రోమ్ నగరం తగలబడుతుంటే.. ఫిడేలు వాయించినట్టే ఉంటది కేసీఆర్‌తో వ్యవహారం. ఆయనకు ఎప్పుడు ఏది ఇష్టమో అదే చేస్తారు. అది సందర్బమా? అసందర్భమా.. డోంట్ కేర్.
రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నిజమే. కొనుగోళ్లు ఇంకా పూర్తి కాలే.. అదీ నిజమే. ఇంకా మద్దతు ధర అమౌంట్లు ఖాతాల్లో పడలేదు. ఎదురు చూస్తన్నారు. వాస్తవమే. ఎండల తీవ్రతకు చనిపోతున్నారు. విషాదమే. ఈ సమయంలో బీఆరెస్ రైతు సంగ్రామ సదస్సు పెట్టింది వరంగల్‌లో. కాంగ్రెస్ ఇదే వరంగల్‌లో రైతు డిక్లరేషన్ సభ పెట్టింది కాబట్టి..అక్కడే సర్కార్‌ను నిలదీద్దామని డిసైడ్ అయ్యారు. బహిరంగ సభ పెట్టుకున్నారు.
పెద్ద స్టేజీ వేశారు. ఎర్రటి ఎండలో జన సమీకరణ కూడా బాగనే చేశారు. చివరకు తేలిందేమిటంటే.. ఇది చిన్నదొర.. అదే కేటీఆర్‌ను ఫ్యూచర్‌లో సీఎం చేసేందుకు వేసుకున్న ట్రయల్ రన్ సభనట. అవును.. పెద్దసారు ఫామ్‌హౌజ్‌లో కూర్చుని ఆర్డేరేసిండు. పోలోమని సీనియర్లంతా కలిసి వరంగల్‌లో ధూం ధాంగా సభ పెట్టిండ్రు. ఇక కేసీఆర్ లేకున్నా.. తననే కేసీఆర్ అనుకోవాలె జనం. కేసీఆర్ తనకు సీఎం కుర్చీ ఇచ్చినా.. ఆశీర్వదించేందుకు మీరంతా రెడీగా ఉండండి. సిద్దం కండి.. అనే రకంగా ఇది ఓ విధమైన బలప్రదర్శన లాగా ఉంది. తెలంగాణ జనం ముందు కేటీఆర్ విజ్ఞాన ప్రదర్శనను తలపించింది. కేసీఆర్ వాగ్దాటితో నేనేం తక్కువ కాదని నిరూపించుకునే క్రమంలో ఏదేదో రాసుకుని వచ్చి.. మరేవేవో మాట్లాడి.. కంట్రోల్ తప్పి… బూతులు తిట్టి.. శపథాలు చేసి.. తొడలు చరిచి.. గొంతు బొంగురు పోంగా.. గాబరా గాబరా చెంది.. మొత్తానికి హమ్మయ్యా అని అయ్యిందనిపించుకున్నాడు. ఇదీ సంగతి.
మరి ఆ రైతు సంగ్రామ సభలో కొత్త విషయాలు ఏమైనా చెప్పారా అంటే.. ఏమీ లేవు. నిత్యం మాట్లాడుకునేటివే. తెలంగాణ భవన్‌లో గ్రామ ఫోన్ రికార్డులా వల్లెవేసిన రైతు హామీల ప్రసంగాలే. కొత్తవేమీ కావు. కొత్తదనం ఇక్కటే. అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కేటీఆర్ అంతే. కాన కేసీఆర్‌ను అక్కడ ఊహించుకుని వచ్చిన వారికి చిన్నదొర తత్తరపాటు ప్రసంగం చప్పగానే వినిపించింది. జనం కళ్లలోకి సూటిగా చూడకుండా పదే పదే రాసుకొచ్చిన పేపర్‌ను చూసి యాదికి తెచ్చుకుని మరీ తిట్టిన తిట్లు పెద్దగా కిక్కయ్యలే. యాస, ప్రాస కోసం చిన్నసారు పడ్డ ప్రాయాస పాపం అనే సానుభూతిని మాత్రం తెచ్చిపెట్టంది.
మీటింగు మొదలైన దగ్గర నుంచి ఆ సీనియర్ల ముఖాలు చూడాలె. భీతితో , తెచ్చిపెట్టుకున్న గంభీరతతో, భయంతో .. ముఖం నిండా పూసుకున్న నవ్వుతో తత్తర పాటు చూపులతో అటూ ఇటూ చూస్తున్నారు. చిన్నదొర ఎప్పుడు ఏం మాట తుళ్లుతారో.. ఎక్కడ కంట్రోల్ తప్పి ఏమేమీ మాట్లాడుతారో..? అనే భయమే వారి కళ్లలో చివరి వరకూ కనిపించింది. మధ్యలో మధ్యలో చప్పట్లు, చప్పట్లు.. అంటూ వారు కూడా జనాలను ఉత్సాహపరిచేందుకు తిప్పలు పడ్డారు. సీనియర్లందరికీ ఇదో అనుభవం. చిన్నసారూకు ఇదో ట్రయల్ రన్.
అబ్బ రైతు సభ సక్సెస్ చేసినం… ఇక వారంకో మీటింగు పెడదాం.. ఇట్లనే ఎర్రటి ఎండలో జన సమీకరణ చేద్దాం.. కేటీఆర్‌తో ప్రసంగం అదరగొడదాం.. ఇవన్నీ పెద్ద సారు ఫామ్‌హౌజ్‌లో కూర్చుని చూడాలె. మనను మెచ్చుకోవాలె. పెద్ద సారు కల నెరవేరేదాకా.. సభలు పెట్టాల్సిందేనని అనుకుంటున్నారట. ఎర్రటి ఎండలో ఎవడు చస్తే మాకేందీ? జనం గోసలు, తిప్పలు మాకేలా? సీఎం పీఠమే ముఖ్యం. అట్లనే ఉంది ఇప్పుడు రాజకీయం.

