Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీ హస్తకళల రేంజ్ మార్చబోతున్న పవన్ కల్యాణ్.. ఆ 'గ్లోబల్ ప్లాన్' ఏంటంటే?

ఏపీ హస్తకళల రేంజ్ మార్చబోతున్న పవన్ కల్యాణ్.. ఆ 'గ్లోబల్ ప్లాన్' ఏంటంటే?

Big TV Live 1 week ago

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ హస్తకళల వారసత్వానికి పుట్టినిల్లని, ఒక జాతి యొక్క అసలైన గొప్పతనం ఆ దేశం నిర్మించిన భవనాల్లో కాకుండా, అక్కడి కళాకారుల్లోనే కనిపిస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

అమరావతిలోని అంబేద్కర్ కళావేదికలో ఘనంగా ప్రారంభమైన 'ఏపీ హస్తకళా మహోత్సవం 2026' కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన హస్తకళాకారుల స్టాల్స్‌ను ఆయన సందర్శించి, వారి అద్భుతమైన ప్రతిభను అభినందించారు.

శ్రమకు దక్కిన గౌరవం..

ఈ వేడుకల్లో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఇక్కడికి తాను ఒక అధికార హోదాలో కాకుండా, కళాకారుల తోటి కుటుంబసభ్యుడిగా వచ్చానని భావోద్వేగంగా చెప్పారు. కళాకారుల అద్భుత ప్రతిభను, వారి కష్టాన్ని గుర్తించి అండగా నిలవడమే తన బాధ్యత అన్నారు. హస్తకళాకారులు కేవలం వస్తువులను తయారు చేయడం లేదు, మన పూర్వీకుల గొప్ప వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్నారని కొనియాడారు. ఈ శ్రమకు ఫలితంగానే హస్తకళల విభాగంలో జాతీయ స్థాయిలో మూడో వంతు అవార్డులను ఆంధ్రప్రదేశ్ గెలుచుకోగలిగిందని ఆయన గర్వంగా ప్రకటించారు.

లోకల్ టూ గ్లోబల్..

మన హస్తకళల ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన మార్కెటింగ్ శక్తి ఉందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. మన లక్ష్యం ఒక్కటే కావాలని, అది కళాకారుల ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పడమేనని అన్నారు. ఇందుకోసం 'లోకల్ టూ గ్లోబల్' అనే విధానంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వ్యాపారాన్ని మరింత మందికి చేర్చడానికి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సూచించారు. అలాగే, ప్రతి కళ వెనుక ఒక కథ ఉంటుందని, వస్తువులను విక్రయించేటప్పుడు కళాకారుడి పూర్తి వివరాలతో కూడిన ఒక గిఫ్ట్ బాక్స్ రూపంలో అందిస్తే, దాని విలువ పదింతలు పెరుగుతుందని ఒక వినూత్న ఆలోచనను పంచుకున్నారు.

సమస్యల పరిష్కారం..

కళాకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని పవన్ కల్యాణ్ తెలిపారు. ఇందులో భాగంగానే 'వుడ్ బ్యాంక్' (హూడ్ బ్యాంకు) డెవలప్ చేయడం మొదలుపెట్టామని, సీతారాంపురంలో కళాకారుల కోసం ప్రత్యేకంగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించానని చెప్పారు. హస్తకళలను మరింత ప్రోత్సహించడానికి వాటిని టూరిజం (పర్యాటక రంగం)తో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కళాకారులు తమ సమస్యలను చెప్పుకోవడానికి ఎప్పుడైనా తన కార్యాలయానికి రావచ్చని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. కళాకారుల నుంచి వచ్చిన సూచనలను క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్లి, వారి భవిష్యత్తుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live