్టడం లేదు. తమ టాలెంట్, కఠిన శ్రమతో చట్టబద్ధంగా వీసాలు పొంది అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. చిలుకూరు బాలాజీ గుడిలో పాస్‌పోర్టు పెట్టి దండం పెట్టుకున్నంత మాత్రాన అమెరికా ఎంబసీ వీసాలు ఇచేస్తుందా? GRE, టోఫెల్ ఎగ్జామ్స్ రాసి కఠినమైన వీసా ఇంటర్వ్యూలు దాటి, తమ ప్రతిభ ఆధారంగానే అమెరికాలో అడుగుపెడుతున్నారు. పన్నుల రూపంలో అగ్రరాజ్యానికి బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని అందిస్తున్నారే తప్ప, ఎవరి హక్కులనూ దోచుకోవడం లేదు. అయితే, ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడల్లా.. అగ్రరాజ్యంలో అమెరికా ఫస్ట్ నినాదాలు ఊపందుకుంటాయి.
అమెరికాలో కొత్త రాజకీయమా?
ఈ ముసుగులో అమెరికన్ల ఓట్లను దండుకోవడానికి అక్కడి రాజకీయ నాయకులు భారతీయులపై వ్యతిరేకతను నూరిపోసే ప్రయత్నం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా ఇండియన్లకు వీసాలు దక్కకుండా చేయాల్సిందంతా చేస్తున్నారు. ఇప్పటికే H-1B, L-1 వీసాల జారీ ప్రక్రియను క్లిష్టంగా మార్చేశారు. అమెరికన్ కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోకుండా చట్టపరమైన, రాజకీయ ఒత్తిళ్లను తీసుకువస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో, బహిరంగ ప్రదేశాల్లో భారతీయుల జీవన విధానాన్ని, సంస్కృతిని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారు. టెక్నాలజీ రంగంలోనూ, ముఖ్యంగా ఏఐ సెక్టార్‌లో ఇండియన్లు దూసుకుపోవడం జీర్ణించుకోలేక సెనెటర్ ఎరిక్ స్మిత్ వంటి వారు తమ రాజకీయ ఉనికి కోసం ఇలాంటి వివక్షాపూరితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఎరిక్ ఆరోపణలకు చెక్
అమెరికా ప్రభుత్వం ఏటా ఇచ్చే హెచ్1-బీ వీసాల్లో ఎక్కువగా భారతీయులే దక్కించుకుంటారు. జనరల్ కోటాలో 65 వేలు, యూఎస్ మాస్టర్స్ కోటాలో 20 వేలు, మరో కోటాలో 60 వేల వీసాలు ఇండియన్స్‌కే వస్తున్నాయ్. ప్రతి సంవత్సరం హెచ్1-బీ వీసాల కోసం వచ్చే అప్లికేషన్లు కూడా 3 లక్షల నుంచి 4 లక్షల వరకు ఇండియా నుంచే ఉంటాయి. వీటిలో లాటలరీ పద్ధతి ద్వారా వీసాలను ఎంపిక చేస్తారు. చిలుకూరు బాలాజీని దర్శించుకోవడం, అమెరికా వీసా సంపాదించడం వరకు సాగే జర్నీలో.. ఓ ప్రాక్టికల్ లింక్ ఉంది. వీసా ఇంటర్వ్యూ తీవ్రమైన మానసిక ఒత్తిడితో కూడుకున్నది.
ట్రంప్ నిబంధనలు
చిలుకూరు బాలాజీని దర్శించుకోవడం వల్ల అభ్యర్థుల్లో దేవుడు మనకు తోడున్నాడనే నమ్మకం కలిగి, ఇంటర్వ్యూలో తడబడకుండా సమాధానాలు చెప్తారు. కాన్ఫిడెన్స్ ఉంటే వీసా ఆటోమేటిక్‌గా వస్తుంది. అంతే తప్ప.. చిలుకూరు బాలాజీ ఆలయం కేవలం ఒక వీసా సెంటర్ కాదు. వేలాది మంది యువతీ యువకుల ఆశలకు, ఆకాంక్షలకు ఓ ప్రతీక. ట్రంప్ ప్రభుత్వం నిబంధనల్ని ఎంత కఠినంగా మార్చినా, అమెరికన్లు ఎంత అడ్డుకున్నా.. భారతీయుల ప్రతిభను, వారి ఆధ్యాత్మిక విశ్వాసాలను దెబ్బతీయడం ఎవరి వల్లా కాదు.
చిలుకూరు బాలాజీపై నెటిజన్ల స్పందన
చిలుకూరు బాలాజీ ఇచ్చే ఆత్మవిశ్వాసానికి, భారతీయుల మేధస్సుకు అమెరికా వీసా దక్కడమనేది.. కేవలం సహజమైన ఫలితం మాత్రమే! పవిత్రమైన దేవాలయాన్ని, భక్తుల నమ్మకాన్ని రాజకీయ చదరంగంలోకి లాగుతున్నారు. అమెరికా అభివృద్ధిలో భారతీయుల పాత్రను గుర్తించకుండా, కేవలం ఓట్ల రాజకీయం కోసం ఇలాంటి చిల్లర కామెంట్లు చేస్తున్నారు. ఎరిక్ స్మిత్ లాంటి వారి నోటి దూల వల్ల అంతర్జాతీయంగా అమెరికా ప్రతిష్ఠ దెబ్బతినే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ధర్నాకు పర్మిషన్ ఇవ్వరా? జగిత్యాల ఎస్పీపై ఎంపీ అరవింద్ ఆగ్రహం

