Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ.. విమర్శకులకు రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్!

ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ.. విమర్శకులకు రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్!

Big TV Live 1 month ago

NTR Statue: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ చౌరస్తాలో దివంగత ముఖ్యమంత్రి, తెలుగుప్రజల ఆరాధ్యదైవం నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయి ఉండి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడంపై వస్తున్న విమర్శలకు రేవంత్ రెడ్డి తనదైన శైలిలో గట్టి సమాధానమిచ్చారు.

రాజకీయాలకు అతీతంగా ఎన్టీఆర్ స్పూర్తి

కులమతాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా ఈ దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఒక కాంగ్రెస్ సీఎం ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎలా ఆవిష్కరిస్తారంటూ కొందరు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారని, అయితే ఎవరు ఏమనుకున్నా, ఎలాంటి విమర్శలు చేసినా తాను భయపడేది లేదు, వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అమీర్‌పేట్ చౌరస్తా గుండా వెళ్లే ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ విగ్రహం ఒక కొత్త స్ఫూర్తిని నింపాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.

సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించిన మహనీయులు

నాడు దేశ ప్రధాని ఇందిరా గాంధీ తెలంగాణ ప్రాంతం నుండి పి.వి. నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి, పి. శివశంకర్, వెంకటస్వామి వంటి జాతీయ స్థాయి నాయకులను దేశానికి అందించారని రేవంత్ గుర్తుచేశారు. అదేవిధంగా అన్న ఎన్టీఆర్ కూడా తెలంగాణ ప్రాంతానికి మండవ వెంకటేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు వంటి ఎంతో మంది సమర్థవంతమైన నాయకులను రాజకీయాలకు పరిచయం చేశారని కొనియాడారు.

కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది ఆయనే..

ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నాడు ఎన్టీఆర్ రాజకీయ భిక్ష పెట్టకపోతే కేసీఆర్ గానీ, లేదా ఇతర నేతలు గానీ ఈరోజు నాయకులు అయ్యేవాళ్లా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ నీడన బతికి, ఈరోజు ఆయన గురించే తక్కువ చేసి మాట్లాడటం సరికాదన్నారు. సమాజంలో ఎప్పుడూ నకిలీలు ఉంటారని, వారి ఆలోచనలు కూడా అలాగే ఉంటాయని ఎద్దేవా చేశారు. ఇప్పటికీ కొందరు ఎన్టీఆర్ పేరు చెప్పుకునే నాయకులుగా చలామణి అవుతున్నారని విమర్శించారు.

ఇందిరమ్మ, ఎన్టీఆర్ కలయికే మా ప్రజా పాలన

తమ ప్రభుత్వానికి ఇందిరమ్మ ఎంత ముఖ్యమో, ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పేదల సంక్షేమం కోసం ఇందిరా గాంధీ ప్రవేశపెట్టిన పథకాలు, ఎన్టీఆర్ అందించిన ప్రజా రంజక పాలన.. ఈ రెండింటి కలయికతోనే తెలంగాణలో ప్రస్తుతం తమ 'ప్రజా పాలన' సాగుతోందని ముఖ్యమంత్రి వెల్లడించారు.

రేవంత్ సర్కార్‌పై కవిత ధ్వజం.. 'టీఆర్ఎస్'లో చేరిన మాజీ మంత్రి బోడ జనార్థన్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live