Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏంటీ.. నేపాల్ వరద ప్రవాహ వేగం గంటకు 200 కిమీలా? 4 వేల మీటర్ల ఎత్తు నుంచి దూకి..

ఏంటీ.. నేపాల్ వరద ప్రవాహ వేగం గంటకు 200 కిమీలా? 4 వేల మీటర్ల ఎత్తు నుంచి దూకి..

Big TV Live 1 week ago

Nepal Floods 2026: పంచభూతాల్లో ఏది బలమైనది అంటే.. ఇప్పుడు నీరు అనే చెప్పవచ్చు. నేపాల్‌ను అతలాకుతలం చేసిన వరద బీభత్సాన్ని చూస్తే.. నీటికి అంత శక్తి ఉంటుందా అనే ఆశ్చర్యం కలగకమానదు.

ఆ వరదలో కేవలం నీరు మాత్రమే కాదు.. నేల కూడా కలిసింది. రాళ్లు, బురద రూపంలో నీటికి తోడై.. తమ దారికి అడ్డుగా ఉన్న చెట్లు, ఇళ్లు, జీవులను తనలో కలిపేసుకుంటూ ప్రళయతాండవం చేసింది. మీడియా, సోషల్ మీడియాల్లో వైరల్ అవుతున్న వీడియోలు చూసిన జనం.. ఇలాంటివి హాలీవుడ్ మూవీల్లో చూడటమే తప్పా.. నిజంగా జరుగుతాయని ఏ నాడు ఊహించలేదని అంటున్నారు. అసలు ఆ నీటికి అంత శక్తి ఎలా వచ్చింది? ఆ స్థాయిలో విరుచుకుపడటానికి కారణాలేమిటనేది విశ్లేషిస్తే…

ఎత్తు.. వేగం.. నీటి సామర్థ్యం

హిమాలయాలంటే సాధారణ కొండల్లా ఉండవు. నిట్టనిలువుగా చాలా ఎత్తుగా ఉంటాయి. వాటిపై కొన్నివేల మీటర్ల ఎత్తులో పేరుకుపోయే మంచులో వందల గ్యాలన్ల నీరు ఉంటుంది. సాధారణంగా ఆ మంచు చాలా నెమ్మదిగా కరుగుతూ.. లోయల్లోకి చేరుతుంది. అదే ప్రవాహంగా మారి నదిలా ప్రవహిస్తుంది. గంగ, యమున, సింధూ నదుల పుట్టుకకు కారణం అవే. ఆ పర్వతాలపై మంచు రూపంలో గడ్డకట్టి ఉండే ఈ దిబ్బలనే గ్లాసియర్స్ అంటాం. పరిశోధకులు వీటిని నడిచే మంచు నదులు అంటారు. వాతావరణం వేడెక్కినప్పుడు లేదా వర్షాలు కురిసినప్పుడు ఆ మంచు దిబ్బలు బీటలు వారుతాయి. ఒక్కసారిగా కొన్ని వేల అడుగుల ఎత్తు నుంచి నదుల్లోకి పడతాయి. దానివల్ల మంచు ముక్కలై.. భారీ స్థాయిలో నీరుగా మారుతుంది. ఏటవాలు నదుల్లోకి చేరడం వల్ల చాలా వేగంగా ప్రవహిస్తుంది.

చైనా – నేపాల్ సరిహద్దులో ఏం జరిగింది?

ఈ వరద ప్రభావాన్ని ముందుగా ఎదుర్కొన్నది జిరోంగ్ వ్యాలీ (దీన్నే జిరోంగ్ పోర్ట్ లేదా కేరాంగ్ అని కూడా అంటారు). ఇది చైనాలోని టిబెట్, నేపాల్‌లను కలిపే ప్రధాన అంతర్జాతీయ సరిహద్దు వ్యాపార మార్గం. నేపాల్ వైపు ఉన్న ప్రాంతాన్ని రాసువాగఢి (Rasuwagadhi) అంటారు. ఇక్కడే నేపాల్ కస్టమ్స్ ఆఫీసు కూడా ఉంది. ఆ రెండిటిని కలుపుతూ ఒక ఫ్రెండ్‌షిఫ్ బ్రిడ్జి ఉంది. దాని మీదుగానే సరిహద్దుల్లో రాకపోకలు జరుగుతాయి. టిబెట్ వైపు గైరాంగ్ (జిరోంగ్) పోర్ట్ బార్డర్ గేట్ అండ్ కస్టమ్స్ కాంప్లెక్స్ (Gyirong Port Border Gate Complex) భవనం ఉంది. ఆరు అంతస్తుల ఈ భవనం వరద ప్రవాహానికి ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయింది. సుమారు 20 నుంచి 30 అడుగుల ఎత్తులో మట్టి, రాళ్లు, బురద నీటితో ఎగసిపడ్డ కెరటాలు రెప్పపాటులో భవనానన్ని, పార్కింగ్ ఏరియాలను తుడిచిపెట్టేసింది. అటు నేపాల్ కస్టమ్స్ ఆఫీసు పరిస్థితి కూడా అంతే.

ఆ వేగమే కొంప ముంచేసింది

సాధారణంగా వరద ఏర్పడినప్పుడు నెమ్మది నెమ్మదిగా నీరు ముంచెత్తుతుంది. ఆకస్మిక వరదల ప్రభావం దీని కంటే ఎక్కువ ఉంటుంది. కానీ, హిమాలయాల్లో పరిస్థితి వేరు. అకస్మిక వరదల కంటే ప్రమాదకరం. మంచు దిబ్బలు కొన్ని వేల అడుగుల ఎత్తు నుంచి కిందకు పడతాయి. ఆ క్రమంలో అక్కడి బండరాళ్లు బద్దలవుతాయి. వాటి వల్ల భూకంపాలు కూడా ఏర్పడతాయి. ఆ క్రమంలో కొండల్లోని మట్టి, రాళ్లు, నీటిలో కలిసి బురదగా ఏర్పడతాయి. కాంక్రీట్ మిశ్రమాన్ని తలపిస్తాయి.

మానస సరోవరానికి ఇండియా నుంచి ఎన్నో రూట్లు.. కానీ, నేపాల్ మీదుగానే ప్రయాణమెందుకు?

ముందుగా హిమాలయాల్లోని చైనా, నేపాల్ సరిహద్దుకు ఎగువన ఉన్న లండే ఖోలా (Lhende Khola) నదీ పరివాహక ప్రాంతంలో లాంగ్‌టాంగ్ లీరుంగ్ (Langtang Lirung) అనే పర్వతం ఉంది. దానిపై 5000 వేల మీటర్ల ఎత్తులో ఉన్న గ్లాసియర్ (గడ్డకట్టిన మంచు దిబ్బ) కింది భాగం తెగి.. లండే ఖోలా నదిలో సుమారు 4000 వేల మీటర్ల ఎత్తు నుంచి పడింది. దీంతో అక్కడ ఏర్పడిన నీరు, బురద, రాళ్లన్నీ.. లండే ఖోలా నదికి దిగువున ఉన్న భోటేకోషి (త్రిశూలి) నదిలో కలిసింది. ఆ వరద అక్కడి నుంచి గంటకు సుమారు 200 కిమీల వేగంతో ప్రయాణించింది. కేవలం ఏడు నిమిషాల్లోనే ఆ వరద సుమారు 20 నుంచి 23 కిమీల దూరంలో ఉన్న జిరోంగ్ పోర్ట్, రాసువాగఢి ప్రాంతాలకు చేరుకుని ప్రళయం సృష్టించింది. మార్గం మధ్యలో డ్యామ్‌లు ఏవీ లేకపోవడంతో చాలా వేగంగా ఆ నీరు ప్రవహించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live